"నేనేమీ పవిత్రురాలీని కాదు. ఇప్పటికిద్దరయ్యారు. కొన్ని లక్షలు సంపాదించడానికి మరికొందరు అయినా ఫరవాలేదు. ఎటొచ్చీ విషయం రహస్యం గా ఉండాలి " అంది లక్ష్మమ్మ.
"నువ్వు నన్ను పరిక్షిస్తున్నావు-" అన్నాడు నారాయణ.
అది అబద్దమని నారాయణకు తెలిసిపోయింది. అతని ఆధ్వర్యం లో ఒక నెలరోజుల్లో ఇరవై నాలుగు వేలు సంపాదించింది. ఈ విధమైన వ్యాపారానికి ఆమె వంటి ఆడది అరుదైన వరం అన్న పేరు కూడా వచ్చింది. అయిదారు నెలల్లో ఆమె మూడు లక్షల వరకు సంపాదించింది.
అటు సౌఖ్యానికి యిటు డబ్బుకూ ఈ పద్దతి బాగుందని పించింది లక్ష్మమ్మ కు. ఈ జీవితం కొనసాగించడం కోసం ఆమె నారాయణతో వెళ్ళి పోవడానికి సిద్దపడింది.
"నేను నీ స్మగ్లింగు కు పనికోస్తాను. నీ పద్దతులు నాకు నచ్చాయి. మనమిద్దరం ఒకటైతే లక్షలకు లక్షలు గడిస్తూ హాయిగా గడపవచ్చు" అంది లక్ష్మమ్మ.
"కానీ నేనాశించినది అటువంటి జీవితం కాదు. కేవలం నీకోసం నేను అవినీతి కి పాల్పడ్డాను. ఈ డబ్బు సంపాదించేక సాఫీ జీవితం గడుపుదామను కున్నాను. నీతో అందరికి లాగే సంసారం చేయాలనుకున్నాను. కాని నువ్వు ఈ దేశంలో పుట్టవలసిన మనిషిని కాదు. భగవంతుడు నీకు అద్భుతమైన శరీర సౌష్టవాన్నిచ్చి - అందుకు తగ్గ మనసునే సృష్టించాడు . నీకూ నాకూ సంసారం సరిపడదు. ఇప్పటికి నాకు బుద్ది వచ్చింది. నిన్ను పూర్తీ గా అర్ధం చేసుకున్నాను" అన్నాడు నారాయణ.
లక్ష్మమ్మ అప్పటికి ఏమీ మాట్లాడలేదు. తను సంపాదించిన డబ్బుతో పాటు - నారాయణ డబ్బు కూడా ఆమె వద్దనే ఉంది.
రెండు రోజుల అనంతరం లక్ష్మమ్మ కు అనుకోని ప్రమాదం వచ్చింది. నారాయణ లక్ష్మమ్మను సూర్యం అనే వ్యక్తీ ద్వారా రహస్య వ్యభిచారం లో ప్రవేశ పెట్టాడు. ఆ సూర్యం ఆమెకు తెలీకుండా చాలా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు రహస్యంగా వుంచడానికి అతను రెండు లక్షలు అడుగుతున్నాడు.
సూర్యం నుంచి ఇటువంటి ప్రమాదం అప్పటికే పరిమితం కాదనీ ముందు ముందు కూడా అతను తనను జలగలా పీడించగలడని లక్ష్మమ్మ గ్రహించింది. రహస్య వ్యభిచారంలో యిప్పుడామెకు సూర్యం లాంటి వాళ్ళ సాయం అవసరం లేదు. కానీ యిబ్బంది వచ్చి పడింది.
లక్ష్మమ్మ తన యిబ్బందిని నారాయణకు చెప్పింది. నారాయణ ఆవేశంగా సూర్యాన్ని కలుసుకున్నాడు. మాటలు పోట్లాటలోకి మారగా నారాయణ చేతిలో సూర్యం చచ్చాడు. నారాయణ పారిపోయి లక్ష్మమ్మ యింటికి వచ్చి జరిగింది చెప్పాడు.
"ఫోటోలు ఎక్కడ?"
"వాటి భయం నీకు లేదు. వాటిని సూర్యం యెక్కడ దాచాడో నాకు తెలుసు. అవి మూడో కంట పడే ప్రమాదం లేదు"అన్నాడు నారాయణ.
'ఇప్పుడు నేనేం చేయాలి?" అంది లక్ష్మమ్మ.
"నా డబ్బు నాకిచ్చేయ్. ఇక్కణ్ణించి వెళ్ళిపోతాను " అన్నాడు నారాయణ.
లక్ష్మమ్మ మంచి మాటలతో అతన్ని ఓ గదిలోకి తీసుకు వెళ్ళి గొళ్ళెం పెట్టి పోలీసుల్ని పిల్చుకు వచ్చి తోచిన కట్టుకధ చెప్పింది. లక్ష్మమ్మ ఆధారంతో సూర్యం హత్య తేలిపోయింది. నారాయణ హంతకుడిగా నిరూపించబడ్డాడు. నారాయణ నేరాన్ని ఒప్పుకున్నాడు. తప్పితే ఇంకేమీ చెప్పలేదు. దొంగ తమ యింట్లో డబ్బు వదిలి పెట్టినట్లు భర్తకు చెప్పి లక్షల ఆస్తిని అతని వశం చేసింది లక్ష్మమ్మ.
సరిగ్గా పదిహేను రోజుల తర్వాత నారాయణ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను లక్ష్మమ్మ ను కలుసుకుని "నా జీవితం నీ కారణంగా నాశనమైంది. నిన్ను చంపడం నా కిష్టం లేదు. ఎందుకంటె అది చాలా సామాన్యమైన శిక్ష. సూర్యం తీసిన ఫోటోలు నీ భర్తకు చూపించాను. ఏ ఆడదైనా అలా బరితెగిస్తే మగవాడికి సంతోషంగా ఉండవచ్చు గానీ ఆ ఆడది తన భార్య అయుండి - పరాయి మగవాడి మీదకు అలా బరితెగిస్తే సహించలేడు. ఆ అసహనమే నీకు సరిపడ్డ శిక్ష" అని వెళ్ళిపోయాడు.
తర్వాత అతను తనకు తనే పోలీసుల దగ్గరకు వెళ్లి "ఒక చిన్న పని మిగిలిపోయిన కారణంగా జైలు నుంచి పారిపోయాను. తప్పితే నాకు జైల్లో వుండడ మే ఇష్టం " అని చెప్పి లొంగిపోయినట్లు తెలిసింది.
సాంబశివరావు ఫోటో లతో సహా భార్య దగ్గరకు వచ్చి "నాదనుకున్న నీ శరీరంతో ఇంత పచ్చిగా ఎంతో మంది అడుకున్నారని నాకు తెలియదు. అందుకు నిన్ను తప్పు పట్టలేను. లోపం నాదే అయి వుండాలి. అందుకే నిన్ను ఏమి అనను. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించు. ఈ రోజు నుంచీ మనమిద్దరం స్నేహితులమే తప్పితే దంపతులం కాము" అన్నాడు.
ఆరోజు నుంచీ సాంబశివరావు తాగుడుకు, అలవాటు పడ్డాడు. కొద్ది నెలల్లోనే అతను చంద్రావతిని వుంచుకున్నాడు.
12
"తప్పు చేసింది నేను, నా భర్త కాదు. నారాయణ నా భర్తను చంపడం అన్యాయం" అంది లక్ష్మమ్మ.
'అయితే కధంతా గుర్తుకు వచ్చిందన్న మాట" అని నవ్వి "యుద్దాల్లో రాజులు పోరు. వారి పరివారమే చస్తుంది"అన్నాడు గోపీ.
"ఇప్పుడు నేనేం చేయాలి?" అంది లక్ష్మమ్మ.
"ఆ ఫోటోలు యింకా నారాయణ దగ్గర వున్నాయి" అన్నాడు గోపీ.
"నేను వాటిని ఎప్పుడో చింపేశాను" అంది లక్ష్మమ్మ.
"కానీ నారాయణ దగ్గర యింకా చాలా కాపీలున్నాయి. నేగేటివ్స్ కూడా వున్నాయి."'
"ఉంటే?"
"అవి నీ కన్నకొడుకు చూస్తె ?"
లక్ష్మమ్మ నిలువెల్లా వణికిపోయింది "వద్దు నువ్వేం చెబితే అ పని చేస్తాను."
"ఏమీ లేదు. నువ్వు నారాయణ కు భార్యవు కావాలి. యిక్కడ యీ ఇంటి పెత్తనం నా కివ్వాలి" అన్నాడు గోపీ.
'అంటే?"
"జైల్లో ఉన్నంత కాలం నారాయణ నిన్ను తలచుకుంటూనే ఉన్నాడు. తన కారణం గానే నువ్వు పాడయ్యావనీ, నీ బుద్ది పెడదారులు తొక్కిందని , నీ జీవితం నరక ప్రాయమైందని అనుకున్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పటికీ సత్ప్రవర్తన కారణంగా అతను కొద్ది కాలం క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైనప్పటి నుంచి నిన్ను తనకు అప్పగించవలసిందని సాంబశివరావు ను కోరాడు. ఆ పని మాత్రం చేయ్యనన్నాడు సాంబశివరావు. అప్పుడు నారాయణ మొట్టమొదట నిన్ను తనే వివాహం చేసుకునంట్లూ ఒక బిడ్డను కూడా కన్నట్లూ చెప్పాడు."
'అబద్దం"అంది లక్ష్మమ్మ.
'అబద్దం కాదు. ప్రాణం లేకుండా పుట్టిందని నువ్వనుకున్న బిడ్డను నేనే. హాస్పిటల్లో నర్సుకు డబ్బిచ్చి నారాయణ ఆ మార్పిడి చేయించాడు. మీ ఇద్దరి సంసారానికి నేనే సాక్షిని. నారాయణ చెప్పిన వివరాలు విని సాంబశివరావు నన్ను చూడగోరాడు. నన్ను చూసి నప్పటినించీ ఆయనకు మతి పోయింది. నారాయణ లక్ష్మమ్మను కోరే మాటయితే తను ఆత్మహత్య చేసుకుని నన్ను హంతకుడిని చేయగలనని బెదిరించాడాయన. అయన ఆత్మహత్య చేసుకోవడం నాన్నకు ఇష్టమే! అందుకే ఆయన్ను బాగా రెచ్చగొట్టాడు. అయన చివరి వార్నింగ్ యిచ్చాడు. ఆరోజునే నేను మీ యింటికి వచ్చి ఎలిబీ సంపాదించాను. సాంబశివరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అయన అలా చేసుకుంటాడని తెలిసుండీ ఊరుకున్నందుకు నాన్న హంతకుడే అవుతాడు."
లక్ష్మమ్మ ఆశ్చర్యంగా గోపీని చూస్తూ "అయితే నువ్వు?" అంది.
"నీ కన్నకొడుకునని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్న వాణ్ని. వీరభద్రాన్ని కూడా అలా చేయగల సమర్దుడిని"
"ఇప్పుడెం చేస్తావ్?"
"నీకు నారాయణతో ఉండడం యిష్టమే అయిన పక్షంలో అన్ని వ్యవహారాలూ నేనే సెటిల్ చేసేస్తాను" అన్నాడు గోపీ.
"ఎలా?"
"సాంబశివరావుది ఆత్మహత్య. ఆ నిజం చంద్రావతికి తెలుసును. అది ఆమె చేత కక్కించడం సులభమే. సాంబశివరావు నపుంసకుడని నీసంతానం అతని అనుమతితో నారాయణ కారణంగా కలిగిందని - నారాయణ నిన్ను భార్యగా పొందగోరితే సాంబశివరావు అతన్ని హత్య కేసులో యిరికించి జైలుకు పంపించాడనీ -- జైలు నుంచి నారాయణ తిరిగి వచ్చేక నీకోసం ఒత్తిడి చేయగా ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల్ని నమ్మిస్తాను." "మరి చంద్రావతి విషయం...."
"తను నపుంసకుడని ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం చంద్రావతి నాయన ఉంచుకున్నడని చంద్రావతి చేతనే చెప్పించగలను."
'ఛీ...ఛీ.... కన్నబిడ్డ ముందు ఎటువంటి సంభాషణ చేయాల్సి వస్తోంది...? అంది లక్ష్మమ్మ అప్రయత్నంగా.
'అలా బాధపడనక్కర్లేదు . విదేశాల్లో తల్లీకొడుకులు ఇలాగే మాట్లాడుకుంటారు. అందులో తప్పేమీ లేదు. నువ్వీ దేశంలో పుట్టవలసిన ఆడదానివి కాదని నారాయణ ఆననే అన్నాడు" అన్నాడు గోపీ.
"నారాయణ , నారాయణ అనకపోతే నాన్న అనలేవా?"
"నారాయణ అంటే పుణ్యం వస్తుంది . నాన్న అంటే పాపం వస్తుంది "అన్నాడు గోపీ.
"ఈ దేశానికి తగని నా కడుపున మీలాంటి పిల్లలు పుట్టడం అదృష్టమో, దురదృష్టమో....!' అంది లక్ష్మమ్మ.' "ఇంతకూ నీ నిర్ణయం యేమిటి?" అన్నాడు గోపీ.
"నేనింకా విధవను కాలేదు" అంటూ లోపలకు నడిచింది లక్ష్మమ్మ.
---అయిపొయింది ----
