"నాకోసారి నీ చాకు కావాలి...."
"ఏ చాకు?"
"నీ దగ్గరెన్ని చాకులున్నాయి?"
సతీష్ పక్క చూపులు చూశాడు. పక్కనే నారాయణరావు పూజామందిర ముంది. మందిరానికి పైన ఆంజనేయుడి పటం గోడకు వ్రేలాడుతోంది.
ఆంజనేయుడు తన్నురిమి చూసినట్లనిపించింది సతీష్ కి.
"ఒకసారి నాకు చాకు కావాలి...."
"ఎందుకు?"
"చాకుతో యేంచేస్తారు?"
సతీష్ మళ్ళీ పక్క చూపులు చూశాడు. ఆంజనేయుడు పటంలోంచీ మళ్ళీ అతడి వంక వురిమి చూశాడు.
"పెన్సిలు చెక్కుకుంటారు-" అన్నాడు సతీష్.
"నేను పెన్సిలు చెక్కుకోవాలి...." అన్నాడు నారాయణరావు.
"పెన్సిలు నా కియ్యి చెక్కి యిస్తాను...."
"నా ఆరోగ్యం బాగున్నంత కాలం నా పను లింకొకళ్ళకి చెప్పను.....చాకు నాకు తెచ్చియ్యి...." అన్నాడు నారాయణరావు.
"నా ఆరోగ్యం బాగున్నంత కాలం నీ పనులు నిన్ను చేసుకోనివ్వను. నేనే చేసిపెడతాను-...." అన్నాడు సతీష్.
"సరేలే - ఒక్కసారి నా కా చాకు తెచ్చిచూపించు...."
"ఎందుకు?"
నారాయణరావు తన బట్టతలమీద కుడిచేయి ఆన్చి ఓసారి పాముకున్నాడు. తర్వాత నెమ్మదిగా-"నేను నీకు అభిమానంతో కొనిచ్చిన వస్తువధి. దాన్నెంత భద్రంగా దాచుకుంటున్నావో చూద్దామని..." అన్నాడు.
మళ్ళీ సతీష్ పక్క చూపులు చూశాడు.
ఆంజనేయుడి బొమ్మ అతడి వంక గేలి చేస్తూ చూస్తోంది.
సతీష్ పూర్తిగా ఆ బొమ్మవైపు తిరిగాడు.
అతడి కయిదేళ్ళ వయసప్పుడు నారాయణరావా బొమ్మను చూపించి - "స్వామిభక్తికి ఆంజనేయున్ని మించినవాడు లేడు. అందుకే ఆయన ఆరాధ్య దైవమయ్యాడు. భక్తితో ఆయన తాను నమ్మిన దేవుణ్ణి మించిన బలవంతుడయ్యాడు. సముద్రాలను దూకి, రాక్షసులను చంపి మహారాక్షసులను చంపిన శ్రీరామచంద్రుణ్ణి కూడా యుద్ధంలో ఓడించిన ఆంజనేయుడి విజయరహస్యం స్వామిభక్తి నీవుకూడా నీ యింట్లోవాళ్ళను ఆంజనేయుడంత భక్తితో ఆరాధించు నువ్వూ ఆంజనేయుడంతవాడి వౌతావు-" అని చెప్పాడు.
ఆంజనేయుడి శక్తి గురించీ, బలపరాక్రమాల గురించీ నారాయణరావు చెప్పగా యెన్నో కథలు విన్నాడు సతీష్. ఆ దేవుడి వ్యక్తిత్వం అతడి మనసుపై చెరగని ముద్ర వేసుకుంది. తనూ అంతటివాడు కావాలన్న కోరిక గుండెల్లో చేరుకుంది. నారాయణరావును సతీష్ ఆరాధించేవాడు. తాతయ్యకు సేవలు చేసినపుడల్లా అతడాపటంవైపు చూసేవాడు. ఆంజనేయుడు తన నాశీర్వదిస్తూన్నట్లూ, సెభాషని మెచ్చుకుంటున్నట్లూ అతడికి తోచేది. ఈ రోజలాగనిపించడం లేదు.
"మళ్ళీ యెప్పుడూ తప్పు చేయను స్వామీ!" అనుకున్నాడు సతీష్.
"ఏరా చాకు తెచ్చిపెట్టవా?"
సతీష్ మాట్లాడలేదు.
"ఎలా తెస్తావులే-.....పారేసుకున్న వస్తువు మళ్ళీ దొరుకుతుందా?"
"నేను చాకు పారేసుకున్నానని నీ కెవరు చెప్పారు....?"
"ఒకరు చెప్పాలా? నాకు దొరికింది కాబట్టి చెప్పగలిగాను...."
"నీకు దొరికిందా-ఎక్కడ?" ఆత్రుతగా అడిగాడు సతీష్.
"మన దొడ్లో-...."
"అబద్దం!" అన్నాడు సతీష్.
"ఇలా రా!" అన్నాడు నారాయణరావు.
సతీష్ నమ్మలేని చూపులతో అయన వంక చూస్తూ ఆయన్ను సమీపించాడు.
"ఈ తలగడ ఎత్తి చూడు!"
నారాయణరావు పట్టెడ మంచంమీద కూర్చుని వున్నాడు. మంచంమీద పువ్వుల దుప్పటి తలాగ్ర దిక్కున ఓ ఫోమ్ తలగడ.....దానికి దుప్పటిలో మ్యాచయ్యే గలీబు....
సతీష్ తలగడ ఎత్తి చూసి ఒక్కడుగు వెనక్కు వేశాడు.
అక్కడ నిజంగానే చాకుంది.
"ఏమిట్రా - అంతలా ఆశ్చర్యపడ్డావు....? అది నీ దవునో కాదో చూసుకో-...." అన్నాడు నారాయణరావు.
సతీష్ చాకును చేతిలోకి తీసుకున్నాడు.
స్టెయిన్ లెస్ స్టీలు చాకు. గులాబీరంగు బొమ్మ ఎస్ అన్న పొడి అక్షరం.....
"ఇది నాదే......కానీ నీ దగ్గర కెలా వచ్చింది?"
"నువ్వు పారేసుకుంటే...."
"నీ కెక్కడ దొరికిందన్నావూ?"
"మన దొడ్లో...."
సతీష్ ఉత్సాహంగా-"అంటే సుధాకర్ బామ్మను నేను చంపలేదు...." అన్నాడు.
"ఏమన్నావూ?" అన్నాడు నారాయణరావు.
సతీష్ తడబడ్డాడు.
"సుధాకర్ బామ్మెవరురా?"
సతీష్ మాట్లాడలేదు.
"చంపడ మేమిటిరా?"
సతీష్ మౌనం కొససాగించాడు.
"నువ్వెవరినైనా చంపిందీ లేనిదీ నీకు తెలియదా? నా దగ్గర చాకు చూసి గానీ ఆ విషయం తెలుసుకో లేవా?"
సతీష్ నాలుకతో పెదాలు తడుముకున్నాడు- "అసలేం జరిగిందీ చెబుతాను తాతయ్యా!"
"చెప్పు!"
అతడు క్లుప్తంగా సుధాకర్ బామ్మ చావు గురించి చెప్పి-"అక్కడ యిలాంటి చాకే వుంది. సుధాకర్ నన్ననుమానిస్తున్నాడు. నేనేమో ఆ చాకు నాది కాదనీ నా చాకు మనింట్లోనే వుందనీ దబాయించాను...." అన్నాడు.
"హత్య గురించి నిన్ననుమానించడ మేమిటీ? నువ్వేమి కిరాయి గూందావు కాదు గదా...." అన్నాడు నారాయణరావు.
సతీష్ మళ్ళీ తడబడ్డాడు.
"సుధాకర్ బామ్మను నువ్వెందుకు చంపుతావు?"
"ఏమో-సుధాకర్ కి వాళ్ళ బామ్మంటే చాలా యిష్టం. చాకు చూడగానే నన్ననుమానించాడు...."
"అలాంటి వాళ్ళతో స్నేహం చేయకు...."
"అబ్బే-అదంతా తాత్కాలికావేశం తాతయ్యా! నా స్నేహితుడు విశ్వం అంటాడూ-సుధాకర్ కి ఎలాగైనా ఆ హంతకుణ్ణి పట్టుకోవాలనుందిట. నామీద అభియోగం చేస్తే నేనేమో పౌరుషం తెచ్చుకుని అసలు హంతకుణ్ణి పట్టుకుంటానని అలాగంటున్నాట్ట...."
"నువ్వు నిజం చెప్పడంలేదు. నా దగ్గరేదో దాస్తున్నావు...."
"లేదు తాతయ్యా!"
"అయితే ఆంజనేయుడి ముందుకువెళ్ళి కళ్ళు మూసుకుని చేతులు జోడించి-నిజమేమిటో చెప్పేసెయ్.....నేను నమ్ముతాను...." అన్నాడు నారాయణరావు.
"లేకపోతే నమ్మవా?"
"నమ్మను...."
"అసలు నీకు నామీద అనుమాన మెందుకొచ్చింది?"
"ఎందుకంటే.....నీ చాకు శవం దగ్గరుంది. అది నీది కాదనీ ఇంట్లో నీ చాకుందనీ చెబితే నీ స్నేహితుడు నమ్మి ఊరుకున్నాడా?"
"లేదు.....కాసేపట్లో వాళ్ళు మనింటికొస్తారు. నేను చాకు చూపించకపోతే సుధాకర్ నామీద పోలీసు రిపోర్టిస్తానన్నాడు......"
