"థాంక్స్ మేడమ్ . హీరోగా నన్ను మీరే రికమెండ్ చేసారని తెల్సింది."
నవ్వింది రుక్మిణి.
"మీకు బ్రయిట్ ఫ్యూచరుంది. అందుకే రికమెండ్ చేసాను. నటన ఒక వరం. అది కూడా అన్ని కళలాంటిదే. ఏ కళనూ తక్కువగా చూడకూడదు. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, నటననీ అంతే ప్రేమించాలి. ధ్యానించాలీ.......గుర్తుంచుకోండి."
ఆ మాటల్ని జయేంద్ర దత్ ఎప్పుడూ మననం చేసుకుంటుంటాడు. జయేంద్రదత్ హీరోగా, రుక్మిణీ దేవి హీరోయిన్ గా రిలీజైన , 'మాతృభూమి ' రిలీజైంది.
సేన్సేషనల్ హిట్- అప్పటివరకూ ఉన్న సినిమాల రికార్డుల్ని బద్దలుకొట్టి , రెండు సంవత్సరాలు ఆడించి "మాతృభూమి".
ఆ తర్వాత వాళ్ళిద్దరూ నటించిన పది సినిమాలు వరసగా హిట్టయ్యాయి.
----ఒకరోజు ఇద్దరూ షూటింగు నుంచి కారులో తిరిగొస్తున్నారు.
"మీకు బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ వచ్చిందట......చెప్పలేదేం."
సడన్ గా అడిగింది రుక్మిణీదేవి.
"ముందు, మీ వాళ్ళతో చెప్పి, ఆ తర్వాత అందరికీ చెప్దామనా.." నవ్వుతూ అంది మళ్ళీ.
"ఇదేం రహస్యమా. ...రేపుదయం అన్ని పేపర్లలో వస్తుంది కదా - నాకు, ఏ విషయం చెప్పుకోడానిగానీ ఎవరూ లేరు."
"ఏం......" నోటివరకూ వచ్చిన ఆ ప్రశ్న, గొంతులోనే ఆగిపోయింది రుక్మిణీదేవికి.
"ఈ అవార్డు రావడానికి కారణం మీరే.....మీతోనే మొదట చెప్పాలనుకున్నాను కానీ.......మీలాంటి మహానటితో ఈ అవార్డు గురించి చెప్తే......" ఆగిపోయాడు జయేంద్ర దత్.
"అమ్మా .....నాన్న ...ఎవరూ లేరా?" నెమ్మదిగా అడిగిందావిడ.
"లేరు.....చిన్నపుడే."
"బ్రదర్స్....సిస్టర్స్......"
"ఎవరూ లేరు.....నేనొక్కడ్నే....."
కొడంబాకం వంతెన మీద నుంచి కారు వెళ్తున్నప్పుడు.
"అన్నీ ఉన్నా........అందరూ ఉన్నా......నాకూ ఎవరూ లేనట్టే."
ఆ మాట అంటున్నప్పుడు ఆమె ముఖం వేపు చూసాడు. జయేంద్ర .
మరి కాసేపయ్యాక అంది రుక్మిణి.
"మీరు ఆ హోటళ్ళలో ఎన్ని రోజులని ఆంటారు... మీరేం అభ్యంతరం లేకపోతే మా బంగళా కొచ్చేయండి......నాక్కూడా కొంచెం తోడుగా ఉండినట్టుంట్టుంది."
అదృష్టం అన్నిసార్లు తలుపు తడుతుందని తెలీని జయేంద్రదత్ ఉక్కిరిబిక్కిరయిపోయాడు.
* * * *
ఒకరోజు బంగళా నుంచి కారు షూటింగ్ స్పాట్ కి బయటుదేరింది.
"నా సూట్ కేస్ తెచ్చ్జి, కార్లో పెట్టింది మీరేనా?' కార్లో కూర్చుంటూ అడిగింది రుక్మిణి.
"అవునండీ......"
"ఇక నుంచి అలా చెయ్యకండి.........ఇంటి నిండా ఫ్యున్స్ ఉండగా మీకెందుకు శ్రమ."
"ఇందులో శ్రమేం ఉండండి?" మెల్లగా అన్నాడు జయేంద్ర.
"మీరేం ఆర్డినరీ మాన్ కాదు. ముందు ఆ విషయం మీరు తెలుసుకోండి. పాతిక సినిమాల్లో నటించిన హీరో. అదీ రెండేళ్ళ కాలంలో -- అలాంటి వ్యక్తీ, నా సూట్ కేస్ పట్టుకుని, కార్లో పెట్టారంటే , గాసిప్ న్యూస్ కింద సినిమా ప్రతికల వాళ్ళు వేసేస్తారు." నవ్వుతూ అంది.
"కనీసం ఆ రకంగానైనా కృతజ్ఞత తీర్చుకుందామని."
చటుక్కున తల తిప్పి చూసింది రుక్మిణి.
"ఒక సినిమాలో కంటస్థం పెట్టిన డైలాగులు, ఆ సినిమాతోనే మర్చిపోవాలి, మరెక్కడా వాడకూడదు."
"ఇది సినిమా డైలాగు కాదు మేడమ్."
"మేడమ్ ఏంటి మధ్యన ......అలాంటి పదాలు .....నాకు నచ్చవు. చాలాసార్లు చెప్దామనుకున్నాను.....ఆ పదంతో పిలవడం మానేయండి." కోపాన్ని నటిస్తూ అందావిడ.
"నేను మీకంటే చిన్నవాణ్ణి , అవునా, నన్ను మీరు అని మీరు గౌరవిస్తున్నప్పుడు, నేను మేడమ్ అని పిలవడంలో తప్పులేదు కదా."
"చిన్నయినా, పెద్దయినా, యూ ఆర్ ఏ మాన్.....అర్ధమైందా?"
యూ ఆర్ ఏ మాన్.......
యూ ఆర్ ఏ మాన్.....
రుక్మిణి దేవి నోటివెంట వచ్చిన మాటలే, అతని చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి.
"నాకంటే మీరు అయిదేళ్ళు చిన్న."
అవునన్నట్టుగా తలూపాడు జయేంద్రదత్.
"పదేళ్ళు కాదుగా......." నవ్వింది రుక్మిణీ మళ్ళీ నవ్వింది-
పడీ, పడీ, పదే పదే నవ్వింది.
ఆమె ఎందుకలా నవ్వుతుందో, అర్ధంకాక, తెల్లబోయి చూస్తూన్నాడు జయేంద్రదత్.
అప్పటికి జయేంద్ర వయసు , ముప్పై రెండేళ్ళు.
* * * *
అయిదేళ్ళు కాలక్రమంలో అయిదు క్షణాల్లా గడిచిపోయాయి. సినీ సీమలోకి కొత్తతరం నటీమణులు తామర తంపరలా వచ్చేస్తున్నారు.
జయేంద్రదత్ ప్రస్తుతం నెంబర్ వన్ హీరో, రొమాంటిక్ హిరో. ఆడపడుచుల అభిమాన హీరో.
ప్రస్తుతం తనకో అందమైన బంగళా, కారులు, హొదా అన్నీ ఉన్నాయి. రుక్మిణీ దేవికి హీరియిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. జీవన్ థియేటర్స్ వారు తమ పదిహేనవ చిత్రాన్ని ఎనౌన్స్ చేసారు. వాళ్ళు నిర్మించిన పది సినిమాల్లో హీరో , హీరోయిన్లు జయేంద్ర , రుక్మిణీలే. మిగతా అయిదూ ఇతర భాషా సినిమాలు.
