"వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు!" అనుకున్నాడు సత్యం. తనవంటి సామాన్యమైన దొంగలకు వీళ్ళను నిలువునా దోచడం వీలుపడదు.
ఇల్లంతా కలయదిరిగి తన దగ్గరున్న తాళాలతో ఎక్కడ పని జరక్క వాటిని తిరిగి వాసుదేవరావు తలగడ కిందే వుంచి యింట్లోంచి బయటపడ్డాడు సత్యం.
3
అర్ధరాత్రి పూట ఆ యింట్లోంచి బయటపడ్డాక సత్యం తిన్నగా ఓ యింటికి వెళ్ళాడు.
అదొక బంగళా! దానిముందో పెద్దగేటు. గేటుపక్కగా గోడకు నేమ్ ప్లేటు.
ఎన్.చంచల్రావు!
చంచల్రావు పేరా ఊళ్ళో చాలా మందికి తెలుసు. ఆయన ప్రముఖ వ్యాపారస్థుడు. కానీ ఆయన పేరు తెలియడాని కదొక్కటే కారణం కాదు.
ఎక్కడ యెవరికెలాంటి కష్టం వచ్చినా చంచల్రావు దగ్గరకేడితే తీరిపోతాయని అంతా చెప్పుకుంటారు. ఆయన యెందరో పేద విద్యార్ధులకు ఫీజులు కట్టాడు. పుస్తకాలు కొనిపెట్టాడు. కూటికి లేనివాళ్ళకు దానాలు యిస్తాడు. అప్పులూ ఇస్తాడు.
ఆ కారణంగా ఆయన చేతిలో పదివేలకు తక్కువ కాకుండా ఓట్లున్నాయి. ఆ వూళ్ళో చంచల్రావు ఎన్నికల్లో నిలబడితే తిరుగుండదు. కానీ ఆయన ఎన్నికల్లో నిలబడడు. ఆయనకు పదవీ వ్యామోహంలేదు. అందుకని పదవీ వ్యామోహం వున్న వాళ్ళాయిన చుట్టూ తిరుగుతారు. దేశంలో ఇందిరా వేవ్, రామారావు వేవ్, రాజీవ్ వేవ్ - ఏ వేవ్స్ వచ్చినా ఆ ఊళ్ళో మాత్రం ఎన్నికల ఫలితాలు చంచల్రావు వేవ్ ని బట్టే వుంటాయి.
ఆ కారణంగా చంచల్రావుకు పై వర్గాల్లో చాలా పలుకుబడి వుంది. తన పలుకుబడిని కూడా మంచి పనులకే వినియో'గిస్తాడాయన. మధ్య తరగతి వాళ్ళ కుద్యోగాలిప్పించడం. చిన్న చిన్న ఊళ్ళలో చెరువులు తవ్వించడం రోడ్లు వేయించడం, బడుగువర్గాల వాళ్ళ కిళ్ళస్థలాలు కేటాయించడం .....ఇలాంటి వెన్నో ఆయన కారణంగా జరిగాయి.
ఇప్పుడు సత్యం చంచల్రావు యింట్లో అడుగుపెట్టాడు. పేరు చెప్పగానే వాచ్ మాన్ అతణ్ణి లోపలకు పోనిచ్చాడు.
లోపల.....
అప్పటికే అక్కడ చంచల్రావు-నలుగురు మనుషులతో మాట్లాడుతున్నాడు. సత్యం కాస్త ఆలస్యం చేశాడు. సత్యం లోనికి రాగానే ఆయన నవ్వుతూ-"వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను...." అన్నాడు.
ఆయన ఎత్తైన కుర్చీలో కూర్చున్నాడు. నలుగురూ కింద కూర్చున్నారు. సత్యం తనూ వాళ్ళతో పాటు కూర్చున్నాడు. జైల్నించి పారిపోయి వచ్చేక అతడు చంచల్రావునీ, ఆ నలుగుర్నీ కలుసుకోవడం యిది రెండవసారి!
"నేనిచ్చిన మత్తుమందు బాగా పనిచేసిందా-నీ పగ తీరిందా?" అన్నాడు చంచల్రావు నవ్వుతూ.
సత్యం తలాడించాడు.
"రేపట్నించి మీ అయిదుగురికీ కలిపి బ్యాంకు దోపిడీ యెలా చేయాలో శిక్షణ ప్రారంభమవుతుంది. మిమ్మల్నో గ్రామం తీసుకువెడతాను. అక్కడ ఓ డమ్మీ బ్యాంకుపై రిహార్సల్సు జరుగుతాయి. రోజుకో రిహార్సల్ వేయొచ్చు కానీ మీరు రెండో రిహార్సల్ కల్లా పెర్ ఫెక్టు అయిపోవాలి" అన్నాడు చంచల్రావు.
సత్యం మిగతా నలుగురితోపాటు తలాడించాడు.
"ఈ బ్యాంకు దోపిడీ ఎందుకూ అని మీలో ఒక్కరు కూడా అడగలేదు" అన్నాడు చంచల్రావు.
ఎవ్వరూ మాట్లాడలేదు.
"దోపిడీలు, దుర్మార్గాలు నా తత్వానికి సరిపడినవి కాదు. అయితే మన సమాజంలో అంతులేని దోపిడీ జరిగిపోతోంది, ఆ దోపిడీని అరికట్టడం కోసమే ఈ దోపిడీ!" అన్నాడు చంచల్రావు.
ఆయన ఆవేశంగా వాళ్ళకింకా చాలా చెప్పాడు.
ఏ దేశమైనా ఆ దేశంలోని ప్రజలందరికీ చెందుతుంది. అయినప్పటికీ కొందరి వద్ద ఎక్కువగానూ, కొందరి వద్ద తక్కువగానూ డబ్బుండవచ్చు. అందరికీ తిండి, గుడ్డ, నీడ మాత్రం వుండాలి. మన దేశంలో అది జరగడం లేదు.
దేశం నిండా బ్యాంకులున్నాయి. అందులోని డబ్బు మొత్తం ప్రజలందరిదీ! కానీ ఆ డబ్బు కొందరి చేతుల్లోనే వుండిపోతోంది. అన్నార్తులకు, అనాథలకు, అసహాయులకు బ్యాంకులు సాయపడ్డంలేదు, పోనీ వారికి సాయపడాలనుకున్న వారికీ సాయపడ్డంలేదు.
"నేను వ్యాపారాలపై యెంతో సంపాదిస్తున్నాను. నా కుటుంబానికి సుఖజీవనం ప్రసాదించడానికి ఆ సంపాదనంతా అవసరంలేదు, నాకున్నదాంట్లో పదిమందికీ సాయపడాలన్నది నా కోరిక. కానీ పదిమందికి సాయంచేస్తే వందమంది నా చుట్టూ మూగుతారు. ఎవర్నీకాదనలేను. కానీ యింతమంది కోసం ఎక్కణ్ణించి డబ్బు తేగలను?" అన్నాడు చంచల్రావు.
ఆయన చెబుతున్నాడు వాళ్ళు వింటున్నారు.
న్యాయప్రకారం డబ్బు సంపాదించడానికి కింకా చాలా మార్గాలున్నాయి. అవన్నీ చంచల్రావుకి తెలుసు. అలాగే డబ్బు సంపాదించి వేలాది మందికి సాయపడాలని చంచల్రావు భావిస్తున్నాడు. అయితే....
సాయం ఆయన ఒక్కడి చేతిలోలేదు. ఆయన సంపాదనలో నాలుగింట మూడువంతులు ఆదాయపు పన్నుకే పోతోంది. అటుపైన రాజకీయపక్షాలకు విరాళాలివ్వాలి. అధికారులకు లంచాలివ్వాలి. ఈ ఖర్చులు న్యాయంగా చూపడానికి లేదు. ఎందుకే ఆయన దృష్టి నేరాలమీదకు మళ్ళింది.
"గొప్పవాళ్ళను కొల్లగొడితే-వాళ్ళంతా ఒక్కటై నా సంస్థనే అణిచివేస్తారు. ఇందుకు బ్యాంకులొక్కటే అనువైనవిగా నాకు తోచాయి. వీటిని దోచడంవల్ల ఎవరికీ నష్టంలేదు. నా సమాజ సంక్షేమ కార్యక్రమాలూ, ఇతర ఖర్చులూ వీటివల్ల తీరిపోతాయి. బ్యాంకులు సంపాదించే లాభాల్లో ఈ దోపిడీల నష్టం ఓ లెక్కలోదికాదు...."
చంచల్రావు ఆ అయిదుగురి బ్యాంకుదోపిడీల కారణంగా తను దేశాన్నెంతలా సేవించగలుగుతున్నాడో వివరించి చెప్పాడు. బ్యాంకు దోపిడీ చేసి తనకు సహకరించడం ద్వారా వాళ్ళూ దేశ సేవకులెలా కాగలుగుతున్నారో చెప్పాడు.
"శత్రుసైన్యాలు మనను ఢీకొంటాయి. అప్పుడు సిపాయిలేంచేస్తారు? తుపాకితో ఎదురొచ్చిన ప్రతి సైనికున్నీ కాల్చి చంపేస్తారు. వారు చేసేది నేరంకాదు. హత్యకాదు. దేశం వారికి నివాళులర్పిస్తుంది. బిరుదులిస్తుంది. దేశభక్తులని వారిని కొనియాడుతుంది. మనదేశంలో పేదరికం మన శత్రువు. దానిపై యుద్ధం ప్రకటించాను నేను. ఆ యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు మీరు. మీరేం చేసినా అది నేరంకాదు. మీరు దేశభక్తులు. బ్రతికుండగా పుణ్యం చనిపోతే స్వర్గం. ఈ రెండూ మీకు తప్పవు..."
"నాకిప్పుడెంతో సంతోషంగా వుంది." అన్నాడు సత్యం చటుక్కున.
అంతసేపూ తనేదైనా తప్పు చేస్తున్నానన్న భావన వుంటే సత్యంలో అదిప్పుడు తొలగిపోయింది. అతడిప్పుడు చంచల్రావేది చెబితే అది చేసే స్థితికి వచ్చాడు అతడితో పాటు మిగతా నలుగురూ కూడా అదేమాట అన్నారు.
చంచల్రావు వాళ్ళను మెచ్చుకుని-"చాలా త్వరగానా ఆశయాల నర్దం చేసుకున్నారు. మీరు తెలివై నవాళ్ళు. వృద్దిలోకి వస్తారు. ఇదేవిధంగా నాకు కొంతకాలం సహకరిస్తే మీకు సమాజంలో గౌరవమైన హోదా కల్పిస్తాను." అన్నాడు.
ఒకరి తర్వాత ఒకరు కొద్ది వ్యవధిలో ఆ యింట్లోంచి బయటపడ్డారు.
4
సత్యం కనకదుర్గా లాడ్జికి వెళ్ళాడు. అందులో ఏడో నంబరు గదిలో అతడుంటున్నాడు.
కనకదుర్గాలాడ్జి పెద్ద విశేషమైనదికాదు. అక్కడశుభ్రత కూడా తక్కువే. జైల్నించి పారిపోయొచ్చిన సత్యానికి మాత్రం అక్కడి గది స్వర్గంలాగే అనిపించింది. అతడు గది తలుపులు వేసుకుని మంచంమీద పడుకున్నాడు. పరుపు కాస్త గట్టిగావుంది. అయినా అతడికి ఫోంబెడ్ మీద పడుకున్నట్లేవుంది. ఫాన్ గాలి అతడికాగది ఎయిర్ కండిషన్డా అనిపింపజేస్తోంది.
