Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 50

 

    "ఈ ఫోటో నీ ఆఫీసుకు పంపిస్తే నీ వుద్యోగం ఊడొచ్చు. బయట ప్రచారం చేస్తే నీ కెవ్వరూ పిల్ల నివ్వరు. నీ చెల్లికి కూడా పెళ్ళి కాదు...."
    ఆత్మారామం అంతదూరం ఆలోచించలేదు. ఆలోచించాగానే అతడికి భయం వేసింది. "నేనేం చేయను?" అన్నాడతను.
    "లక్ష రూపాయలు సంపాదించడానికి మరో మార్గం చెబుతాను...."
    "ఆ మర్గాలేవో నువ్వే చూసుకోరాదూ ...."
    "చూడు మిస్టర్ ! జామిచెట్టు దగ్గర కెళ్ళి మామిడి పండు కావాలంటే యివ్వగలదా? లక్ష రూపాయలు సంపాయించ గల శక్తి నీకే వుంది. అందుకే నేను నిన్నాశ్రయించాను--"
    "నీ మార్గాలు నాకు నచ్చడం లేదు ...."
    "నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. శాంపిల్ గా నీ మీదకు ఓ అమ్మాయిని వదిలాను. మగాడిని కాబట్టి నువ్వది ఆనందించావు. నువ్వు నాకు లోంగిరాని పక్షంలో నీ చెల్లెలు...."
    ఆత్మారామం ముఖం ఎర్రబడింది.
    "అలా కోపంగా చూడకు. నా శక్తి యేమిటో చెబుతున్నాను...."
    ఆత్మారామం చివరకు లక్ష రూపాయలు సంపాదించే మార్గ మేమిటో చెప్పమని అడక్క తప్పలేదు.
    "నీకు ప్రసాదరావు గారు తెలుసా ?"
    "ఊ"
    "అయన భార్య వీరభద్రమ్మ తెలుసా ?"
    ఆత్మారామం తడబడ్డాడు -- "ఇవన్నీ ఎందుకు నీకు ?"
    "ఎందుకా ? అలోచించి చూడు. ప్రసాదరావు , వీరభద్రమ్మ లకు సంబంధించి నీకేం తెలుసో చెప్పు !"
    ఆత్మారామం ఆలోచనలో పడ్డాడు.
    
                         *    *    *    *

    ప్రసాదరావు ఆత్మారామం కు దూరపు బంధువు . బాగా డబ్బున్నవాడు కావడం వల్ల వాళ్ళ మధ్య దూరం కూడా ఎక్కువగానే వుంది.
    వీరభద్రమ్మ కు అత్మారామమంటే అభిమానం. తన కూతుర్ని ఆత్మారామం కిచ్చి పెళ్ళి చేయాలని కూడా ఆమె అనుకుంటోంది. అందుకు ప్రసాదరావు ఒప్పుకోవడం లేదు.
    ఒకారోజామే అత్మారామంకు ప్రత్యేకంగా కబురు పెట్టింది. అతడు వెళ్ళాడు. ఇంట్లో ఆమె ఒక్కర్తే మాత్రమే ఉంది.
    "నా దురదృష్టం కొద్దీ ఈయనకు భార్యనయ్యాను" అన్నదామె.
    ఆత్మారామం మౌనంగా విన్నాడు.
    "నేను కోరుకున్నది డబ్బు కాదు, అభిమానం . ఆయనకు లేని దురలవాటు లేవు. నాకు చీరలు, నగలు కొంటారు. తన సుఖాలి వేరేచోట వెతుక్కుంటారు. ఇంత వయసొచ్చాక ఆయనకు రెండో పెళ్ళి చేసుకోవాలనిపిస్తోంది. అదేమంటే యింత ఆస్తికి వారసుడు లేకుండా పోయాడని బాధగా ఉందంటున్నారు. వారసత్వానికి మగబిడ్డ కాని ఆడబిడ్డ పనికి రాదా అని దెబ్బలాడాను -- " అని ఆగిందామె.
    అత్మారామం  వింటున్నాడు. ప్రసాదరావు మీద అతడికి సదభిప్రాయం లేదు. కానీ వీరభద్రమ్మ కష్టపడుతున్నట్లు ఇతడికి తెలియదు. ఈ ప్రపంచంలో సుఖ పడాలంటే డబ్బొక్కటే సాధనం కాదని అతడు గ్రహించాడు.
    వీరభద్రమ్మ చెప్పుకుపోతోంది.
    తను రెండో భార్యగా తెచ్చుకోదల్చుకున్న యువతిని ప్రసాదరావు భార్యకు చూపించాడు. ఆమె వీరభద్రమ్మను  అక్కయ్యా అని ఆప్యాయంగా పిలిచింది. ఆ యింట్లో తను దాసీదానిలా పడి వుంటానంది. ప్రసాదరావును తను ప్రేమిస్తున్నాననీ, అతడు లేకపోతె బ్రతకలేననీ అంది.
    'అయితే చావు!' అంది వీరభద్రమ్మ.
    "అది చస్తే నేనూ చస్తాను" అన్నాడు ప్రసాదరావు.
    "అయితే ఇద్దరూ కలిసే చావండి" అంది వీరభద్రమ్మ.
    "అయ్యో - అయ్యో - నన్నెన్ని మాటలైనా అనండి. వారి నేమన్నా సహించలేను నేను" అందా యువతి.
    వాళ్ళిద్దరికీ వివాహమైతే కాలేదు కానీ భార్యాభర్తల్లాగే వ్యవహరిస్తున్నారు. తనామేను వివాహం చేసుకుని తీరతానని ప్రసాదరావు మొండి కేశాడు.
    వీరభద్రమ్మ అతడికి కాగితం రాసివ్వాలిట. తను సంసార జీవితానికి పనికి రాని స్థితి ఏర్పాడిందనీ, భర్తను సుఖ పెట్టలేక పోతున్నాననీ-- కాబట్టి వేరే వివాహం చేసుకోవలసిందిగా తనే బలవంత పెడుతున్నాననీ ఆమె కాగితం రాసి ఇస్తే ప్రసాదరావు ఆ యువతిని గత్యంతరం లేక ఒప్పుకున్నట్లు నటించి వివాహం చేసుకుంటాడట.
    "దానికి వెళ్ళేందుకూ? ఎలాగూ దాంతో వుంటున్నారుగా! ఉంచుకున్నానుకొండి" అంది వీరభద్రమ్మ.
    "పెళ్ళి చేసుకోకపోతే నాకు వారసుడేలా వస్తాడు?" అన్నాడు ప్రసాదరావు.
    "చస్తే మీకా కాగితం రాసివ్వను" అంది వీరభద్రమ్మ.
    "రాసివ్వక పొతే చస్తావు ...." అన్నాడు ప్రసాదరావు.    
    అతడామెను బెదిరించాడు -- ఆమెను ఇంట్లో ఉరి తీసి తనే ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్నీ నమ్మిస్తాడట. అప్పుడు హాయిగా ఆ యువతిని పెళ్ళి చేసుకుంటాడట.
    "చస్తావో, కాగితం రాసిస్తావో ఆలోచించుకో " అన్నాడు ప్రసాదరావు.
    అతడామెకు ఎన్నో ఆశలు కూడా చూపించాడు. ఆస్తిలో సగం వీరభద్రమ్మ పేరున రాస్తానన్నాడు. ఆమెను ఎంతో గౌరవంగా అభిమానంగా చూసుకుంటానన్నాడు. ఆ యువతి చేత ఆమె కూడిగం చేయిస్తానన్నాడు.
    దేనికీ వీరభద్రమ్మ లొంగలేదు. భర్తను తనతో పాటు మరో స్త్రీ పంచుకోవడం ఆమెకు రుచించలేదు.
    "అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్తున్నావు. నన్ను చంపైనా సరే దాన్ని పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు ప్రసాదరావు.
    అతడు వీరభద్రమ్మకు రెండు రోజులు గడువిచ్చాడు. ఈ రోజుతో గడువుకాలం ముగుస్తుంది.
    "పరిస్థితి నా చేయి దాటి పోయిందని పిస్తోంది. నేను చావుకైనా సిద్దపడతాను గానీ బ్రతికుండగా ఈ పెళ్ళికి ఒప్పుకోలేను. ఇంట్లో పెళ్ళీడు ఆడపిల్ల వుండగా ఈయన కిలాంటి పాడుబుద్ధి పుట్టడం నా దురదృష్టం " అంది వీరభద్రమ్మ.
    "నేనేం చెయ్యనత్తయ్య !" అన్నాడు ఆత్మారామం.
    'అయన నన్నెలా చంపాలను కుంటున్నారో నాకు చెప్పారు. అదే విధంగా చంపుతారేమినని నా భయం. చస్తానన్న భయం నాకు లేదు. నేను గనుక హత్య చేయబడితే అయన నేరం బయటపడాలి. అయన జైల్లోకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు నీ మరదల్ని పెళ్ళి చేసుకుందుకు ఏ అడ్డూ వుండదు. అ విధంగా నా ఆత్మ శాంతిస్తుంది. ఆయనతో నేను పడుతున్న ఇబ్బందులూ, అయన బెదిరింపులు సవివరంగా స్వదస్తూరితో రాసి నీకిస్తాను. నేను హత్య గావించబడితే ఆ ఉత్తరం నువ్వు పోలీసుల కివ్వాలి --"
    వీరభద్రమ్మ ఉత్తరం రాసి ఆత్మారామం కిచ్చింది. అతడది యింట్లో భద్రంగా దాచాడు. అమర్నాడుదయం ప్రసాదరావు స్వయంగా ఆత్మారాం ను కలుసుకున్నాడు.
    "నేనే తననెం చేసినా నువ్వు నన్ను పోలీసులకు పట్టిస్తావని పెల్తోంది మీ అత్తయ్య. నా సంగతి నీకు తెలియదు. నువ్వు వెధవ పనులేం చేసినా నన్ను నేను రక్షించుకోగలను . కానీ ఆ తర్వాత నిన్ను నువ్వు రక్షించుకో లేవు -- " అంటూ ప్రసాదరావతడిని తీవ్రంగా హెచ్చరించాడు.
    ప్రసాదరావు కు డబ్బుంది. ఆ డబ్బుతో అతడు పోలీసుల్ని కూడా కోనేయగలనన్న నమ్మకంతో వున్నాడు. అతడి హెచ్చరికకు ఆత్మారామం భయపడ్డాడు.
    ఆరోజే వీరభద్రమ్మ ఆత్మహత్య చేసుకుని చచ్చి పోయింది. చనిపోయే ముందామే ఉత్తర మొకటి రాసింది. దస్తూరీ హడావుడిగా , చిందర'వందరగా రాసినట్లుంది. సంతకం ఆమెదే!
    "నాకు మగ సంతానం లేదు. నేనుండగా నా భర్త మరో వివాహానికి అంగేకరించడం లేదు. ఆయనకు వారసుడు లేకుండా పోవడం నాకిష్టం లేదు. అందుకు నా చావు తప్ప దారి లేదనిపించింది -" అని వ్రాసిందామే.
    ఆమెది ఆత్మహత్య కాదనీ-- హత్య అనీ ఆత్మారామం కు తెలుసు. అందుకు అవసరమైన సాక్ష్యం కూడా వుంది. కానీ అతడు ప్రసాదరావు కు భయపడి నోరు మూసుకుని ఊరుకున్నాడు.
    ఇప్పటికి వీరభద్రమ్మ చనిపోయి మూడు వారాలయింది.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS