Previous Page Next Page 
డాళింగ్ పేజి 50

 

    బెడ్ రూంలోంచి బయటికొచ్చి, వరండా దాటి,  మెట్లు దిగి, కింద హలో ఎడమ వేపు నున్న పూజ గదిలో కొచ్చింది.
    ఆ పూజ గదిలో నిలువెత్తు దేవి విగ్రహం ----ఆ విగ్రహం ముందు చిన్న బంగారం భరిణ ఉంది.
    "జయేంద్ర........ఆ పెట్టె తెరువు" అంది.
    ఆశ్చర్యంగా రుక్మిణి దేవి, ముఖంలోకి చూసి, ఆ బంగారం భరిణను విప్పాడు.
    అందులో -------
    పచ్చగా, కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో కనబడిన వస్తువును చూడగానే -
    జయేంద్ర తలతిప్పి, రుక్మిణి దేవి వేపు చూసాడు దిగ్బ్రమగా....
    నాలుగు కళ్ళు ఒక్కక్షణం కలుసుకున్నాయి.
    మరో మాట మాట్లాడలేదు జయేంద్ర.
    ఆ వస్తువును తీసి, దేవీ పాదాల ముందు పెట్టి, నమస్కరించి చేతిలోని తీసుకుని, కళ్ళకద్దుకున్నాడు.
    ఆ వస్తువు---
    ఎంతో అపురూపంగా , ఎన్నాళ్ళనుంచో రుక్మిణి దేవి దాచుకున్న మంగళ సూత్రం .......
    ఇద్దరి మధ్యా ఒకే ఒక్క క్షణం ....
    జయేంద్రదత్, మరేం మాట్లాడకుండా , దేవీ సాక్షిగా , రుక్మిణీ దేవి మెడలో మంగళ సూత్రధారణ చేసాడు.
    చేసి కళ్ళు మూసుకుని
    తలొంచుకుని నిలబడ్డాడు. అతనికంతా విచిత్రంగానూ, ఒక కలలా ఉంది--
    పాదాలకు, ఏదో చల్లని స్పర్శ.
    కళ్లిప్పి చూసాడు జయేంద్ర.
    రెండు పాదాలను కళ్ళకద్దుకుంటోంది రుక్మిణీ దేవి.
    ఆమె కళ్ళంట ఉబికిన కన్నీళ్లు, అతని పాదాల్ని కడుగుతున్నాయి.


                                            *    *    *    *

    పన్నెండు నెలలు గడిచాయి. రుక్మిణి దేవి సినిమాలకు స్వస్తి చెప్పేసింది.
    జయేంద్ర క్షణం తీరిక లేని హీరో అయ్యాడు. ఒక్క తెలుగు సినిమాల్లోనే కాకుండా, సంవత్సరానికి ఓ రెండు హిందీ సిన్మాలు కూడా చేస్తున్నాడు.
    ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం బొంబాయి వచ్చాడు జయేంద్ర.
    "ఇండియా గెట్" దగ్గర షూటింగ్ జరుగుతోంది.
    అప్పుడు రాత్రి ఒంటిగంటయింది.
    "సార్ మీ కర్జంటూగా ఫోన్."
    మద్రాసు నుంచి వచ్చిందా ఫోన్.
    "కంగ్రాచ్యులేషన్స్ జయేంద్ర! మగపిల్లవాడు......ఒక అరగంటైంది."
    ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నాక, ఒక్క క్షణమైనా అక్కడ ఉండలేకపోయాడు జయేంద్ర.
    వచ్చి, ఆస్పత్రిలో ఉన్న రుక్మిణీ దేవి, బాబుని చూసేవరకూ అతనికేం తోచలేదు--
    గదిలో కొచ్చిన జయేంద్రను చూసీ చూడగానే , రుక్మిణీ కన్నీళ్ళు నిండిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పింది.
    "నా బతుక్కి ఇంతటి వరం లభిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు జయేంద్ర! చాలా మంది నటీమణుల్లాగే, ఎవరికీ తెలీకుండా , ఏదో మారుమూల పూరిగుడిసెలో చచ్చిపోతానేమోననుకున్నాను లేదు.......నేను అదృష్టవంతురాల్ని, నాకా అదృష్టాన్నిచ్చిన వాడివి నువ్వు. బంగారం లాంటి బాబు నిచ్చినవాడివి నువ్వు, ఈ జన్మలోనే కాదు....జన్మ జన్మాలకు నీకు భార్యగా పుట్టాలని , ఆ భగవంతుడ్ని కోరుకుంటాను" కృతజ్ఞతతో ఆమె కంఠం మూగబోయింది.
    ప్రేమగా బాబు నుదుటున ముద్దాడి, రుక్మిణి కళ్ళల్లోని కన్నీటిని తుడిచి....
    "బాబుకేం పేరు పెడదాం......" అడిగాడు జయేంద్ర ప్రేమగా .


                                                 *    *    *    *

    బాబు పేరు విమలేంద్ర.
    అయిదేళ్ళు గడిచాయి.
    ఇంకో పాప పుట్టింది.
    పాప పేరు వినమ్ర.......
    

                                                *    *    *    *
    పిల్లలిద్దరూ రుక్మిణికి పంచప్రాణాలు. విమల్ ని మంచి నటుడ్ని చేయాలి. వినమ్రను అమెరికాలో చదివించాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరూ డెహ్రాడూన్ లో చదువుకుంటున్నారు.
    రుక్మిణికి అడపా, దడపా నటించమని అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
    కానీ ....రుక్మిణీ దేవి ఒప్పుకోలేదు.
    
                                             *    *    *    *
    కాలప్రవాహంలో పన్నెండ్లు గడిచిపోయాయి.
    విమల్ లో తనను చూసుకుని మురిసిపోతుంది రుక్మిణి.
    "పెద్దయ్యాక నువ్వేం చేస్తావ్ నాన్నా....." ఒక్కసారి కొడుకుని అడిగింది.
    "నీలా సినిమాల్లో నటిస్తాను మమ్మీ." ఆ మాటకు పొంగిపోయింది రుక్మిణి.
    విమల్ , సినిమా నటుడవడానికి అవసరమైన హార్స్ రైడింగ్ డాన్స్, కరాటే, అన్నిటిలో శిక్షణ ఇప్పించింది రుక్మిణి.
    జయేంద్ర చాలా ......బిజీ అయిపొయాడు.
    నెలకు ఒక రోజయినా , ఇంట్లో ఉండడం అరుదయిపోయింది.
    ఎప్పుడూ షూటింగులే.
    హీరో నుంచి కారక్టర్ యాక్టరయ్యాడు జయేంద్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS