"పూర్వకాలంలో ఆడవాళ్ళకు యింటిచాకిరీ యెక్కువగా వుండేది. అది తప్పించుకోవడం కోసం ఒకోసారి ఇలాంటి వంక పెట్టేవారు. మొదట్లో నటనగా ప్రారంభించేక కొన్నాళ్ళకది అలవాటుగా మారిపోతుంది-" అన్నాడు వెంకన్న.
"మధ్యాహ్నంలోగా దొంగను పడతానన్నారు-ఎలా?" అనడిగింది సీతమ్మ.
"ఈ రోజంతా కన్తర్వు, వీర్రాజు, యశోదలను నా మనుషులు నీడలా వెన్నంటి ఉంటారు....వాళ్ళేం చేసారో తెలుసుకుంటారు" అన్నాడు వెంకన్న.
పదకొండున్నరకు వెంకన్నకు ఫోన్ వచ్చింది. కాంతారావు ఆఫీసుకు వెళ్ళి మామూలుగా తన పని చేసుకుంటున్నాడుట. ఏ విశేషమూ జరగలేదుట.
మరో అయిదునిముషాల్లో ఇంకో ఫోన్ వచ్చింది. వీర్రాజు మనిషి దిగులుగా కనబడుతున్నాట్ట. అజంతా హోటల్ ముందు చాలాసేపు తచ్చాడాడుట. లోనికి వెళ్ళనా, మాననా అని చాలా పర్యాయాలు తటపటాయించి ఆఖరికి లోపలకు వెళ్ళలేడుట. పోస్టాఫీసుకు వెళ్ళి ఓ ఉత్తరం రాసాట్ట. అడ్రస్: రాజయ్య, ఆత్రేయపురం, తూర్పు గోదావరిజిల్లా ప్రస్తుతం అతను ఓ హాండ్ లూమ్ ఎగ్జిబిషన్లో తిరుగుతున్నాట్ట.
ఇంకో అయిదునిముషాల్లో ఒక యువతి అక్కడకు వచ్చింది. ఓ గంటక్రితం ఆమె ఆ వీధిలో గిల్టునగలు అమ్మిందట. యశోద గిల్టునగలపై ఏ విధమైన ఆసక్తీ చూపలేదుట. ఈ విషయం చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
వెంకన్న ఫోన్ తీసి "దేవీ!" అన్నాడు.
వంటింట్లోంచ్చి ఫోన్ తీసిన పద్మావతీదేవీ "హలో!" అంది.
"నాలుగు వెల్లుల్లిపాయలు వలిచి, రేకలుతీసి, ముద్దగా నూరి ఘాటు ఏ మాత్రమూ పోకుండా భరిణలో పెట్టి మూతవేసి వుంచు. సీతమ్మని పంపిస్తాను. ఆమె కా భరిణ ఇవ్వు" అన్నాడు వెంకన్న.
"సరే!" అని ఫోన్ పెట్టేసింది పద్మావతీదేవి.
"ఏం చేయబోతున్నారు మీరు?" అంది రాజమ్మ.
"దొంగకు నిస్సహాయత కలిగించబోతున్నాను...." అన్నాడు వెంకన్న.
అంతకుమించి అతనేమీ చెప్పడని అర్ధమైన-అసిస్టెంట్సు ఇద్దరూ మాట్లాడకుండా ఊరుకున్నారు. కొద్ది సేపట్లోనే ఫోన్ మ్రోగింది. పద్మావతీదేవి వెల్లుల్లి ముద్దను తయారుచేసిన విషయం ఫోన్లో చెప్పింది. వెంకన్న ఆనతి మేరకు సీతమ్మ వెళ్ళి ఆ భరిణ తీసుకువచ్చింది.
"ఇప్పుడు మనం ముగ్గురం ఎదురింటికి వెడుతున్నాం" అన్నాడు వెంకన్న.
ముగ్గురూ బయల్దేరి యెదురింటికి వెళ్ళారు.
"రండి-రండి-దొంగ దొరికాడా?" అంది యశోద నవ్వుతూ.
"దొంగా దొరికాడు. వస్తువులూ దొరికాయి. శాంపిల్ కు ఒక ఉంగరం తీసుకొచ్చాను. ఈ భరిణలో వుంది. మీదేనేమో చూడండి...." అన్నాడు వెంకన్న.
"పోయిన వస్తువుల్లో ఉంగరం వున్నట్టులేదే...." అంటూ యశోద కుతూహలంగా భరిణ మూతతీసింది. వెల్లుల్లి వాసన గుప్పుమంది. అప్పుడు వెంకన్న చటుక్కున ఆమెను సమీపించి ఆ భరినను ఆమె ముక్కుకు అదిమి పెట్టాడు.
"అబ్బా-ఏమిటిది?" అంటూనే ఆమె కళ్ళు తేలవేసి ఉన్నపళంగా నేలమీద కూర్చుండిపోయి-నెమ్మదిగా కిందకు వాలిపోయింది.
ఆమెకు దెబ్బలు తగలకుండా సీతమ్మ, రాజమ్మలు కాశారు కానీ లేకపోతే ఏ ఎముకైనా విరిగి వుండేదామెకు!
"మీరు కాస్త జాగ్రత్తగా ఈమెను చూస్తూండండి" అంటూ వెంకన్న ఇల్లంతా కలయదిరగసాగాడు. తన అనుభవాన్ని జోడించి అతను కొన్ని స్థలాల్లో పరీక్షించగా ఒకచోట ఓ మూట దొరికింది. ఆ మూటలో నగలున్నాయి. కొంత క్యాషు కూడా వుంది. దాంతో అతను ఉత్సాహంగా సీతమ్మ, రాజమ్మలవద్ధకు వచ్చి "రండి, పోదాం-ఆ భరిణ తీయండి" అన్నాడు.
యశోద ఇంకా స్పృహతప్పి పడి వుంది.
ముగ్గురూ మళ్ళీ వెంకన్న ఇల్లు చేరుకున్నారు.
సీతమ్మ, రాజమ్మలు ఆ నగలవంక ఆశ్చర్యంగా చూస్తూ "ఎక్కడ దొరికాయి మీకు?" అన్నారు.
"యశోద ఇంట్లో!"
"మరామె అలా స్పృహతప్ప పడివుంది...." అంది రాజమ్మ.
"ఆమెను చూస్తే చాలా జాలిగా ఉంది నాకు. దొంగాడా కరవకురా అన్నట్లు ఆమెను మోసగించే ఉపాయం ఆమే చెప్పేసింది నాకు" అన్నాడు వెంకన్న.
"ఆమె నటించడంలేదు. నిజంగానే స్పృహతప్పి పడిపోయింది. చూస్తూ చూస్తూ యెవ్వరూ యావదాస్థినీ పోగొట్టుకోరు" అంది సీతమ్మ.
"నగలు పోయాయని వాళ్ళనుకుంటున్నారు. ఆ ఇంట్లో యెవ్వరూ దొంగ కాని పక్షంలో అవెలాగూ పోయినట్లే గదా! నాకు దొరికాయి" అన్నాడు వెంకన్న.
సరిగ్గా పన్నెండున్నరకు కాబోలు వీర్రాజును వెంటబెట్టుకుని యశోద వెంకన్న యింటికి వచ్చింది.
"డిటెక్టివ్ లై యుండి మీరు నన్నిలా మోసగిస్తారనుకోలేదు" అంది యశోద వస్తూనే తీవ్రంగా వెంకన్న వంక చూస్తూ.
"బాగుంది నేనేం చేశాను?" అన్నాడు వెంకన్న.
"నాకు వెల్లుల్లి వాసన చూపించి....స్పృహ తప్పించి నా యింట్లో దొంగతనం చేశారు" అందామె. ఈ సారి ఆమె కంఠంలో కాస్త తడి కూడా వుంది.
"మీ యింట్లో దొంగతనాని కింకేమున్నాయి? నిన్న రాత్రే అంతా దొంగలు దోచేసారు" అన్నాడు వెంకన్న ఆశ్చర్యాన్ని నటిస్తూ.
"ఎందుకొచ్చిన గొడవ వెంకన్నగారూ. నిజం చెప్పేస్తాను. మా ఇంట్లో నిజంగా దొంగతనం జరగలేదు. కొన్ని కారణాలవల్ల అది సృష్టించవలసి వచ్చింది" అంది యశోద.
సీతమ్మ, రాజమ్మ ఆశ్చర్యంగా యశోద వంక చూశారు.
వీర్రాజు బాగా డబ్బున్న వాళ్ళబ్బాయి. ఏదో పని మీద అయిదువేలిచ్చి అతన్నీ ఊరు పంపించారు. నిన్న అజంతా హోటల్ క్లబ్బులో అతను పేకాడి రెండువేలు పోగొట్టుకున్నాడుట. ఇంటి దగ్గర ఈ విషయం తెలిస్తే తిడతారు. అందుకని అతను తనను కాపాడమని కాంతారావును కోరాడుట. ఫలితంగా మూడువేలూ ఇద్దరూ పంచుకుందామన్నాడతను. ఊరికే పదిహేనొందలుస్తున్నాయిగదా అని కాంతారావు ఈ దొంగతనం ఉపాయం పన్నాడు. దొంగతనం జరిగినట్లు వీర్రాజు అప్పుడే ఇంటికి ఉత్తరం కూడా రాసేశాడు. వీధిలో నలుగురూ ఈ దొంగతనానికి సాక్ష్యంగా వుంటారు గదా అని కాస్త హడావుడి చేస్తే వెంకన్న తగులుకున్నాడు.
అప్పుడు వెంకన్న వారి సామాను వారికి చూపించాడు. యశోద ఆత్రంగా వాటిని పరీక్షించి చూసి, "ఫరవాలేదు. డిటెక్టివులను నమ్మవచ్చు" అంది.
"వెల్లుల్లి విషయంలో మీరు డాక్టర్ని కలుసుకోవడం మంచిది. మీ ఇంట దొంగతనం చాలా సులభం" అంది సీతమ్మ.
"డిటెక్టివు ఇంటి యెదురుగా వుంటే నాకేం భయం?" అంటూ వెళ్ళిపోయింది యశోద. వీర్రాజు ఆమెను అనుసరించాడు.
"యశోదకు వెల్లుల్లి పడుతుంది. ఇందాకా ఆమె చేసి నది నటన మాత్రమే!" అన్నాడు వెంకన్న.
"ఆ అనుమానం మీదనే గదా మీ పరిశోధన ప్రారంభమైంది-అసలా అనుమానం మీ కెలా వచ్చింది?" సీతమ్మ, రాజమ్మ ఒకేసారి అడిగారు కుతూహలంగా.
"ఏముందీ-చిన్నప్పట్నించీ నాకు వెల్లుల్లి అంటే విపరీతమైన ఇష్టం. అది తినని రోజుండదు" అన్నాడు వెంకన్న తాపీగా.
"అయితే?" అంది సీతమ్మ ఆశ్చర్యంగా.
"నా పెళ్ళికి ముందునుంచీ యశోద యీ యింటి యెదురుగా కాపురముంటోంది. నన్ను చూసి ముచ్చటపడి ప్రతి రోజూ పిలిచి ముద్దిచ్చేది. ముద్దంటే నా కెప్పుడూ ఇష్టమే! నేను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా అబ్బ-వెల్లుల్లి వాసన-అని నవ్వేది యశోద. పరవసం తప్ప స్పృహతప్పే లక్షణాలేమీ ఉండేవికాదు. అప్పట్లో ఆమె ఇచ్చిన ముద్దులే ఈ రోజామె నేరాన్ని కూడా బయటపెట్టాయి" అన్నాడు వెంకన్న.
"ఛీ-ఏం డిటెక్టివులో ముద్దులో కూడా నేరాలు పడతారు" అంది రాజమ్మ.
"డిటెక్టివును ముద్దు పెట్టుకోకూడదు" అంది సీతమ్మ.
వెంకన్న ఆలోచనాశక్తివల్ల యిద్దరికీ అతను ముద్దు వస్తున్నాడు. అయినా వాళ్ళతనికి దూరంగానే వున్నారు.
:-అయిపోయింది:-
