Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 49

 

                      ఒకే దెబ్బకు పిట్టలెన్నో ?

                                                           జొన్నలగడ్డ రామలక్ష్మీ

    ఆత్మారామం ఒక్కడూ యింట్లో వున్నపుడామే వచ్చి తలుపు తట్టింది. ఆమెను చూడగానే అతడి కళ్ళు చెదిరి పోయాయి. అమెది రెచ్చగొట్టే అందం. మరింత రెచ్చగొట్టే విధంగా బట్టలు వేసుకుంది.
    ఆమె పేరు జానకి, ఆత్మారామం చెల్లెలు కోసం వచ్చింది. చేతిలో చిన్న బ్రీఫ్ కేసుంది. ఏదో ఇంటర్వ్యూట. ట్రెయిన్ దిగి సరాసరి వీళ్ళింటికే వచ్చింది. మర్నాడు రాత్రికి వెళ్ళిపోతుందట. అయితే తన చెల్లెలు ఊరెళ్ళింది. మరో వారం దాకా రాదు.
    అర్మారామం కంగారుపడ్డాడు. ఆమెను వెళ్ళి పొమ్మని ఆనలేడు. ఉండమనీ అనలేడు. అందమైన ఒంటరి ఆడపిల్ల ఓ రాత్రంతా తనింట్లో వుంటే అభ్యంతరమేమీలేదు తనకు. కానీ ఆమె వుంటుందా?
    అతడామెను లోపలకు రానిచ్చి ఇంట్లో పరిస్థితి చెప్పాడు. దానికామె ఏమాత్రమూ చలించలేదు.
    "ఉండడానికి మీకు అభ్యంతరం లేకపోతే నాకేమీ అభుంతరం లేదు" అన్నాడు ఆత్మారామం తెగించి.
    'అయ్యో రామా! నాకు అభుంతర మెందు కండీ .... ఇంకా మీరే నన్ను ఏ దొంగో అనుకుంటారని భయపడ్డాను" అన్నదామె.
    రాత్రివేళ ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని ఆమె స్టేషన్ దగ్గర భోజనం చేసే వచ్చిందట. కాసేపు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకున్నారు.
    జానకి చాలా చలాకీ మనిషి లాగున్నది. ఆమె చలాకీ తనం అర్మారామాన్ని ఇబ్బంది కూడా పెట్టింది.
    "నా డ్రస్సు చూసి మీరు నేను చాలా ఫాషనబుల్ గర్ల్ ననీ, సాఫిస్టికేటేడ్ ఫామిలీ నుంచి వచ్చానని అనుకుంటే పోరబడ్డారనే చెప్పాలి. ఈ డ్రస్సు నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కోసమని నిర్ణయించాను. ఇలాంటి జతలు రెండున్నాయి. చీర పల్చగా -- లోనేక్ జాకెట్ , పైట జారాలి ...ఇంక చూడండి ....ఇంటర్వ్యూ చేసే ఆ మగరాయుళ్ళు మొహాలు...." అందామె.
    ఆత్మారామం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆమె పైట జారింది. అతడి మోహంలో మార్పులు వస్తున్న మాట నిజం. అవి రాకుండా వుండాలని అతడు వృధా ప్రయత్నాలు కొన్ని చేశాడు.
    ఆమె చెప్పుకు పోతోంది. "ట్రయిన్ లో మగాళ్ళ రియాక్షన్ చూశాక  నాకు అనిపించింది. ఆకర్షణకు తిరుగులేని డ్రస్సు ఇదేనని! అయితేమీరు నాకో సలహా యివ్వాలి. ఇప్పుడు నేను వేసుకున్నది లైట్ బ్లూ కలర్! పెట్టెలో లైట్ రోజ్ కలర్ శారీ పెట్టు వుంది. ఏది నాకెక్కువ బాగుంటుందో మీరే చెప్పాలి. మీరు లైట్ బ్లూ కలర్ దే బాగుంటుందంటే రాత్రికి రాత్రి ఈ సెట్టు ఉతికి అరెసుకోవాలి. సింధటిక్ కదా -- ఉదయాని కేమిటి - అర్ధరాత్రికే ఆరిపోతాయి"అంటూనే ఆమె బ్రీఫ్ కేసు తెరిచి మరో సెట్టు తీసి - "ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను"అంది.
    ఆత్మారామం "ఊ" అన్నాడు. అసలేం జరుగుతోందో తెలియకుండా పోతోందతడికి. మనసు వశం తప్పేసింది. ఏవేవో ఆశలతడిలో రగుల్కుంటూన్నాయి.
    కొద్ది క్షణాల్లో అమెలైట్ రోజ్ కలర్ డ్రస్సు లో వచ్చింది. చూస్తూనే "మార్వేలస్ " అన్నాడతను అప్రయత్నంగా.
    "థాంక్యూ " అన్నదామె.
    "రెండు డ్రస్సు లూ ఎగ్జాట్లీ సెమ్ కాదు....' అంటూ ఆమె అతడికి కొన్ని మార్పులు చెప్పింది. ఆత్మారామం ఇంకా యిబ్బంది పడ్డాడు.
    అతడి అభిప్రాయం విన్నాక ఆమె సంతోషంగా 'అయితే రాత్రికి బట్టలుతుక్కునే బాధ తప్పింది: అంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళింది. వెళ్ళిన మరు క్షణంలోనే కెవ్వు మన్న కేక వినిపించింది.
    ఆత్మారామం అప్రయత్నంగా గదిలోకి పరుగెత్తాడు.
    "బల్లి!" అన్నదామె. ఆమె వంటి మీద బట్టలు లేవు. కానీ భయంతో వణుకుతున్నదామె. బల్లి అంటే ఆమెకు భయమట.
    మరి కొద్ది క్షణాల్లోనే ఆమె అతడికి బల్లిలా అతుక్కు పోయింది.

                                    2
    రెండు రోజుల అనంతరం ఆత్మారాం కు పోస్టులో ఓ కవరు వచ్చింది. అందులో రెండు ఫోటోలు, ఓ ఉత్తరం వున్నాయి.
    "డియర్ మిస్టర్ ఆత్మారాం! వచ్చే గురువారం సాయంత్రం ఆరింటికి పద్మజా హోటల్ - పదిహేడో నంబరు గదికి లక్ష రూపాయలు తీసుకునిరా -- నా దగ్గర మొత్తం నాలుగు నెగుటివ్ లున్నాయి. అన్నీ తీసుకు వేడుదువుగాని...."
    ఆత్మారాం తెల్లబోయాడు. ఏమిటీ ఉత్తరం?
    జరిగిందేమిటో అతడి కర్ధమయింది. జానకి తనింటికి ఎవరో పంపగా వచ్చింది. ఆ వ్యక్తీ తనని బ్లాక్ మెయిల్ చేయబోతున్నాడు. అయితే ....
    ఏమిటీ బ్లాక్ మెయిల్ ఉద్దేశ్యం !
    తండ్రి రిటైరయ్యాడు. ఆయనకు వచ్చే పెన్షన్ నెలకు మూడొందలు. తనుద్యోగంలో చేరి రెండేళ్ళయింది. తన జీతం నెలకు ఎడువందలు. తనకో ఇరవై ఏళ్ళ చెల్లెలుంది. ఆమె పెళ్ళికి కట్నం పది వేల దాకా అడుగుతున్నారు.
    తాముండేది అద్దె యిల్లు. తమకు పొలం, గట్రా ఏమీ లేదు.
    ఎక్కణ్ణించి తెస్తాడు తను లక్ష రూపాయలు? ఈ విషయం ఆ బ్లాక్ మెయిలర్ కు తెలియదా? ఒకవేళ అతడీ ఫోటోలు బయట పెట్టినా పరువు పోవడానికి తను పారిశ్రామికవేత్తకాదు. రాజకీయ నాయకుడూ కాదు. నలుగురిలో తిరగడానికి కొన్నాళ్ళు కాస్త యిబ్బందిగా వుంటుంది. అయితే అందుగురించి లక్ష రూపాయలు వెచ్చించగల స్తోమత అతడికి లేదు.
    ఆత్మారామం ఆ ఉత్తరం గురించీ బ్లాక్ మెయిలర్ గురించీ గురువారం దాకా ఆలోచిస్తూనే వున్నాడు. గురువారం సాయంత్రం అతడు పద్మజా హోటల్లో బ్లాక్ మేయిలర్ని కలుసుకున్నాడు. అతడిని చూసి ఆత్మారామం ఆశ్చర్యబడ్డాడు.    
    తెల్లగా, పొడుగ్గా , హుందాగా - తనకంటే గొప్పవాడి లాగున్నాడు.
    "డబ్బు తెచ్చావా?"
    "లేదు...."
    "అయితే ఈ ఫోటోలు పదిమందికీ చూపించ మంటావా?"
    "చూపించక పోతేనే నేను సంతోషిస్తాను. కానీ లక్ష రూపాయలు నా కెక్కడి నుంచి వస్తాయి?" అన్నాడు ఆత్మారామం.
    "లక్ష రూపాయలు వచ్చే మార్గం నీకు నేను చెబుతాను . చేస్తావా?"
    "ఊ"
    "సురేంద్ర మోహన్ తెలుసా నీకు?
    "తెలియదు ."
    "అరే - ప్రముఖ పారిశ్రామికవేత్త సురేంద్ర మోహన్ తెలియదూ నీకు? నువ్వీ విషయం అన్నట్లు ఆయనకు తెలిస్తే  నీ ప్రాణాలు దక్కవు."
    "అయ్యో - అయినా - యధాలాపంగా సురేంద్ర మోహన్ అంటే ఎవరో అనుకున్నాను. అయన పేరు విన్నాను...."
    'అయన కూతుర్ని పెళ్ళి చేసుకో - ఒకటి కాదు - రెండు లక్షలు కట్నంగా ఇస్తాడు ...." అన్నాడతను.
    ఆత్మారామం కళ్ళు మెరిశాయి. "అంత గొప్పవాడు తన కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేస్తాడా?"
    "చేస్తాడు చేసుకుంటావా?"
    "ఊ"  అని ఏదో అనబోయి ఆగిపోయడతను -- "కొంపదీసి ఆమె రూపం భయంకరంగా ఉంటుందా ?"
    "రూపానికేమీ లోటు లేదు. అప్సరస లా వుంటుంది. ఎటొచ్చీ  ఓ కాలూ, చెయ్యి కన్నూ లేవు . అయితే సంసార జీవితానికి పనికొస్తుంది."
    ఆత్మారామం కు వళ్ళు జలదరించింది -- "నేనా పెళ్ళి చేసుకోను."
    "ఓహ్ -- అయితే నీ  అందం , పొజిషను చూసి ఓ అందమైన పిల్లను రెండు లక్షల రూపాయల కట్నమిచ్చి పెళ్ళి చేస్తారని అనుకుంటున్నావా ?"
    "నా అందం, పొజిషను చూసే కదా - నువ్వు నన్ను లక్ష రూపాయలకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు?" అన్నాడు ఆత్మారామం కసిగా.
    "తెలివిగానే మాట్లాడావు -- మరి నా లక్ష రూపాయలు ఎలా ఇద్దామనుకుంటున్నావు ?"
    'అనుకోవడం లేదు ...." అన్నాడు ఆత్మారామం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS