Previous Page Next Page 
డాళింగ్ పేజి 46

 

    కృష్ణ నందనని అర్ధచేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు విమల్.
    "ప్రేమలో నిజమైన ప్రేమ, దొంగ ప్రేమ అని రెండు ప్రేమలుంటాయా?"
    "ఎందుకుండవు......నిజమైన ప్రేమను కోరేవాళ్ళు, పెళ్ళి చేసుకోకపోయినా, కలకాలం ప్రేమించుకుంటూ వుంటారు. అలాంటి ప్రేమ నాకిష్టం......దూరంగా వుంటూనే, ఒకర్నొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ప్రేమించుకుంటారు. అలాంటి ప్రేమలోనే అద్భుతమైన మాధుర్యం వుంటుంది...."
    అది పిరికివాళ్ళ ప్రేమ........చేతకాని వాళ్ళ ప్రేమ......ప్రేమంటే ప్రపంచాన్ని ఎదిరించి, వాళ్ళిద్దరూ ఒక్కలా ఉండడం.....ఉదాహరణ కు మనమిద్దరం ........నీకోసం అందర్నీ కాదనుకోగలను.....నేను ......" ఆవేశంగా అన్నాడు విమల్.
    ఆ మాటకు జవాబు చెప్పలేదు కృష్ణ నందన.
    "ఇంత అర్ధరాత్రి , ఈ అడవిలో ఓ ఇద్దరు ప్రేమ గురించి డిస్ కస్ చేసుకుంటుంటారని ఎవరూ అనుకోరూ కదూ....." నవ్వుతూ అంది కృష్ణ నందన.
    కాసేపాగి మళ్ళీ అంది కృష్ణనందన.
    "ఐ లవ్ యూ విమల్........"
    నందనని, రెండు చేతుల్లో పెనవేసి, దగ్గరగా తీసుకున్నాడు.
    గువ్వలా , అతని ఒడిలో ఒదిగిపోయింది నందన.
    ముద్దుగా, ముద్దుల వెన్నెల్లో వాళ్ళిద్దరూ.
    -------జ్ఞాపకం చెరిగిపోయింది, వాల్ పోస్టరు వేపు చూస్తూ అలా ఎంతసేపు నిల్చుండిపోయాడో తెలీదు.
    పక్కన పోలీస్ పెట్రోల్ వ్యాన్ ఆగడంతో తలతిప్పి చూసాడు.
    "అర్ధరాత్రి వాల్ పోస్టరు చూస్తున్నావెంటయ్యా......వెళ్ళిపో.....వెళ్ళిపో......." వెనక సీట్లోంచి పోలీసు అరుస్తున్నట్టుగా చెప్పాడు.
    విమల్ మాట్లాడలేదు. ముందుకి కదిలాడు. ముందు సీట్లో కూర్చున్న ఇన్ స్పెక్టర్ , విమల్ ముఖం చూసి, జీపుని వెనక్కి తీసికెళ్ళమన్నాడు.
    జీపు విమల్ పక్కన ఆగింది.
    "గుడ్ నైట్ సార్.......హీరో విమల్ గారూ కదూ......ఏంటి సార్ , ఇక్కడున్నారు....నేను మీ ఫాన్ ని సార్.......ఇక్కడేదైనా షూటింగుందా సార్......ఓ.కే. సార్.....కెరీ అన్ సార్....మళ్ళీ రిటర్న్ లో వస్తాం సార్..." జీపు ముందుకెళ్ళి పోయింది.
    అలా ఎంత దూరం నడిచాడో తెలీదు.
    అలుపెరుగని దీర్ఘ రాత్రిలో అలసట ఎరుగని బాటసారిలా విమల్.......మెరీనా బీచ్ దగ్గర కొచ్చాడు.
    నల్లటి చీకట్లో సముద్రం ఆకారం లేకుండా అరుస్తున్న వింత జంతువులా ఉంది.
    ఇసుకలో కూలబడ్డాడు. ఆకాశంలో చంద్రుడు మసగ్గా ఉన్నాడు .
    చల్లటిగాలి .....
    దూరంగా ఏదో స్టీమర్ .....దీపాల వెలుగులో ద్వీపంలా కన్పిస్తోంది.
    చటుక్కున ఎందుకో తండ్రి జయేంద్రదత్ , తల్లి రుక్మిణీ దేవి గుర్తుకొచ్చారు.
    అమ్మ.....
    అమ్మ....
    ఒక్కసారి తల్లి రూపం కనుల ముందు కదలాడింది - ఆరోజు ఇంకా స్పష్టంగా జ్ఞాపకం ఉంది.


                                                    *    *    *    *

    విమల్ తండ్రి జయేంద్ర దత్ - అప్పటికి సినిమాల్లో నంబర్ వన్ హీరో------ తల్లి రుక్మిణీ దేవి ఒకప్పుడు, చలనచిత్ర సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి.
    రుక్మిణీదేవి కంటే జయేంద్రదత్  అయిదేళ్ళు చిన్నవాడు.
    ప్రేమకు వయసేప్పుడూ అడ్డురాదు.
    యంగ్ హీరోగా అడుగుపెట్టిన జయేంద్రదత్ ని , సెట్లో మొట్టమొదటిసారి చూసినప్పుడే , రుక్మిణి దేవి ఇష్టపడింది. ఎప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడని రుక్మిణి దేవి -
    తన పక్కన భర్త వేషంలో ఉన్న కుర్రవాడు, జయేంద్రదత్ ని చూసి,
    "ఇదే మీకు ఫస్ట్ పిక్చారా?" అని అడిగింది.
    "కాదన్నాడు " జయేంద్ర దత్.
    "రెండో పిక్చర్."
    "మొదటి పిక్చర్"
    "చెప్పాడు జయేంద్ర ---ఆ సినిమాలో కూడా ఇలాంటి కేరక్టరే రెండే సీన్లు- ఒక సీన్లో కారు చెట్టుకి గుద్దుకుంటే , హీరోయిన్ బతుకుతుంది. హీరోయిన్ భర్త చచ్చిపోతాడు. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్.....కానీ ......ఇక్కడ చావు హార్ట్ ఎటాక్ రూపంలో వస్తుంది. అమాయకంగా చెప్తున్న జయేంద్ర వేపు చూసి నవ్వింది రుక్మిణి.
    ---ఆరోజు పేకప్ అయిపోయాక, తన కార్లోనే జయేంద్ర దత్ ఉండే హోటల్ ముందు డ్రాప్ చేసింది.
    మర్నాడు ఉదయం మళ్ళీ షూటింగ్ ప్రారంభం.
    సెట్లో కొచ్చిన జయేంద్రదత్ , డైరెక్టర్ తన దగ్గరికి రావడంతో కంగారుపడ్డాడు.
    "చూడండి జయేంద్ర మీ కారెక్టర్ మారింది , ప్రొడ్యుసర్ గారు, హీరో కారక్టర్ లో మిమ్మల్ని పెట్టమన్నారు. ప్రొడ్యుసర్ని భలే మానేజ్ చేసారే.......లక్కంటే మీదే లక్......" హీరో కేరక్టర్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు.
    అవ్వేవీ విన్పించుకోవడం లేదు జయేంద్ర.
    ఎవరో దేవత ప్రత్యక్షమై , వరం ఇచ్చినట్టుగా ఉంది అతనికి. ఆ దేవత రుక్మిణి దేవి అని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు.
    అదే రోజు ---
    సెట్లో కలిసినప్పుడు -----


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS