ఆమెను అతను ఒకరోజు మధ్యాహ్నం సినిమా క్కాకుండా ఒక ఏకాంత స్థలానికి ఆహ్వానించాడు. లక్ష్మమ్మ ఆ ఆహ్వానాన్ని ,మన్నించి వెళ్ళింది. అక్కడ నారాయణ ఒక్క క్షణం కూడా సహనాన్ని ప్రదర్శించ లేకపోయాడు. అది లక్ష్మమ్మ సహించింది. ఇద్దరూ ఒకటయ్యారు. తర్వాత లక్ష్మమ్మ ఏడ్చింది.
"ఏడవకు నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు నారాయణ.
"సినిమాలు చూస్తున్నాగా -- మగాళ్ళంతా ఇలాగే అంటారు " అంది లక్ష్మమ్మ.
"నేను అందరి మగాళ్ళ లాంటి వాడ్ని కాదు" అన్నాడు నారాయణ.
"ఇంతవరకూ అందరి మగాళ్ళ లాగే ప్రవర్తించావు" అని ఏడ్చింది లక్ష్మమ్మ.
మర్నాడు నారాయణ తననూ అందరి మగాళ్ళకూ తేడా చూపించాడు. లక్ష్మమ్మ ను గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు. లక్ష్మమ్మ నారాయణ ను మెచ్చుకోలేదు.
నారాయణ యింకా కాలేజీలో చదువు కుంటున్నాడు. తండ్రి అతనికి డబ్బు పంపిస్తున్నాడు. అతని పెళ్ళి గురించీ, వచ్చే కట్నం గురించీ చాలా ఆశలు పెట్టుకున్నాడు తండ్రి. కొడుక్కు పెళ్ళి జరిగినట్లు తెలిస్తే కోపం వచ్చి అయన అతనితో తెగతెంపులు చేసుకుంటాడు. దాంతో నారాయణ చదువు ఆగిపోతుంది. చదువు పూర్తయి తన కాళ్ళ మీద తను నిలబడగలిగే వరకూ పెళ్ళి చెసుకోకూడదని నారాయణ మొదట్లో అనుకున్నాడు. అయితే పెళ్ళి తప్పని సరి కాగా కనీసం ఆ విషయాన్ని తండ్రి కి తెలియకుండా రహస్యంగా వుంచాలని అతననుకున్నాడు.
అందుకే లక్ష్మమ్మ అంత తృప్తిగా లేదు. పెళ్ళి జరిగి సంసారం చేస్తున్నా అటు తన తండ్రికి, ఇటు భర్త తండ్రికి కూడా ఈ విషయం తెలియదు. లక్ష్మమ్మ కూడా అతికష్టం మీద నారాయణతో తనకు పెరిగిన చనువు ను నలుగురికీ తెలీకుండా దాచ గలిగింది.
ఒకసారి లక్ష్మమ్మ నారాయణను కలుసుకుని తిరిగి యింటికి వెడుతోంది. ఏం ఆలోచిస్తుందో కానీ పరధ్యానంగా నడుస్తుండగా ఒక కారు వేగంగా ఆమె మీదకు వచ్చింది. హరన్ మ్రోగినా ఆమె వినిపించుకోలేదు. ఆమె ప్రాణం పోవాల్సిందే కానీ కాస్తలో ప్రమాదం తప్పింది. ఆమెను యెవరో బలంగా పక్కకు లాగారు.
"నాపేరు సాంబశివరావు" అన్నాడతను.
"చాలా చాలా కృతజ్ఞురాలీని" అంది లక్ష్మమ్మ.
అతను ఆమె వంక గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. ఆ చూపులలో ఆపదలో ఉన్న వారిని రక్షించిన భావం లేదు. నారాయణ తన వంక చూసే చూపుల్లాగే వున్నాయి. "ప్రాణం పోయి వుండేది నేను లాగకపోతే ."
"నిజమే!" అది అతనింకా తన చేయి వదలక పోతుంటే తనే వదిలించుకుంది. లక్ష్మమ్మ "అదృష్టం బాగుండి బ్రతికి పోయారు."
'అదృష్టం మీది కాదు నాది. అనుకోకుండా మీ అంత అందాలరాశి తో పరిచయం లభించింది" అన్నాడు సాంబశివరావు.
ఆ పరిచయం అక్కడితో ఆగలేదు. సాంబశివరావు తరచుగా లక్ష్మమ్మ ను కలుసుకుందుకు ప్రయత్నిస్తూ చిన్న చిన్న బహుమతులు అందిస్తుండేవాడు. ఆ బహుమతులు అందుకుంటూ అతని ప్రాధమిక చిలిపితనాన్ని సహిస్తూ వచ్చింది లక్ష్మమ్మ. ఆఖరికి తనామేను ప్రేమిస్తున్నానని ఆమె లేనిదే బ్రతకలేననీ సాంబశివరావు చెప్పాడు. తనకు అప్పటికి వివాహమయిందన్న విషయం లక్ష్మమ్మ సాంబశివరావు కు చెప్పలేదు. అతను ఆమెతో ఏకాంతానికి ప్రయత్నిస్తే సహకరించింది. అతనామెను వశపర్చుకో బోతే లొంగిపోయింది. ఆ తర్వాత ఏడ్చేసింది.
"ఏడవకు. నిన్ను పెళ్ళడతాను" అన్నాడు సాంబశివరావు.
"అందరు మగాళ్ళు అలాగే అంటారు" అంది లక్ష్మమ్మ.
"నేను అందరి మగాళ్ళ లాంటి వాణ్ని కాదు" అన్నాడు సాంబశివరావు.
"ఇంతవరకు ఆ తేడా చూడలేదు...." అంది లక్ష్మమ్మ.
అయితే మర్నాటికి అతను ఆ తేడా చూపించాడు. స్వయంగా . లక్ష్మమ్మ యింటికి పెళ్ళి ఆమె తండ్రితో మాట్లాడేడతను. సాంబశివరావు కు ఏదో చిన్న ఉద్యోగం వుంది. సంప్రదాయమైన కుటుంబం. కట్నం అక్కర్లేదన్నాడు. లక్ష్మమ్మ తండ్రికి పెళ్ళికి అభ్యంతరం చెప్పడానికి కారణం కనబడలేదు. సంతోషంగా అంగేకరించేడాయన.
ఆ సమయంలో నారాయణకు సెలవులు. అతనికి సమాచారం అందించే అవకాశం లక్ష్మమ్మ కు లభించలేదు. ఆమె పెళ్ళి మాములుగా జరిగిపోయింది. లక్ష్మమ్మ కాపురాని కి వెళ్ళిపోయింది.
నారాయణకు విషయం తెలిసి లక్ష్మమ్మ ను చూడబోయాడు. తన అనుమతితో నిమిత్తం లేకుండా వివాహం జరిగి పోయిందని లక్ష్మమ్మ ఏడ్చింది. ఆమె పరిస్థితులను సానుభూతితో అర్ధం చేసుకున్నాడు నారాయణ. "న్యాయానికి నేనే నీ భర్తను, నాతొ వచ్చేసేయ్" అన్నాడతను.
"చాటుగా తాళి కట్టిన నిన్ను భర్త అనుకోవాలా, నలుగురిలోనూ తాళి కట్టిన సాంబశివరావు ను భర్త అనుకోవాలా నువ్వే చెప్పు" అంది లక్ష్మమ్మ.
"నన్ను నువ్వు ప్రేమించలేదా, నేనంటే నీకిష్టం లేదా?" అనడిగాడు నారాయణ.'
"నువ్వంటే చాలా యిష్టం నాకు. కానీ నీతో ఎలా వచ్చేది?" నీకింకా ఉద్యోగమైనా లేదు..." అంది లక్ష్మమ్మ.
"ఉద్యోగం వస్తే నాతొ వచ్చేస్తావా?" అనడిగాడు నారాయణ.
"తప్పకుండా?" అంది లక్ష్మమ్మ.
నారాయణ చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగం కోసం శతవిధాల ప్రయత్నించాడు. కొద్ది నెలల్లోనే అతనికి ఓ చిన్న ఉద్యోగం దొరికింది. అతను వెళ్ళి లక్ష్మమ్మ ను కలుసుకున్నాడు.
"జీతం యెంత?" అంది లక్ష్మమ్మ నారాయణ చెప్పాడు.
"నా భర్త జీతం నీ కీతం కంటే యెక్కువ " అంది లక్ష్మమ్మ.
"అయితే?"
"సాంబశివరావు ను వదిలి నీ దగ్గరకు రావడం ఎందుకు? ఎక్కువ సుఖాన్ని పొందడానికే కదా! విధం చెడినా ఫలం దక్కాలి" అంది లక్ష్మమ్మ.
"నువ్వు నన్ను ప్రేమించడం లేదా?' అన్నాడు నారాయణ దెబ్బతిని.
"నువ్వు నా శరీరాన్ని ప్రేమిస్తున్నావు- నీకు ఆ శరీరం సుఖం యిస్తుంది కాబట్టి, నాకు సుఖం యిచ్చేది డబ్బు. నువ్వు నన్ను భోగభాగ్యాలలో ముంచి తేల్చగలిగినపుడు నీతో వస్తాను " అంది లక్ష్మమ్మ.
తర్వాత ఒకటి రెండు నెలల్లో లక్ష్మమ్మ ప్రసవించింది. కానీ పుట్టిన బిడ్డకు ప్రాణం లేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నారాయణ ఆమె దగ్గరకు వచ్చాడు.
"నేనిప్పుడు లక్షాధికారిని" అన్నాడతను.
"ఎలా?" అన్నదామె.
"కేవలం నిన్ను స్వంతం చేసుకొని నీతో సంసార జీవితం శాశ్వతం చేసుకోవాలన్న కోర్కెతో నేను అవినీతి పధాన్ని పట్టాను. ఇప్పటికి మూడు లక్షల క్యాషు ఉంది నాదగ్గర " అన్నాడు నారాయణ.
"చాటుమాటు బ్రతుకా . సంఘంలో పెద్దమనిషిలా చలామణీ కాగలవా?" అంది లక్ష్మమ్మ.
"నీకు తెలియదేమో - ఈ సంఘంలో పెద్ద మనిషులుగా చలామణీ అవుతున్న వారంతా నాలాంటి వాళ్ళే -- " అన్నాడు.
లక్ష్మమ్మ ముఖం వెలిగింది. "అయితే నీతో వచ్చేస్తాను. డబ్బు తీసుకు వచ్చి చూపించు-"
నారాయణ అక్కణ్ణించి వెళ్ళిపోయాక లక్ష్మమ్మ మెదడులో రకరకాల ఆలోచనలు కలిగాయి. సాంబశివరావు సామాన్యుడు. నారాయణ నేరస్థుడు. నారాయణతో జీవితం ఎప్పటికైనా తనకు ప్రమాదమే! నారాయణ యిచ్చిన డబ్బు సాంబశివరావు చేతి కి అందితే తాము సాఫీగా జీవితం గడపవచ్చు. అందుకేదో వుపాయం ఆలోచించాలి.
రెండు రోజుల తర్వాత నారాయణ ఆమెను కలుసుకుని డబ్బు చూపించాడు. లక్ష్మమ్మ డబ్బును చూసి చాలా సంతోషించింది.
"ఎలా సాధ్యం -- యింత డబ్బు సంపాదించడం?" అందామె ఆశ్చర్యంగా.
"రెండు మార్గాలున్నాయి. ఒకటి ప్రమాదకరమైనది. దాని పేరు స్మగ్లింగ్. రెండవది ప్రమాదం లేనిది. దాని పేరు వ్యభిచారం. నేను మొదటిది చేస్తున్నాను ...." అన్నాడు నారయణ.
"వ్యభిచారం లో నువ్వు డబ్బెలా సంపాదించాలనుకున్నావో నాకు తెలియడం లేదు."
"చేతిలో నలుగురు అందమైన ఆడపిల్లలు ఉంటె డబ్బున్న వాళ్ళకు సప్లయ్ చేసి లక్షలు గడించవచ్చు. ఈ వ్యాపారానికి నేనింకా ప్రయత్నించ లేదు. యెందుకంటే ఆరంభంలో చాకు లాంటి పిల్ల కావాలి."
'చాకులాంటి పిల్ల అంటే ?' అంది లక్ష్మమ్మ.
"నీకు లాంటి పిల్ల..."
లక్ష్మమ్మ ఒక్క క్షణం తటపటాయించి "ఈ జీవితానికి సుఖాన్నిచ్చేది డబ్బు. అందుకోసం ఏం చేసినా తప్పులేదు. లక్షలు సంపాదించడానికి నేను పనికి వస్తానంటే నన్ను ఉపయోగించుకో-" అంది.
నారాయణ తెల్లబోయి "నిజంగా అంటున్నావా నువ్వీ మాటలు ...." అన్నాడు.
"నిజంగానే అంటున్నాను."
"నేను నిన్ను పెళ్ళాడింది. నీతో డబ్బు సంపాదించడానికనుకున్నావా?" అన్నాడు నారాయణ.
