"ఈ రోజు కాకపోతే రేపైనా అతడికి తెలియక పోదు. ఒకసారి దెయ్యాల కొంపగా పేరుపడిందంటే ఇంక ఈ యింటికెవరూ అద్దెకు రారు-" అన్నాడు రమాకాంతం.
"మరేం చేస్తారు?" అంది కుసుమ.
"దెయ్యాన్ని తరిమేస్తాను-" అన్నాడు రమాకాంతం.
"ఎలా?"
"ఎవరైనా మంత్రగాణ్ణి పిలుస్తఃను-"
కుసుమ గంభీరంగా-"మంత్రగాళ్ళమని చాలామంది మోసం చేస్తారు. డబ్బు నష్టమేకానీ వాళ్ళవల్ల ప్రయోజనముండదు. నాకు తెలిసిన ఓ పేరాసైకాలజిస్టు ఉన్నాడు. ఆయన సైన్సు ఉపయోగించి ఇలాంటివి ఆవగాహన చేసుకుంటాడు. మా ఊళ్ళో నాలుగు దెయ్యాలను వదిల్చాడు. కానీ ఆయన చార్జి ఎక్కువ."
రమాకాంతం ఆత్రుతగా ఆమె వంక చూశాడు. "ఛార్జి ఎక్కువంటే ఏ మాత్రం తీసుకొంటాడేమిటీ?"
"దెయ్యానికి అయిదువేలు చొప్పున పుచ్చుకొంటాడు...."
"అయిదువేలే?" అన్నాడు రమాకాంతం-"ఇంతకూ ఆయన పేరు?"
"ప్రొఫెసర్ కర్మ!" అంది కుసుమ.
రమాకాంతం అప్పటికి వెళ్ళిపోయాడు. ఆయన మనసులో చాలాసేపు అవీ ఇవీ లెక్కలువేశాడు. ఆ అనామక యువతి ఎవరో కానీ తనను చాలా ఇబ్బందిలో పెడుతోంది. ఆమె తన యింట్లో చచ్చినందుకు ఆనందరావు అనేవాడికి పదివేలిచ్చుకొన్నాడు. ఇప్పుడు చచ్చిదెయ్యమైనందుకు మరో ప్రొఫెసర్ కర్మకు అయిదు వేలిచ్చుకోవాలి. కానీ అదే మంచిదేమో!
మంత్రగాడిని తీసుకొనివస్తే చాలా హడావుడి అవుతుంది. వీధంతా దెయ్యం గురించి ప్రచారమవుతుంది. ప్రొఫెసర్ కర్మ అయితే మూడో కంటివాడికి తెలియకుండా దెయ్యాన్ని పారద్రోల గలడేమో?
అయితే రమాకాంతం తనూ ఒకసారి దెయ్యాన్ని స్వయంగా చూడాలని ఉబలాటపడ్డాడు. ఫలితంగా ఆ రాత్రి కుసుమ రమాకాంతం ఇంట్లో పడుకొంటే ఆయన మాధవరావు వాటాలో పడుకొని దెయ్యం కోసం ఎదురుచూడసాగాడు.
గదిలో అన్ని తలుపులూ వేసివున్నాయి. దెయ్యం ఎక్కన్నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? వచ్చి ఏం చేస్తుంది?
రమాకాంతానికి పన్నెండు లోగానే చిన్న కునుకుపట్టింది. ఏదో అలికిడికి మెలకువవచ్చి చూసేసరికి గదిలో చూసేసరికి గదిలో అటూ యిటూ తిరుగుతున్న దెయ్యం కనబడింది. ఆయనకు కాలూ, చెయ్యీ కదలలేదు.
సహజంగా రమాకాంతం ధైర్యవంతుడు. కానీ యింత స్పష్టంగా దెయ్యాన్ని చూస్తానని ఆయన అనుకోలేదు. దెయ్యం ముఖాన్నాయన స్పష్టంగా చూశాడు. ఆ వాటాలో హత్య గావించబడిన యువతి అనడంలో సందేహం లేదు.
క్షణం పనిచేయడం మానేసినా రమాకాంతం బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. అది నిజంగా దెయ్యమేనా, లేక మనిషా? మనిషే అయితే లోపలకెలా వచ్చింది? గదిలో అంత ధైర్యంగా ఎలా తిరుగుతోంది? అయినా ఆమె శవాన్ని తను కళ్ళారా చూశాడు. తనకళ్ళ ముందే పోలీసులు తీసుకొని పోయారు. ఇంతలో ఈమె మనిషిగా ఎలా మారింది?
రమాకాంతం చటుక్కున మంచంమీంచి లేచాడు.
అటుగా వెడుతున్న దెయ్యం ఇటు తిరిగింది. లేచిన రమాకాంతం చటుక్కున మంచంపై కూలబడి కెవ్వుమని అరిచాడు.
దెయ్యం రూపం ఇప్పుడు మనోహరంగా లేదు. వికృతంగా వుంది. చూస్తూండగా ఆమె రూపమెలా మారింది?
రమాకాంతం భయంతో కళ్ళు మూసుకొన్నాడు. ఆయన కళ్ళు తెరిచేసరికి దెయ్యం కనబడలేదు. ఆయన మంచంమీంచి కదలలేదు. కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి.
5
మర్నాడు యింట్లో దెయ్యం గురించి చర్చ మొదలయింది. రమాకాంతం మరో రోజు పడుకొని దెయ్యం అంతు తేలుస్తానన్నాడు. కానీ అందుకు శాంతమ్మ ఒప్పుకోలేదు. భార్య ఒప్పుకోదని తెలిసే ఆయన ధైర్యం మరింత పెరిగింది.
ఎంత డబ్బయినాసరే ఆ దెయ్యాన్ని వదిలించాలంది శాంతమ్మ.
దీనికి రఘు ఒప్పుకోలేదు. తనూ ఒక రోజు పడుకొని దెయ్యం సంగతి తేలుస్తానన్నాడు. శాంతమ్మ ససేమిరా అంది.
దాని జోలికి పోకుండా చూసి ఊరుకొన్నారంటే ఆ దెయ్యం ఏమీ చెయ్యదని కుసుమ చెప్పింది. అలాగే చూసి ఊరుకొంటానని మాట ఇచ్చాకనే రఘుకి కూడా మాధవరావు గదిలో ఒక రాత్రి పడుకొనే అవకాశం వచ్చింది.
రాత్రి పన్నెండు గంటలవేళ అతనూ దెయ్యాన్ని చూశాడు. తండ్రిలా అతను భయపడలేదు. లేచి దెయ్యాన్ని సమీపించాడు.
చటుక్కున వికృతమైన ముఖంతో దెయ్యం అతడి వైపు తిరిగింది. అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కు వేశాడు రఘు.
దెయ్యం రఘు వంకే చూస్తోంది. చేతులు చాపింది. కుసుమకోమలమైన ఆమె చేతివ్రేళ్ళకు పొడవాటి గోళ్ళు ఉన్నాయి.
రఘు ఆగి దెయ్యం వంకనే పరిశీలనగా చూస్తున్నాడు.
దెయ్యం రఘును సమీపిస్తోంది. రఘు దాని వంకనే చూస్తున్నాడు.
దెయ్యం అతడ్ని సమీపించి ఆగింది. ఆగకుండా అతడి కళ్ళలోనే చూడసాగింది. రఘు కొద్ది క్షణాలలాగే నిలబడి వున్నట్లుండి కెవ్వుమని అరిచాడు. తర్వాత అతడు భయంతో కాసేపు కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిచేసరికి దెయ్యంలేదు.
అతని కేక వింటూనే ఇంటిల్లిపాదీ తలుపులు తట్టేరు. ఆ తలుపు తీయాలంటే రఘు రెండు గదులు దాటి వెళ్ళాలి. వెళ్ళడానికి అతడికి ధైర్యం చాలడంలేదు.
"రఘూ....రఘూ..." అందరి గొంతుకలూ వినబడుతున్నాయి.
రఘు మంచంమీంచి లేచాడు. ముందు నెమ్మదిగా నడిచి గది తలుపు తీశాడు. తర్వాత రెండు గుమ్మాలు దాటాలి.
"రఘూ....రఘూ..." కేకలు వినబడుతున్నాయి.
అతను క్షణం తటపటాయించి ఒక్క పరుగున రెండు గుమ్మాలు దాటి తలుపుతీసి కుప్పలా కూలిపోయాడు.
"రఘూ, ఏమయిందిరా?" అంది శాంతమ్మ.
"అమ్మా-అది చాలా ప్రమాదకరమైన దెయ్యం!" అన్నాడు రఘు-"అది నాకు దగ్గరగా వచ్చి ఎంతో క్రూరంగా చూసింది. అప్పుడే నా ప్రాణాలు పోయినట్లనిపించింది..."
"నాకేసి ఎప్పుడూ క్రూరంగా చూడలేదే!" అంది కుసుమ.
"నేను దాన్ని పట్టుకోవాలనుకొన్నాను. చూపుల తోనే నన్నశక్తున్ని చేసింది అది-" అన్నాడు రఘు. అతడి మాట ఇంకా వణుకుతూనే వుంది.
రమాకాంతం కుసుమ వంక చూసి-"ప్రొఫెసర్ కర్మ అడ్రసు చెప్పు!" అన్నాడు. ఇంకా జాడ్యం చేయడం మంచిది కాదని ఆయనకు తోచింది.
రమాకాంతం ఆ అడ్రసు తీసుకొని మర్నాడు ప్రొఫెసర్ కర్మను కలుసుకొన్నాడు.
"మీ యింటి గుమ్మందాటి కుడిపాదం లోపలపెట్టబోయే ముందు మీరు నాకు అయిదువేలూ అందించాలి. నేను మీ యింటి గుమ్మందాటి వెళ్ళేటప్పుడు దెయ్యాన్ని నాకూడా తీసుకుపోతాను..." అన్నాడు ప్రొఫెసర్ కర్మ.
ఆయన షరతులన్నింటికీ రమాకాంతం అంగీకరించాడు. "మా యింట్లో దెయ్యముందనిగానీ, దాన్ని మీరు వదిల్చారనిగానీ మీరెవ్వరికీ చెప్పకూడదు-" అన్నాడు.
