Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 48


    "మనవాడికి చదువొక మాదిరిగా వచ్చింది. సరేలే అనుకున్నాను. ఆ తర్వాత ఒక్క ఉద్యోగం తిన్నగా చేయలేదు. దానికీ సరిపెట్టుకున్నాం. గొప్పవాళ్ళ పిల్లను ప్రేమించానని చావుదెబ్బలు తిని తర్వాత మోసపోయానని గ్రహించాడు. ఇప్పుడేమో-రాత్రిల్లెక్కడెక్కడో తిరుగుతున్నాడు. వాడి చాకు ఓ హత్యా స్థలంలో ఉంది-" అన్నాడు నారాయణరావు.
    "ఇదంతా ఏమిటి?" అన్నాడు జగన్నాధం.
    "ఏమిటో నువ్వే చెప్పాలి. కుర్రాడు నీ అదుపులో లేడనిపిస్తోంది...."
    "ఇప్పుడు నేనేం చేయాలి?"
    "సతీష్ ని నీ అదుపులోకి తెచ్చుకో....."
    జగన్నాధం దీనంగా నారాయణరావు వంక చూసి "నాన్నా! వాడి విషయంలో నీకేమైనా అనుమానముంటే-అది నువ్వే తేల్చుకో నీ అదుపులోకి తెచ్చుకో అప్పుడు నా కప్పగించి ఏం చేయాలో చెప్పు, నా కేమీ తెలియదు-" అన్నాడు.
    నారాయణరావు నిట్టూర్చి-"అన్నింటికీ నామీద ఆధారపడితే-ఎల్లకాలమూ నేనుండనుగదా-" అన్నాడు.
    "ఏమో నాన్నా-నువ్వు చెబుతూంటే నాకేదో భయంగా ఉంది. అర్జంటుగా వాణ్ణి నీ అదుపులోకి తెచ్చుకో-...." అన్నాడు జగన్నాధం.
    "రాత్రిళ్ళు వాడెక్కడికి వెడుతున్నాడో-ఏం చేస్తున్నాడో-అదికూడా నీకు తెలియదా-తెలుసుకో లేవా?" అన్నాడు నారాయణరావు.
    జగన్నాధం తల అడ్డంగా ఊపి-"అడిగితే తిన్నగా యేదీ చెప్పాడు వాడు-" అన్నాడు.

                                      8

    రాత్రి పదయింది.
    "అమ్మా! తలుపేసుకో - నేను మళ్ళీ తెల్లవారుఝామున వస్తాను...." అన్నాడు సతీష్.
    "ఎక్కడికిరా?" అంది మాలతి.
    "ఎక్కడికో అక్కడికి - నీకెందుకు?" అన్నాడు సతీష్ నిర్లక్ష్యంగా ముందుకు వెడుతూ.
    "ఎక్కడికిరా?
    సతీష్ ముందడుగు వేయబోయినవాడే చటుక్కున మళ్ళీ వెనక్కి తిరిగాడు.
    ప్రశ్న వేసిన ఆ గొంతు అతడి తాతయ్యది.
    "స్నేహితుడింటికి-...."
    "ఎవరా స్నేహితుడు?"
    "నీకు తెలియదతడెవరో" అన్నాడు సతీష్.
    "నాకు తెలియని వాళ్ళింటికి నువ్వు వెళ్ళడానికి లేదు...."
    "ఎందుకని?"
    "రాత్రిళ్ళు నిన్ను బయటకు పంపను...."
    "ఎందుకు?" రెట్టించాడు సతీష్.
    "ఒకసారి చాకు పారేసుకుని వచ్చావు. మళ్ళీ ఇంకేం పారేసుకుంటావోనని నా భయం....."
    "పారేసుకుందుకు నా దగ్గరింకేమీ లేవు.....".    
    "నీ గురించి నీకంటే నాకు బాగా తెలుసు. నువ్వెక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు. పద-లోపలకు...."నారాయణరావు గంభీరంగా అన్నాడు.
    "తాతయ్యా-ప్లీజ్.....నన్ను వెళ్ళనీ...."
    కాసేపు తాతామనుమళ్ళ మధ్య వాగ్వివాదం జరిగింది.
    మాలతి ఇదంతా కుతూహలంగా చూస్తోంది.
    ఇద్దరూ యెవరిపట్టు వారు వదలడంలేదు. మాలతికి తల్లి మనసుపీకి-'పోనీ-వాడిని వెళ్ళనిస్తేనేం?" అనుకుంది కానీ పైకి అనలేదు.
    నారాయణరావు చివరికి విసుగ్గా-"ఒక షరతుమీద నిన్ను బయటకు వెళ్లనిస్తాను...." అన్నాడు.
    "చెప్పు-...."
    "నేనూ నీతో వస్తాను...."
    "కుదరదు...."
    "అయితే నువ్వు బయటకు వెళ్ళడం కుదరదు...."
    ఇద్దరి మధ్యా మళ్ళీ వాగ్వివాదం. చివరికి నారాయణ రావే జయించాడు. ఎందుకంటే ఆయన మనుమడితో వచ్చి తీరుతానని పంతం పట్టాడు.
    అసహనంగా, అయిష్టంగా సతీష్ ఇంట్లో ఉండడానికి అంగీకరించాడు, నారాయణరావు తృప్తిగా నిట్టూర్చాడు.

                                     9

    ఒక రాత్రివేళ సతీష్ లేచాడు. టైమప్పుడు పన్నెండు కావస్తోంది.
    అసహనంగా అతడు నారాయణరావువంక చూశాడు.
    నారాయణరావు వళ్ళు తెలియని నిద్రలో ఉన్నాడు. గుర్రుకూడా పెడుతున్నాడు.
    గదిలో నైట్ బల్బు వెలుగుతోంది.
    సతీష్ గదిలోంచి బయటకు వెళ్ళపోయాడు. అప్రయత్నంగా ఆంజనేయుడి బొమ్మ అతడివంక క్రూరంగా చూసింది.
    సతీష్ ఆగిపోయాడు.
    నారాయణరావింకా గుర్రుపెడుతూనే ఉన్నాడు.
    సతీష్ పటానికి నమస్కరించి-"ఆంజనేయా! నన్ను మన్నించు-" అంటూ గదిలోంచి బయటకు వచ్చాడు.
    గది బయటకుకూడా నారాయణరావు గుర్రు వినపడుతూనే ఉంది.
    సతీష్ తేలికగా నిట్టూర్చి ముందడుగు వేశాడు. అయితే వీధి గుమ్మానికి అడ్డంగా ఓ మడత మంచం దానిమీద-మాలతి పడుకుని ఉంది.
    "ఓహో-నన్నాపడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోందన్న మాట...." అనుకున్నాడు సతీష్ అతడు దొడ్డిదారిన బయటకు వెళ్ళాలనుకున్నాడు. కానీ బయటకు వెళ్ళడానికుపయోగించే ఇతర ద్వారాలు రెండూ మూసి, తాళం పెట్టబడి ఉన్నాయి. బయటకు వెళ్ళాలంటే ఇక వీధి గుమ్మం ఒక్కటే మిగిలింది.
    సతీష్ తటపటాయించలేదు. తల్లి దగ్గరకు వెళ్ళాడు. తట్టిలేపాడు. మాలతి కళ్ళు నులుముకుంటూ లేచి-"ఏమిట్రా!" అంది.
    "నేను వెళ్ళాలమ్మా!" అన్నాడు సతీష్.
    "ఎక్కడికి?"
    "హుష్-గట్టిగా అరవకు తాతయ్య లేస్తాడు...."
    "ఎక్కడికో చెప్పు...." అంది మాలతి స్వరం తగ్గించి.
    "అమ్మా! నా స్నేహితుల్లో పరువుపోతుంది. వచ్చేక అన్నీ చెబుతాను. నేను కాని పనేమీ చేయడంలేదు. నన్ను వెళ్ళనీయి-" అన్నాడు సతీష్.
    "తాతయ్య నిన్నెక్కడికీ వెళ్ళనివ్వద్దన్నారు...."
    "అమ్మా-ఈ ఒక్క రోజుకీ.....ప్లీజ్...." అన్నాడు సతీష్.
    మాలతి ఒప్పుకోలేదు.
    సతీష్ వెంటనే తల్లి కాళ్ళు పట్టుకుని-"నేను నీ కాళ్ళు వదలను-నన్ను వెళ్ళనిచచే దాకా-" అన్నాడు.
    మాలతి కాస్త చలించింది. అయినా మేకపోతుగాంభీర్యం వహించింది.
    ఈలోగా ఆమె పాదాలు తడిశాయి.
    సతీష్ యేడ్వడం ప్రారంభించాడు. కన్నీటితో ఆమెకు పాదాభిషేకం చేస్తున్నాడు.
    మాలతి ఇక ఆగలేకపోయింది-"సరే వెళ్ళు మళ్ళీ తాతయ్య లేచేలోగా వెనక్కు వచ్చేయి. గుర్తుంచుకో ఈ ఒక్క రోజుకు మాత్రమే నిన్ను వెళ్ళనిస్తున్నాను" అన్నదామె.
    సతీష్ బయటకు వెళ్ళాడు.
    అతడిలా వెళ్ళాడో లేదో-"ఇదన్నమాట-నీ అదుపు" అన్నమాట వినిపించింది. మాలతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది.
    నారాయణరావు, జగన్నాధం అక్కడ కనబడ్డారామెకు.
    "ఒరేయ్-జగన్నాధం! బాగుచేసుకున్నా, పాడుచేసుకున్నా-మీ పిల్లల విషయంలో బాధ్యత మీదేనని చెప్పానుగా నువ్వు త్వరగా వెళ్ళి వాడెక్కడికి వెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో చూసి వచ్చి నాకు చెప్పు.....-" అన్నాడు నారాయణరావు.
    జగన్నాధం వెంటనే వెళ్ళిపోయాడు.
    నారాయణరావు కోడలి వంక తీవ్రంగా చూసి-"సతీష్ ఎలా పాడయ్యాడో నాకు తెలుస్తోందిప్పుడు-" అన్నాడు.
    "నన్ను క్షమించండి మామయ్యా!" అంది మాలతి.
    "నిన్ను నేను క్షమించగలను కానీ సతీష్ ను బాగుచేయలేను-" అన్నాడు నారాయణరావదోలాగున.
    "వాడు కాళ్ళు పట్టుకుని యేడ్చేసరికి కాదనలేక పోయాను-...."
    "పిల్లల్ని అదుపు చేయడానికి మనోబలముండాలి. వాళ్ళనదుపు చేయడం వాళ్ళ క్షేమానికే!" అన్నాడు నారాయణరావు.
    "ఇప్పుడేమవుతుంది?" అంది మాలతి.
    "నువ్వు చేసిన పొరపాటు నీ కొడుకు నేదశకు తీసుకుని వెళ్ళిందో తెలుసుకునేందుకు - నీ భర్త తిరిగి రావాలి-" అన్నాడు నారాయణరావు.
    ఆ  తర్వాత మాలతి నిద్రపోలేదు. ఏ శక్తి సతీష్ ను బలవత్తరంగా ఆకర్షిస్తోందో తెలుసుకోవాలని ఇద్దరూ యెదురుచూస్తున్నారు.
    కాసేపటికి జగన్నాధం వచ్చాడు. అతడి ముఖంలో పుట్టెడు దిగులు. తండ్రి భార్య యెంతగా అడిగినా జవాబు చెప్పడానికతడికి గొంతు పెగలడానికి కాసేపు పట్టింది.
    ఏమైతేనేం అసలు విషయం అందరికీ తెలిసింది.
    సతీష్ మత్తుపదార్ధాల కలవాటుపడ్డాడు.
    "మత్తుపదార్ధాలంటే?" అంది మాలతి.
    "అవి రకరకాలు బాధల్ని మరిచిపోవడానికీ, అసంతృప్తిని జయించడానికీ మనిషి వాటిని ఆశ్రయిస్తాడు. అప్పుడతడికి తనపై తనకే అదుపుండదు. మత్తుపదార్ధాలకు బానిస అయిన వ్యక్తి శారీరకంగా, మానసికంగా కృశించి దౌర్భాగ్యపు చావు చస్తాడు. అదీ చిన్న వయసులో!" అన్నాడు నారాయణరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS