Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 48


                              జోస్యం అచ్చిరాలేదు!

    తన మామూలు స్థలంలో అన్నీ సర్దుకు కూర్చున్నాడు పంతులు. అతను కూర్చున్న అయిదునిముషాల్లోనే ఓ మనిషి వచ్చాడతని దగ్గరకు.
    "చేయి చాపు-"అన్నాడు పంతులు.
    పంతులు ముందు మహారాజైనా సరే చేయిచాచి తీరవలసిందే. అలాగని అతను దాతకాడు. జ్యోతిష్కుడు, హస్త సాముద్రికంలో అతనికి మంచి ప్రావీణ్యత ఉంది.
    జ్యోతిష్కుడి స్థానంలో ఉన్నంతసేపూ పంతులు ప్రత్యేకమైన హుందాను ప్రదర్శిస్తాడు. ఎంత గొప్పవారి నైనా అతను నువ్వనే అంటాడు. అవతలివ్యక్తి మరీ గొప్పవాడిలా కనిపిస్తే బాబూ అన్న సంబోధన జతపరుస్తాడు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరినీ బాబుగారూ అనడతను.
    అయినా పంతులు దగ్గరకు వచ్చేవాళ్ళలో గొప్పవాళ్ళు తక్కువ. ఎందుకంటే అతను రోడ్డుమీద జ్యోతిష్కుడు కనుక. అదే అతను ఏ హోటల్లోనైనా మకాం చేసివుంటే వారందరూ అతని దగ్గరకువచ్చి ఉండేవాడేమో! మరీ విపత్కర పరిస్థితులేర్పడి-ఏమో-ఏ పుట్టలో ఏ పాముందో చూద్దామనుకునే సందర్భాల్లోనే గొప్పవారతని దగ్గరకు రావడం జరుగుతూంటుంది.
    "నువ్వు సాహసికుడివి...." అన్నాడు పంతులు.
    అతనికి పాతికేళ్ళుంటాయేమో - మనిషి నాజూగ్గా ఉన్నాడు కానీ ముఖంలో విషాదముంది. "అవును-అదే నా కొంప ముంచుతోంది-" అన్నాడు.
    "కంగారు పడకు. ఆ సాహసం ఇంతవరకూ నీ కొంప ముంచినా ఇకముందు నీ భవిష్యజ్జీవితానికదే ఆసరా కాగలదు...." అన్నాడు పంతులు.
    అతనికళ్ళు మెరిశాయి-"అది తెలుసుకునేందుకే మీ దగ్గరకు వచ్చాను స్వామీ-నా చేతినిబట్టి నన్నుగురించి మీకేమనిపిస్తోందో వివరించండి-"
    పంతులు ఉత్సాహంగా-"ముందు రూపాయి అక్కడ పెట్టు...." అన్నాడు.
    అతను జేబులోంచి రూపాయితీసి పంతులు కిచ్చాడు, అతను దాన్ని రొంటిన దోపుకున్నాడు-"చూడండి . నా మనసుకు నచ్చేలా చెబితే మీకింకా ఇస్తాను...." అన్నాడతను.
    పంతులు కళ్ళలో ఆశ క్షణకాలం తొంగిచూసి మాయమయింది-"అయితే నీపేరు, జన్మనక్షత్రం, జననకాలం అన్నీ వివరంగా చెప్పగలవా-జాతకం వేస్తాను. భూత భవిష్యద్వర్తమానాలు ఖచ్చితంగా చెబుతాను. అయిదు రూపాయలవుతుంది...."
    "నా పేరు వేణు-" అంటూ అతను జేబులోంచి ఓ కాగితంతీసి పంతులుకిచ్చి-"ఇందులో నా జాతకముంది. అన్నీ తెచ్చుకునే వచ్చాను. మీరు వివరంగా అన్నీ చెప్పగలిగితే-అయిదు కాదు-పదిరూపాయలిస్తాను" అన్నాడు.
    'ఈ రోజు నా రొట్టె విరిగి చేతిలో పడింది'-"అనుకున్నాడు పంతులు. బోణీ బేరం అంతమంచిది తగలడం అతనికి చాలా సంతోషంగా వుంది.
    పంతులు వేణు యిచ్చిన కాగితాన్ని శ్రద్దగా పరిశీలించాడు. తన పక్కనే వున్న సంచీలోంచి ఏవో పుస్తకాలు తీసి-కాసేపు ఏవో లెక్కలు చేశాడు. మొత్తం పదిహేను నిముషాలు అలా గుణించి, గణించి-అప్పుడు వేణువంక చూసి-"చేయి చాపు" అన్నాడు.
    వేణు చేయి చాపేడు. పంతులుదాన్ని తన కళ్ళతో తీవ్రంగా కాసేపు పరీక్షించి-తర్వాత భూతద్దంలోంచి కూడా హస్తరేఖలను పరీక్షించాడు. వేణు మౌనంగా ఓర్పుగా పంతుల్ని గమనిస్తున్నాడు.
    "నీది చాలా కష్ట జీవితం. చిన్న తనంలోనే తల్లిదండ్రులకు దూరమయ్యావు. పెంచినవారు నిన్నష్టకష్టాలూ పెట్టారు. నీలో తెలివి తేటలున్నాయి కానీ నీకు చదువురాలేదు. అవునా?" అన్నాడు పంతులు.
    వేణు మాట్లాడలేదు.
    "అవునో కాదో చెప్పు జాతకాన్ని బట్టి మనిషి చరిత్రను అయిదారు రకాలుగా ఊహించవచ్చు. జాతకమూ, హస్తసాముద్రికమూ కలిపితే ఇంచుమించు మనిషి చరిత్రను అంచనా వేసేయవచ్చు. నా ఆలోచనలు సరైన దారిలోనే వెడుతున్నాయో లేదో నువ్వు చెప్పాలి...." అన్నాడు పంతులు.
    "అమ్మా నాన్నా బ్రతికే వున్నారు నాకు కానీ నన్ను పోషించే స్థితిలో లేరు. నాపదోయేట నా బంధువుల ఇంటికి వెళ్ళి పోయాన్నేను. చదివిస్తామని వాళ్ళు తీసుకువెళ్ళారు. కానీ వాళ్ళకు నా అవసరం చాలావుంది. తరచుగా స్కూలు మానేస్తూండే వాణ్ణి ఇంటిపనులు చేయడంకోసం. ఇంట్లో నా ఈడు పిల్లలున్నారు. వాళ్ళందరూ కూడా నన్ను తమ బంధువుల కుర్రాడిగా కాక ఓపని కుర్రాడిగా చూసేవారు. అది నాకు చాలాబాధగా వుండేది. వాళ్ళందరి
మీదా ఒక విధమైన కసి నాలో పేరుకుపోయేది. ఈ కసీ, తీరుబడి తక్కువకావడమూ కారణంగా శ్రద్ధగా చదవలేక పోయే వాడిని.
    నాకు చదువు సరిగ్గా రాలేదు, నా చదువుగురించి ఎవరూ పట్టించుకోలేదు. అమ్మా నాన్నల కీ విషయం చెబితే ఎలాగో వాళ్ళనే మంచి మాటలాడి నా బ్రతుకుతెరు వేర్పరచుకో మన్నారు. జీవితంతో రాజీ పడక తప్పలేదు.
    చివరకు రెండేళ్ళ క్రితం ఒక ఆఫీసులో ఫ్యూన్ ఉద్యోగం వేయించాడు మా బంధువు. నాకు వచ్చేజీతం చాలా తక్కువ. అటుపై ఆఫీసర్లింట్లో పనిచేయాలి. ఇటు బంధువుల ఇంట్లోనూ పనిచేయాలి. ఉద్యోగంలో చేరాక నాకు శ్రమ హెచ్చింది తప్పితే తగ్గలేదు. చివరకు విసిగి పోయి వారంరోజుల క్రితం మా బంధువు నెదిరించాను. అన్ని పనులు చేయడం నావల్ల కాదన్నాను.
    అంతే-రెండ్రోజుల్లో నా ఉద్యోగం ఊడింది. నేను లంచం పట్టానన్న దొంగనేరం నా మీద ఆరోపించబడింది. ఇదీ నా ప్రపంచం తీరు. నేను విసిగిపోయాను. ఆ రాత్రి మా బంధువు ఇంట్లోంచి అయిదువందలు రహస్యంగా దొంగతనం చేసి ఇల్లువదిలి పారిపోయి ఈనగరం చేరాను. నాకు స్వతంత్రం వచ్చింది కానీ దాన్నెలా ఉపయోగించుకోవాలో తెలియడంలేదు. మీరు చెప్పిన వన్నీ నా చరిత్రకు బాగానే సరిపోయాయనిపిస్తోంది...." అన్నాడు వేణు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS