"ఎవరో తలుపు తడుతున్నారు...."
'అయితే ?"
"నేను త్వరగా బట్టలు వేసుకోవాలి" అంటూ ఆమె ఒక్క విసురున అతణ్ణి విదుల్చుకుని ఆ గదిలోంచి పక్క గదిలోకి పరుగెత్తింది.
ఈలోగా ఉదయ లేచి గుడిసె తలుపు తీసింది. బయట నాయకుడు, మాంత్రికుడు ఉన్నారు. ఇద్దరూ ఒక్క ఉదుటున లోపలకు వెళ్ళారు.
వేదాంతం గదిలో దుస్తులు ధరిస్తున్న ఆటవిక యువతిని వారిద్దరూ చూడ్డానికెంతో సేపు పట్టలేదు. చాలావరకూ నిద్రలేక పోవడం వల్ల అప్పుడు వేదాంతం గాడ నిద్రలో ఉన్నాడు.
నాకుదాటవిక యువతిని తీసుకుని వెళ్ళిపోయాడు. జరిగిందేమిటో తెలుసుకుందుకతడు ప్రయత్నించలేదు. చెప్పడానికి ఉదయ ప్రయత్నించలేదు.
వాళ్ళు వెళ్ళిపోయాక ఉదయ వేదాంతాన్ని కులభూషణ్ నీ నిద్ర లేపింది. జరిగింది చెప్పింది.
కులభూషణ్ తల వంచుకున్నాడు.
వేదాంతం ఆలోచనలో పడ్డాడు.
"వైద్యుడికి అత్యాచార బుద్ది ఉంటే అతడి ప్రతిభ రాణించదు...." అంది ఉదయ నిష్టూరంగా.
"నేనత్యాచారం చేయలేదు. వలచి వచ్చిన వనితను ఆదరించాను. ఇది నాకు కొత్త కాదు" అన్నాడు కులభూషణ్.
"జరిగినదాని గురించి ఆలోచన వద్దు. ముందు జరగనున్నదో ఆలోచించాలి ....' అన్నాడు వేదాంతం.
"ఏం జరుగుతుంది ?" అన్నాడు కులభూషణ్.
"ఆమె వివాహిత స్త్రీ , ఆటవికులీ తప్పును క్షమించారు...."
"క్షమించక ఏం చేస్తారు ?"
ఏం చేస్తారో వారికి తెలియడాని కెంతో సేపు పట్టలేదు.
అది చెప్పడానికి నాయకుడు వారిని స్వయంగా వచ్చి కలుసుకున్నాడు.
"దేవతా పురుషులయుండి ఇలాంటి తప్పు చేస్తారని నేననుకోలేదు" అన్నాడు నాయకుడు.
తప్పేలా జరిగిందో వేదాంతం నాయకుడికి సివరించాలను కున్నాడు. నాయకుడతడి సంజాయిషీ వినడానికి నిరాకరించాడు.
నాయకుడి ,మాటల ప్రకారం తప్పు ఆటవిక యువతిది కాదు. ఆమె మాయమాటలతో వశపర్చుకోబడింది. దేవతా పురుషులకు మానవ స్త్రీలను వశ పరచుకోవడం అసాధ్యం కాదు. ఇప్పుడు రెండే రెండు మార్గాలున్నాయి.
ఆటవిక యువతిని వారు కూడా తీసుకుని పోవచ్చు. బదులుగా ఆమె భర్తకు ఉదయను అప్పగించాలి. ఉదయ ఇక మీదట శాశ్వతంగా ఆటవికుల మధ్య ఉండిపోవాలి.
లేదా....
తప్పు చేసిన వేదాంతం ఆటవికు లేర్పాటు చేసిన చితిలో ప్రవేశించి అగ్నికి ఆహుతి కావాలి.
"బయటి వారి విషయంలో మా నీతి సూత్రాలివి" అన్నాడు నాయకుడు.
వేదాంతం, ఉదయ, కులభూషణ్ మ్రాన్పడి పోయారు.
"చితికి ఏర్పాట్లు చేస్తాను. అగ్ని ప్రవేశానికి రాత్రే ముహూర్తం....ఏ విషయమూ మధ్యాహ్నానికి తేల్చి చెప్పండి." అని నాయకుడు వెళ్ళబోయాడు. వేదాంతం అతడితో మేము మీకేన్నో ఉపకారాలు చేశాం. మాకీ శిక్ష న్యాయం కాదు...." అన్నాడు.
"ఉపకారానికి ప్రత్యుపకారం నీతి తప్పడం కాదు " అని ఆటవికుడక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు.
"ఇప్పుడేమిటి దారి?" అన్నాడు కులభూషణ్.
"నువ్వు చేసిన తప్పుకు ఇతరులనుభావించాలి" అన్నాడు వేదాంతం.
ఉదయ వెంటనే "ఆ తప్పుకు కులభూషణ్ ని ప్రోత్సహించిందెవరు? నువ్వే? అదృష్టం బాగుండబట్టి కానీ అగ్నికి ఆహుతి కావలసింది కులభూషణ్ అయ్యేవాడు. ఇలా జరిగుగుందని నీకు ముందే తెలుసు. ఆటవికులు ఆచారాలు మా అందరి కంటే నీకే బాగా తెలుసు. నీ గదికి వచ్చిన యువతిని తప్పని వారించక అతడీ గదికి పంపావు. అతడిని ప్రమాదం గురించి హెచ్చరించాకుండా సుఖంగా నిద్ర పోయావు" అంది.
"నాకు భూషణ్ అంటే శత్రుత్వమా?" అన్నాడు వేదాంతం.
"నువ్వు సవాల్లో నెగ్గడం గురించే ఆలోచించు కున్నావు తప్ప -- రానున్న ప్రమాదం గురించి పట్టించుకోలేదు. ప్రమాదమంటూ ఉంటె అది కులభూషణ్ కే గదా అనుకున్నావు. కానీ పైన దేవుడున్నాడు. నీ వేలితో నీ కన్నె పొడుచుకున్నట్లయింది...."
"ఉదయా అవెం మాటలు.....ముందు ప్రమాదం గురించేలా తప్పించుకోవాలో ఆలోచించు. ప్రమాదం వేదంతానికే కాదు నీకూ ఉంది. నిన్నాటవికుల కప్పగించాల్సి వస్తే ఏం చేస్తావు ?" అన్నాడు కులభూషణ్.
ఉదయ ముఖం ఎర్రబడింది.-- "నేను ఆటవికుల పాలయ్యే ప్రసక్తి లేదు. నన్ను నువ్వు రక్షించుకోవా?' అంది. వేదాంతం గంభీరంగా "ఉదయా! నిన్ను రక్షించే అవకాశం నేను భూషణ్ కివ్వను. నేనే తీసుకుంటాను...." అన్నాడు.
'అంటే?" అన్నాడు కులభూషణ్.
"నేనే అగ్నికి ఆహుతై పోతాను..."
ఉదయ పకపకా నవ్వి "మీ బుర్రలు పనిచేయడం మానేశాయనుకుంటాను....' అంది.
ఇద్దరూ తెల్లబోయి "ఈ పరిస్థితుల్లో నువ్వు నవ్వుతున్నావా?" అన్నారు.
'అవును, మన కూడా విస్సీ బావ ఉన్నాడు. అతడు ది గ్రాండ్ గ్రేట్ వండర్ పుల్ సుపర్బ్ ఎక్సలెంట్ అడ్జస్ట్ బుల్ మాన్ అన్న విషయం అప్పుడే మర్చిపోయారా?" అంది ఉదయ.
ఇద్దరూ కుతూహలంగా ఆమె వంక చూశారు.
"వేదాంతం రూపంలో విస్సీ బావ వెళ్ళి అగ్నికి ఆహుతైపోతాడు...." అంది .
'నో" అని అరిచాడు వేదాంతం.
"ఈ పరిస్థితుల్లో అంతకు మించిన దారి లేదు" అన్నాడు కులభూషణ్.
'అయితే నా ధనుష్టంకారం ఏమైపోవాలి?" అన్నాడు వేదాంతం ఆవేదనగా.
"మనసంటూ ఉంటె మరిన్ని మార్గాలుంటాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించు కునేందు కిదోక్కటే దారి" అంది ఉదయ.
కులభూషణ్ వేదాంతానికి నచ్చజెప్పసాగాడు.
***
రాత్రి పన్నెండు గంటల సమయం వేదాంతం తన గదిలో నిద్ర పోతున్నాడు. ఉదయ, కులభూషణ్ ఒకే గదిలో కూర్చున్నారు.
"ఈపూట వేదాంతానికింత నిదేమిటి?" అన్నాడు కులభూషణ్.
'అతడెం చేసినా అందుకేదో కారణముంటుంది. నిజానికతడు నిద్ర పోతున్నాడని అనుకోను. ఏదో తీవ్రాలోచనలో ఉండి ఉంటాడు ...." అంది ఉదయ.
అప్పుడు గుడిసెకు నాయకుడు, మాంత్రికుడు వచ్చారు. ఉదయ లోనికి వెళ్ళి వేదాంతాన్ని నిద్ర లేపి తీసుకుని వచ్చింది.
మాంత్రికుడు వేదాంతానికి నుదుట బొట్టు పెట్టాడు.
"పద" అన్నాడు.
వేదాంతం వారితో కదులుతూ "మీరు గుడిసె విడిచి రావద్దు. ఇది నా ఆదేశం. అన్నాడు.
ఉదయ, కులభూషణ్ తలలూపారు. లోపల ఉన్న మరో వేదాంతం గురించి ఇతరులకు తెలియకుండా వారక్కడ కాపలా ఉండాలి. ఆ కాపలాకు కారణం నాయకుడి కనుమానం కలిగించకూడనిదై ఉండాలి. అందుకే వేదాంతం వారికలా చెప్పాడు.
"విస్సీ బావ పనిపోయింది" అంది ఉదయ.
"ప్రతి అవతారానికి పరిసమాప్తి తప్పదు...." అన్నాడు కులభూషణ్.
"ఈ అవతారానికి పరిసమాప్తి నీ కారణంగా వచ్చింది" అంది ఉదయ.
"ఉదయ ప్లీజ్ .....అలా మాట్లాడవద్దు ...." అన్నాడు కులభూషణ్.
"వేదాంతం సవాలు వేసినందుకెనా నువ్వు నిన్ను నిగ్రహించుకునెందుకు ప్రయత్నించ లేదు ...." అంది ఉదయ.
కులభూషణ్ క్షణం తటపటాయించి "నేను నీకు నిజం చెబుతాను. నువ్వు వేదాంతాన్ని వివాహం చేసుకుంటావని మాటివ్వాలి..." అన్నాడు.
"ఎందుకు?" అంది ఉదయ.
"మాటివ్వు -- చెబుతాను ..."
"సరే ఇచ్చాను " అంది ఉదయ.
"మాటిస్తే సరిపోదు. ఈ క్షణం నుంచీ నీవు వేదాంతం భార్యనే అనుకోవాలి. అనగా నాకు పరాయి స్త్ర్రీవి...."
"ఏమిటిదంతా ?" అంది ఉదయ.
"ముందాలాగని మాటివ్వు...." ఉదయ మాటివ్వడానికి కాసేపు పట్టింది.
"వేదాంతం నీకు తగిన వరుడు. నీవు పవిత్రురాలివి. నీ కోసం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో తన పవిత్రతను కాపాడుకున్నాడు వేదాంతం. మీ ఇద్దరికీ రాసి పెట్టి ఉంది. అందుకే విస్సీ మనకు మిగలలేదు. నీవు పునర్జన్మ నేత్తావు...."
'అయితే ?"
