Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 51


                                వాళ్ళు ముగ్గురు

    సినిమా చూస్తోంది శిరీష.
    సినిమా చాలా ఆసక్తికరంగా వుంది. హీరోయిన్ కి హీరోమీద అనుమానం వచ్చి రహస్యంగా అతడి గదిలో ప్రవేశించింది. గదిలో ఎవ్వరూ లేరు. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తోంది. ఉన్నట్లుండి వెనుకనుంచి యెవరిదో చెయ్యి భుజంమీద పడింది. హీరోయిన్ ఉలిక్కిపడింది.
    శిరీష నిజంగానే ఉలిక్కిపడింది. తన భుజంమీద యెవరిదో చేయిపడింది. ఆమె పక్కకు తిరిగింది. పక్కన యెవరో యువకుడున్నాడు. అతనామె భుజంమీద చేయి అలాగేవుంచి తన్మయత్వంతో సినిమా చూస్తున్నాడు.
    శిరీషకు సినిమా ఎక్కలేదు. ఆమె విసురుగా అతడి చేయి విసిరికొట్టింది. అతను చటుక్కున ఆమెవైపు వంగి "ఏయ్ రాధా-ఏమిటిది?" అన్నాడు.
    "నాపేరు రాధకాదు. శిరీష" అందామె.
    "అరే! మరి రాధ ఏమయింది?"
    "ఏమో, నాకు తెలియదు...."
    "ప్లీజ్ - ఒక్కసారి బయటకు వస్తారా?"
    "ఎవరు మీరు? యూస్ లెస్ బగ్గర్!" జోరుగా అంది శిరీష.
    "ఇష్!" వెనుకనుంచి ఎవరో విసుక్కున్నారు.
    అతను ఓ జేబురుమాలును చటుక్కున ఆమె ముక్కుకు గట్టిగా అదిమాడు. ఏం జరిగిందో తెలిసేలోగానే సిరీషకు స్పృహ తప్పింది. ఆమె కుర్చీలో తల పక్కకు వాల్చేసింది. అతను లేచాడు. ఆమెను కుర్చీలోంచి లేపి నిలబెట్టి, ఎలాగో హాలు బయటకు వచ్చాడు. అక్కడ థియేటరు కాపలావాడితో "ఈమె నా మరదలు. ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది. టాక్సీని పిలుస్తావా?" అని అడిగాడు.
    వాడు పరుగున వెళ్ళి టాక్సీని పిల్చుకుని వచ్చాడు.
    అతను టాక్సీలో శిరీషను ఎక్కించి తనూ యెక్కి-"లతాసదనం" అన్నాడు. టాక్సీ లతాసదనం చేరుకొనే సరికి పదినిముషాలు పట్టింది. టాక్సీ దిగి అతను యింటి తలుపు తాళం తనే తీశాడు. టాక్సీ వాడికి డబ్బిచ్చి శిరీషను ఇంట్లోకి తీసుకొనిపోయాడు. టాక్సీవాడు వెళ్ళిపోతూ, "డాక్టరుగారి కెవరికయినా చెప్పాలాండీ?" అన్నాడు.
    "అక్కరలేదు నువ్వెళ్ళు" అన్నాడతను. వాడు వెళ్ళి పోయాడు.
    అతను లోపలకు వెళ్ళి తలుపులు వేసి శిరీషను పడుకోబెట్టిన చోటుకి వెళ్ళాడు. ఆమెకు శీతలోపచారాలు చేశాడు. కొద్దిసేపట్లో ఆమెకు స్పృహవచ్చి కళ్ళువిప్పి, "నేనెక్కడున్నాను?" అనడిగింది.
    "ది సినిమాహాలు మాత్రంకాదు" అన్నాడతను.
    అప్పటి కామె మెదడు పనిచేయడం మొదలు పెట్టింది. అతడివంక కంగారుగా చూసి "ఎవర్నువ్వు?" అంది.
    "నాపేరు కుమార్!" అన్నాడతను.
    "ఎవర్నువ్వు?" అందామె మళ్ళీ.
    "సినిమా హాలునించి నిన్నెత్తుకొచ్చాను" అన్నాడతను.
    "ఎందుకు?"
    "ఎందుకేమిటి? నువ్వు అందంగా వున్నావు. వయసులో వున్నావు. నిన్నెందుకు తీసుకొస్తాను?"
    "అందుకా?" అందామె అప్రయత్నంగా.
    "అందుకే!" అన్నాడతను.
    "ప్లీజ్ నన్నొదిలిపెట్టు" అందామె.
    "వదులుతాను. రేపుదయం" అన్నాడతను.
    ఆమె భయంగా అతడివంక చూసింది. అతడు తనున్న చోటునించి లేచి బట్టలు మార్చుకుంటున్నాడు.
    "ప్లీజ్! నన్నొదిలిపెట్టు" అందామె మళ్ళీ.
    "వెళ్ళి స్నానం చేసిరా!" అన్నాడతను ఆజ్ఞాపిస్తున్నట్లు.
    "ప్లీజ్! నన్ను వదిలిపెట్టు" ఆమె మళ్ళీ అంది.
    "చెప్పినమాట వినకపోతే కత్తి తీయాల్సుంటుంది" అంటూనే అతడామెకు కత్తిని చూపించాడు.
    "స్నానాలగది ఎక్కడ?" అందామె.
    గది నానుకునే వుంది స్నానాలగది. ఆమె గదిలోకి గడియ పెట్టుకుని తేలికగా నిట్టూర్చింది.
    బయట్నించి అతను అరిచాడు. "నీకోసం వేరే బట్టలుంచాను. స్నానంచేసి బట్టలు మార్చుకోవా?"
    ఆమె బదులివ్వలేదు. స్నానాల గదిలోంచి యెలా తప్పించుకోవడమా అని చూస్తోంది. వెంటిలేటరు వుంది కానీ చాలా ఎత్తులో వుంది. అక్కడికి వెళ్ళడానికి వేరే సాధనమూ లేదు. ఇప్పుడేం చేయాలి?
    పది నిముషాల తర్వాత అతను బయటనుంచి అరిచాడు "ఇంకా ఎంతసేపు స్నానం?" అంటూ.
    ఆమె మాట్లాడలేదు. ఇక్కడ తనకు తాత్కాలికంగా నయినా రక్షణ లభించగలదని ఆమె ఆశ.
    అయితే ఆమె చూస్తూండగా స్నానాలగది గడియ విడిపోయి తలుపు తెరుచుకుంది. అతనామెవంక కోపంగా చూసి, "నువ్వింకా స్నానం ప్రారంభించనే లేదు-ఆయుధం ప్రయోగించాలా?" అన్నాడు.
    "తలుపెలా తీశావు?" అందామె ఆశ్చర్యంగా.
    "ఎలాగయినా తీయగలను. లోపల గడియవేసినా వేయకపోయినా బయటనుంచి తలుపు తీయవచ్చు. లేక పోతే నిన్నెలా లోపలకు పంపాననుకున్నావు?"
    ఆమె అసహాయంగా అతడివంక చూసింది.
    అతనొక లుంగీ, బుష్ షర్టు అక్కడపెట్టి, "స్నానం చేసి ఇవి పట్టుకుని రా పదినిముషాలకంటే పట్టకూడదు. వళ్ళు ఘుమఘుమ లాడిపోవాలి. ఏమాత్రం తేడావచ్చినా నే నూరుకోను" అన్నాడు.
    "ఏం చేస్తావ్-చంపేస్తావా?" నిర్లక్ష్యంగా అడిగింది శిరీష.
    "లేదు దగ్గరుండి స్నానం చేయిస్తాను."
    శిరీష తలుపు వేసుకుంది. అక్కడున్న ఖరీదైన సబ్బు ఉపయోగించుకుని స్నానం చేసింది. అతనక్కడ పెట్టిన లుంగీపంచ, షర్టు వేసుకుంది. తలుపు తీసుకుని గదిలోకి వచ్చింది. ఇవన్నీ తొందరగా చేయకపోతే మధ్యలో అతను వచ్చేస్తాడేమోనని ఆమె భయం.
    ఆమె గదిలోకి రాగానే అతనామెను చూశాడు. భుజం దగ్గరకు వంగి-"గుడ్ - ఘుమఘుమలాడి పోతున్నావు. కాదూ ఇది చాలదు. వెళ్ళి పౌడరు, సెంటూ రాసుకురా" అంటూ డ్రెస్సింగ్ టేబుల్ చూపించాడు.
    శిరీషకు తప్పదని తెలిసిపోయింది. ఆమె అతడు చెప్పినట్లే చేసింది.
    "వెరీగుడ్!" అని మెచ్చుకున్నాడతను.
    ఆమెను మంచంమీద కూర్చోమన్నాడు. తను ఎదురుగా కుర్చీలో కూర్చుని "ఇలా నువ్వెంత బాగున్నావు?" అన్నాడు.
    శిరీష ముడుచుకుపోయింది.
    "అలా సిగ్గుపడకు - మనం కాసేపు మాట్లాడు కోవాలి...."
    "ఎంతసేపు?" అందామె.
    "అతను వచ్చేదాకా?" అన్నాడు కుమార్.
    "అతనెవరు?"
    "మేము ఇద్దరం" అన్నాడుకుమార్.
    శిరీష మళ్ళీ భయపడింది. మానసికంగా ఆమె కొంతకు సిద్దపడ్డట్లే వుంది. అప్రయత్నంగా "ఇద్దరా?" అంది.
    కుమార్ నవ్వి "ఒక్కరైతే ఫరవాలేదనుకున్నావా?" అన్నాడు.
    ఏం జవాబివ్వాలో తెలియ లేదామెకు. తనే మనుకుంటోందో కూడా ఆలోచించ దల్చుకోలేదామె. ఆలోచించాలంటేనే ఎబ్బెట్టుగా వుంది.
    "ఎవర్నువ్వు? నన్నెందుకు బాధించా లనుకుంటున్నావు?"
    "నాపగ నీమీద కాదు. నీ తండ్రిమీద!" అన్నాడు కుమార్.
    "నా తండ్రిమీదా?"
    "అవును-" ని ఆగాడతను-"నీ తండ్రికి డబ్బుంది. ఆ డబ్బుతో తన భార్యని సుఖపెట్టుకుంటే నాకు బాధలేదు. తన పిల్లల్ని సుఖపెడితే నాకు బాధలేదు. కానీ ఆయన సుఖాన్ని ఎదుటివాళ్ళ దగ్గర వెతుక్కుంటున్నాడు. అదీ నా బాధ!"
    "అందులో తప్పేముంది?" అమాయకంగా అడిగింది శిరీష.
    "నేను నా సుఖాన్ని నీ దగ్గర వెతుక్కుంటున్నాను. తప్పులేదు కదూ?"
    "అంటే?" అని ఆగిందామె. తన తండ్రి ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఆమెకు ఏదోలాగుంది.
    "నేనున్న స్థానంలో తనుండి-నువ్వున్న స్థానంలోకి చాలామందిని పంపాడు నీ తండ్రి మాణిక్యాలరావు" అన్నాడు కుమార్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS