వెల్లుల్లి వాసన
"ఎదురింట్లో ఏదో కలకలంగా వున్నట్లుంది" అన్నాడు వెంకన్న.
"నేనువెళ్ళి తెలుసుకు వస్తాను బాస్!" అంది సీతమ్మ.
"ఊఁ" అన్నాడు వెంకన్న.
"అమ్మయ్య-నువ్వు వెడితే కాసేపు బాస్ తో ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు....." అంది రాజమ్మ. సీతమ్మ మూతి మూడువంకర్లు తిప్పి అక్కణ్ణించి బయటకు వెళ్ళింది.
"మిస్ రాజమ్మా! నీకు నాతో ఏకాంతంగా మాట్లాడాలని కోరికగా వుంటుందా?" అన్నాడు వెంకన్న కుతూహలంగా ఆమె ముఖం వంక చూస్తూ.
"అవును బాస్!"
"అయితే మాట్లాడు-వింటాను!" అన్నాడు వెంకన్న అరమోడ్పు కన్నులతో.
"బాస్! డిటెక్టివ్ గా మీరు రెండుచేతులా సంపాదిస్తున్నారు. మీ అసిస్టెంట్సుగా మాకూ యెంతో కొంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అయితే నాకు ఒక్కటే బాధ!"
"ఏమిటది?" అన్నాడు వెంకన్న కుతూహలంగా.
"అన్నిట్లోనూ మీరు మమ్మల్నిద్దర్నీ సమానంగానే చూస్తున్నారు. నిజానికి నాకు సీతమ్మకంటే శక్తిసామర్ద్యాలెక్కువ. ఆ వశ్యం మీకూ తెలుసు. అందుకని ఆమె కంటే నాకు ఎంతో కొంత-అంటే ఆఖరికి ఒక్కరూపాయైనా సరే సీతమ్మకంటే జీతం ఎక్కువిప్పించాలి!" అంది రాజమ్మ.
"ఇదా నువ్వు నాతో ఏకాంతంగా మాట్లాదలనుకున్న విషయం?" అంటూ వెంకన్న నిట్టూర్చి ఏదో అనబోయేంతలో సీతమ్మ ప్రవేశించి-"బాస్! ఎదురింట్లో దొంగతనం జరిగింది. విలువయిన బంగారునగలు, వెండిసామానుకొంత డబ్బు పోయాయి. నిన్నటి రోజున వాళ్ళింటికి బంధువు వచ్చాడట. ఆయన ఏదో పనిమీద కూడా అయిదువేల రూపాయల క్యాషు తెచ్చాడట. ఆ డబ్బుకూడా పోయింది" అంది.
"ఇంతకీ దొంగతనం ఎలా జరిగింది?" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
సీతమ్మ, రాజమ్మవంక అదోలా చూసి-"సగం వివరాలు నేను తెలుసుకు వచ్చాను. మిగతా సగం వివరాలు నువ్వు తెలుసుకు రావాలి. ఎందుకంటే బాస్ తో నేను ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను...." అంది.
"ఎంత కుళ్ళే తల్లీ నీకు?" అంటూ రాజమ్మలేచింది.
డిటెక్టివ్ వెంకన్న మాత్రం నీరసంగా కుర్చీలో జారగిలపడి "ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు!" అన్నాడు.
సీతమ్మ చిరుకోపంతో వెంకన్నవంక చూసి "బాస్! మీకు నేనంటే యిష్టంలేదనుకుంటాను. ఇందాకా రాజమ్మ మీతో ఏకాంతంగా మాట్లాడతానంటే మీ కళ్ళలో మెరుపు కనబడింది. ఇప్పుడు నేను మాట్లాడతాననగానే మీరు నీరసంగా అయిపోయారు" అంది.
"అవును మరి-ఏకాంతంగా అంటే-పద్దెనిమిదేళ్ళ కన్నెపిల్ల నా లాంటి యువకుడితో ఏవేవో మాట్లాడుతుందని అనుకుంటాను. కానీ తనకు నీకంటే ఓ రూపాయ జీతం యెక్కువిప్పించమని అడిగింది రాజమ్మ" అన్నాడు వెంకన్న.
"దానికి బొత్తిగా ఏమీ తెలియదు. జీతమంటూ పెంచితే నాకే పెంచాలి. ఎందుకంటే నాకైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుంది" అంది సీతమ్మ.
వెంకన్న ముఖం యెర్రబడింది. కళ్ళు మెరిశాయి-"నిజంగానా?" అన్నాడు.
"నిజం బాస్! అయితే ఒక్క సందేహం. మీకు పెళ్లైపోయిందిగా-మీరింకో ఆడపిల్లని ముద్దుపెట్టుకుంటే తప్పు కదూ!" అంది సీతమ్మ.
వెంకన్న గొంతు సవరించుకుని "చూడు మిస్ సీతమ్మా! ముద్దు సెక్సుకింద లెక్కకాదు. అదొక అందమైన మధురమైన కార్యం మనకిష్టమైన వాళ్ళకు ఓ చిరునవ్వు పారేసి నట్లే ఓ ముద్దుకూడా పారేయొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మనమిద్దరం ముద్దు పెట్టుకున్నామనుకో మన శీలాలు పాడైనట్లు కాదు" అని యింకా యేదో అనబోతూండగా-
"బాస్-అయితే పెళ్ళికిముందు మీరెవరైనా అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారా?" అనడిగింది సీతమ్మ.
వెంకన్న జవాబివ్వబోతుండగా రాజమ్మ ప్రవేశించింది. సీతమ్మ రాజమ్మ వంక చిరాగ్గా చూసి "మరీ అంత తొందరగా వచ్చేయడమేమిటే బాబూ-ఇక్కడ మేమెంతో సరదాగా మాట్లాడుకుంటూంటే" అంది.
రాజమ్మ ఆ మాటలు పట్టించుకోకుండా "బాస్! ఎదురింటి ఆమె పుట్టింటివారు ఆ బంధువుద్వారా ఆమెకు వెల్లుల్లి ఆవకాయ పంపారట. అందులో వెల్లుల్లి పాలు కాస్త ఎక్కువై చాలా ఘాటుగా వున్నదట. ఎదురింటి ఆమెకు వెల్లుల్లిఘాటు పడదట. నిన్నరాత్రి ఎనిమిది గంటలకు ఆమె భర్త ఏదో పనిమీద బజారుకు వెళ్ళాడుట. బంధువు మొదటి ఆట సినిమాకు వెళ్ళాడట. ఈమె ఇంటిపనులు చేసుకుంటూ వెల్లుల్లి ఆవకాయను డబ్బాలోంచి జాడీలోకి మారుస్తోందిట. సగం పనిఅయ్యేసరికి వెల్లుల్లిఘాటు ఆమె తలకెక్కి కళ్ళు తిరిగాయట. పని మధ్యలో వదిలేసి ఆమె మంచమెక్కిందట. రాత్రి తొమ్మిదింపావుకి ఆమె బంధువు వచ్చేసైర్కి ఇంటి తలుపులు బార్లా తెరిచివున్నాయట. వస్తువులన్నీ చెల్లాచెదురుగా వున్నాయట. అతను లేపగా ఆమె లేచిందిట. వెతికిచూస్తే చాలా పోయాయి. ఆ తర్వాత ఇంకాస్సేపటికి ఆమె భర్త వచ్చాడట. భార్య అశ్రద్ధకు మండిపడి అతనామెను కొట్టినంత పనికూడా చేసాడుట" అంది.
వెంకన్న సాలోచనగా-"నిన్న రాత్రి మేము విందుభోజనానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి రాత్రి పన్నెండయింది. అప్పటికీ గొడవంతా సద్దుమణిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇరుగూ పొరుగూ చేరి హడావుడి ప్రారంభించారన్నమాట" అని చటుక్కున లేచి నిలబడి-"డిటెక్టివ్ ఇంటి ముందు దొంగతనమా? ఇది వెంకన్నకు అవమానం. ఈ కేసు అంతుతేల్చవలసిందే-" అన్నాడు.
"అయినా వాళ్ళు మనింటికి రావడం లేదేమిటి?" అంది సీతమ్మ ఆశ్చర్యంగా.
"ఇది నా పరువుకు సంబంధించిన విషయం కాబట్టి- వాళ్ళు అడక్కపోయినా ఈ కేసు నేనే పరిశోధించి విషయం తేలుస్తాను...." అన్నాడు వెంకన్న.
2
"పోలీసు రిపోర్టిచ్చారా?" అన్నాడు వెంకన్న.
"లేదు ఇవ్వాలని కూడా లేదు. వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు...." అన్నాడు కాంతారావు. అతడు ఎదురింటామె భర్త.
"వీళ్ళవైతే నగలు, వెండి సామాను పోయాయి. నా దైతే రొక్కం. దొరికే అవకాశమెలాగూ లేదు. పోలీసులకు చెప్పి మళ్ళీ అదో గొడవెందుకు?" అన్నాడు వీర్రాజు. అతను ఎదురింటామె బంధువు.
"అది మా సొమ్ము కాదు. పోయింది. ఋణం తీరిపోయింది" కన్నీళ్ళొత్తుకుంటూ అంది యశోద. యశోద అన్నది ఎదురింటామె పేరు.
"మీరిలా ఊరుకోవడం ఏమీ బాగాలేదు. డిటెక్టివ్ వెంకన్న ఇంటికి ఎదురుగా ఉంటున్నారు మీరు. మీ ఇంట్లో దొంగతనం జరగడం నాకు నచ్చలేదు. నే నూరుకున్నా మా ఆవిడ ఊరుకోదు. ఈ దొంగతనం విషయం నేను తేల్చేయగల ననుకుంటున్నాను...." అన్నాడు వెంకన్న.
"ఎందుకండీ-అనవసర శ్రమ!" అన్నాడు కాంతారావు.
"అదేంటండీ-ఈవేళ మీ ఇంట్లో అయింది. రేపు ఇంకో రింట్లో కావచ్చు. మనమిలా చేతులు ముడుచుకుని కూర్చుంటే దొంగ విజ్రుంభించి రోజుకో ఇంటిని కొల్లగొడతాడు. నా పరిశోధనవల్ల పోలీసుల బెడద ఉండదు. మీరు నా చుట్టూ తిరగనక్కర్లేదు. అవసరమైనప్పుడల్లా నేనే మీ చుట్టూ తిరుగుతాను..." అన్నాడు వెంకన్న.
"మా నగలు మాకు చిక్కుతా యంటారా?" అన్నాడు కాంతారావు.
"తప్పకుండా చిక్కుతాయి. దొంగ కూడా చిక్కుతాడు...." అన్నాడు వెంకన్న.
