"పరిశోధన యెలా ప్రారంభిస్తారు?..." అనడిగాడు వీర్రాజు.
"దొంగ ఇల్లంతా గాలించాడు గదా-అతగాడి వ్రేలిముద్రలు దొరుకుతాయేమీ ప్రయత్నిద్దాం. నా దగ్గర మామూలుగా దొంగతనాలు చేసేవాళ్ళ వేలిముద్రలు చాలా ఉన్నాయి. వాడు కొత్త దొంగకాని పక్షంలో వాడి ఆచూకి తెలుసుకునేందుకు ఎంతోసేపు పట్టదు-" అన్నాడు వెంకన్న.
"మేము ఇల్లంతా కంగారుగా వెతికినప్పుడు అన్నీ కంగాళీ చేసేశాం. మీకు వేలిముద్రలు దొరుకుతాయని అనుకోను నేను.... అన్నాడు కాంతారావు.
"జరిగిన దొంగతనం మామూలుది కాదు. పోయిన మొత్తం సామాన్యమైనది కాదు. మీలో యెవరికీ చీమ కుట్టినట్లైనా లేదే!" అన్నాడు వెంకన్న.
వీర్రాజు ఉలిక్కిపడి-"అయిదు వేలు రొక్కం పోయింది. చీమ కుట్టినట్లెలా ఉంటుందీ? ఏ కొండచిలువో మింగినట్లుంటుంది కానీ...." అన్నాడు.
"అలాగా-అయితే ఆ దొంగని నేను పడతాను. ఒక్కసారి జరిగిందంతా చెప్పండి!-" అన్నాడు వెంకన్న.
వాళ్ళు చెప్పిన కథ సీతమ్మ, రాజమ్మలు చెప్పిందాని లాగే ఉంది.
వెంకన్న కథంతా విన్నాక-"ఈ దొంగతనం జరగడానికి మీ ముగ్గురూ కూడబలుక్కుని సహకరించినట్లుంది తప్పితే దొంగ యేమీ యిబ్బంది పడ్డట్లు లేదు-" అన్నాడు.
కాంతారావు ముఖంలో కోపం కనబడింది-"దొంగతనం జరగడానికి మేమెందుకు సహకరిస్తాం?"
"ఉదాహరణకు-....ఆ సమయంలో మీరు ఇంట్లో లేనని అంటున్నారు. ఏ పనిమీద బైటకు వెళ్ళారో చెప్పగలరా?" అనడిగాడు వెంకన్న.
"నా స్నేహితుడు నళినీకాంతారావు ఇంటికి వెళ్ళాను. బ్రిడ్జి ఆడాలని ఆహ్వానించాడతను. అలా అప్పుడప్పుడు ఎవరో ఒకరి ఇంట కలుసుకుని బ్రిడ్జి ఆడడం మాకు రివాజు. ఒకోసారి మా ఇంటకూడా ఆడుతూంటాం. నేను అక్కణ్ణించి తిరిగివచ్చేసరికి పదకొండు దాటిపోయింది..." అన్నాడు కాంతారావు.
"ఇంట్లో ఆడదొక్కర్తీ ఉందని తెలిసి కూడా మీరు సినిమాకు వెళ్ళారా?" అన్నాడు వెంకన్న వీర్రాజుతో.
"నాకు సినిమా పిచ్చి ఏమాత్రం కాళీ దొరికినా పిక్చర్ చూస్తూంటాను-" అన్నాడు వీర్రాజు.
"ఒక్కర్తినీ ఉండడం నాకు బాగా అలవాటు-ఆ భయం లేదు-" అంది యశోద.
"కానీ-నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ దొంగతనం విషయంలో మీ ముగ్గుర్లో కనీసం ఇద్దరు లాలూచీ అయుండాలని నా నమ్మకం. ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకండి-" అన్నాడు వెంకన్న.
"మిస్టర్ వెంకన్నా! దొంగతనం జరిగి మే మేడుస్తూంటే మీరు మాకు ఇలాంటి అభియోగాలతో మరింత చిరాకు తెప్పిస్తున్నారు. మీకూ మీ పరిశోధనకూ ఓనమస్కారం. మీ రిక్కన్నించి వెళ్ళండి?" అన్నాడు కాంతారావు.
"పిలవని పేరంటంగా పరిశోధనకు దిగడం నాకేమీ కొత్తకాదు గానీ మీరు వద్దన్నా మానను. నా అభియోగం ఇదే! లేని దొంగతనాన్ని మీ ఇంట్లో సృష్టించారు. సృష్టించి ఊరుకుంటే ఫరవాలేదు. వీధిలో అనవసరంగా కాసేపు అలజడి కలిగించారు. నేరం జరిగితే అది పోలీసులకు రిపోర్టు చేయడం మంచి పౌరుడి బాధ్యత. ఆ బాధ్యతను మీరు నిర్వహించకపోతే నేను నిర్వహిస్తాను...." అన్నాడు వెంకన్న.
"పోలీసుల గొడవెందుకు గానీ మీరే పరిశోధించండి. ఈ దొంగతనం నిజంగా జరుగలేదని మీ రెందుకు అభిప్రాయపడుతున్నారు?" అన్నాడు కాంతారావు.
"వెల్లుల్లి వాసనకు కళ్ళు తిరిగి దొంగాడొచ్చి ఇల్లంతా దోచేస్తున్నా తెలియనంతగా స్పృహ తప్పిపోవడం చాలా సిల్లీగా ఉంది-" అన్నాడు వెంకన్న.
"ఇందులో సిల్లీ ఏమీలేదు. మా ఆవిడకు వెల్లుల్లి పడదు. ఇలా చాలాసార్లు తెలివితప్పి పడిపోయింది-" అన్నాడు కాంతారావు.
"అయితే ఒక్క సందేహం-ఆమెకు వెల్లుల్లి పడదని తెలిసికూడా ఆమె పుట్టింటివారు ఘాటైన వెల్లుల్లి ఆవకాయ యెందుకు పంపినట్లు?" అన్నాడు వెంకన్న.
కాంతారావు నవ్వి-"డిటెక్టివ్ లు అడగవలసిన ప్రశ్నే అడిగారు. నాకు వెల్లుల్లి బాగా ఇష్టం. నా కోసం ప్రత్యేకంగా ఆ ఆవకాయ పంపింది మా అత్తగారు-" అన్నాడు.
"నేనో పర్యాయం ఆ ఆవకాయ చూడొచ్చా" అన్నాడు వెంకన్న.
"మీకు అంతగా ఇష్టమైతే ఓ చిన్న గిన్నెడు ఊరగాయ ఇస్తాను...." అన్నాడు కాంతారావు.
"అది తర్వాత చూద్దాం. ముందు ఊరగాయ చూస్తాను...." అన్నాడు వెంకన్న.
కాంతారావు వెంకన్నను వంటింట్లోకి తీసుకు వెళ్ళాడు. వెంకన్న ఊరగాయ వాసన చూసి"-కాస్త ఘాటుగానే ఉంది కానీ దీనికి స్పృహ తప్పుతుందా?"-అన్నాడు.
"వెల్లుల్లి ఇష్టంలేని వాళ్ళకు దాని వాసన దుర్భరంగా ఉంటుంది. మా ఆవిడకేకాదు-నా చెల్లెలి క్కూడా ఇలాంటి జబ్బుంది-" అన్నాడు కాంతారావు.
ఇద్దరూ మళ్ళీ నడవాలోకి వచ్చారు-"మీకు వెల్లుల్లి ఏమాత్రమూ సహించదా?" అనడిగాడు యశోదవంక చూస్తూ.
"సహించదు..."
"వెల్లుల్లిపట్ల మీకున్న అసహ్యం చిన్నప్పట్నించీ ఉందా-"మధ్యలో వచ్చిందా?"
"చిన్నప్పట్నించీ ఉంది...."
"చిన్నప్పట్నించీ ఉందా?" ఆశ్చర్యంగా అడిగాడు వెంకన్న.
"అవునండీ-చిన్నప్పట్నించీ ఉంది...." అని కాస్త చిరాగ్గానే నవ్వింది యశోద-"ఎదురింట్లో డిటెక్టివుంటే ఇదో బెడద కాబోలు. దొంగతనం జరిగిన ఇంట్లో మనుషులనే దొంగల్ని చేస్తాడు...."
"పోయిన మీ నగలు, డబ్బు దొరకాలని మీకుందా?"
"ఉంది!" అంది యశోద.
"అయితే నామీద విసుక్కోకండి. ఈ రోజు మధ్యాహ్నానికల్లా అన్నీ దొరికేస్తాయి...."
ముగ్గురూ అతడివంక ఆశ్చర్యంగా చూసి-"ఏమిటి మీరంటున్నది?" అన్నారు.
"ఎదురింటి డిటెక్టివ్ తడాఖా మధ్యాహ్నానికి చూపిస్తాను...." అన్నాడు వెంకన్న.
3
నళినీకాంతారావు వద్ద వాకబు చేయగా కాంతారావు చెప్పింది నిజమేనని తెలిసింది. చాలా రాత్రి వరకూ అక్కడ బ్రిడ్జి ఆట కొనసాగింది. కాంతారావు కూడా ఉన్నాడు.
వీర్రాజు సినిమాకు వెళ్ళిన విషయం నిజమే అయుండాలి. అది ఋజువు చేయడం కష్టం. కానీ అతను ఇల్లు ఆరుగంటలకు కాస్త ముందుగా వదిలిపెట్టాడనీ, తిరిగి తొమ్మిది దాటాకనే ఇంటికి వచ్చాడనీ వీధిలో కొందరి ద్వారా తెలిసింది. ఆ సాక్ష్యాలను ఖచ్చితంగా నమ్మాలంటే-దొంగ ఏదో సమయంలో ఇంటదూరాడు గదా- అదెవరూ చూసినట్లులేదు.
వెంకన్న తిరిగివచ్చేక సీతమ్మ, రాజమ్మ అతడివేపు ఆశ్చర్యంగా చూస్తూ-"నిజంగా దొంగతనం జరుగలేదని మీరెందుకు అనుమానిస్తున్నారు?"
"నేను డిటెక్టివ్ ను కదా-నా ఆలోచనా రీతులు మీ కర్ధంకావు-...." అన్నాడు వెంకన్న.
"మరీ అంత అర్ధం కాకుండా లేదులెండి-వెల్లుల్లి వాసనకు స్పృహ తప్పిపోవడం మీకు అసందర్భంగా తోచింది. అంతేగదా!" అంది సీతమ్మ.
"బాగా చెప్పావు!" అన్నాడు వెంకన్న.
"అయితే మీ ఊహ సరైనది కాదు. మా నాయనమ్మకు వెల్లుల్లి వాసన తగిలితే స్పృహతప్పి పడిపోయేది...." అంది రాజమ్మ ఆమె చెప్పిన ప్రకారం ఆవిడకు మళ్ళీ స్పృహ రావడానికి ఒకోసారి రెండేసి గంటలు కూడా పట్టేది.
