మేనేజరు సరేనన్నాడు.
"ఈసారి తప్పించుకో'గల మంటావా ?" అన్నాడు విక్టర్ అనుమానంగా.
"తప్పించు కోలేక పోవడానికి ఆ వెంకన్నేమయినా దేవుడంటావా -- ఒకటి కాదు రెండు కాదు- మొత్తం ఆరు జంటలు. వాటిలో ఏ జంట నను మానిస్తాడు ? అసలు సినిమా హల్నించి బయటకు వచ్చే వాళ్ళలో మనని గుర్తించడమే అసాధ్యం. అటుపైన బురఖా యువతిని గుర్తించడం మరింత కష్టం. అలాంటి జంటలు అరుంటే యింక చెప్పనక్కర లేదు...." అన్నాడు రాజా.
'అవుననుకో -- కానీ యింతవరకూ జరిగింది చూస్తుంటే ఆ వెంకన్న మనిషేనా అని కూడా అనుమానం కల్గుతోంది " అన్నాడు విక్టర్.
"అతడు మననేలా కనిపెడుతున్నాడో నాకూ మిస్టరీ గానే వుంది. కానీ ఈసారి అతడు మనని కనుక్కోలేడని నా నమ్మకం ...."
"కనుక్కుంటే ఏం చేద్దాం -- లొంగి పోదామా?"
"లొంగి పోవద్దు. లొంగిపోయామని అబద్దం చెబుదాం. అతడు మనుషుల మంచితనాన్ని నమ్ముతాడు. ఇంకెప్పుడూ నేరాల జోలికి వెళ్ళమని అతడికి మాట ఇచ్చేస్తే -- ఆ తర్వాత మనిష్టం ...." అన్నాడు రాజా.
'అంత సులభమని నేననుకోను. ఆ వెంకన్న అసాధ్యుడు. ఏదో ట్రిక్ చేస్తాడు...." అన్నాడు విక్టర్.
"అలాగని ఎందుకనుకుంటున్నావు?"
"లేకపోతె మనమీద మనకెంత నమ్మక ముండేది! ఇప్పుడేమో పట్టుబడిపోతే ఏం చేయాలి అని చర్చించుకుంటున్నాం ."
వాళ్ళిద్దరూ మేనేజరు ప్రయివేటు గదిలో ఉండగా లోపలకు ఓ ముస్లిం జంట వచ్చింది. ఆ తర్వాత మరో జంట వచ్చింది. అటుపైన మరో జంట వచ్చింది. అలా మొత్తం ఆరు జంటలు వచ్చాయి. అప్పుడక్కడ ఓ జంట రాజా, విక్టర్ తో వేషాలు మార్చుకుంది. అనగా రాజా, విక్టర్ లు ముస్లిం జంటగా మారిపోయారు. ఆ ముస్లిం జంట సర్దార్జీలుగా మారింది.
కొంతసేపట్లో ఆ గదిలోంచి ఆరు ముస్లిం జంటలూ ఇద్దరు సర్దార్జీ లు , మేనేజరు బయటకు వచ్చారు. మేనేజరు వారందరికీ హల్లో సగౌరవంగా జంటలు జంటలుగా సీట్లు చూపించాడు.
రాజా, విక్టర్ ఎక్కువ మాట్లాడకుండా మొత్తం సినిమా అంతా చూశారు. ట్రెయిన్ లో తను ముస్లిం వేషంలో వుండగా వెంకన్న కళ్ళ బడ్డానని అతడికి గుర్తుంది. అప్పుడతడు మీసం లేకుండా గెడ్డంతో వున్నాడు. బట్టతల విగ్గులో ఉన్నాడు. ఇప్పుడందుకు భిన్నంగా పూర్తీ వుంగారాల జుత్తు , ఆపైన కుచ్చు టోపీ వుంచుకున్నాడు. ఈసారి గెడ్డం లేదు కానీ పెద్ద పెద్ద బుర్ర మీసాలు తగిలించుకున్నాడు. అతడెలా వేషం మార్చుకున్నప్పటికీ మనసులో వెంకన్న గురించి భయపడుతూనే ఉన్నాడు.
సినిమా అయిపొయింది. రాజా, విక్టర్ ఏ హడావుడి లేకుండా తాపీగా హాల్లోంచి కదిలారు.
మొత్తం ఆరు ముస్లిం జంటలూ సినిమా హాల్లోంచి బయటపడి రోడ్డు మీద కొచ్చాయి. ఆ తర్వాత అందరూ తలోవయిపు ప్రయాణం కొనసాగించారు.
"బాబూ రిక్షా కావాలా?" అన్నాడో రిక్షావాలా.
రాజా, విక్టర్ ఆ రిక్షా వాడిని అనుమానంగా చూశారు. వాడే వెంకన్న కాదు కదా అని వాళ్ళు భయపడుతూ.. వద్దని చెప్పి ముందడుగు వేశారు. గమ్యం వారి మనసులో ఉండనే వుంది.
సదానంద్ యిల్లు. అక్కడికే తాము చేరుకోవాలి. వెంకన్న విషయం చెప్పాలి. తమను పట్టుకోలేకపొతే వెంకన్న మత్తు పదార్ధాలను తమకు తిరిగి అప్పగిస్తానని మాటిచ్చాడు. అతడు మాట మీద నిలబడతాడు. అందువల్ల సదానంద్ కి విషయం తెలియబరిస్తే అతడు వెంకన్న మీద దాడి చేసి ఆ మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకో గల్గుతాడు.
తాము సదానంద్ ను కలుసుకోవాలంటే మాములుగా సదానందుండే యిల్లు కాక- జనతా కాలనీలో ఉన్న రాజ్యలక్ష్మీ నివాస్ కు వెళ్ళాలి. అక్కడ సదానంద్ యింటికి రహస్యంగా ఫోన్ చేయడానికి సదుపాయముంటుంది. రాజ్యలక్ష్మీ నివాస్ కూ సదానంద్ కూ సంబంధ ముందని ఎవ్వరూ ఊహించలేరు. ఆ యింటిలో మామూలు మధ్య తరగతి కుటుంబ మొకటి ఉంటోంది. వారిని సదానంద్ ఏజంట్ల ని ఎవ్వరూ అనుకోలేరు.
రాజా, విక్టర్ కొంత దూరం కాలి నడకన వెళ్ళాక. రిక్షా ఎక్కి జనతా కాలనీ కి వెళ్ళారు. రాజ్యలక్ష్మీ నివాస్ కు చేరుకున్నారు. ఆ యిల్లు తాళం పెట్టి వుంది.
"ఇప్పుడెం చేయాలి?" అన్నాడు విక్టర్.
"తాళం పక్కింట్లో యిచ్చారేమో అడగాలి " అన్నాడు రాజా.
ఇద్దరూ పక్కింటికి వెళ్ళారు. ఓ ముసలాయన వచ్చి తలుపు తీశాడు. విషయం తెలుసుకుని "వాళ్ళంతా చుట్టాలింట్లో పార్టీకి వెళ్ళారు అయిన వాళ్ళెవరయినా వస్తే తాళం ఇవ్వమన్నారు ..." అన్నాడు.
"మేము శంకర్రావు ఆఫీసు చుట్టాలం --" అన్నాడు రాజా.
ముసలాయన మారు మాట్లాడకుండా వాళ్ళకు తాళం చెవి యిచ్చాడు.
ఇద్దరూ తాళం చెవి తీసుకుని రాజ్యలక్ష్మీ నివాస్ తలుపులు తెరిచి లోపల చొరబడ్డారు.
వాళ్ళిద్దరికీ అది తెలియని చోటేమీ కాదు. ఓ గదిలోకి వెళ్ళి గోడకున్న శ్రీనివాసుడి పటం తొలగించారు. అక్కడో చిన్న గూడు , ఆ గూట్లో టెలిఫోను వున్నాయి.
రాజా హడావుడిగా ఓ నెంబరు తిప్పి -- "హలో -- సదానంద్ గారున్నారా --" అన్నాడు.
"ఏ సదానంద్ ?" అని అవతల నుంచి ప్రశ్న వినబడింది.
"ప్రముఖ పారిశ్రామిక వేత్త ...." అన్నాడు రాజా.
"ఊ" ఏం చెబుతావో చెప్పు ...."
రాజా క్లుప్తంగా -- "మా దగ్గరున్న మట్టుపదార్ధాలు డిటెక్టివ్ వెంకన్న చేతుల్లో పడ్డాయి. అతడి మీద దాడి చేస్తే అవి మనకు దక్కుతాయి ...." అన్నాడు.
"ఊ సరే -- లైన్లో వుండండి ...." అంది అవతలి గొంతు.
రాజా తేలికగా నిట్టూర్చాడు. తాననుకున్నది సాదించానని అతడికేంతో సంతోషంగా వుంది.
అప్పుడు లైన్లో కి సదానందం వచ్చాడు. సరుకేలా పోయిందీ అడగి తెలుసుకున్నాడు. వెంకన్న చేతిలో దొరికిపోనందుకు మెచ్చుకుని మిగతా విషయం తను చూసుకుంటానన్నాడు.
డిటెక్టివ్ వెంకన్న తమను దయతలచి వదిలి పెట్టాడనీ, తమ మధ్య సవాలు నడుస్తున్నదనీ మాత్రం వాళ్ళు సదానంద్ కు చెప్పలేదు.
"మొత్తం మీద అనుకున్న కార్యం సాధించాం --" అన్నాడు విక్టర్.
"ఇప్పుడెం చేద్దాం -- ఇక్కడే వుండి విశ్రాంతి తీసుకుందామా -- లేక ట్రెయినెక్కేద్దామా ?" అన్నాడు రాజా.
"ఈ వేళకి ఏ ట్రెయిన్ గురించీ ఆలోచించవద్దు. ఆ వెంకన్న ఏ రైల్వే స్టేషన్లో కలిపినా ఆశ్చర్యం లేదు--" అన్నాడు విక్టర్.
"అవును - ఇరవై నాలుగ్గంటలు -- అతణ్ణి తప్పించుకుని తిరగాలి --" అన్నాడు రాజా.
'అంత సమయం అవసరముంటుందనుకోను. సదానంద్ మనుషులు వెంకన్న ను వేటాడ్డానికి బయల్దేరి వుంటారు ...." అన్నాడు విక్టర్.
"మూడొంతులు వెంకన్న పని ఫినిష్....." అన్నాడు రాజా.
ఇద్దరూ ఉత్సాహంగా యింట్లోంచి బయటకు వచ్చి తలుపులు తాళం వేసి పక్కింట్లో తాళం చెవి యిచ్చి వచ్చారు.
"ఏదైనా హోటలుకు పోయి పడుకుందాం --" అన్నాడు రాజా.
ఇద్దరూ రాజ్యలక్ష్మీ నివాస్ వున్న సండులోంచీ మెయిన్రోడ్డు మీదకు వచ్చారు. సరిగ్గా అక్కడ వెంకన్న నిలబడి వున్నారు.
"సో.... బాయ్స్.... ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా?" అన్నాడతడు.
రాజా తెల్లబోయి --" ఎవర్నువ్వు ?" అన్నాడు.
"ఇంకెవరు ?" అన్నాడు వెంకన్న -- "మిమ్మల్ని నీడలా వెంటాడుతున్న వెంకన్న ను...."
"మమ్మల్నేలా కనిపెట్టావ్?" అన్నాడు బురఖా లో వున్న విక్టర్.
"లొంగి పోయామని ఒప్పుకోండి. రహస్యం చెప్పేస్తాను...."
"లొంగి పొతే ఏం జరుగుతుంది?"
"మీరు సదానంద్ కు చెప్పిన అబద్దం అబద్దం లాగే వుండి పోతుంది. ఒకవేళ మీరు నాకిచ్చిన మాట తప్పి మళ్ళీ నేరాలకు దిగారంటే మీ అంతం మీరే నాకు బ్రీఫ్ కేసులు అప్పజెప్పి -- సదానంద్ కి సంబంధించిన రహస్యాలన్నీ చెప్పేశారని సదానంద్ కు వార్తా చేరవేస్తాను ..."
"అయన నీ మాట నమ్మడు?"
"ఎందుకని ?"
"మామీద ఆయనకున్న నమ్మకము ;లాంటిది...."
'అలాగా -- అయితే నేనొక వేళ సదానంద్ తో మీ స్మగ్లింగ్ కార్యకలాపాలకు త్రుభువన్ హోటల్ , ఖాన్ టైలరింగ్ షాప్, దియేటర్ కుసుమ , జనతా కాలనీ లోని రాజ్యలక్ష్మీ నివాస్ అని నాకు తెలిసిపోయిందని చెప్పానను కొండి. అప్పుడాయన ఎవర్నానుమానిస్తాడు ?" అన్నాడు వెంకన్న.
"ఇవన్నీ మీకెలా తెలిశాయ్?" అన్నాడు రాజా, వెంకన్న నుంచి తప్పించు కునేందుకు తమకున్న సదుపాయాలన్నీ తాము పయోగిస్తే జరిగిందేమిటి?
"స్మగ్లింగ్ లో మీకున్న సదుపాయాలన్నీ తెలుసుకుందుకే మిమ్మల్ని తప్పుకు పోనిచ్చాను...." అన్నాడు వెంకన్న.
రాజా, విక్టర్ ఇద్దరూ వెంకన్న కు రెండు చేతులూ జోడించి నమస్కరించి -- "హేట్సాఫ్ టూ యూ!" అన్నారు. అప్పుడు రాజా -- "మాలో మార్పు రావాలన్న మీ ఆశయం తప్పక నెరవేరుతుంది . కానీ మీరు మమ్మల్నేలా కనుక్కోగలిగారో చెప్పండి ....' అన్నాడు.
"మీరిద్దరూ ఒకరినొకరు వదిలి వుండలేరు. మారు వేషాలు కూడా జంటగా వేసిన కారణంగా నా పని చాలా సులభమైంది....అది మొదటి పాయింటు ...." అన్నాడు వెంకన్న.
"మరి రెండో పాయింటు ?" అన్నాడు విక్టర్.
"దూరాన్నుంచే నేను ఎత్తులు అంగుళాలతో సహా అంచనా వేయగలను. అటుపైన ఏ మారు వేషం వేసినా మీ యిద్దరి ఎత్తు నా దగ్గరున్న బైనాక్యులర్స్ సాయంతో చూసేవాణ్ణి. మీ యిద్దరికీ భుజాల దగ్గర సరిగ్గా అయిదంగుళాల తేడా వుంది. మొత్తం ఎత్తులో నాలుగంగుళాల తేడా వుంది. ఇద్దరూ ఎప్పుడూ ఇంచుమించు ఒకేరకం ఎత్తున్న జోళ్ళు ధరించారు. అందువల్ల మీకున్న అ తేడాయే మిమ్మల్ని నాకు సులభంగా పట్టిచ్చింది. ఇది రెండో పాయింటు --" అన్నాడు వెంకన్న.
"మరి మూడో పాయింటు?" అన్నాడు రాజా.
'అది ట్రేస్ సీక్రెట్ . చెప్పకూడదు . టాటా !" అన్నాడు వెంకన్న.
వెళ్ళిపోతున్న వెంకన్నను చూస్తూ -- "ఇలాంటి డిటెక్టివులుండగా -- మనం మన పద్దతులు మార్చుకోవడమే మంచిదని పిస్తోంది --' అన్నాడు రాజా.
విక్టర్ తలూపాడు.
***
