Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 48

 

    వాళ్ళు నలుగురూ అతణ్ణి సమీపించారు.
    "నువ్వు వారిని ప్రతిఘటించకు. చర్మం అడుగున దాచి కుట్టినా కనుక్కోగల సామర్ధ్యమున్న మనుషులు వాళ్ళు...."
    నారాయణ మందహాసం చేశాడు మళ్ళీ.
    వాళ్ళు నలుగురు ఒకరోక్కరే నారాయణను తడిమి తడిమి వెతికారు. తర్వాత వాళ్ళతడి బట్టలు విప్పసాగారు.
    నారాయణ తెల్లబోయాడు. వాళ్ళు తన నీవిధంగా కూడా పరీక్షీస్తారని అనుకోలేదు. అతడు స్వరూప్ వంక చూశాడు.
    స్వరూప్ నవ్వుతున్నాడు.
    తనను వెదుకుతున్న వారిలో ఆడపిల్లలు కూడా వున్నారు. తనలో రవంత భావోద్రేకం కలిగితే మనసు వశం తప్పి పొరపాటు చేయవచ్చు. స్వరూప్ ఉద్దేశ్యమదే!
    నారాయణ కళ్ళు మూసుకున్నాడు - "ఏడుకొండల వాడా -- గోవిందా -- గోవిందా !" అన్నాడు. అతడు తన దృష్టిని భగవద్దాన్యం మీదనే కేంద్రీకరించాడు.
    ఏం జరుగుతుందో అతడికి తెలియలేదు. కానీ కాసేపటికి అ నలుగురు అతణ్ణి వెతకడం పూర్తయింది.
    అతడు తిరిగి బట్టలు వేసుకున్నాడు.
    వాళ్ళు నలుగురూ వెళ్ళిపోయారు.    
    "ఎక్కడ దాదాపు వజ్రాన్ని ?" అన్నాడు స్వరూప్ ఆశ్చర్యంగా.
    "నాకే తెలియదు ....' అన్నాడు నారాయణ.
    "అయితే నాకెలా తెచ్చిస్తావు ?"
    "ఇందులో నేను చేసినదేమీ లేదు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ. ఆ భగవంతుడినే అడిగి తెచ్చిస్తాను "అన్నాడు నారాయణ.
    "నాకిప్పుడే కావాలి ఆ వజ్రం ..."
    "మీరు నాకు వజ్రం తిరిగివ్వడాని క్కూడా ఒకరోజు గడివిచ్చారు --"
    "నారాయణ ప్లీజ్ ! నాకు చాలా కుతూహలంగా వుంది. ఆ వజ్రాన్నేక్కడ దాచావో చెప్పవూ ?" అన్నాడు స్వరూప్.
    "సారీ -- బాస్ !' అన్నాడు నారాయణ.
    "యూ ఆర్ రియల్లీ ఏ వండర్ బాయ్ --" అన్నాడు స్వరూప్.
    "మరి నేను సెలవు తీసుకోవచ్చా ?" అన్నాడు నారాయణ.
    "రహస్యం నాకు చెప్పవా ?"
    "అంతా దేవుడి మహిమ వజ్రం యిక్కడ మాయమై తిరుపతిలో వెలసింది. నేనిప్పుడది అక్కడికి వెళ్ళి తీసుకుని రావాలి --..."
    "ఇట్సా ల్రైట్ -- ,,, నాకు చెప్పోద్దులే ...." అన్నాడు స్వరూప్.
    నారాయణ గదిలోంచి బయటకు వచ్చాడు. అక్కడ యిందాకా అతడిని శోధించిన నలుగురూ వున్నారు వాళ్ళు మరోసారి గదిలో వెతికినంత శ్రద్ధ గానూ అతడిని వెదికి -- "నువ్వు వెళ్ళవచ్చు --" అన్నారు.
    అప్పుడు స్వరూప్ బయటకు వచ్చాడు.
    "సర్ ! వజ్రం అతడి వద్ద లేదని పూచీ ఇవ్వగలం. మెము -- " అన్నది వాళ్ళు నలుగురూ ఏక కంఠం తో వెలిబుచ్చిన అభిప్రాయం.
    "అతడిని తక్కువ అంచనా వేయకండి - అని - "నారాయణా! నేను నీ గెలుపును అంగీకరిస్తున్నాను . లెటజ్ సేలిబ్రేట్ !' అన్నాడు స్వరూప్.
    "ఏదైనా నేను తిరుపతి వెళ్ళి వచ్చాకనే !" అన్నాడు నారాయణ.
    "పోనీ -- వజ్రం తర్వాత తెచ్చివ్వచ్చు. లెటజ్ సేలిబ్రేట్ నౌ!" అన్నాడు స్వరూప్.
    నారాయణ అంగీకరించలేదు.
    అతడు తిరుపతి వెళ్ళడాని కంత తొందరెందుకు పడుతున్నాడో అర్ధం కాకపోయినా అతడికి కారిచ్చాడు స్వరూప్.

                                      5
    స్వరూప్ యింట్లోంచి కారులో బయల్దేరిన నారాయణ తన నొక కారు అనుసరించి వస్తుండడం గమనించాడు. అది స్వరూప్ తనపై నిఘా వేయమన్న మనిషిదని అతను గ్రహించాడు. అయితే నారాయణ తడబడలేదు.
    కారు తిన్నగా నారాయణ యింటి ముందాగింది. అతడు కారు దిగి లోపలకు వెళ్ళాడు.
    నారాయణ ననుసరించి వస్తున్న కారు అతడి కారుకు కాస్త దూరంలో ఆగింది. అందులోని మనిషి దూరాన్నుంచి నారాయణ యింటి వైపు చూస్తున్నాడు.
    కాసేపటికి నారాయణ యింట్లోంచి బయటకు వచ్చాడు. కారెక్కి స్టార్టు చేశాడు. అతడి కారు వెనుకే దూరాన వున్న కారూ బయల్దేరింది.
    అనుసరిస్తున్న వ్యక్తీ -- నారాయణ కారు తన దృష్టి నుంచి తప్పించు కోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. ముందు కారు సందులు గొందులు తిరిగితే తనూ అ పని చేస్తున్నాడు. ఆ కారు అతడి దృష్టి నుంచి తప్పించు కోవడానికి యెన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు.
    అలా చాలాసేపు జరిగేక ముందు కారు ఒక చోట ఆగింది. అనుసరిస్తున్న వ్యక్తీ తనూ కారు ఆపాడు.
    అతడూ కారు దిగాడు.
    అయితే నారాయణ అతడి వైపే రాసాగాడు.
    ఆ వ్యక్తీ కలవరపడలేదు. అతడాడిగే ప్రశ్నలకు జవాబతడి వద్ద సిద్దంగానే వుంది . "నా దారిన నేను పోతున్నాను. నీ సంగతి నాకు తెలియదు --" అని దబాయించడమే అతని ఉద్దేశ్యం.
    "ఏయ్ మిస్టర్! నీ పేరేమిటో నాకు తెలియదు కానీ నీ వరస నాకు నచ్చలేదు.....' అన్నాడు నారాయణ ఆ వ్యక్తిని సమీపించి.
    ఏదో అనబోయిన ఆ వ్యక్తీ తన ఎదురుగా వున్న వ్యక్తిని చూసి తెల్లబోయాడు.
    అతడు నారాయణ కాదు!
    బాప్ రే!
    జరిగిన దేమిటో అతని కర్ధమై పోయింది.
    నారాయణ తెలివిగా తనను తప్పుదారి పట్టించాడు. తను ఇంట్లోకి వెళ్ళి అచ్చం తనలా కనబడే వ్యక్తిని బయటకు పంపించాడు. అతడి కున్న నున్న గుండు కారణంగానూ, దూరాన్నుంచి చూడడం వల్లనూ -- ఆ వ్యక్తీ నారాయణే నని తను పొరబడ్డాడు.
    ఈ పాటికి నారాయణ తన గమ్యం వైపు పయనిస్తుంటాడు.
    ఆ వ్యక్తీ చటుక్కున కారెక్కాడు. కారు స్టార్టు చేశాడు.
    అయితే నారాయణ గమ్య మేమిటో అతడికి తెలియదు.

                                      6
    ఇంట్లోకి వెళ్ళి తన బట్టలు మార్చి -- మరో వ్యక్తీ కిచ్చి బయటకు పంపేక నారాయణ తలపై విగ్గు పెట్టుకున్నాడు. గెడ్డం, మీసాలు ముఖానికి అతికించుకుని దొడ్డి దారిన బయల్దేరి బస్ స్టాండు చేరుకున్నాడు.
    సమీప గ్రామంలో అతడి ప్రియురాలు నాగాలక్ష్మీ వుంది.
    ఆమె పట్నంలో బంధువులింట్లో వుంది. ఇంటర్మీడియట్ చదువుకుంటోంది. ఇప్పుడామె కు సెలవులు. ఇంటికి వెళ్ళిపోయింది.
    నాగాలక్ష్మీ నారాయణకు దూరపు బంధువు. పట్నంలో ఆమెను చూడగానే అతడామెను చిన్నతనపు పోలికలను బట్టి గుర్తుపట్టాడు. ఇద్దరూ ఒకరంటే ఒకరు యిష్ట పడ్డారు. నాగలక్ష్మీ కోసమే నారాయణ తన జీవిత పధాన్ని మార్చుకోవాలని కూడా అనుకున్నాడు. ఇప్పుడతడామే వద్దకే వెడుతున్నాడు.
    తను సాధించిన ఘన విజయాన్ని ప్రియురాలికి చెప్పుకుని ఆమె మెప్పు పొందాలన్న కోరిక మాత్రమే కాక -- తను పాత జీవితం నుంచి విముక్తి పొందిన ఆనందాన్నామెతో పంచుకోవాలన్న కోరిక కూడా యిప్పుడతడిలో వుంది.
    నాగలక్ష్మీ తో అతడి కున్న పరిచయం గురించి -- అతడి బాస్ స్వరూప్ కు కూడా తెలియకపోవడం ఒక పెద్ద విశేషం. పట్నం నుంచి సరిగ్గా రెండు గంటల ప్రయాణం.
    నారాయణ బస్సు దిగాడు.
    అక్కణ్ణింఛి కిలోమీటరు నడిస్తే పల్లె వస్తుంది.
    అతడు చకచకా నడుస్తున్నాడు.
    నాగాలక్ష్మీ యిల్లు చేరుకునేసరికి టైము సుమారు పదకొండయింది. ఇంట్లో ఆమె తండ్రి , అన్నలేరు. పొలానికి వెళ్ళారు.
    నాగాలక్ష్మీ తల్లి , వదిన వంటింట్లో యేవో పనుల్లో వున్నారు.
    ఆమె మండువాలో కొయ్య కుర్చీలో కూర్చుని లావు పాటి నవల చదువుతోంది. అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది. నారాయణ నామె గుర్తుపట్టలేదు.
    "ఎవరండీ మీరు?" అందామె.
    నారాయణ తన గొంతు బొంగురుగా మర్చి -- "నన్ను గుర్తు పట్టలేదా నాగాలక్ష్మీ!" అంటూ విగ్గు తీసేశాడు.
    గుండు, మీసం, గెడ్డం .....ఇప్పుడతడి అద్దంలో చూసుకుంటే తనకు తానె గుర్తు పట్టలేడు.
    "లేదు !" అంది నాగాలక్ష్మీ.
    అతడప్పుడు గెడ్డం, మీసం తొలగించి -- "నేను -- నారాయణను!" అన్నాడు.
    "నువ్వా!" అని నవ్వింది నాగాలక్ష్మీ -- "ఏమిటీ అవతారం ?"
    "క్లుప్తంగా తన కధ చెప్పాడు నారాయణ. కధ వింటున్నంత సేపూ నాగలక్ష్మీ కళ్ళు పెద్దవయ్యాయి. కధ పూర్తీ కాగానే -- "నువ్వు నిజమే చెబుతున్నావా ?' అందామె.
    "నేను నీకు అబద్దాలు చేబుతానా?" అన్నాడు నారాయణ,
    మరైతే ఆ వజ్రాన్నేలా కాజేశావు ?"
    "కళ్ళు మూసుకుంటే ఆ వజ్రం చూపిస్తాను ...." అన్నాడు నారాయణ.
    "ఎక్కడ దాచావో నాకు తెలియాలి -- ' అంది నాగాలక్ష్మీ.
    "నా చేతిలో వజ్రాన్నీ, నన్నూ చూడగానే నీకు ఆసలు రహస్య మేలాగూ తెలిసిపోతుంది. ప్లీజ్ .... కళ్ళు మూసుకో!" అన్నాడు నారాయణ.
    నాగాలక్ష్మీ వెనక్కు తిరిగి కళ్ళు మూసుకుంది.
    కొద్ది క్షణాల య్యేక -- "ముందు తిరుగు ...." అన్నాడతడు.
    ఆమె ముందుకు తిరిగింది కళ్ళు తెరిచింది.
    నారాయణ చేతిలో మిలమిల మెరిసే వజ్రం.
    "అరే! నువ్వు నిజమే చెబుతున్నావే -- " అంటూ అతడి నామె సమీపించి -- "ప్లీజ్ ఎక్కడ దాచావో చెప్పవూ?" అంది.
    "నన్ను పరీక్షగా చూడు...నీకే అర్ధమవుతుంది ..."
    ఆమె అతడి వంక చూసి -- 'అరే - మళ్ళీ విగ్గేందుకు పెట్టుకున్నావు ?" అంది.
    నారాయణ నవ్వి -- "నీ తెలివి తెల్లారినట్లే వుంది. ఇందాకా తీసిన విగ్గదిగో -- ఆ పక్కనే వుంది. ఇది అచ్చంగా నా జుత్తు. వజ్రాన్నిందులోనే దాచాను. నా నున్న గుండు కేవలం మేకప్ !" అన్నాడు.
    నాగాలక్ష్మీ అతడి తెలివి నెంతగానొ అభినందించి -- "నువ్విలాగే ఎంతో బాగున్నావు. ఎప్పుడూ గుండు చేయించుకోవద్దు ...." అంది.
    "కానీ యిప్పుడు చేయించుకోవాలి . తప్పదు.... వజ్రాన్ని కాజేయడానికి నేను పన్నిన ఉపాయం స్వరూప్ తెలుసుకోకూడదు అందుకోసం నేను నిజంగా గుండు చేయించుకోక తప్పదు ...." అన్నాడు నారాయణ.
    "నీ తెలివి తెల్లారినట్లే వుంది. ఈ మాత్రం దానికి నిజంగా గుండు చేయించుకోవడ మెందుకు? విగ్గు సరిపోదూ?" అంది నాగాలక్ష్మీ.
    "దేనికైనా నా నీ సలహా అడగాలి. అవుతుంది నా పని! విగ్గు పెట్టుకుంటే నున్న గుండెప్పుడూ నున్నగానే వుంటుంది. తల మీద జుత్తు పెరగాలి కదా! లేకుంటే స్వరూప్ కు అనుమానం వచ్చి అసలు రహస్యం తెలుసుకుంటాడు. లావాదేవీలు తెల్చుకుందుకు నేనింకా అతడితో ఓ నెలరోజులు గడపాల్సి వుంది కదా ....' అన్నాడు నారాయణ.
    నాగలక్ష్మీ ఆరాధనా పూర్వకంగా అతడి వంక చూసి -- "నువ్వు గొప్ప ఉపాయశాలివి. చాలా గోప్పవాడివై పోతావు....' అంది.
    "ఇంతవరకూ ఎన్నో ఉపాయాలు పన్నాను. కానీ నా జీవిత పధం మార్చుకునేందు కుపయోగ బడ్డ ఈ ఉపాయా మిచ్చిన తృప్తి నా కింకే ఉపాయమూ యివ్వలేదు. అసలైన ఉపాయా శాలి తన ఉపాయాలను తప్పుడు పనులకు ఉపయోగించక -- ఇప్పుడు నేనెన్నుకున్న జీవిత పధాన్నే ఎన్నుకుంటాడు...." అన్నాడు నారాయణ.

                                      ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS