Previous Page
వసుంధర కథలు-7 పేజి 49


    మాలతి వణికిపోయింది.
    నారాయణరావు కొడుకు వంక తిరిగి-"నువ్వు వాడిని వెంట తీసుకుని రాలేదేం?" అన్నాడు.    
    "వాడెక్కడికి వెళ్ళాడో చూశాను. ఏంచేస్తున్నాడో తెలుసుకున్నాను. నాకా వాతావరణంలో అడుగుపెట్టాలంటే భయం వేసింది నాన్నా! ఎలాగో అలా నువ్వే మన సతీష్ ని రక్షించాలి-" అన్నాడు జగన్నాధం.
    నారాయణరావు నిట్టూర్చి-"వాడంత గోలపెట్టి అక్కడికి పోయాడంటే వాడీ పదార్ధాలకు బాగా అలవాటు పడ్డాడన్న మాట. మన నిర్లక్ష్యం వల్లనే వాడీదశకు వచ్చాడు. వాడి గురించి మనకు తెలిసినట్లు వాడికి తెలియనివ్వద్దు వాణ్ణి మంచిదారిలో పెట్టే ఉపాయం నేనాలోచిస్తాను-" అన్నాడు.
    "నువ్వాలోచిస్తే అన్నీ సానుకూలమవుతాయి. నాకానమ్మకముంది నాన్నా!" అన్నాడు జగన్నాధం.
    ఆ రాత్రికి ఆ యింట్లో ఎవ్వరికీ సరిగా నిద్రపట్టలేదు. తెల్లవారుఝామున సతీష్ వస్తే ఆ విషయం కూడా ఎవ్వరూ పట్టనట్లే ఉన్నారు.

                                   10

    మర్నాడుదయం సతీష్ బాగా ఆలస్యంగా నిద్రలేచాడు ఎవ్వరూ అతణ్ణి పెందరాళే నిద్ర లేపడానికి ప్రయత్నించలేదు.
    సతీష్ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేసరికి జగన్నాధం ఆఫీసుకు వెళ్ళిపోయాడు. నారాయణరావు మనుమన్ని పిలిచి-"ఒరేయ్-కొన్నాళ్ళుగా నేను ఒంటరితనం ఫీలవుతున్నాను. కొంతకాలం పాటు మనమిద్దరం కలిసి తిరుగుదాం. నువ్వెక్కడికి వెడితే నేనూ అక్కడికి వస్తాను-" అన్నాడు.
    "ఒక్క రాత్రిళ్ళు తప్ప...." అన్నాడు సతీష్.
    "ఎందుకని?"
    సతీష్ వెంటనే ఏమీ బదులివ్వలేదు. ఒక్కక్షణం ఆగి-"తాతయ్యా! సుధాకర్ కి నేను తన బామ్మను చంపానని అనుమానంగా ఉంది. తనూ నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకుంటానంటున్నాడు. రాత్రిళ్ళు నువ్వు బయట తిరగడం మంచిదికాదు-" అన్నాడతడు.
    "నువ్వు సుధాకర్ బామ్మను చంపితే మధ్య నేనేం చేశాను?"
    "చాకు విషయంలో నువ్వేదో నాటకమాడావని అతడి అనుమానం. ఆపైన నాకు నువ్వంటే యిష్టమని తెలుసుగా....నీకోసం నేను జీవితాంతం కుమిలి ఏడ్చేలా చేస్తానంటున్నాడు...." అన్నాడు సతీష్.
    "అయితే మాత్రం-నాకేం భయంరా....నేనెక్కడికి వెళ్ళినా నువ్వు నా పక్కనుంటావు నీ తాతయ్యను నువ్వు రక్షించుకోలేవూ?" అన్నాడు నారాయణరావు.
    సతీష్ అప్రయత్నంగా గదిలోని పూజామందిరం వైపు చూశాడు. పైన గోడకు వ్రేలాడుతున్న పటంలోని ఆంజనేయుడతడివైపు కుతూహలంగా చూస్తున్నాడు.
    "చెప్పరా - నీ తాతయ్యను నువ్వు రక్షించుకో లేవూ?"
    "నా మాట విను తాతయ్య-రాత్రిళ్ళు నువ్వు బయటకు రావొద్దు."
    నారాయణరావు చిరాగ్గా - "నువ్వేవో దాస్తున్నావు. ఆంజనేయుడు సాక్షిగా నిజం చెప్పాలి నువ్వు"- అన్నాడు.
    సతీష్ చటుక్కున - "ఆ పటానికి ఫ్రేం పాడయింది తాతయ్యా! నేను కొత్త ఫ్రేం వేయిస్తాను...." అన్నాడు.
    అతడు మాట మార్చుతున్నాడని నారాయణరావు గ్రహించాడు. తనూ నొక్కించకూడదనుకుని-"ఫ్రేం మార్చినా ఆంజనేయుడు మారడు-" అన్నాడాయన.
    "నాకు తెలుసు ఏదో నా తృప్తికోసం-" అన్నాడు సతీష్.
    నారాయణరావంగీకరించగానే అతడు పటం తీసుకుని బయటకు వెళ్ళి కాసేపట్లోనే తిరిగివచ్చి - "తాతయ్యా! చాలా పెద్దఘోరం జరిగిపోయింది-" అన్నాడు.
    "ఏమయిందిరా?" అన్నాడు నారాయణరావు.
    "పటం దారిలో చేయిజారి పగిలిపోయింది. బొమ్మ తీసుకుందామనుకుంటూండగా ఓ పిచ్చివాడు పరుగునవచ్చి నా దగ్గర్నుంచి అది లాక్కుని ముక్కలు ముక్కలుగా చింపేశాడు-" అన్నాడు సతీష్.
    నారాయణరావా కథ నమ్మలేదు. సతీషంతరాత్మ నా పటం బాధిస్తోంది. అందుకని కావాలనే అతడా పటాన్ని నాశనం చేశాడని ఆయన నమ్మాడు.
    "సతీష్ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి వాడి పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది-"అనుకున్నా డాయన.
    
                                     11

    ఆ రోజు మధ్యాహ్నం బయటకువెళ్ళిన సతీష్ రాత్రి పదైనా ఇంటికి రాలేదు. మాలతి బెంగపడుతూంటే-"నిన్నవాన్ని అదుపుచేయాలని చూశాంగదా-అందుకని మధ్యాహ్నమే ఇల్లు వదిలిపెట్టాడు-" అన్నాడు నారాయణరావు.
    ఆయన జగన్నాధన్నడిగి సతీష్ వెడుతున్న ఇంటి వివరాలు తెలుసుకున్నాడు. అప్పటికప్పుడే తనే ఆ ఇంటికి బయల్దేరాడు.
    అదొక చిన్న బంగళా బంగళా ముందు వరండాలో పడక కుర్చీలో ఓ నడివయస్కుడు కూర్చుని ఉన్నాడు. అయన నారాయణరావును చూసి-"ఎవరు మీరు? మీ రెవరి కోసం వచ్చారు?" అన్నాడు.
    "నా మనుమడి పేరు సతీష్.....అతడికోసం వచ్చాను.."
    "అతడిక్కడుంటాడని మీ కెవరు చెప్పారు?"
    "నాకు నీ గురించి అంతా తెలుసు. యువకులను మత్తు పదార్ధాల కలవాటుచేయడం నీ వృత్తి. నీ విషయం పోలీసులకు రిపోర్టిస్తాను. నీ అంతం చూస్తాను-"అన్నాడు నారాయణ రావావేశంగా.
    అతడు నవ్వి-"నా గురించి బాగానే తెలుసుకున్నావు. తెలుసుకున్నాక నువ్వు మిగలవు-" అన్నాడు.
    "నన్ను బెదిరించకు. నాకు భయంలేదు....." అన్నాడు నారాయణరావు.
    "అయితే లోపలకు వెళ్ళు. నీ సతీషున్నాడేమో చూసుకో"-అన్నాడావ్యక్తి.
    నారాయణరావు లోపలకు వెళ్ళాడు. ఓ చిన్న గది......ఆ గదినానుకుని ఓ విశాలమైన హాలు. హాల్లో పదిహేను గురు యువకులున్నారు. వాళ్ళలో ఆయనకు సుధాకర్, విశ్వంలు కనబడ్డారు. సతీశ్లేడు.
    వాళ్ళందరూ అలౌకికానంధంలో ఉన్నారు. కొందరు పైపు పీలుస్తున్నారు. కొందరు సిగరెట్ కాలుస్తున్నారు.
    సుధాకర్ నారాయణరావును చూసి-"మీరు సతీష్ కోసం వచ్చారా? ఆ వంక పెట్టుకుని వచ్చారా?" అన్నాడు.
    అతడీ లోకంలో లేడని నారాయణరావు కర్ధమయింది. సరిగ్గా అప్పుడే బయటివ్యక్తి లోపలకు వచ్చి-"నా ప్రియ స్నేహితులారా! ఇతడు నన్ను పోలీసులకు పట్టిస్తా నని బెదిరిస్తున్నాడు. నేను పోలీసులకు దొరికితే మీకీ ఆనందముండదు. కాబట్టి మీరితడికి తగిన విధంగా బుద్ధి చెప్పండి...." అన్నాడు.
    ఆ వ్యక్తి మాటలు పూర్తయ్యేలోగా నలుగురు యువకులు నారాయణరావు మీద పడ్డారు. వాళ్ళు తలో దెబ్బా వేస్తూంటే నారాయణరావు క్రిందపడిపోయాడు. లేవబోతూండగా గుమ్మం దగ్గర ఆయనకు సతీష్కనిపించాడు.
    "ఒరేయ్ సతీష్.....సమయానికి వచ్చావు. నన్ను రక్షించరా?" అని అరిచాడాయన.
    సతీషాయన వంకే చూస్తూ ముందడుగు వేశాడు.
    
                                      12

    "అమ్మకు, నాన్నకు సతీష్ నమస్కరించి వ్రాయునది.
    దీపను ప్రేమించిన భ్రమలో నేను మత్తుపదార్దాల కలవాటు పడ్డాను. ఆ అలవాటుకు డబ్బుకావాలి. అందుకని చిల్లరనేరాలు ప్రారంభించాను. డబ్బు దొంగిలించడానికి వృద్దులను, అసహాయులను, వికలాంగులను ఎన్నుకునేవాణ్ణి ప్రతిఘటించిన కారణంగా చాకుతో పొడిస్తే సుధాకర్ బామ్మ చనిపోయింది. ఆ హత్య నేనే చేశాను.
    నేను మత్తుపదార్దాలకి బానిసని. వాటి కోసం ఏమైనా చేస్తాను. నావంటి యువకులు చాలామంది ఉన్నారు. మా వంటి వారివల్ల ప్రమాద ముండకూడదనుకుని-తాతయ్యను రాత్రిళ్ళు బయట తిరగవద్దని హెచ్చరించాను. ఆయన నా మాట వినకుండా సరాసరి రాకూడని చోటుకే వచ్చాడు.
    తాతయ్య నన్ను హత్యకేసులోంచి రక్షించాడు. ఎక్కడున్నా నేను తనని రక్షించగలనని నమ్మాడు. కానీ మత్తు పదార్ధాల అదుపులో ఉన్న నేను-వాటికోసం ఏమైనా చేయగల నేను-ఆ సమయంలో- నన్ను రక్షించు సతీష్........అంటున్న తాతయ్యను......నేను స్వయంగా చాకుతో పొడిచి చంపాను. ఏ చాకుతో అయితే తాతయ్య నన్ను రక్షించాడో-ఆ చాకుతో నే ఆయన్ను పొడిచి చంపాను.
    తెల్లవారేకగానీ నా తప్పు నాకు తెలియలేదు. అప్పుడు నా తప్పు నాకు తెలిసీ ప్రయోజనంలేదు.
    తాతయ్య నా గురించి ఆత్మార్పణ చేశాడు. ఆయన ఆత్మార్పణ నాకు సహకరించదు. ఇప్పటికే నేను హంతకుణ్ణి.
    అయితే తాతయ్య ఆత్మార్పణ వృధాపోకూడదు.
    అందుకే నన్నిలా తయారుచేసిన వారి గురించిన పూర్తి వివరాలు పోలీసు స్టేషన్ కు ఉత్తరం ద్వారా అందజేస్తున్నాను.
    ఇది మీకందే సమయానికి నేనీలోకంలో ఉండను.
    అదుపు తప్పిన యువకులకు నా కథ అదుపు కావాలన్నది నా కోరిక. త్వరగా తాతయ్యను కలుసుకుని అయన కేకాంత బాధ లేకుండా చేయాలన్నది నా ఆకాంక్ష, తాతయ్యంటే నా కెంత ఇష్టమో మీకూ తెలుసు...."
    ఉత్తరం మడిచి జగన్నాధం ఏడుస్తూ-"నాన్నా! నా కొడుకును నేనదుపు చేయలేక పోయాను. నీ ప్రాణత్యాగంతో దేశంలోని ఎందరో యువకుల నదుపు చేస్తున్నావు నువ్వు-" అన్నాడు.
    పూజామందిరంపైన గోడకు వ్రేలాడుతున్న ఫోటోలో ఆంజనేయుడి స్థానంలోవున్న నారాయణరావు ముఖంలో చెరగని చిరునవ్వు-కొడుకుతో-"నీ దుఃఖాన్ని అదుపు చేసుకో." అని హెచ్చరిస్తోంది.

                            -:అయిపోయింది:-


 Previous Page

WRITERS
PUBLICATIONS