Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 46

 

                               ఉపాయాశాలి

                                                                వసుంధర
    "బాస్ ! నేనిక మామూలు జీవితం గడపాలను కుంటున్నాను. మీరు నాకు సెలవిప్పించాలి" అన్నాడు నారాయణ.
    బాస్ అతడి వంక అదోలా చూసి "నేను నిన్ను వదులుకోలేను. ఆ విషయం నీకు తెలుసు" అన్నాడు.
    "మనది అయిదేళ్ళ కాంట్రాక్టు. ఆ విషయం మీకూ తెలుసు."
    బాస్ తల పంకించాడు.
    బాస్ పేరు స్వరూప్. ఆయన వద్ద చాలా డబ్బుంది. ఆ డబ్బుతో అయన వ్యాపార రాజకీయ సాంఘిక రంగాల్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. ఆ పలుకుబడితో అయన తను చేసే అవినీతి బయటపడకుండా కాపాడుకుంటున్నాడు.
    స్వరూప్ కార్యకలాపాలు రకరకాలు. వాటిలో అవినీతికి సంబంధించిన వాటిలో. ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు నారాయణ.
    నారాయణ బియ్యే ప్యాసయ్యాడు. అతడి మెదడు ఉపాయాల పుట్ట. కానీ అవేమీ అతడు మాములుగా జీవించడాని కుపయోగ]పడలేదు. చిన్న ఉద్యోగం కూడా అతడికి దొరకలేదు. ఏం కావాలన్నా ముందు డబ్బుండాలని నారాయణ గ్రహించాడు. అలాంటి పరిష్టితుల్లోనే అతడికి స్వరూప్ పరిచయం లభించింది.
    నారాయణ స్వరూప్ నుద్యోగం అడిగాడు.
    "ఏమైనా చేస్తావా ?" అన్నాడు స్వరూప్.
    "ఊ" అన్నాడు నారాయణ.
    "ఏమైనా చేయగలవా ?" అన్నాడు స్వరూప మళ్ళీ.
    "ఊ" అన్నాడు నారాయణ.
    "చూడు ఓ ఏడాది పాటు ట్రయినింగుంటుంది. ట్రాయినింగు లో నెలకు అయిదు వందలే యిస్తాను సంతృప్తి కరంగా ట్రయినింగు పూర్తీ చేస్తే నీకుద్యోగం యిస్తాను. ఆరంభంలో నెలకు వెయ్యి జీతం. నీ సామర్ధ్యాన్ని బట్టి అది అయిదు వేల వరకూ పెరగవచ్చు. ట్రయినింగ్ పూర్తయ్యాక అయిదేళ్ళు సర్వీసులో వుంటావని కాంట్రాక్టు రాసివ్వాలి. అంగీకారమేనా ?" అన్నాడు స్వరూప.
    నారాయణ స్వరూప్ గురించి విని వున్నాడు. అందుకని వెంటనే "అంగీకారమే?" అన్నాడు.
    అతడు ట్రయినింగ్ పూర్తీ చేశాడు. ఉద్యోగంలో చేరాడు. ఆర్నెల్లలో రెండు వేల జీతం ..... రెండేళ్ళు తిరక్కుండానే అయిదు వేల జీతం.
    మూడేళ్ళు గడిచేక అతడు బాస్ తో "మన కాంట్రాక్టు అయిదేళ్ళు. అయిదేళ్ళు కాగానే మీ దగ్గర సెలవు తీసుకుని మామూలు జీవితం గడుపుతాను" అన్నాడు.
    "ఎందుకని ?"
    "మీ వద్ద పని చేయడానికి అవసరమైన శక్తి సామార్ధ్యాలూ, తెలివి తేటలూ నా వద్ద వున్నమాట నిజం. అయితే నా మనస్తత్వాని కిది సరిపడదు. నాకు సామాన్యుడిలా నీతి నాశ్రయించుకుని బ్రతకాలని వుంది" అన్నాడు.
    "సరే - నీ యిష్టం " అన్నాడు స్వరూప్.
    నారాయణను తన నుంచి విడిపోకుండా చేయాలని స్వరూప్ కొన్ని ప్రయత్నాలు చేశాడు. అతణ్ణి విలాస జీవితానికి అలవర్చాలనుకున్నాడు. ఎలాంటి కంపెనీలో వున్నా నారాయణ చుక్క బీరు కూడా ముట్టేవాడు కాదు. స్వరూప్ అతడి పై అమ్మాయిలను ప్రయోగించి చూశాడు. అతడు వారిని తకనైనా తాకలేదు.
    "నీ నిగ్రహం అపూర్వం. ఇలాంటి వృత్తిలో నీ నిగ్రహం యెలా సాధ్యపడిందో నాకర్ధం కావడం లేదు" అని నారాయణ గురించి స్వరూప్ ఆశ్చర్యపడ్డాడు.
    "ఎదుటి వాళ్ళు తప్పులు చేయడంలోనే మనకు ప్రయోజన ముంటుంది . మనం తప్పులు చేయకూడదు."
    "ఎలా తెలుసుకున్నా నీ గొప్ప సూత్రాన్నీ?" అన్నాడు స్వరూప్.
    "మీ నుంచే !"
    నారాయణ తెలివైన వాడని స్వరూప్ అర్ధం చేసుకున్నాడు. అతడి తెలివిని అయిదేళ్ళు మాత్రమే ఉపయోగించగలిగితే -- తన తెలివి వ్యర్ధం!
    ఎలాగో అలా అతడు తనకు లోబడకపోతాడా అని స్వరూప్ ఆశించాడు. కానీ చూస్తుండగానే అయిదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు నారాయణ వెళ్ళి పోతానంటున్నాడు.
    "మిస్టర్ నారాయణా! కాంట్రాక్టు అయిపొయింది. కాబట్టి నిన్నిక ఉద్యోగానికి నొక్కించను కానీ నువ్వు కావాలంటే నాతొ భాగస్వామిగా కూడా వుండవచ్చు. నీకు ఎన్నో విధాల లాభం ...." అన్నాడు స్వరూప్.
    "బాస్ ! నా కోరికలు పెద్దవి కావు. సుఖజీవితానికి సరిపడ డబ్బు నాకు చాలు. ఇన్నాళ్ళు మీ వద్ద ఉద్యోగం చేసి నప్పటికీ అది జీతానికి సంబంధించినంతవరకే. లేకుంటే మనం భాగస్వాముల మేనని మీకూ తెలుసు...." అన్నాడు నారాయణ.
    అదీ నిజమే! నారాయణ స్వరూప్ కలిసి పధకాలు వేశారు. అందువల్ల స్వరూప్ కు లక్షల్లో ప్రయోజనం. నారాయణకు నెలకు అయిదు వేలు మాత్రం!
    "నీకెంత డబ్బు కావాలో చెప్పు ..... అంతా యిస్తాను ...." అన్నాడు స్వరూప్.
    "నాక్కావలసిందో చిన్న యిల్లు....అందమైన భార్య మేమిద్దరం ఒకరికోసం ఒకరు జీవించాలి ...." అన్నాడు నారాయణ.
    "నన్ను వదలి వెడుతున్నావు. నీకు నా రహస్యాలెన్నో తెలుసు. నువ్వు తిన్నగా వుంటావని నమ్మకమేమిటి?"
    "బాస్! తెలివైనవాడు తనకంటే తెలివి. బలం వున్న వాళ్ళ జోలికి వెళ్ళడు. నేను నా జీవితం సుఖంగా సాగాలను కుంటున్నాను. మీ జోలికి వచ్చి ఏదో బావుకోవాలనుకోవడం కంటే -- మీతో కలిసి ఉండడమే నాకు మెరుగు కదా!"
    "నువ్వలాగను కుంటే మాత్రం నేను నమ్మవద్దా? నా కారణంగా నీవాశించే సుఖజీవినం దూరం కావచ్చు...."
    అది బెదిరింపు అని గ్రహించాడు నారాయణ . అతడు తాపీగా -- "బాస్! నా సామర్ధ్యం మీద నాకు నమ్మకముంది. నా సుఖ జీవనానికి అడ్డు తగిలితే మాత్రం -- ఆ దేవుడి కైనా ఎదురు తిరిగి ముప్పతిప్పలూ పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను....ఆ విషయం మీకు తెలుసు" అన్నాడు.
    ఈ హెచ్చరికకు స్వరూప్ చలించలేదు. "నీ సామర్ధ్యం మీద నీకు నమ్మకముంటే నాతొ కలిసుండడానికేం? పట్టుబడాతానేమోనన్న భయం నీలో ప్రవేశించింది. అందుకే అలాగంటున్నావు."
    "మీతో కలుసుండడానికి భయం కారణం కాదు , నా మనస్తత్వం ఈ తరహ జీవితాన్నభిలషించడం లేదు....." అన్నాడు నారాయణ.
    "అంటే నీకు నీ సామర్ధ్యం మీద నమ్మక ముందా?"
    "పూర్తిగా వుంది?"
    "అయితే నీ సామర్ధ్యాన్ని నువ్వు రుజువు చేసుకుని నావద్ద నుంచి వెళ్ళు . అప్పుదిద్దరికీ ఏ బాధా వుండదు ...." అన్నాడు స్వరూప్.
    'అంటే - నానుంచి మీరింకా ఏదో ప్రయోజనం ఆశిస్తున్నారన్న మాట !"
    "అదేమీ కాదు. ఇది కేవాలం నీ సమర్ద్యానికి పరీక్ష. "
    "చెప్పండి ...."
    "మా యింట్లో ఓ గదిలో ఒక రాత్రంతా నువ్వుంటావు. గదిలో ఓ అలమారా వుంటుంది. అలమారాలో ఓ భరిణ భరిణ లో ఓ వజ్రం దాని ఖరీదు అయిదు లక్షలు. ఆ వజ్రాన్ని నువ్వు కాజేయాలి. మర్నాడు గది తలుపులు తీసేసరికి భరిణలో ఆ వజ్రముండకూడదు. నా మనుషులు నిన్ను నఖ శిఖా పర్యంతం పరీక్షిస్తారు. సోదా చేస్తారు. నువ్వు బయటకు వెళ్ళిపోయి ఒకరోజు తర్వాత నావద్దకు వచ్చి వజ్రాన్ని తిరిగివ్వాలి. ఆ వజ్రానికి బదులుగా నేను నీకు అయిదు లక్షలూ ఇచ్చేస్తాను. అది నేను నీ తెలివి తేటలకూ , సామార్ధ్యానికి. ఇన్నాళ్ళుగా నీవు నాకు చేసిన సేవలకూ - నీకిచ్చే బహుమానంగా వుంచుకోవచ్చు."
    "ఆయామ్ రెడీ !" అన్నాడు నారాయణ.
    "అదిసరే! నేనీ పరీక్షనెందుకు పెడుతున్నానో కూడా నువ్వు తెలుసుకోవాలి "అన్నాడు స్వరూప్.
    "చెప్పారుగా నా సామర్ధ్యాన్ని పరీక్షిస్తున్నానని?"
    "సమర్దుడి మెదడులో ఓటమి గురించిన ఆలోచనలకూ స్థానముండదు " అన్నాడు నారాయణ గంబీరంగా.
    "కానీ తెలుసుకోవడం మంచిది కదా?"
    "చెప్పండి ?"
    "ఈ పరీక్షలో గెలుపు నీకు లాభం! ఓటమి నాకు లాభం!"
    నారాయణకు అర్ధమైంది. తనీ పరీక్షలో ఓడిపోతే శాశ్వతంగా స్వరూప్ కు కట్టుబడి వుండాలి.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS