Previous Page Next Page 
డాళింగ్ పేజి 48

 

    "ఇది వెరైటీ ప్రేమ కధా చిత్రం జయేంద్రగారూ ఇందులో ఓ క్రొత్త అమ్మాయిని హిరోయిన్ గా పరిచయం చేస్తున్నాం." చెప్పాడు ప్రొడ్యుసర్.
    జీవన్ థియేటర్ అనగానే గుర్తుకొచ్చేది జయేంద్ర, రుక్మిణీ దేవి అంటే. ఆ సంస్థ నెంబర్ వన్ సంస్థ కావడానికి కారణం ముఖ్యంగా రుక్మిణీదేవే.
    "రుక్మిణీగారూ...."ఏదో అడగబోయారు జయేంద్రదత్.
    "సారీ జయేంద్రగారూ! చూస్తూ చూస్తూ ఆవిడకి హీరోయిన్ కేరక్టర్ ఇవ్వలేం, తెలుసు కదా నలబై ఏళ్ళు దాటిన నటి, పదహారేళ్ళ హిరోయిన్ పాత్ర చేస్తే , మన ప్రేక్షకులు ఒప్పుకుంటారా? రుక్మిణీ గారికి కేరక్టర్ లేకుండా మన సినిమా ఉండదనుకొండి. అందుకే, ఆవిడకి హీరోయిన్ తల్లి కేరక్టర్ క్రియేట్ చేసాం. కధాపరంగా, తల్లి కేరక్టర్ లేదనుకోండి, రుక్మిణి గారి కోసం క్రియేట్ చేసాం. ఆవిడ్ని వదులుకోలేక గదా......" చెప్పాడు నిర్మాత.
    ఆలోచనలో పడ్డాడు జయేంద్ర.
    "హీరోకి నా వయసు సరిపోతుందా?"
    "అదేంటి అలాగంటారు, మీకు మేకప్ వేస్తె. ఇరవై ఏళ్ళ వాడిలా ఉండరూ, వయసు ఆడవాళ్ళలో కన్పిస్తారు గానీ, మగవాళ్ళలో కాదు కదా!"
    రుక్మిణీ గారూ  ఆ కేరక్టర్ వేస్తామన్నారా?" అడిగాడు జయేంద్ర.
    "డైరెక్టర్ గారూ వెళ్ళారు. ఆవిడ మన బానర్ ని వదులుకోరు" నమ్మకంగా చెప్పాడు నిర్మాత.
    అప్పుడే డైరెక్టర్ వచ్చాడు.
    "రుక్మిణి గారు వేషం వెయ్యటం, కేరక్టర్ లేకపోయినా ఫర్వాలేదు, తల్లి పాత్రలు వెయ్యనన్నారు."
    "ఆవిడ ఏదో ఒక కేరక్టర్ లో మన సినిమాలో లేకపోతే , జనాలు మన సినిమా జోలికి రారయ్యా, ఎలాగైనా ఒప్పించలేకపోయావూ." బుర్ర గోక్కుంటూ అన్నాడు నిర్మాత.
    "మీరే ఎలాగోలాగ ఒప్పించాలి జయేంద్ర గారూ! మా సంస్థ ఎదగడానికి ఆవిడ తల్లిలా దోహదం చేసారు. ఆవిడా లేకుండా , ఆవిడ నటించకుండా నేను సినిమా తియ్యలేను. హీరోయిన్ వేషమే వేస్తానని ఆవిడ మరీ పట్టుబట్టారనుకొండి, తప్పదు అవిడ్నే తీసుకుందాం. మీరే ఎలాగోలా చెప్పండి." నిర్మాత అన్నాడు.
    "చూద్దాం" అని జయేంద్ర, రుక్మిణీ దేవి బంగళాకు బయలు దేరాడు.
    విషయమంతా చెప్పాడు జయేంద్ర.
    "కొత్త నీరు రావడం , పాత నీరు పోవడం ఇది సృష్టి ధర్మం జయేంద్ర. వయసుకి తగ్గ కేరక్టర్లు వెయ్యడం నా ధర్మం. ఆ సంస్థ పురోభివ్రుద్ది కోసం , నేనెంతగా చేసానో నీకు తెలుసు. కనీసం ఆ నిర్మాత తన కొత్త ప్రొడక్షన్ గురించి నాతొ మాట మాత్రమైనా చెప్పకుండా డైరెక్టర్ చేత హీరోయిన్ తల్లి వేషం వెయ్యమని కబురంపుతాడా, మనిషికి కృతజ్ఞత లేదు, అవునంటావా?"
    రుక్మిణీ దేవి బాధ అర్ధమైంది జయేంద్రకు.
    "మీరు వెయ్యకపోతే , ఆ సినిమాని నేనూ వదులుకుంటాను." స్థిరంగా అన్నాడు జయేంద్ర. తలెత్తి కాసేపు జయేంద్ర ముఖం వేపు తేరిపార చూసి -----
    "నువ్విప్పుడు నెంబర్ వన్ హీరోవి, ప్రొఫెషన్ లో త్యాగాలు కూడదు. ఇవాల్టి అవకాశాలు రేపు రావు, గుర్తుంచుకో. నా కోసం నువ్వు సినిమా వదులుకోవడం నా కిష్టం లేదు. నీ కోసం యాక్ట్ చేస్తాలే. అదీ హీరోయిన్ తల్లిగా కాదు, హీరో తల్లిగా, నీ తల్లిగా, కధ మార్చమని చెప్పు."
    రుక్మిణి దేవి తీసుకున్న నిర్ణయానికి , తనమీద ఆమెకున్న వాత్సల్యానికి జయేంద్ర దత్ కళ్ళు చెమర్చాయి.
    "థాంక్స్ మేడమ్.....మళ్ళీ ఫోన్ చేస్తాను........" చెప్పి వచ్చేసాడు.
    రుక్మిణీ దేవి నిర్ణయం విన్న నిర్మాత, దర్శకుడు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
    "మొన్నటి వరకూ మీ హీరోయిన్ గా నటించి ఇప్పుడు మీ తల్లి కేరక్టర్ వేస్తానన్నారా, ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా?"
    తర్జన భర్జనలు పడ్డారు చాలా సేపు.
    ఆలోచనలయ్యాక ----
    "ఒకే డైరెక్టర్ కధ మార్చు ------హీరో మదర్ కారక్టర్  పెట్టు ఇంట్రవల్ ముందు, ఆ కేరక్టర్ చనిపోతుంది. అలాగ చెయ్యి......"
    జయేంద్రదత్ లేని సమయంలో డైరెక్టర్ తో చెప్పాడు ప్రొడ్యుసర్.
    సినిమా ప్రపంచం చాలా విచిత్రమైన ప్రపంచం.
    లక్ కి, గుడ్ లక్ కి, బాడ్ లక్ కి మధ్య ఒకే ఒక గీత వుంటుంది.
    "హీరో జయేంద్రదత్ , తల్లి కేరక్టర్ లో హీరోయిన్ రుక్మిణీ దేవి సినిమా షూటింగ్ అవుతున్నప్పుడే పెద్ద పబ్లిసిటీ వచ్చేసింది.
    ఆ సినిమా పేరు    
    "వందేమాతరం" రిలీజైంది.
    ఆ తల్లి పాత్రని పొడిగించటం ఇష్టం లేక, ఇంట్రవెల్ ముందు చంపేసారు.
    అదే పిక్చర్ కి ప్లస్ పాయింట్ అయింది.
    సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
    అందులో తల్లి కొడుకుల కేరక్టర్ లో జయేంద్ర, రుక్మిణి పోటాపోటీలు పడి నటించారు.
    పిక్చర్ వందరోజులు , ఆంధ్రప్రదేశ్ లో అన్ని థియేటర్లలోనూ ఆడింది.
    స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ నటి, నట అవార్డుల్ని జఎంద్రకు, రుక్మిణి కిచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS