Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 46

 

                                     4
    గోవిందరావు ని చూస్తూనే రాజేశ్వరమ్మ త్వరత్వరగా లేచి వెళ్ళిపోయింది.
    "ఎప్పుడూ లేనిదీ రోజింత సేపు కబుర్లు పెట్టావేమిటి? నేనింట్లో కి వచ్చేసరికి నువ్వు ఒంటరిగా వుండాలని తెలియాదూ?" అన్నాడు గోవిందరావు భార్యను కౌగిట్లో బంధిస్తూ.
    సునీత జరిగినదంతా చెప్పి తలుపు గొళ్ళెం చూపించింది. గోవిందరావు ఆశ్చర్యంగా విని, "అవును-- వాడు పదిహేను రోజులు ఎర్న్ డ్ లీవుకు అప్లై చేశాడు. ఐతే ఏదో ప్రమాదంలో వున్నట్లు నాకు చెప్పలేదు" అన్నాడు.
    సునీత వీధి తలుపులు వేసివచ్చింది. గోవిందరావు గది గొళ్ళెం తీసాడు. గదిలోంచి రామస్వామి నవ్వుతూ బయటకు వచ్చాడు. "గట్టిగా మాత్రం మాట్లాడకండి. ఇంట్లో నేనున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. ఇది అజ్ఞాత వాసం కూడా కాదు. అదృశ్యంవాసం" అన్నాడతను.
    "అసలు కధేమిటో చెప్పు" అన్నాడు గోవిందరావు.
    "చెప్పాడానికి కధేమీ లేదు. చాలా కష్టాల్లో వున్నాను. ఇప్పుడేమీ వివరించలేను. అయిన వాళ్ళుగా ఓ వారం రోజులు ఆదరించగలిగితే ఆదరించండి. మీ ఋణం ఈ జన్మకు తీర్చు కోలేననుకుంటాను." అన్నాడు రామస్వామి.
    "ఇది నీ యిల్లు" అన్నాడు గోవిందరావు . సునీత మాత్రం మౌనంగా ఊరుకుంది.
    "నీ కిష్టం లేదా?" అన్నాడు రామస్వామి , సునీతను.
    "మీరు కూడా ఓ వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టకూడదు?' అంది సునీత.
    గోవిందరావు ఆలోచనలో వుండగా రామస్వామి అన్నాడు. 'అలా అయితే నా ప్లానంతా అప్ సెట్ అవుతుంది. మీ అయన ఉత్తినే సెలవు పెట్టి యింట్లో కూర్చుంటే అందుకేదో కారణ ముందనె అనుకోవాలి . నేను మీ ఇంట్లో ఉంటున్నానని అసలేకూడా ఎవరికీ అనుమానం కలక్కూడదు."
    'అలా అనుమానం కలిగితే ఏమవుతుంది?" విసుగ్గా అన్నాడు గోవిందరావు.
    "చాలా కష్టాల్లో వున్నాను. ఇప్పుడేమీ చెప్పలేను. అయిన వాళ్ళుగా...."
    "సరే అలాగేలే -- కానీ ...." అన్నాడు గోవిందరావు.
    "నన్ననుమానించ వద్దు. నువ్వు వెళ్ళేటప్పుడే గదికి గొళ్ళెం పెట్టి వెళ్ళు. తాళం మాత్రం వెయ్యవద్దు. ఎవరయినా ఇంటికి వస్తే లోపల మనుషు లుండగా ఓ గదికి తాళం వేసి ఎందు కుందన్న అనుమానం వస్తుంది?" అన్నాడు రామస్వామి.
    "సరేలే. కానీ యిదంతా దేనికి?"
    'చాలా కష్టాల్లో వున్నాను. ఇప్పుడేమీ చెప్పలేను. అయిన వాళ్ళు గా....'
    "తప్పకుండా ఆదుకుంటాం లే బాబూ -- " అన్నాడు గోవిందరావు. రామస్వామి వ్వవహరమేమిటో అతనికి అంతు బట్టలేదు.

                                      5

    సునీతను దగ్గరగా తీసుకుని "జీవితాంతం మనమిద్దరం ఇలాగే....' అని ఏదో అనబోతుండగా భర్తను వరించి "హుష్ , ఇంట్లో బావ వున్నాడు"అంది.
    "ఉన్నాడని నాకు తెలుసులే. కానీ వాడు వింటే వచ్చిన నష్టమూ లేదు. పైగా వాడికి ఉపయోగం కూడా. మనింట్లో మూడో మనిషున్నట్లు యెవ్వరికీ అనుమానం రాకూడదు." అన్నాడు గోవిందరావు.
    'అది సరే -- కానీ బావ విషయం మీకేమైనా తెలిసిందా?"
    "ఏమీ చెప్పందే ఎలా తెలుసుంది ?"
    "చేప్పలేదనుకొండి. కానీ మీరు చాలా తెలివయిన వారు కదా...."
    "చదివింది గుర్తుంచుకోవడం లోనే నా తెలివి తేటలు...."
    "అంతే ఐతే అమెరికన్ స్కాలర్ షిప్ మీకెలా గోస్తోంది?"
    "అప్పుడే వస్తోందని అనేయకు. దానికి చాలా పెద్ద పోటీ వుంది. మన సంస్థ నించే ఇద్దరమూన్నాం" అన్నాడు గోవిందరావు.
    "ఇద్దరంటే యెవరు? బావే గదా. మీ యిద్దరిలో మీ ముందు బావెలాగూ చాలడు? అందుకే స్వయం వరంలో నేను మిమ్మల్నేన్నుకున్నాను?" అంది సునీత.
    "అది నీస్వయంవరం సంగతి. ఇక్కడంతా ఇంటర్వ్యూ పైన ఆధారపడి వుంటుంది. రామస్వామి ఇంటర్వ్యూ లు బాగా చేస్తాడు" అన్నాడు గోవిందరావు.
    'అక్కడికి మీకు చేతకానట్టు. ఇంటర్వ్యూ కమిటీ లో మీ డైరక్టరున్నాడుట గదా-- ఆయనకు మీరంటే యెలాగూ అభిమానం" అంది సునీత.
    'ఆయనకు నేనంటే కాదు, మా సంస్థంటే అభిమానం. మా ఇద్దరిలో ఒకరికి తప్పకుండా స్కాలర్ షిప్ వస్తుంది. వచ్చిన వాడు చాలా అదృష్ట వంతుడు . రెండేళ్ళ ట్రయినింగు , నెలకు వెయ్యి డాలర్లు. జాగ్రత్తగా వుంటే రెండేళ్ళ లోనూ లక్ష రూపాయలు వెనకేసుకు రావచ్చు. అదీ గాక మనమిద్దరమూ హీరో హీరోయిన్లలా ఫారిన్ జీవితం గడపొచ్చు" అన్నాడు గోవిందరావు.
    'అది సరే, బావ సంగతి చెప్పలేదు. నాకేదో భయంగా వుంది. అతనికి నామీద చిన్నప్పట్నించీ ఆశ వుందని మీకూ తెలుసు. అలాంటప్పుడు రోజల్లా అతనితో వంటరిగా ఉండడం నాకిష్టం లేదు"అంది సునీత.
    "నాకూ యిష్టం లేదు కానీ ఆ సంగతి చెప్పడానికి మొహమాటంగా వుంది. అందుకింకేదయినా యేర్పాటు చేసుకోవాలి" అని క్షణం అలోచించి, "లత తెలుసు గదా నీకు!" అన్నాడు గోవిందరావు.
    "మీ ఆఫీసులో పనిచేస్తున్న టైపిస్టు రాధ చెల్లెలేగా?"
    "అవును, ఆమె కాలేజీకిప్పుడు సెలవులు. నీవంట్లో ఆరోగ్యంగా లేదనీ, నేను లేనంత సేపూ ఓ నాలుగు రోజులు నీకు కంపెనీగా ఉండమనీ రిక్వస్ట్ చేస్తాను. లతకు నువ్వంటే చచ్చేటంత ఇష్టం. ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది."అన్నాడు గోవిందరావు.
    తీరుబడి సమయంలో పుస్తకాలు చదువుకోవడం సునీత అలవాటు. కబుర్ల తో కాలక్షేపం చేయడం ఆమెకు చాలా చిరాకు. లతకు కబుర్లంటే చాలా ఇష్టం. ఇరవై నాలుగ్గంట లూ  ఏదో ఒకటి వాగుతూ వుంటుంది. సునీతకు లతంటే బోరు. కానీ యిప్పుడు గత్యంతరం ఉన్నట్లు లేదు.
    "ఏమిటో సరదాగా, సుఖంగా జీవిస్తున్నాం...." అని నిట్టూర్చింది సునీత.
    "ఇప్పుడు మాత్రం సరదాకీ, సుఖానికీ తక్కువేమీ వచ్చింది?" అంటూ సునీతను దగ్గరగా తీసుకొన్నాడు గోవిందరావు.

                                      6
    సునీత చటుక్కున భర్త పక్కలోంచి లేచి, "పాలవాడోచ్చాడు "అంది.
    "నువ్వు పడుకో, నేను వెళ్ళి వస్తాను...." అన్నాడు గోవిందరావు.
    "ఈ వేల్టికలా కుదరదు. బావకు పెందరాళే కాఫీ అలవాటు."
    "ఏమైనా చేయగలను కానీ ఈత్యాగం మాత్రం చేయలేను" అన్నాడు గోవిందరావు. కానీ బట్టలు సరి చేసుకుని వెళ్ళిపోతున్న భార్యనతను వారించలేదు. ఏమైనా అతిధి మర్యాద గృహస్థ ధర్మం కదా!
    సునీత పాలు పోయించుకు వచ్చేసరికి రామస్వామి స్నానం చేయడం కూడా అయిపొయింది. రాత్రి అతను ఫ్రీగా మసలడం కోసం అతని గది తలుపుకు గొళ్ళెం వేయలేదామే. అతన్ని చూస్తూనే , "సారీ బావా! లేచేసరికి ఆలస్య మై పోయింది. నీకు పెందరాళే కాఫీ అలవాటు గదా!" అంది సునీత బాధగా.
    "నా అలవాట్లింకా గుర్తున్నాయా నీకు!" అన్నాడు రామస్వామి ఆనందంగా.
    "ఎందుకుండవు?" అని అక్కణ్ణించి వెళ్ళిపోయింది సునీత. ఆమె కాఫీ కలిపెసరికి భర్త కూడా ముఖం కడుక్కుని వచ్చాడు. ముగ్గురూ కాఫీ తాగడమవ గానే పనిమనిషి వచ్చి తలుపు తట్టింది. చటుక్కున తన గదిలోకి దూరాడు రామస్వామి. అప్పుడే సునీత కు గుర్తుకొచ్చింది తన బావ పనిమనిషి కళ్ళబడకూడదని . ఐతే అదెలా సాధ్యం? అదిప్పుడు ఇల్లంతా తిరిగి ఊడుస్తుంది. అంట్ల గిన్నెలు తోముతుంది.
    "పోనీ అని బావగది ఊడవద్దని చెబుదామంటే ఎందుకని అడుగుతుంది. అలాంటి అనుమానా లేవ్వరికీ రాకూడదని బావన్నాడు. ఈ విషయాన్నామె రహస్యంగా భర్త నడిగితే "ఇందులో నీకు కంగారెందుకు? వాడి సంగతి వాడె చూసుకుంటాడు" అన్నాడు.
    ఐతే ఆ తర్వాత జరిగిన విషయమామెకు నవ్వు పుట్టించింది. పనిమనిషి ఇల్లూడుస్తుంటే రామస్వామి తన చాకచక్యాన్నంతా ప్రదర్శించి గొల్ల స్థంబాలాట లో లాగ గదులు మరి పనిమనిషికి తన ఉనికి గురించిన అనుమానం కలక్కుండా చూసుకొన్నాడు.
    ఆ వింత సన్నివేశాన్ని సునీత తో పాటు గోవిందరావు కూడా ఆనందించి పనిమనిషి వెళ్ళిపోయాక "ఈ తమాషా అంతా దేనికో నాకూ చెప్పగూడదు? విని ఆనందిస్తాను " అన్నాడు.
    "మీకు తమసాలా గుంది కానీ ఇది నాకు జీవన్మరణ సమస్య. చాలా కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడేమీ చెప్పలేను. అయిన వాళ్ళు....' అని అతనింకా ఏదో అనబోతుండగా -- "పొరపాటు నాదే -- ఇంక అడగనులే-" అన్నాడు గోవిందరావు.
    పనిమనిషి వెళ్ళి పోయేక సునీత త్వరత్వరగా వంట చేసింది. భోజనాలు ముగ్గురూ కలిసి చేశారు. గోవిందరావు వెళ్ళిపోబోయే ముందు రామస్వామిని గదిలో పెట్టి గొళ్ళెం వేయడం మరిచి పోలేదు.
    భర్త వెళ్ళి పోగానే సునీత తొందరగా ఇల్లు సర్దుకుంది. ఏ పని చేస్తున్న గదిలో ఉన్నబావ ఆమె కళ్ళముందు మెదుల్తూనే ఉన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS