Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 49


    పంతులు ముఖంలో తను అతని చరిత్రను సరిగా ఊహించ గలిగినందుకు కలిగిన గర్వంతోపాటు, అతని చరిత్రపై సానుభూతి కూడా కలిగింది.
    "ఇంతవరకూ నీ కష్టాలకు పరిస్థితులొక్కటే కారణం కాదు. నీ ప్రవర్తన కూడా నువ్వు సాహసికుడిని. స్కూల్లో అల్లరి చేయడమో, ఇంట్లో ఆడవాళ్ళ నెదిరించడమో, చాటుగా నీ బంధువుల పిల్లలను తన్నడమోవగైరా పనులు తప్పక చేసి ఉంటావు. స్వతహాగా నీపట్ల సద్భావం లేని నీ బంధువులను నీ సత్ప్రవర్తనతో, ఓర్పు, నేర్పు లతో ఆకట్టు కోవడానికి బదులు-నీ దుడుకుతనంతో వారిలో ద్వేషాన్ని మరింత పెంచావు. కాదంటావా?"
    "మీరు చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు-" అన్నాడు ఆశ్చర్యంగా.
    జ్యోతిష్యాశ్త్రానికి అనుభవం జోడించగల సామర్ధ్యం పంతులుకుంది. అతనికిప్పుడు రవంత గర్వం కలిగింది-"అయినా భయపడకు నీ దుడుకుతనమే నీకు శ్రీరామరక్ష అవుతుంది. నువ్వింక స్వతంత్రంగా జీవించ గలుగుతావు. నువ్వేం చేయాలనుకుంటున్నావో దానికీ రోజే ముహూర్తం పెట్టుకో-...." అన్నాడు పంతులు.
    "నేను తలపెట్టిన కార్యక్రమం జయప్రదంగా ముగుస్తుందంటారా?" అన్నాడు పంతులు.
    "నేను తలపెట్టిన కార్యక్రమం జయప్రదంగా ముగుస్తుందంటారా?" అన్నాడు వేణు.
    "తప్పకుండా నీకింక తిరుగులేదు. నీ ఉద్యోగం పోయిన రోజునే ఏలినాటి శని నిన్ను వదిలి పెట్టాడు. పోతూ పోతూ మంచిచేస్తాడు....." అన్నాడు పంతులు.
    "నేను మొండివాణ్ణికానీ ఈసారి ఎందుకో తటపటాయిస్తున్నాను. మీరు ధైర్యమిస్తే తటపటాయించను....." అంటూ జేబులోంచి పదిరూపాయలనోటు తీసి ఇచ్చాడు వేణు, పంతులు దాన్ని భద్రంగా రొంటిన దోపుకుని జాతకం కాగితం వెనక్కిచ్చి-'అనుకున్న పని చేయదానికి సందేహించకు......వెళ్ళు జయమవుతుంది....." అన్నాడు పంతులు.
    వేణు వెళ్ళిపోయాడు, పంతులు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను తన దగ్గరకు వచ్చినవారిని ప్రోత్సాహపరచడం మామూలే అయినా ప్రతిఫలంగా ఇంతడబ్బు లభించడం అరుదుగా జరుగుతూంటుంది, "ఆ కుర్రాడిపనిజరిగితీరాలి-" అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు మనసులో పంతులు.
    వేణు వెళ్ళిపోయిన పావుగంటకి అతని దగ్గరకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పంతులు దగ్గరకు రావడం అదే ప్రధమం ముఖం చాలా విషాదంగా ఉంది. చూడ్డానికి చదువుకున్నదానిలా ఉంది. మనిషి అందంగా కూడా వుంది.
    "కూర్చో అమ్మా-" అన్నాడు పంతులు.
    ఆ అమ్మాయి కూర్చుని - "చాలా ముఖ్యమైన సందేహం నన్ను వేధిస్తోంది...." అంది.
    "చేయిజాపు....." అన్నాడు పంతులు.
    అమ్మాయి చేయి జాపింది. పంతులామె హస్తరేఖల్ని శ్రద్దగా పరిశీలించాడు. తర్వాత ఆమె ముఖంలోకి చూచి "కాలు జారలేదుగదా నువ్వు?" అన్నాడు.
    ఒక ఆడపిల్లనంత మాటనడానికి పంతులుకు మాత్రమే ధైర్యముంది. పంతులు వయసులో పెద్దవాడుకాడు కానీ పెద్దమనిషి తరహాగా మసలడం తెలిసినవాడు. పరిస్థితులను బట్టీ మనుషులనుబట్టీ ఎప్పుడే మాట మాట్లాడాలో బాగా తెలుసు.
    పంతులు మాటలకా అమ్మాయికి కోపం వచ్చినట్లు లేదు. పైగా గ్రుడ్లనీరు కక్కుకుని ఏ మాటా మాట్లాడలేదు. పంతులుకర్ధమైపోయింది ఆమె సంగతి. విషయాన్ని బాగా పసికట్టినందుకు తన్నుతానే అభినందించుకుని ఆమె చేతిని మరింత శ్రద్దగా గమనించి - "ఒకరూపాయియ్యి-అన్నీ వివరంగా చెబుతాను....." అన్నాడు. ఆమె డబ్బివ్వగానే పంతులు మొదలుపెట్టాడు.
    "నీది దివ్యమైన చేయి, పెళ్ళికిముందే మగవాడిచేతిలో పడాలని నీ చేతిలో రాసివుంది. కానీ అందువల్ల నీ జీవితానికేమీ భయంలేదు. నీ చేతిలో భాగ్యరేఖవుంది. నిన్ను కట్టుకున్నవాడి ఇంట్లో లక్ష్మి చిందులు వేస్తూంటుంది. నీ జీవితం నల్లేరుపై బండినడక......"
    "భవిష్యత్తుకంటే వర్తమానంగురించి నాకు బెంగగా వుంది-" అందా అమ్మాయి.
    "ఎందుకని?" అన్నాడు పంతులు-"డబ్బుకు లోటు లేని ఇంట్లోనే వున్నావుకదా నువ్వు. తల్లిదండ్రుల ప్రేమ లభిస్తోంది కదా...."
    "నాన్నలేడు నాకు...." అందా అమ్మాయి.
    పంతులు గతుక్కుమని ఆమె చేయి మళ్ళీ అందుకుని చూశాడు-"నీ చేతిలో పితృవియోగం లేదుమరి. అది మీ అమ్మ హస్తరేఖ మహాత్మ్యమయుంటుంది. నాన్న లేకపోయినా మీ ఇంట్లో చెప్పుకోదగ్గ మగదక్షత వుండి వుండాలి...."
    "మామయ్యున్నాడు. మా ఆస్తి వ్యవహారాలన్నీ ఆయనే చూస్తూంటాడు. మా ఇంట్లో నాకేలోటూ రానివ్వరు. నా ఇష్టానికి వ్యతిరేకంగా కూడా జరుగదు. కానీ...." ఆమె క్షణం ఆగి-"మేము చాలా పరువుగా బ్రతుకుతున్నాం. తిండికీ గుడ్డకూ లోటులేని సంసారం మాది. అలాగని లక్షలకు లక్షలులేవు. అతను నాకు కాలేజీలో పరిచయమయ్యాడు. చాలా తెలివైనవాడు. పరిచయం తొందరగా ముదిరింది. నేను అతనిమైకంలో అన్నీ మరిచిపోయాను. నిన్ననే తెలిసింది-అతను ఓ లక్షాధికారుల అమ్మాయి వెంటపడుతున్నాడని. అతనలాంటివాడని నేనూహించలేదు....."
    పంతులు నవ్వాడు-"ఈ హస్తరేఖలు చూస్తూంటే నువ్వెందుకు కలవరపడుతున్నావో తెలియదు. అసలు తప్పు జరగలేదనుకుని మరిచిపో. మామూలుగా జీవితం నడుపు. నీ కోసం బంగారంలాంటి భవిష్యత్తు కాచుక్కూర్చుంది....."
    అమ్మాయి ముఖంలో దిగులు మాయమయింది. పంతులామె కింకా అవీ ఇవీ చెప్పి మరింత వుత్సాహపరిచాడు. ఆ అమ్మాయిని చూస్తూంటే అతనికి రాజమ్మ గుర్తుకొస్తోంది.
    రాజమ్మ శివయ్యకూతురు. రమారమి పాతికేళ్ళుంటాయి కానీ ఇంకా పెళ్ళిచేసుకోలేదు. రాజమ్మ పంతులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయిదేళ్ళనుంచి ఈ ప్రేమ కొనసాగుతోంది. కానీ పెళ్ళిమాత్రం సాధ్యపడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS