బ్యాంకు దోపిడీ కింకా వారం రోజుల గడువుంది. ఈలోగా సత్యం తన పగ తీర్చుకునేందుకు వాసుదేవరావింటికి వచ్చాడు.
"అప్పుడు చెయ్యని నేరానికి నన్ను జైలుపాలు చేశారు వీళ్ళు. అయిదువేల రూపాయల పాపం నాకు అంటగట్టారు. అందుకు కనీసం అయిదురెట్లు వసూలు చేయాలి నేను" అన్నాడు సత్యం.
"దొంగతనమెలా చేస్తావు?" అంది రమణమ్మ.
"ఈ పులుసులో మత్తుమందు కలుపుతాను...." అంటూనే అతడు తన జేబులోంచి ఓ డబ్బాతీసి అందులోని పొడాన్ని పులుసులో వేశాడు.
"తర్వాత?" అంది రమణమ్మ.
"రాత్రి వాళ్ళు భోజనాలుచేసి మత్తుగా నిద్రపోతారు. వాళ్ళతో పాటే నువ్వూను...." అన్నాడు సత్యం.
"ఆ తర్వాత?"
"నేను కొట్టుగదిలో దాగుని ఉంటాను. ఓ రాత్రివేళ వచ్చి యిల్లంతా చక్కబెట్టుకుని పోతాను. తెల్లారేదాకా ఎవరికీ మెలకువరాదు. ఆ తర్వాత ఎవ్వరికీ నేను దొరకను. ఈ పథకంవల్ల ఎవరికీ నీ మీద కూడా అనుమానంరాదు..."
రమణమ్మ సత్యం పథకాన్ని మెచ్చుకుంది. అయితే ఆమెకో సందేహం వుండిపోయింది-"వాసుదేవరావు మీద పగవుంటే అది బ్యాంకు దొంగతనం తర్వాత తీర్చుకో వచ్చుగదా! ఇప్పుడే దొంగతనం చేయడంవల్ల కర్మం జాలక ఎవరికైనా అనుమానం కలిగితే నువ్వు పట్టుబడి పోవచ్చు...."
సత్యం నవ్వి "అన్నీ ఆలోచించాన్నేను. బ్యాంకు దోపిడీ అంటే సామాన్యమైన విశేషం కాదు. నేను పట్టుబడిపోవచ్చు. ప్రాణాలు కోల్పోవచ్చు. పగ తీరకుండా చావడం నా కిష్టం లేదు. ఈ యింట్లో దొంగతనం చేయటం వల్ల నేను పట్టుబడననే నా నమ్మకం. ఒకవేళ పట్టుబడి నప్పటికీ ఆ పెద్దమనిషి నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తాడు" అన్నాడు.
రమణమ్మ భయంగా "అంత ప్రమాదకరమైనదైతే బ్యాంకు దోపిడీ జోలికెందుకు వెడతావు? ఈ యింట్లోని డబ్బు నీకు చాలదా?" అంది.
"రమణమ్మా! నీకూ నాకూ ఆలోచనల్లో మార్పు వచ్చేసింది. ఏడాది జైలు జీవితం నా గుండెను బండరాతిగా మార్చేసింది. మున్ముందు నా జీవితాన్ని నేరాలతోనే తీర్చిదిద్దుకుంటాను. నేరస్థుడిగా యీ సమాజాన్ని శాసిస్తాను" అన్నాడు సత్యం.
రమణమ్మ ఆలోచనలో పడింది. "అంటే మనం కలిసుండడం సాధ్యపడదా?" అంది కాసేపాగి.
"ఇంకా నాకు సులభజీవితం లేదు. అనుక్షణం సమాజానికి భయపడుతూ, అంతకంతా సమాజాన్ని భయపెడుతూ అదో రకపు జీవితం గడిపే నాతో నువ్వు సుఖపడలేవు. నేను నీకు చేయగల ఉపకారమల్లా నీ కూతురి జీవితం సుఖమయం చేయడమొక్కటే!" అన్నాడు సత్యం.
రమణమ్మ యింకేమీ మాట్లాడలేదు. సత్యమంటే ఆమెకు ప్రేమవుంది. అభిమానముంది. సత్యాన్నామె తన జీవనభాగస్వామిగా ఊహించుకుంది. అతడిప్పుడు సమాజానికి విరోధి అవుతున్నాడు. అందుకు తాను సాయపడుతోంది.
"ఏమిటాలోచిస్తున్నావ్?" అన్నాడు సత్యం.
"నేను నీకు సాయపడతాను" అంది రమణమ్మ.
2
సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు సత్యం కొట్టుగది లోంచి బయటకు వచ్చాడు. ఒక్క కొట్టుగదిలో తప్ప మిగతా యిల్లంతా అస్పష్టమైన సన్నని వెలుతురుంది. ఇల్లంతా బెడ్ దీపాలున్నాయి.
మొత్తం ఎనిమిది గదుల బంగళా అది!
ఇల్లంతా సత్యానికి బాగా పరిచయమే! అయిదేళ్ళతడా యింట్లో వంట చేశాడు. ఏ గదిలో ఎవరు పడుకుంటారో అతడికి బాగా తెలుసు.
ఇంట్లో వాసుదేవరావు, అతడి భార్య, ఇద్దరు కొడుకులూ, కోడళ్ళు, వారి ముగ్గురు పిల్లలూం, రమణమ్మ.
అందరికీ నిర్ణీతమైన గదులున్నాయి.
ఇనప్పెట్టె వాసుదేవరావున్న గదిలోనే వుంటుంది. తాళం చెవులు వాసుదేవరావు తలగడ క్రింద వుంటాయి.
సత్యం జేబులు తడుముకుని బటన్ నైఫ్ తీశాడు. ఓసారి బటన్ నొక్కాడు. సన్నని వెలుతుర్లో బాకు తళతళా మెరిసింది.
"అవసరమైతే ప్రాణాలు తీయడానిక్కూడా జంకకూడదు' అనుకున్నాడతడు. తిరిగి బటన్ నైఫ్ ను మడిచి జేబులోకి తోసేసి వాసుదేవరవు పడుకున్న గదిలోకి వెళ్ళాడు.
గది తలుపులు తీసే వున్నాయి.
ఆ యింట్లో ఎవరి గదితలుపులూ వేసి వుండవు. గుమ్మానికి ఓ తెర వ్రేలాడుతూంటుంది. రెండేళ్ళ పిల్లలు కూడా గదిలోకి వెళ్ళేముందు తెరకివతలే నిలబడి అనుమతి తీసుకుంటారు. ఆ యిల్లొదిలి ఏడాది దాటిపోయినా జైలు జీవితం అలవాట్లను మార్చినా గదిలో అడుగు పెట్టేముందు సత్యం అప్రయత్నంగా తెరకివతల ఒక్కక్షణం ఆగిపోయాడు.
ఇల్లంతా నిశ్శబ్దం. చీమ చిటుక్కుమన్నా వినిపించే టంత నిశ్శబ్దం.
సత్యం వాసుదేవరావు గదిలో ప్రవేశించాడు.
గదిలో పెద్దమంచం. మంచాని కటువైపు వాసుదేవరావు భార్య. ఇటు వాసుదేవరావు. ఇదరూ పెద్దదుప్పటీ కప్పుకున్నారు. మనుషుల్లో కదలికలేదు, మత్తుమందు ప్రభావం కాబోలు-గాఢనిద్రలో వున్నారు.
సత్యం మంచాన్ని సమీపించాడు. జేబులోంచి బటన్ నైఫ్ తీసి బటన్ నొక్కాడు. గదిలో నైట్ బల్బు కాంతిలో చాకు తళతళ మెరిసింది.
భార్యాభర్తల్లో ఎవరికీ మెలకువ రాకూడదు. వస్తే చాకు చూపి బెదిరించి అరవకుండా ఆపాలి. అయినప్పటికీ అరిచారా పొడిచేయక తప్పదు.
చేతిలో చాకు-ఎదురుగా మనుషులు-అరిస్తే పొడవడం-ఈ మూడూ తలచుకోగానే సత్యంలో సన్నని వణుకు ప్రారంభమైంది. ఇంతవరకూ అతడెన్నడూ యిలాంటి ఘోరం తలపెట్టలేదు. ఆ మాటకొస్తే నేరమే చేయలేదు.
వాళ్ళిద్దరికీ మెలకువ రాకూడదని దేవుడిని ప్రార్దించుకుంటూ రెండో చేత్తోదిండు ఎత్తాడు సత్యం.
మంచంమీద మొత్తం మూడు దిండ్లున్నాయి. అవతల దిండుపై తల ఆన్చి వాసుదేవరావు భార్య నిద్రపోతోంది. ఇవతల దిండుపై తలఆన్చి వాసుదేవరావు నిద్రపోతున్నాడు. మధ్యదిండు ఖాళీగా వుంది. సత్యం వాసుదేవరావు తల ఆన్చిన దిండు ఎత్తాడు.
వాసుదేవరావు తల కదిలింది-కానీ మెలకువ రాలేదు.
తలగడ కింద సత్యానికి తాళంచెవులు దొరికాయి. అప్పుడు చేతిలోని చాకును మించి అతడి కళ్ళు మెరిశాయి.
సత్యం తాళంచెవులు తీసుకుని ఇనప్పెట్టె వద్దకు నడిచాడు. ఇనప్పెట్టె తలుపు తెరిచాడు. అన్నిటికంటే పెద్ద తాళం ఉపయోగించేసరికి సులభంగానే ఇనప్పెట్టె తెరుచుకుంది.
తలుపు తెరవగానే సత్యం కళ్ళు జిగేల్ మన్నాయి.
నోట్ల కట్టలు......సరికొత్త పదిరూపాల నోట్ల కట్టలు.....
సత్యం జాగ్రత్తగా డబ్బు లెక్కపెట్టాడు. ఆరువేల ఎనిమిది వందలుంది.
ఇనప్పెట్టెకు చాలా లాకర్లున్నాయి. వాటిలో నగలుంటాయని సత్యానికి తెలుసు. సత్యం ముందు డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. లాకరు తలుపులు తెరవటానికి మిగతా తాళాలతో ప్రయత్నించాడు. ఏ తాళంతో ప్రయత్నించినా లాకర్లు తెరుచుకోలేదు.
చేతిలో తాళాలున్నాయి. ఎదురుగా లాకర్లున్నాయి. వాటిలో నగలున్నాయి.
తను వాటికెంతో దగ్గరగా వున్నాడు. అయినా ఎంతో దూరం....
సత్యం చాలాసేపు ప్రయత్నించాడు. అతడి ప్రయత్నాలు ఫలించలేదు.
తర్వాత అతడు ఇనప్పెట్టె మూసి తాళంవేసి మిగతా గదుల్లోకి వెళ్ళాడు. ఎక్కడ చూసినా అందరూ గాఢనిద్రల్లో వున్నారు. అతడి పనికి సానుకూలంగా వుంది. కానీ ఆ డబ్బుకు మించి యింకెక్కడా విలువైనవేమీ అతడికి దొరకలేదు.
