Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 50


    మొట్టమొదటిసారి ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చినపుడు రాజమ్మ తండ్రి శివయ్య చిరాకుపడి-బొత్తిగా కొంపాగోడూ లేనివాడిని నీకు పిల్ల నెవడిస్తాడు పొమ్మన్నాడు.....
    పంతులుకు పౌరుషం వచ్చింది. స్వంతిల్లు లేకపోయినా అతని సంపాదన మరీ తక్కువదేమీకాదు. రోజూ సిటీకి వెళ్ళి పదిరూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తూంటాడు. ఒకోసారి అతని సంపాదన పాతికదాకా వుంటుంది.
    పంతులు తన సంపాదన పెరగడానికి సిటీలో స్థలం మార్చాడు. ఆస్థలం అతనికి అచ్చివచ్చింది. రెండేళ్ళలో రెండువేలకు ఓ గుడిసె స్వంతం చేసుకోగలిగాడు పంతులు గుడిసెకూడా విశాలమైనది.
    పంతులు గుడిసె కొన్నాక శివయ్య సంతోషించాడు- "నా కెవరున్నారు? ఒక్కగానొక్క కూతురు. అదెళ్ళిపోతే నన్ను చూసేవాళ్ళెవ్వరూ లేదు. మీమీద పడి తిండం నా కిష్టంలేదు. కూతురి కొంప దోచుకుతింటున్నాడన్న వాదు నాకొద్దు. దానికో నాగ చేయించు. నాకో రెండువేలు పారేయి. ఇద్దరూ పెళ్ళిచేసుకుని హాయిగా వుండండి....."
    పంతులు కుత్సాహం చచ్చిపోయింది. రాజమ్మ పంతుల్ని ఒంటిగా కలుసుకుని-"అందరికీ చేతులు చూసి జోస్యం చెబుతావుగదా-నా చేయిచూసి మన పెళ్లెప్పుడౌతుందో చెప్పు....." అంది.
    రాజమ్మ చేయిచూశాడు పంతులు-"ఇంకా మూడేళ్ళు దాకా నీకు పెళ్ళికాదు...." అన్నాడు.
    "నీ పెళ్ళంటున్నావ్-మరి నీ పెళ్లెప్పుదౌతుందిట?" అంది రాజమ్మ.
    "ప్రియురాలితో అయిదేళ్ళ పరిచయం అయితేగానీ పెళ్ళికాదట...." అన్నాడు పంతులు.
    "నిజమా, వేళాకోళమా?" అంది రాజమ్మ.
    "ఇది పంతులు జోస్యం. తప్పడానికి వీల్లేదు. వేళాకోళం ప్రసక్తిలేదు...."
    "అమ్మ బాబోయ్-అన్నేళ్ళు నేనాగలేను...."
    "ఆగడమెందుకు? మన పరిచయానికిప్పుడు రెండేళ్ళవయస్సు. ఇంకో మూడేళ్ళు పెళ్ళికాకపోయినా దంపతుల్లా గడుపుదాం? డబ్బు పోగవగానే పెళ్ళి చేసుకుందాం -ఏం?"
    "అబ్బా-ఆశ!" అంది రాజమ్మ.
    అలా అన్నప్పటి ఆమె పెదవి విరుపు, కంటి మెరుపు పంతుల్ని కవ్వించాయి. అతను చటుక్కున ఆమెను కౌగలించుకోబోయాడు. ఆమె అతణ్ణి పక్కకు తోసేసి-"పెళ్ళికాకుండా పిచ్చి పిచ్చి వేషాలేయకు...." అంది.
    అప్పట్నించీ పంతులు ప్రయత్నిస్తూనే వున్నాడు డబ్బు పోగుచేద్దామని తన జోస్యం ప్రకారం అయిదేళ్ళు గడిచి ఆర్రోజులయింది. డబ్బింకా పోగవలేదు. ఆరొందలు పెట్టి ఓ పల్చటి బంగారు గొలుసు చేయించాడు రాజమ్మకోసం. పదిహేనువందలదాకా రొక్కంచేరింది. ఇంట్లో జాగ్రత్తగా భద్రంచేస్తున్నాడదంతా. అయిదు వందలు పోగవడానికింకా కొన్ని నెలలు పడుతుందేమో-
    "ఇంతమందికి జోస్యం చెబుతున్నావ్-నీ సంగతి నీకు తెలియదు. ఎప్పుడు మన పెళ్ళి?" అంటోంది రాజమ్మ.
    ఆమెను తనదారికి తీసుకురావాలని చాలా ప్రయత్నించాడు తను. కానీ ఫలితం సాధించలేకపోయాడు. ఎవరో కుర్రాడీ అమ్మాయిని క్షణాల మీద మోసగించగలిగాడు.
    ఆ అమ్మాయి వెళ్ళిపోయినా పంతులు ఆలోచనలు రాజమ్మ చుట్టూ తిరుగుతూనే వున్నాయి. తనూ ఒకసారి రాజమ్మ ననుభవించగలిగివుంటే బాగుండేది.
    "ఇందాకా వచ్చిన అమ్మాయికి ఏం చెప్పావ్?" అన్న మాటలు విని పంతులీ లోకంలోకి వచ్చాడు.
    "ఎవరు బాబూ నువ్వు?"
    "ఇందాకా వచ్చిన అమ్మాయికి ఏం చెప్పావ్?" అతను తన ప్రశ్న రెట్టించాడు.
    "కూర్చో-చేయిచాపు...." అన్నాడు పంతులతని ఉద్దేశ్యాన్నర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.
    యువకుడు అప్రయత్నంగా కూర్చుని చేయిచాచాడు-
    "ఇదాట్టే మంచి చేయికాదు...." అన్నాడు పంతులు పెదిమవిరచి.
    యువకుడి ముఖంలో కోపం కనబడింది. అతని ప్రశ్న, అతని హస్తరేఖలు-మూడూ కలిసి ఆలోచిస్తే పంతుల కతని కథ తెలిసిపోయింది.
    "నీ భాగ్యరేఖ దగ్గర ఒక మెలతవుంది. అంటే ఆ మెలత దగ్గర నువ్వేదో పెద్ద పొరబాటు చేస్తావు. అది గుర్తించి సవరించుకుంటే-నువ్వు పట్టిందల్లా బంగారమౌతుంది. అది సవరించుకోలేకపోతే అధోగతిపాలౌతావు...." అన్నాడు పంతులు.
    "నన్ను గురించి చెప్పిందా ఆ అమ్మాయి...." అన్నాడా యువకుడు అనుమానంగా.
    "ఏ అమ్మాయి?" అన్నాడు పంతులు.
    "నాకుముందు నీకు చేయి చూపించిన పిల్ల....."
    "ఆ అమ్మాయా! అది దివ్యమైన హస్తం. ఆ పిల్లను చేసుకున్నవాడికి పట్టిందల్లా బంగారమౌతుంది...."
    "ఆ అమ్మాయి నన్నుగురించి నీకేమైనా చెప్పిందా?"
    "నువ్వెవరో తెలియదు. కానీ ఆపిల్ల చాలా అదృష్టజాతకురాలు. జీవితంలో ఒకసారి చిన్న పొరపాటుచేసినా అదామె బంగారు భవిష్యత్తు కడ్డురాదు...."
    "నా చేయి చూశావ్ కదా-లక్షాధికార్ల పిల్లను చేసుకునే అవకాశముందంటావా?"
    "ఓ రూపాయిలాపడేయ్-చెబుతాను....."
    యువకుడు పంతులుకు రూపాయిచ్చాడు. పంతులు దాన్ని రొంటిన దోపుకున్నాడు.
    "నువ్వు మరీ డబ్బున్న పిల్లను చేస్కోవు. పిల్ల వల్ల నీకేమీ ఆస్తిరాదు కానీ పిల్లవచ్చాక మాత్రం నీ జాతకం మారిపోతుంది. ఎటొచ్చీ నీ భాగ్యరేఖలో మెలత వుంది కదా. అక్కడ నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దానిమీద నీ జాతకం ఆధారపడివుంది.....' అన్నాడు పంతులు.
    యువకుడు అసంతృప్తిగా అక్కణ్ణించి కదిలి వెళ్ళాడు.
    "కుర్రాడు బాగున్నాడు. అందుకే ఆపిల్ల అంత సులువుగా వీడివల్లో పడిపోయింది-"అనుకున్నాడు పంతులు.
    పంతులుకు యువకుడి కథ అర్ధమైపోయింది. అతనా అమ్మాయిని లొంగదీసుకున్నాక-లక్షాధికార్ల అమ్మాయికై వేట ప్రారంభిన్చినా మానసికంగా అందుకు సిద్దపడ్డట్లు లేడు. ఎందుకంటే ఆమెను తనదగ్గర గమనించి పనిగట్టుకుని ఆమె తనతో ఏం చెప్పిందో తెలుసుకునేందుకు ప్రయత్నించడం అతని మానసిక బలహీనతను తప్పక తెలియజేస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS