Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 47


    "నువ్వేమన్నావు?"
    "ఆ చాకు తాతయ్య దగ్గరుందన్నాను.....అంతే!"
    "ఇప్పుడు సుధాకర్ వస్తాడా?"
    "అవును....విశ్వంతో కలిసి....."
    "ఒకవేళ చాకు నా దగ్గరలేదనుకో......సుధాకర్ నీమీద పోలీసు రిపోర్టిచ్చాడనుకో-పోలీసులు విచారణ ప్రారంభించారనుకో....."
    "ఊఁ."
    "నీకెలా వుంటుంది?"
    "నాకేం భయంలేదు. నేను హత్య చేయలేదుగా....."
    "చేశావని పోలీసులంటారు...."
    "అందుకు ఋజువుండదు....."
    "నీ చాకు....."
    "నా చాకింట్లోనే వుంది....."
    "అదృష్టం కొద్దీ అది నాకు దొరికింది. అది వేరే విషయం. చాకు నాకు దొరకలేదనుకో....అప్పుడు....."
    "ఇంతకీ నువ్వు చెప్పదల్చుకున్నదేమిటి తాతయ్యా?"
    "హత్య జరిగిన సమయంలో నువ్వెక్కడున్నావు?"
    "ఎక్కడుంటే మాత్రం-హత్యాస్థలంలో వున్నట్లు ఋజువు లేదుకదా....."
    "నీ చాకు హత్యాస్థలంలో వుంది....."
    "అయితే?"
    "అప్పుడు నువ్వింట్లో లేవు....."
    "అయితే?"
    "నువ్వింటికెప్పుడొచ్చావో-ఎదురింటి రామారావుకి తెలుసు అతడాసమయంలో పరీక్షలని చదువుకుంటున్నాడు...."
    "ఇప్పుడివన్నీ యెందుకు తాతయ్యా? చాకింట్లో వుంది గదా!"
    "హత్య జరిగిన సమయంలో నువ్వెక్కడున్నావో నాకు చెప్పు...."
    "ఎందుకు?"
    "నా తృప్తికోసం....."
    "అంటే?"
    "నా మనుమడు హంతకుడు కాదన్న తృప్తి నాక్కలగాలి...."
    "ఎందుకని? చాకింట్లోనే ఉందికదా....ఆ ఋజువు చాలదా నీకు?"
    "చాలదు...."
    "ఎందుకు చాలదు?"
    "అది నీ చాకు కాదు కాబట్టి!"
    "అంటే?" అన్నాడు సతీష్ తెల్లబోయి.
    "హత్యాస్థలంలో ఉన్న చాకు నీదే! అక్కడికెలా వెళ్ళిందో నువ్వు నాకు చెప్పాలి...." అన్నాడు నారాయణరావు.
    "ఆ చాకు నాది కాదు...." అన్నాడు సతీష్.
    "అయితే నీ చాకెక్కడుందో చెప్పు!"
    "ఇదిగో-నా చేతిలో ఉంది....."
    "ఇదీ నీది కాదు...." అన్నాడు నారాయణరావు.
    "నాదికాక మరెవ్వరిది?"
    "నాది...." అన్నాడు నారాయణరావు.
    "చాకుమీద నా పేరుంది....."
    "సరేలే-చాకులు కొన్నవాణ్ణి నేను. కొనేటప్పుడే రెండు కొన్నాను. రెండింటిమీదా పేర్లు వేయించాను. ఒక దానిమీద ఎస్, మరోదానిమీద ఎన్ అయితే షాపు వాడు పేర్లు సరిగా వేయలేదు. ఇంటికొచ్చేక చూశాను. రెండూ ఎస్ అనే ఉన్నాయి. ఒకటి నీకిచ్చాను. రెండోది నా దగ్గరుంచుకున్నాను...."
    "నీకు చాకెందుకు?"
    నారాయణరావు నవ్వి-"ఎందుకో ఒకందుకు? అప్పుడు నేను రెండు కొనడం ఇప్పుడు నీకు పనికొచ్చింది గదా! సుధాకర్ ఈ చాకు చూడగానే నీ మాటలు నమ్ముతాడు....." అన్నాడు.
    "అవును తాతయ్యా.....నీకు చాలా చాలా థాంక్స్!"    
    "అయితే నీ చాకెలా పోయిందో చెప్పు....."
    "దాని గురించి నీకంత పట్టుధలెందుకు? నిజం చెబుతున్నాను తాతయ్యా-నేనీ హత్య చేయలేదు....."
    "నువ్వు హత్యచేసినా చేయకపోయినా నీ చాకెలా పోయిందో నాకు తెలియాలి. ఎందుకంటే-యెవరో నీ చాకును తీసుకెళ్ళి హత్యాస్థలంలో పడేశారు-లేదా హత్యకు వాడుకున్నారు. అంటే వాళ్ళకు నీమీద కక్ష వుంది. పగ సాధిస్తున్నారు. నీ శత్రువులెవరో నేను తెలుసుకోవాలంటే నాకు నీ చాకెలా పోయిందీ తెలియాలి....." అన్నాడు నారాయణరావు గంభీరంగా.
    "తాతయ్యా! నాకు శత్రువు లెవ్వరూ లేరు. చెప్పాలంటే నాకు నేనే శత్రువుని...." అన్నాడు సతీష్.
    "అంటే?" అన్నాడు నారాయణరావు ఆశ్చర్యంగా.
    "సుధాకర్ కి చూపించడానికి చాకు దొరికింది. నాకిప్పుడెక్కడలేని ఆకలీ పుట్టుకొస్తోంది. వెళ్ళి భోంచేస్తాను....." అన్నాడు సతీష్.
    మనుమడు మాటమారుస్తున్నాడని అర్ధమై-"సరేలే-వెళ్ళు కడుపునిండా భోంచేయి. ఈసారి చాకు జాగ్రత్తగా దాచుకో-" అన్నాడు నారాయణరావు.
    సతీష్ చటుక్కున చాకును నారాయణరావు మంచం మీద పెట్టి-"తాతయ్యా! ఇది నీ దగ్గరే ఉండనీ-సుధాకర్ కి నీ దగ్గరేకదా చూపిస్తానని చెప్పాను-" అన్నాడు.
    నారాయణరావు చాకును నెమ్మదిగా తలగడక్రిందకు తోశాడు. సతీష్ తల్లి దగ్గరకు వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు.
    "ఏ సమస్యనైనా మామయ్యిట్టే పరిష్కరిస్తారు..." అనుకుంది మాలతి సంతృప్తిగా.

                                      7

    జగన్నాధం ఇంటికి వస్తూనే తండ్రి గదిలోకి వెళ్ళాడు. నారాయణరావతడికి జరిగినదంతా చెప్పి-"సుధాకర్ వచ్చి వెళ్ళాడు. మనవాడి ననుమానించినందుకతడు బాధపడ్డాడు-" అన్నాడు.
    "నువ్వు అద్భుత వ్యక్తిని నాన్నా!" అన్నాడు జగన్నాధం.
    "నేను అద్భుత వ్యక్తిని కావచ్చు కానీ అస్తమానూ అద్భుతాలు చేయలేను. నేను నిన్ను పెంచినట్లుగా నువ్వు సతీష్ ని పెంచడంలేదని నాకిప్పుడనిపిస్తోంది-" అన్నాడు నారాయణరావు సీరియస్ గా.
    "అదేమిటి నాన్నా!" అన్నాడు జగన్నాధం కంగారుగా.
    "చిన్నప్పట్నించీ నేను నిన్నెంతో గారాబంగా పెంచాను. నువ్వు కోరినవన్నీ శక్తికొద్దీ నెరవేర్చడానికి ప్రయత్నించాను, నీ సంతోషమే నా సంతోషంగా జీవించాను అయితే నిన్ను క్రమశిక్షణకు దూరంకానివ్వలేదు. నీకెంతో స్వేచ్చనిచ్చాను కానీ నిన్ను నా అదుపులోంచి పోనివ్వలేదు-...." అన్నాడు నారాయణరావు.
    "అవును నాన్నా-పిల్లల పెంపకంలో యెవరైనా నీ తర్వాతనే...."
    "మాటలు చెప్పడంవరకే తప్ప నానుంచి నువ్వేమీ నేర్చుకున్నట్లు లేదు. మన సతీష్ అదుపు తప్పాడని నా కనిపిస్తోంది-" అన్నాడు నారాయణరావు.
    "నాన్నా! చిన్నప్పట్నించీ సతీష్ నీ సంరక్షణలో వదిలాను. నన్నదుపు చేసినట్లే నువ్వు వాడిని అదుపు చేయగలవని భావిస్తున్నాను...." అన్నాడు జగన్నాధం.
    నారాయణరావదోలా నవ్వి - "ఈ విషయంలో నువ్వు చాలా పొరబడ్డావు. నువ్వు నా సంతానానివి నిన్ను పైకి తీసుకుని రావడం నా బాధ్యత. అందుకే యెప్పటికప్పుడు నిన్నదుపుచేస్తూ నీ ప్రగతిని రక్షించే వాణ్ణి నీకు వివాహమైనాక నా బాధ్యత ముగిసిందనుకున్నాను. సతీష్ ని బాధ్యతగా నేనెప్పుడూ భావించలేదు. నాకు సంబంధించినంతవరకూ వాడొక ఆటబొమ్మ. మాట్లాడి మురిపించే జీవమున్న ఆటబొమ్మ. వాడితో నేను నా సరదాలు తీర్చుకునేవాన్ని. వాడినొక భాధ్యతగా నేనెప్పుడూ భావించలేదు. వాడి ప్రగతి గురించి నువ్వూ, కోడలూ ఆలోచిస్తారని నమ్మాను. కానీ అలా జరిగినట్లు లేదు...." అన్నాడు.
    "అలా యెందుకనుకుంటున్నావు?" అన్నాడు జగన్నాధం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS