Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 47


    సత్యం కళ్ళుమూసుకున్నాడు. కాసేపు సుఖంగా నిద్రపోవాలన్నదతడి తాపత్రయం. కానీ కళ్ళు మూసుకోగానే అతడికి రమణమ్మ గుర్తుకొచ్చింది. రమణమ్మంటే అతడికి చాలా యిష్టం. తనమీద అన్యాయంగా నేరం మోపబడి వుండకపోతే తామిద్దరూ హాయిగా భార్యాభర్తల్లా కాపురం చేస్తూండి వుండేవారు. ఇప్పుడు తనామె కూతురికి సాయపడతానని మాటిచ్చాడు. కానీ సాయపడ్డానికి తనదగ్గరేముంది?
    ఆమె తనకు సాయపడతానని మాటిచ్చింది. సాయపడింది. తనూ ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి-ఎలా?
    సత్యానికి ఆలోచన తెగలేదు కానీ ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. విసుక్కుంటూ వెళ్ళి అతడు తలుపుతీశాడు.
    ఎవరో అపరిచితుడు!
    సత్యం అతఃడివంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "నీ గురించి నాకు చాలా తెలుసు. నీతో అర్జంటుగా మాట్లాడాలి" అన్నాడా అపరిచితుడు.
    "నా గురించి నీకేం తెలుసు?" అన్నాడు సత్యం కంగారుగా.
    "నువ్వు పారిపోయిన ఖైదీవి......."
    సత్యం కంగారుగా అతణ్ణి లోపలకు రానిచ్చాడు. అపరిచితుడు తనే గది తలుపులు వేశాడు.
    "ఇంకా నాగురించి ఏం తెలుసు నీకు?" అన్నాడు సత్యం.
    అపరిచితుడు మాట్లాడకుండా తన జేబులోంచి పాకెట్ రికార్డర్ తీసి బటన్ నొక్కాడు.
    "నేనిచ్చిన మత్తుమందు బాగా పనిచెసిందా-నీ పగతీరిందా?" అన్న చంచల్రావు గొంతు రికార్డర్లోంచి వినబడింది. అందులో మొత్తం చంచాల్రావుకీ అతడి అనుచరులకీ జరిగిన సంభాషణంతా రికార్డయివుంది.
    సత్యం భయంగా-"ఇదంతా ఎలా రికార్డుచేశావు?" అన్నాడు.
    "అదంతా తర్వాత చెబుతాను. నువ్వీ బ్యాంకుదోపిడీలో పాల్గొన్నాక ఏం జరుగుతుందో ఆలోచించావా?" అన్నాడా అపరిచితుడు.
    "ఏం జరుగుతుంది?"
    "మీరు పట్టుబడ్డం ఖాయం....."
    సత్యం భయపడ్డాడు-"అయితే నేనం చేయాలి?"
    "నువ్వేమీ చేయొద్దు. ఈ టేపు సాయంతో చంచల్రావుని నేనే లొంగదీసి ఈ దోపిడీ ఆపిస్తాను, నిన్నెవ్వరూ ఇక బాధించరు. మామూలు జీవితం గడుపుతానని నాకు మాటిస్తే పోలీసులు నీ జోలికి రాకుండా చూస్తాను...."
    "నేను మాటలు జీవితం గడపకపోతే?"
    "పోలీసుల కప్పగిస్తాను...."
    అప్పుడు సత్యం నవ్వాడు- "నేను నీ మాటలునమ్మను. నన్ను పరీక్షించడానికి చంచల్రావు నిన్ను పంపాడు. నేను నమ్మకద్రోహం చేస్తానేమోనని ఆయన నన్ననుమానించి వుంటాడు. ఎందుకంటే మా మాటలు రికార్డుచేయడం ఆయనకు తప్ప సాధ్యంకాదు...."
    అపరిచితుడి ముఖం గంభీరంగా అయిపోయింది- "నువ్వు బాత్రూంలోకి వెళ్ళు. తలుపులు వేసుకో, ఏం మాట్లాడతావో నెమ్మదిగా పైకి మాట్లాడు బయటకురా. నీ మాటలు నా రికార్డల్లో విందువుగాని...."
    సత్యం బాత్రూంలోకివెళ్ళి అపరిచితుడు చెప్పినట్లే చేసి వచ్చాడు. అతడు రాగానే అపరిచితుడు తన టేపు రీవైండు చేసి బటన్ నొక్కాడు. సత్యం గొంతులో "పగలే వెన్నెలా!" అన్నపాట వచ్చింది.
    "అద్బుతం!" అన్నాడు సత్యం అప్రయత్నంగా-"కానీ ఇదెలా సాధ్యం?"
    అపరిచితుడు తన జేబులోంచి చిన్న పిస్టల్ వంటి సాధనం తీశాడు-"దీనితో ఎవరి వీపుకైనా గురిపెట్టి షూట్ చేస్తే చిన్న బొట్టంత ఎలక్ట్రానిక్ చిప్ చొక్కాకు అతుక్కుంటుంది. ఆ చిప్ ద్వారా నీ చుట్టుప్రక్కల ఏ సంభాషణ జరిగినా నాకు అందుతుంది. ఈ రికార్డరుకీ దానికీ వైర్ లెస్ కనెక్షన్ వుంది. ఇది నేను స్వయంగా తయారు చేసుకున్న పరికరం...."
    "అయితే ఆ చిప్ నాకెప్పుడు తగిలించావు?"
    "నువ్వు వాసుదేవరావు గదిలో తలగడ కిందనుంచి తాళాలు తీస్తున్నపుడు!" అన్నాడా అపరిచితుడు.
    సత్యం తెల్లబోయి - "అప్పుడు నువ్వక్కడే వున్నావా?" అన్నాడు.
    "ఆశ్చర్యం తర్వాత! సైన్సెంతగా అభివృద్ధి చెందిందో చూశావా-ఈ బ్యాంకు దోపిడీని ఆపడానికి నేను కంకణం కట్టుకున్నాను. నువ్వు విజయం పొందగలననుకుంటున్నావా?" అన్నాడా అపరిచితుడు.
    సత్యం ముఖంలో భయం కనబడింది-"చంచల్రావు నన్ననుమానించి వేటాడతాడు. ఈ దోపిడీలో పట్టుబడినా సరే-ఒప్పుకోకతప్పదు...."
    అపరిచితుడు నవ్వి-"కంసుడికి శ్రీకృష్ణుడికిలా-చంచల్రావుకీ ఓ మేనల్లుడున్నాడు. అతడిపేరు శివానంద్ అతడు మేనమామను సరైనదార్లో నడిపించాలని చూస్తున్నాడు. ఈ టేపురికార్డరు అతడే నా కందజేశాడని చంచల్రావుకు చెబుతాను. అంతే-చంచల్రావూ శివానందూ కొట్టుకుంటారు. మధ్య నీకే యిబ్బందీ వుండదు. నా రక్షణ లభిస్తే నీకే యిబ్బందీ వుండదు. నువ్వు బుద్ధిగా ఉంటానంటే వాసుదేవరావింట్లోనే నీకు మళ్ళీ వంటవాడి ఉద్యోగం ఇప్పించగలను...." అన్నాడు.
    "అది అసాధ్యం...."
    "ఎందుకని?"
    "నేను మంచివాడుగా వున్నప్పుడే ఆయన నాకు దొంగతనం అంటగట్టాడు. ఇప్పుడు నేను నిజంగా దొంగతనం చేశాను...."
    అపరిచితుడు నవ్వి-"వాసుదేవరావు వెండికంచాల దొంగను నేను పట్టాను. వాళ్ళ వెండి కంచాలు నువ్వు జైలుపాలైన నెలరోజులకే దొరికాయి. అప్పట్నించీ వాళ్ళు పశ్చాత్తాపంతో కృంగిపోతున్నారు. ఈ రోజు వాళ్ళు మిగతా సొమ్మంతా జాగ్రత్త చేసుకుని నీకు కొంత డబ్బుమాత్రమే దొరికేలా ఎందుకుంచారనుకుంటున్నావ్? అన్యాయంగా జైలుశిక్ష అనుభవించినందుకు ప్రతిఫలమది!" అన్నాడు.
    "అంటే వాళ్ళకు నేను వస్తానని తెలుసా?"
    "నువ్వు రమణమ్మను కలుసుకున్నావు. రమణమ్మ నీ గురించి వాళ్ళకు చెప్పేసింది. వాళ్ళు నన్ను పిలిచారు. దీంతో ఏకంగా బ్యాంకు దోపిడీ గురించి కూడా తెలుసుకోవచ్చుగదా అని నేను కాస్త పధకం వేశాను. నిన్ను వాళ్ళు తిరిగి పనిలో పెట్టుకునే షరతుకూడా నేను పెట్టాను..." అన్నాడా అపరిచితుడు.
    "అయ్యా! తమరెవరో తమ ఋణమెలాతీర్చుకోగలనో" అన్నాడు సత్యం.
    "నన్ను డిటెక్టివ్ వెంకన్న అంటారు. నీకు చేరిన డబ్బులోంచి ఒక్క వెయ్యి ఫీజుగాయిస్తే నా ఋణం తీరుతుంది....." అన్నాడు వెంకన్న.
    సత్యం అతడికి వెంటనే వెయ్యిరూపాయలూ ఇచ్చి-"నన్ను నిజంగా వాసుదేవరావుగారు మళ్ళీ పనిలోకి తీసుకుంటారంటారా?" అన్నాడు.
    "నీకేమైనా సందేహముంటే ఈ విషయం విను నువ్వు చేసిన పులుసు ఘుమఘుమలకు మురిసిపోయి-అందులో మత్తుమందుందని తెలిసి కూడా ఇంటిల్లపాదీ అది వేసుకుని భోంచేశారు...." అన్నాడు వెంకన్న.
    సత్యం తెల్లబోయాడు. "నేను నీకు సాయపడతాను" అన్న రమణమ్మ మాటలతడి చెవుల్లో గింగురుమనసాగాయి.


                              -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS