Previous Page
శంఖారావం పేజి 49


    "నాలో పవిత్రత లేదు. నాకు తగ్గ స్త్రీని నేనేన్నుకుంటాను. తగిన సమయం వచ్చినప్పుడు నీ పై మమకారం నాలో కొంత మార్పు తీసుకుని వచ్చింది. అది నా నిగ్రహాన్ని పెంచింది. తప్ప మనసును మార్చలేదు. తలచు కుంటే ఆటవిక యువతి ముందు నేను కూడా కొంత నిగ్రహం పాటించ గలిగే వాణ్ణి. కానీ వేదాంతం చేసిన సవాల్లో నెగ్గి నీలోని అలజడిని మరింతకాలం కొనసాగించడం నాకిష్టం లేదు. అందుకే కావాలని ఓడిపోయాను. నా ఓటమికి నష్టపరిహారం ఒక అపూర్వ వైజ్ఞానిక సాధనం చెల్లించాల్సి వచ్చినందుకు మాత్రం బాధగా ఉంది" అన్నాడు కులభూషణ్.
    "నువ్వు చెప్పేది నిజమా?" అంది ఉదయ.
    "అక్షరాలా నిజం --"
    "అయితే నేను చెప్పేది కూడా నువ్వు విను....'అంది ఉదయ.
    "వేదాంతానికి వ్యతిరేకంగా నువ్వేమి చెప్పినా వినను...."అన్నాడు కులభూషణ్.
    "నేనేం చెప్పినా నువ్వు వినాలి" అంది ఉదయ.
    'అయితే చెప్పు..." అన్నాడు కులభూషణ్ అయిష్టంగానే.
    "విస్సీ బావంటే నాకార్షణ ఏర్పడింది. అయితే వేదాంతం కూడా మొదట్నించీ నన్నాకర్శించాలని చూసేవాడు. విస్సీ బావ నాతొ స్నేహితుడిలా మసిలితే అతడు ప్రేమికుడిలా చూసేవాడు. ఈ తేడా నాలో కొంత సంచలనాన్ని కలిగించింది. వయసులో ఉన్న యువతి స్నేహాన్ని మించి ప్రేమను కోరుతుంది. ఇది విస్సీ బావ కర్ధమయ్యేది కాదు. నా మనసులో తరచూ  వేదాంతం పట్ల ఆకర్షణ ఏర్పడేది. అప్పటికే నేను విస్సీ బావ మనిషి నాన్న భావం కలిగి ఉండడం వల్ల వేదాంతం గురించి అలా ఆలోచించడం తప్పనిపించేది. విస్సీ బావ నిదానం కంటే వేదాంతం ఆవేశమే నాకెక్కువ నచ్చేది. ప్రణయం గురించి ఆలోచిస్తే విస్సీ బావకు బదులు వేదాంతం గుర్తుకు వచ్చేవాడు. తప్పు చేస్తున్నానన్న భావం నాలో పుట్టి అతడికి వీలైనంత దూరంగా ఉండేదాన్ని. అతణ్ణి అకారణంగా ద్వేషించడానికి ప్రయత్నించేదాన్ని. అతడు నాకు దగ్గర కావాలను చేసే ప్రతి ప్రయత్నాన్ని నిర్ధాక్షిణ్యంగా విఫలం చేసేదాన్ని. అందుకు నా మనసెంతో బాధపడేది. ఈ క్షణం వరకూ జరిగిందదే!" అంది ఉదయ.
    కులభూషణ్ తెల్లబోయి ఆమె వంక చూసి "స్త్రీ హృదయం అగాధమంటారు. నీమటలా విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మగాడికి ఆడదేప్పుడూ అర్ధం కాదు" అన్నాడు.
    "నేను నీకు నిజం చెబుతున్నానో-- నన్ను నేను సరి పెట్టుకునెందుకు ప్రయత్నిస్తున్నానో నాకు తెలియదు ...." అంది ఉదయ మళ్ళీ.
    "ఉదయ! నువ్వబద్దం చెప్పవు. చెప్పలేవు...." అన్నాడు కులభూషణ్.
    'అది నీ అభిప్రాయం. కానీ నాసంగతి నాకూ తెలియాలి కదా! అందుకే ఓ పని చేశాను...."
    "ఏమిటి?"
    "మీతో ప్రయాణమై విస్సీ బావను నా అదుపులో ఉంచమన్నందుకే....' అంటే?
    "నా కధంతా విస్సీ బావకు చెప్పుకున్నాను. అంతా విని విస్సీ బావ చెప్పిందేమిటో తెలుసా!"
    "ఊ" కుతూహలంగా అన్నాడు కులభూషణ్.
    "నేను వేదాంతాన్ని ప్రేమిస్తున్నానన్నాడు....'
    కులభూషణ్ తెల్ల మొఖం వేసి ఆమె వంక చూశాడు. మరైతే చివరి క్షణం దాకా వాడినెందుకు బాధ పెడుతూనే ఉన్నావు!
    "నేను విస్సీ బావను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అతడు చచ్చిపోయాడు. చచ్చి పోతాననుకుని నీకు భార్యను కావాలనుకుంటే బ్రతికి నీకు సమస్యనయ్యాను. నా పెళ్ళికి సీతమ్మత్త మాత్రమే దారి అనుకుంటే ఆమె చనిపోయింది -- హత్య చేయబడి! నేనొక దురదృష్ట జాతకురాలిని. వేదాంతానికి దూరంగా ఉండడమే అతడికి మంచిదని పించింది " అంది ఉదయ నిట్టూర్చి.
    "ఏమైతేనేం కద సుఖాంతమైంది...." అన్నాడు కులభూషణ్. ఇద్దరూ లేచి తమ తమ గదులలోకి వెళ్ళారు. కాసేపటి లోనే ఇద్దరూ వెనక్కు వచ్చి వరండాలో కలుసుకున్నారు. ఇద్దరి చేతుల్లోనూ ఉత్తరాలుననాయి.
    ఇద్దరూ ఒకరి ఉత్తరాలోకరు మార్చుకున్నారు. చమురు దీపం వెలుగులో ఇద్దరూ ఉత్తరాలు చదివారు.
    
    "భూషణ్!
    నా కంటే ప్రపంచానికి విశ్వనాద్ వల్లనే ఎక్కువ ప్రయోజనం . అతడి సాయంతో నువ్వు మెడికల్ సైన్స్ లో ప్రగతిని సాధించడమే కాక నేను తలపెట్టిన ధనుష్టంకార కార్యక్రమాన్ని కొనసాగించు....
    ఉదయను పెళ్ళి చేసుకో . ఆమెను కంటికి రెప్పలా చూసుకో.....
    నేను అగ్నికి ఆహుతి అయిపోతున్నాను. అది నిష్పయోజనం కాకూడదు. గుర్తుంచుకో.

                                                                                             నీ

                                                                                         వేదాంతం"
    "ఉదయా!
    నా ప్రాణానికి ప్రాణం విస్సీని, నా ప్రాణం కంటే ఎక్కువైన అమ్మను, నా ధనుష్టంకారం సాధనగా ఉన్న పోగొట్టుకున్నాక నేనింక జీవించి ప్రయోజనమేమిటి?
    నీ వుత్తమురాలివి పవిత్రురాలివి, నేనెప్పుడో నేను చేసిన పాపం నన్ను నీ ద్వేషానికి గురి చేసింది. తెలిసి నేనెవరికి అపకారం చేయలేదు. స్వార్ధం గురించి చెడ్డ పనులు చేయలేదు.
    నీ విస్సీ బావను నీకే విడిచి పెడుతున్నాను. విస్సీ బావ సాయంతో దేశంలో ధనుష్టంకారం కొనసాగిండు. నీ నుంచి నేనుకోరే ఉపకారం అదొక్కటే!
    అసామాన్య పరిస్థితుల్లో నిగ్రహాన్ని కోల్పోయినా భూషణ్ ఉత్తముడు. గతంలో క్షమించినట్లే అతడి ఈనాటి తప్పునీ క్షమించి నీ జీవితంలోకి అతణ్ణి ఆహ్వానించు. ఇది నీకు నేనిచ్చే చివరి సలహా .
    నేను అగ్నికి ఆహుతి అయిపోతున్నాను. ధనుష్టంకారం తదితర ప్రయోజనాలకూ విస్సీ అవసరమన్న వివేకంతో నేనిందుకు తలపడ్డాను. నా ఆత్మాహుతి నిష్ప్రయోజనం కాకూడదని గుర్తుంచుకో----

                                                                                                       నీ
                                                                                                    వేదాంతం"
    ఇదీ వేదాంతం జీవితాశయం. ఆశయం బలమైనదై,స్వార్ధానికి అతీతమై పరోపకారర్ధమై ఉంటె, అద్భుతాలైనా జరిగి ఆశయ సాధన అవుతుంది.
    ఒక బుద్దుడు, ఒక మహాత్ముడు --
    వీరు పురాణ పురుషులు కారు.  చరిత్రలోని మనుషులు.
    ఎక్కడ బలమైన ఆశయాలుంటాయో అక్కడ చరిత్ర పునర్నితమవుతుంది. అదిగో....
    దూరంగా ధనుష్టంకారం వినబడుతోంది. వేదాంతం తిరిగి వచ్చాడేమో! కానీ ఎలా తెలుస్తుంది ?
    వేదాంతం కధను విని, చదివి ప్రభావితులై ఎందరో ప్రజలు ధనుష్టంకారం చేస్తున్నారు. వారిలో వేదాంత మెక్కడున్నాడో ఎలా వెతికి పట్టుకునేది? కాని    ఎక్కడ ధనుష్టంకారం వినిపిస్తుందో అక్కడ వేదాంతం ఉన్నడనే లెక్క!
    వేదాంతం చనిపోతే విస్సీ మానుకుంటాడు. వేదాంతం మిగిలితే అప్పుడూ మనకు విస్సీ ఉంటాడు.
    కాబట్టి ఈ కధలోని వేదాంతం నిమిత్త మాత్రుడు . ధనుష్టంకారం మాత్రం శాశ్వతం.

                                                   (అయిపొయింది)
    


 Previous Page

WRITERS
PUBLICATIONS