Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 48

 

    గోపీ మాట్లాడే పద్దతి చూస్తుంటే అతను మంచి వాడులా, పెద్ద మనిషిలా, నిజాయితీ పరుడిలా అనిపించింది వీరభద్రానికి. అతను చెప్పిన విషయం ఆలోచించదగినదే నని అతనికీ అనిపించింది.
    "మీరు ఆరోజు రాత్రి ఎలిబీ కోసం కాకపోతే మరెందుకు వచ్చినట్లు?" అని సూటిగా గోపీని అడిగాడు వీరభద్రం.
    "ఎలిబీ కోసం కాదని నేననలేదే--?" అన్నాడు గోపీ.
    'అయితే ..?" అని అర్ధోక్తిలో ఆగిపోయాడు వీరభద్రం. అతనికి నోట మాట రాలేదు. గోపీ మాటలకు అర్ధమేమిటి?
    "మీ నాన్నగారు ఆ సమయంలో హత్య కావించబడతారని నాకు తెలుసు. ఆ హత్యా నేరం నామీద రుద్దడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. ఆ హత్య ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ జరుగుతుందని మాత్రం తెలుసును. ఆ హత్యను ఆపడం నా చేత కాదు. నన్ను నేను రక్షించుకోవడం కోసం మీ యింటికి వచ్చాను" అన్నాడు గోపీ.
    "పోనీ మీరైనా ఎందుకు పోలీసులకు చెప్పలేదు...."
    "ప్రాణాలు పోగొట్టుకునే వ్యక్తీ పోలీసుల దగ్గరకు వెళ్ళలేక పోతున్నాడు. నేను మాత్రం ఎలా వెళ్ళగలను " అన్నాడు గోపీ.
    'అయితే హంతకుడు యెవరు--? అన్నాడు వీరభద్రం.
    "అది తెలుసుకొనడం నీకు మంచిది కాదు ."
    "ఎందువల్ల?"
    "అణువు బద్దలైతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం వుండడంలో తప్పులేదు. కానీ అణువు బద్దలు కోట్టేక తెలుసుకుందుకు అక్కడ ఎవ్వరూ వుండరు.'
    వీరభద్రం కుతూహలం పెరిగింది "మీరు చాలా నర్మ గర్బంగా మాట్లాడుతున్నారు. వివరంగా చెప్పండి."
    "అ వివరాలన్నీ నన్నడగొద్దు. నేనిప్పుడు పోలీసుల దగ్గరకు వెడుతున్నాను. వెళ్ళే ముందు మీ అమ్మగారి నోసారి కలుసుకుని నాకు తెలిసిన అన్ని విషయాలు పోలీసులకు చెప్పవచ్చునో కూడదో తెలుసుకుందామని వచ్చాను" అన్నాడు గోపీ.
    వీరభద్రం ముఖం ఎర్రబడింది. "మీరు మాట్లాడే పద్దతి చూస్తుంటే మమ్మల్ని బెదిరించాలని అనుకుంటున్నారనిపిస్తోంది."
    "మీరెలా అనుకున్నా సరే ముందు మీ అమ్మగారిని పిలవండి" అన్నాడు గోపీ.
    వీరభద్రం తల్లిని పిల్చుకు వచ్చాడు. లక్ష్మమ్మను చూస్తూనే "మిమ్మల్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు" అన్నాడు గోపీ.
    "దుర్మార్గుడా-- అంతా నీవల్లనే జరిగింది" అంది లక్ష్మమ్మ.
    "జరిగిందో లేదో మీకు తెలియదు. కానీ పోలీసులు నన్ననుమానించి నా ఫోటో పేపర్లో వేశారు. నేనే స్వయంగా పోలీసుల్నీ కలుసుకునేందుకు వెడుతున్నాను. నేను నిరపరాధినని పోలీసుల ముందు ఋజువు చేసుకోగలను. ఆ సందర్భంలో సాంబశివరావు గారికి సంబంధించిన అన్ని నిజాలు పోలీసులకు చెప్పాలా వద్దా అని అలోచించి ఎటూ తెగక మీ సలహా కోసం వచ్చాను."
    "నిజాలంటే -- ఏ - నిజాలు ?" అంది లక్ష్మమ్మ కంగారుగా.
    "మీరడక్కుండానే చెబుదును. కానీ ఇక్కడ మీ అబ్బాయి ఉన్నాడని తటపటాయిస్తూన్నాను" అన్నాడు గోపీ.
    "ఫరవాలేదు. వాడికీ నాకూ మధ్య కూడా రహస్యాలుండేటంత దౌర్భాగ్యపు స్థితికి మా పరిస్థితి యింకా దిగజారి పోలేదు" అంది లక్ష్మమ్మ.
    "అమ్మమ్మ అలా అనేయకండి. నన్ను నిరపరదిగా నిరూపించుకోవడం కోసం ఫోటోల గురించి చెప్పక తప్పదు. ఆ విషయాలన్నీ మీ అబ్బాయి ఎదురుగానే చర్చించడానికి మీకు  అభుంతరం లేకపోతే నాకూ లేదు" అన్నాడు గోపీ.
    లక్ష్మమ్మ ముఖంలో కంగారు కనపడింది "ఏం కావాలి నీకు?"
    "అన్నీ చెబుతాను , కానీ...."
    "ఏమిటమ్మా ఇదంతా?" అన్నాడు వీరభద్రం అసహనంగా.
    "బాబూ - నువ్వు కాసేపు బయటకు వెళ్ళు" అంది లక్ష్మమ్మ.
    "ఎందుకమ్మా నేనూ పక్కనుంటాను " అన్నాడు వీరభద్రం.
    "నా మాట విను . కాసేపు బయటకు వెళ్ళు" అంది లక్ష్మమ్మ.
    "నేను బయటకు వెడితే నీకేమైనా ప్రమాదం....?"
    "నేను నీ క్షేమం, నా క్షేమం , మన క్షేమం కోరి చెబుతున్నాను. కాసేపు హాల్లోంచి వెళ్ళిపో" అంది లక్ష్మమ్మ . వీరభద్రం తల్లి అజ్ఞా పాటించాడు.

                                   11
    హల్లో నాలుగువైపులా తలుపులు మూసి వచ్చింది లక్ష్మమ్మ. మధ్య సోఫాలో కూర్చున్నాడు గోపీ. లక్ష్మమ్మ అతనికి ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది.
    "నీ కొడుకు ఎదురుగా నిన్ను గౌరవించాను. కానీ నువ్వంటే నాకు అసహ్యం " అన్నాడు గోపీ.
    గోపీ ధోరణి మారినందుకు లక్ష్మమ్మ ఆశ్చర్యపోయి "ఏమిటి నీ ఉద్దేశ్యం?" అంది.
    'అంతా నీకు అర్ధమయ్యే వుంటుంది. నీ గురించి నాకు అంతా తెలుసు."
    "ఏం తెలుసు నీకు ?" అంది లక్ష్మమ్మ.
    "నిన్ను పెళ్ళాడినప్పుడు సాంబశివరావు కు దురలవాట్లు లేవు. నిన్ను పెళ్ళాడి ఇద్దరు పిల్లల్ని కన్న కొంతకాలానికి అయన ప్రవర్తన మారింది. తాగుడు, మొదలు పెట్టాడు. చంద్రావతి నుంచుకున్నాడు. ఆతర్వాత నీకు పిల్లలు కూడా పుట్టలేదు."    
    లక్ష్మమ్మ భయంగా గోపీ వంక చూసి "ఇంకా ఏం తెలుసు?" అంది.
    "చంద్రశేఖరం గురించి కూడా తెలుసు."
    లక్ష్మమ్మ ముఖంలో కంగారు కనబడింది. "ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నట్లు ?"
    "ఏమీ లేదు, సాంబశివరావును చంపినా మనిషి నేనేనని పోలీసులు అనుకుంటున్నారు. అయితే హంతకులెవరో నాకు తెలుసు. నన్ను నేను రక్షించుకునెందుకు పోలీసులకు హంతకుడి పేరు చెప్పాలి కదా - పేరు చెప్పి ఊరుకుంటే చాలదు కాబట్టి మరికొన్ని వివరాలు చెప్పాలి. ఆ వివరాలలో నువ్వున్నావు. నీ గురించి ఏం చెప్పాలో , ఏం చెప్పకూడదో తెలియదు. నిన్ను సంప్రదించి పోలీసుల దగ్గరకు వెడదామని నీ దగ్గర కు వచ్చాను. నాకు నీ గురించి ఏం తెలుసో నీకు తెలిసినట్లు లేదు. అందుకే ఇవన్నీ నీకు చెప్పాల్సి వచ్చింది." అన్నాడు గోపీ.
    "సరే- ఇంతకీ ఆయన్ని చంపినదేవరు?" అంది లక్ష్మమ్మ తమాయించుకుని.
    "అయన అంటే?"
    "సాంబశివరావు....నా భర్త !" అంది లక్ష్మమ్మ.
    గోపీ నవ్వి "హంతకుడు నీ భర్తే!" అన్నాడు.
    లక్ష్మమ్మ వులిక్కిపడి 'అర్ధం లేని మాట - నా భర్తను నా భర్తే చంపడమేమిటి?" అంది.
    'అలోచించి చూడు - నీకే అర్ధమవుతుంది ?"
    లక్ష్మమ్మ ఒక్క నిముషం అలోచించి "అయన ఆత్మహత్య చేసుకున్నారా?" అంది.
    "నారాయణ గుర్తున్నాడా నీకు?" అన్నాడు గోపీ.
    లక్ష్మమ్మ వులిక్కిపడి "ఏ నారాయణ ?' అంది.
    "ఎంతమంది నారాయణలు తెలుసు నీకు?" అన్నాడు గోపీ.
    "ఎవ్వరూ తెలియదు...."
    "నారాయణ అనే పేరు గల వ్యక్తీ నీకు భర్త అయుండే అవకాశముందేమో అలోచించి గుర్తు తెచ్చుకునెందుకు ప్రయత్నించు " అన్నాడు గోపీ.
    లక్ష్మమ్మ ఉలిక్కిపడి భయంగా గోపీ వంక చూసి "ఏమన్నావ్ ?' అంది.
    "నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు" అని నవ్వాడు గోపీ.
    లక్ష్మమ్మ గోపీ వంక బెదురూ చూపులు చూసి "నా భర్తను నారాయణ చంపేడంటావ్" అంది.
    "అయితే నారాయణ నీ భర్త అని ఒప్పుకున్నావ్!" అన్నాడు గోపీ.
    లక్ష్మమ్మ మౌనంగా తల వంచుకుంది.
    "నారాయణ నీ భర్తను చంపాడు" అన్నాడు గోపీ.
    "ఎందుకు?"
    "అలోచించి చూడు. గుర్తుకు వస్తుందేమో?" అన్నాడు గోపీ.
    లక్ష్మమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమె నిజంగానే ఆలోచిస్తోంది.

    
                             *    *    *    *

    లక్ష్మమ్మ అసాధారణ సౌందర్యవతి కాదు కానీ ఆమె ముఖం కళగానే వుంటుంది. అయితే వయసు ఆమెకు అందించిన అవయవాల పొందిక పురుషలోకానికి వేర్రేత్తించేలా వుండేది.
    పన్నెండేళ్ళ వయసప్పుడే అంతా ఆమెకు పద్దెనిమిదేళ్ళు అనుకునేవారు. ఆమెను ఒంటరిగా చూసిన ప్రతి వాడూ మరోసారి చూడకుండా వుండలేకపోయెవాడు. బంధువుల్లో గానీ, ఇతరుల్లో గానీ ఆమెతో అరక్షణం ఏకాంతం సంపాదించగల ప్రతి మగవాడూ సభ్యతకు కదిలి మాట్లాడ్డానికి తెగించే వాడు. అటువంటి మాటలు వినటానికి సిగ్గు అనిపించినా లక్ష్మమ్మ కు అసహ్యం అనిపించేది కాదు. కాస్త సరదాగా కూడా వుండేది.
    కామాన్ని రెచ్చకొట్టే తన రూపం అందమైనదని ఆమె భ్రమ పడింది. ఆ అందానికి అలంకరణలతో మెరుగులు దిద్దేది. అలంకరణ, సినిమాలు ఆమెకు తగని పిచ్చి. తండ్రి అట్టే ఉన్నవాడు కాదు కాబట్టి అందుకు డబ్బు ఆమెకు లభించేది కాదు. అప్పుడే ఆమెకు నారాయణ పరిచయం లభించింది.
    ఒకరోజు బెంచీ టికెట్ దొరక్క తిరుగు ముఖం పట్టిన లక్ష్మమ్మ కు నారాయణ బాల్కనీ టికెట్ ఆఫర్ చేశాడు. సినిమా చూడాలన్న కాంక్షతో లక్షమ్మ నారాయణ ప్రక్కన కూర్చుని సినిమా చూసింది.
    పొరపాటు పేరుతొ సారీ చెప్పుకుంటూ నారాయణ చాలా పర్యాయాలు ఆమె భుజం మీద చేతులు వేశాడు. మొదట్లో మృదువుగా తొలగించినా తర్వాత లక్ష్మమ్మ ఊరుకుంది. అందుకు చాలా కారణాలున్నాయి. మాటి మాటికీ అతని చేతిని తొలగించడం వల్ల సినిమా శ్రద్దగా చూడడం కుదరడం లేదు. మూడు గంటల అట తర్వాత ఎలాగూ యిద్దరూ విడిపోతారు. అతను చెయ్యి భుజం మీద వేస్తె ఒక పిసరు సిగ్గుగా వున్నా శరీరానికి హాయిగా వుంది.
    లక్ష్మమ్మ తన చర్యను ప్రోత్సహించినట్లే నారాయణ భావించాడు. తను తాత్కాలికంగా సహించానని లక్ష్మమ్మ అనుకుంది. కానీ ఆనాటి వారి పరిచయం అంతటితో ఆగిపోలేదు. నారాయణ లక్ష్మమ్మకు అలంకరణ సామాగ్రులు కొని పెడుతూ , సినిమాలు చూపిస్తూ వచ్చాడు. అతని పొరపాట్లు భుజం మీద చేతులు వేయడంతో ఆగక పోయినా లక్ష్మమ్మ సహించింది. ఆమె సహనం పెరిగిన కొద్దీ నారాయణ సహనం తగ్గిపోయింది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS