"మా ప్రేమ అంటున్నావ్ --నా ప్రేమ సంగతి మరిచి పోయావా?'
"నేను నిన్ను ప్రేమించడం లేదు ...." అందిసునీత.
"కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను -- ఆ సంగతి నీకు తెలుసు...."
"అందుకు నేనేం చేయగలను? నీ ప్రేమ సంగతి చెప్పుకోడమే కానీ నా ప్రేమ సంగతి తెలుసుకుందుకు ఎప్పుడైనా ప్రయత్నించావా నువ్వు!"
"లేదనుకో -- కానీ నేను తప్పు అభిప్రాయంలో ఉన్నానని తెలిసినపుడు నువ్వు సరిచేయాలి -- అది నీ భాద్యత!"
"నేను నిన్ను ప్రేమిస్తాననుకోవడం నీ అహంకారం. అందం లో , పర్సనాలిటీ లో, తెలివి తేటల్లో నిన్ను మించిన వాళ్ళు బోలెడు ముందున్నారు. అయినా నువ్వు గుర్తించ లేదు. గోవిందరావు గార్ని నువ్వే నాకు స్వయంగా పరిచయం చేశావ్. అన్ని విధాల నీ కతీతుడైన ఆ మనిషిని నాకు పరిచయం చేయడంలో ఉన్న ధైర్యమే నీ అహంకారాన్ని ఋజువు చేస్తోంది. ఇకపోతే చెప్పాల్సిందే ముంది?"
రామస్వామి సునీత ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. అతను విషయాన్ని పెద్దల దాకా తీసుకు వెళ్ళాడు. ఆ విధంగా ఆదిలోనే ఆ విషయాన్ని పరిష్కరించగలనని అతననుకున్నాడు.
రామస్వామి తండ్రికి చాలా కోపం వచ్చింది. సునీత తలిదండ్రులు కూడా ఈ విషయంలో కూతుర్ని కోప్పడ్డారు.
రామస్వామిని పెళ్ళి చేసుకోమన్నా , గోవిందరావు ని పెళ్ళి చేసుకోనివ్వక పోయినా ఆత్మహత్య చేసుకుంటా నంది సునీత. ఒక్కర్తే ఆడపిల్ల ఆమె! ఇంట్లో పెద్దాచిన్నా అంతా అన్ని గొడవలు పడ్డా - సునీత ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరుగదని రామస్వామికి తేలిపోయింది. అయితే అతను కొంత వ్యవధి కోరి -- ఆ వ్యవధి లో సునీత మనసు మార్చాలను కున్నాడు.
ఎమ్మెస్సీ పరీక్ష లై పోయాయి. గోవిందరావు యూనివర్సిటీ కి ఫస్టుగా వస్తే తను నాల్గవ వాడుగా వచ్చాడు రామస్వామి. ఇద్దరూ చాలా సంస్థలకు అప్లికేషన్స్ పెట్టారు. ఇంటర్వ్యూ లకు వెళ్ళి వస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రామస్వామి సునీత ను తన వైపు తిప్పుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. సునీత తనకు దక్కదని రూడీ అయేక ఒకరోజు అతను అవకాశం చూసుకుని ఆమెను బలవంతంగా అనుభవించ బోయాడు.
అతన్నించి తప్పించుకునెందుకు సునీత శారీరక బలంతో కొన్ని వృధా ప్రయత్నాలు చేసి -- ఆఖరికి చేతులు జోడించి ప్రార్ధించింది. అదీ పని చేయకపోగా ధైర్యం చేసి అతనికి లొంగినట్లు నటించి, తన ముందు మారినట్లు నమ్మించి, అతన్ని తప్పించుకుని గదిలో పెట్టి తలుపు గొళ్ళెం వేసింది. తర్వాత ఇంట్లోని వారందరికీ జరిగింది చెప్పింది.
రామస్వామి తండ్రి కొడుకుని వెనకేసు కొచ్చాడు. సునీత తండ్రి రామస్వామిని నిష్టూరాలాడాడు. ఆ తర్వాత సునీత పొరపాటున కూడా ఏకాంతంగా రామస్వామి కి దొరకలేదు.
గోవిందరావు కీ, రామస్వామి కీ ఒకే పరిశోధన సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. గోవిందరావు పెళ్ళి సుముఖుడయ్యాడు. సునీతకూ అతనికీ వివాహం ముహూర్తం నిశ్చయ మయింది. దాంతో రామస్వామి లో బాగా వేడి పుట్టింది.
అతను సునీత దగ్గరకు వెళ్ళి -- "నిన్ను ప్రేమించినందుకు జేవితంలో చాలా అన్యాయమై పోయాను. ఎలాగూ పెళ్ళి చేసుకు వెళ్ళి పోతున్నావు. నీకు వరసైన వాణ్ణి, స్వయానా బావను చిన్నతనం నుంచీ నిన్ను భార్యగా భావించుకున్న వాణ్ణి. ఒక్కసారిగా నన్ను కరుణించి నాదానివి కా, ఈ ఒక్క ఉపకారానికి జీవితాంతం నీకు ఋణపడి ఉంటాను--" అన్నాడు.
సునీత అసహ్యంగా అతని వంక చూసి -- "పెళ్ళి నిశ్చయమైనాక ఏ వరస వున్నా నేను నీకు చెల్లెలి వంటి దాన్ని, నన్నలాగే చూడ్డం నేర్చుకో--' అంది.
రామస్వామి కి చాలా కోపం వచ్చింది -- "నేననుకున్నది సాధించి తీరతాను. నీ కర్మ కాలింది. జీవితంలో నాకు సుఖం లేకుండా చేశావు. నీకూ సుఖం లేకుండా నేను చేస్తాను. నాక్కాకుండా పోయినందుకు నిన్ను కూడా గోవిందరావు క్కాకుండా చేస్తాను." అన్నాడు.
'అంటే ఏం చేస్తావేమిటి?" అంది సునీత నిరసనగా.
"నా విషయంలో గోవిందరావు చేసిన విధంగా అతని విషయంలో నేనూ చేస్తాను. మీరిద్దరూ కలిసి నా ప్రేమను నిలువునా హత్య చేశారు. మీ ఇద్దరి ప్రేమనూ హత్య చేస్తాను. మీరు చేసిన హత్యలో రక్తం కనబడటం లేదు. కానీ నా హత్యలో ఎర్రటి రక్తం చిందుతుంది...." అన్నాడు రామస్వామి.
సునీత భయపడలేదు, "హత్యలు చేయాలనుకునే మనస్తత్వం మంచిది కాదు . చచ్చిన వాళ్ళ ప్రాణం క్షణంలో పోయినా -- చంపిన వాళ్ళ ప్రాణాలు మాత్రం జీవితాంతం నలుగుతూనే ఉంటాయి." అంది.
ఆ తర్వాత సునీతకు, గోవిందరావు కు పెళ్ళయింది. గోవిందరావు సునీత మెడలో తాళి కడుతుంటే రామస్వామి దిగులుగా చూస్తూ ఉండి పోయాడు.
జీవితంలో స్వర్గాన్ని చవి చూస్తోంది. సునీత గోవిందరావు కు అన్ని మంచి లక్షణాలతో పాటు, పెళ్ళియ్యాక కూడా భార్య ను ప్రేమగా చూసుకునే లక్షణం ఉంది. అతను లేకుండా క్షణమైనా బ్రతకలేని స్థితి సునీత కు వచ్చేసిందంటే -- అందుకతని ప్రేమనురాగాలే కారణం.
3
మంచం మీద పడుకుని నవల చదువుకుంటోంది సునీత.
కధ మంచి పట్టులో వున్న సమయంలో ఎవరో తలుపులు దబదబా బాదారు. చిరాగ్గా లేచించి సునీత. ఆ సమయంలో తలుపులు బాదేదేవరో ఆమెకు అర్ధం కాలేదు.
"ఎవరు వారు?' అని విసుగ్గా అరుస్తూ ఆమె తలుపులు తీసింది. ఒక వ్యక్తీ చటుక్కున లోపల జొరబడి -- "అర్జంటుగా తలుపులు వేసేయ్!" అన్నాడు.
అతన్ని చూసి "నువ్వా?' అంది కంగారుగా సునీత.
"అవును నేనే! ముందు తలుపులు వేసేయ్. నేను చాలా పెద్ద ప్రమాదంలో వున్నాను." అన్నాడు రామస్వామి.
సునీత వెంటనే తలుపులు వేసేసింది. రామస్వామి పరిస్థితి చూడగానే ఆమెకు చాలా జాలి కలిగింది. అతను మనిషి కంగారుగా కనబడుతున్నాడు. శరీరం కొద్దిగా వణుకుతోంది. కళ్ళలో భయం కనబడుతోంది.
"ఏమిటి ప్రమాదం? ఆఫీసు నించే వస్తున్నావా?" అంది సునీత.
"లేదు. ఆఫీసుకు సెలవు పెట్టాను. నేనిప్పుడో పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాను. నన్ను రక్షించడం నీ చేతుల్లో వుంది." అన్నాడు రామస్వామి.
"నేను నిన్ను రక్షించడమా?" ఆశ్చర్యంగా అంది సునీత. అప్పటికి రామస్వామి వెళ్ళి అక్కడే వున్న ఓ కుర్చీలో కూర్చున్నాడు. సునీత తనూ వెళ్ళి యెదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.
"నిజానికి నేను ఏ నేరమూ చేయలేదు. కానీ పరిస్థితులలా వచ్చాయి. ఓ వారం రోజుల పాటు మీ ఇంట్లో నాకు ఆశ్రయం కావాలి. నేనిక్కడుంటూన్నట్లు రెండో కంటి వాడికి తెలియకూడదు. నా రాకపోకలు రహస్యంగా చేస్తుంటాను. మీరూ వాటి విషయంలో రహస్యాన్ని కాపాడాలి."
"ఎందుకీదంతా?"
"నేను నిరపరాధినని నిరూపించుకుందుకు నాకో వారం రోజులు గడువు కావాలి. ఆ గడువు సమయంలో నా నిర్దోషిత్వాన్ని ఋజువు చేసుకోగలను. అంతవరకూ మీ వంటి దగ్గర బంధువులే నాకు సాయపడాలి."
సునీత ఆలోచనలో పడింది. తననొక పర్యాయం ఏకాంతంలో అతడు బలవంతం చేయబోయిన దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదుల్తోంది. ఒక్క సారి తనకు లొంగి పొమ్మన్న అతని అర్దింపు, బెదిరింపు ఆమె చెవులలో గింగురు మంటోంది. కానీ అతనిప్పుడున్న దయనీయమైన పరిస్థితి------
'ఆలోచించకు సునీతా! నన్నిప్పుడో గదిలో వుంచి గొళ్ళెం పెట్టేయి. కాలక్షేపానికి ఏ పక్కింటి పిన్ని గారినో పిలిచి మీ అయన వచ్చేదాకా కబుర్లు చెప్పుకో" అన్నాడు రామస్వామి.
'ఆలాఎందుకు చేయడం?"
"అది నీకూ నాకూ కూడా మంచిది. నేను ఈ ఇంట్లోకి రావడం ఎవ్వరూ చూడలేదు. కానీ నా గురించి ఎవరయినా వెతికే టప్పుడీ యింటికీ రావచ్చును. ఈ ఇంట్లో మరోవ్యక్తి లేడన్న నమ్మకం చుట్టూ పక్కల అందరి లోనూ కలగాలి. నేను గదిలోనే వుంటాను. కానీ నేనిక్కడ లేనట్లు బలమైన సాక్ష్యం వుండాలి."
సునీత క్షణం అలోచించి "నీ పాడు బుద్ది అర్ధమైంది నాకు. నిన్ను గదిలో గొళ్ళెం పెట్టి పక్కింటి పిన్ని గారితో కబుర్లు చెబుతూ కూర్చుంటే అయన వస్తే ఏమనుకుంటారు? నువ్వు నాకోసం వచ్చావనీ, అనుకోకుండా పక్కింటావిడ వస్తే నిన్నావిధంగా దాచేననీ అయన భావించి నన్ను వదిలి పెట్టెస్తారనా?" అంది.
"సునీతా ప్లీజ్!' అన్నాడు రామస్వామి బాధగా. "నేను నిన్ను ప్ర్రేమించిన నేరానికి నాకు దుష్టత్వాన్ని అపాదించకు. నీ అనుమానం నిరాధారమైంది. ముందు నువ్వు ఒప్పుకుంటే అన్ని విషయాలూ నీ భర్త తో కూడా ఆలోచించుదామనుకుంటున్నాను. వాడికి తెలియకుండా నేనేదో చేస్తాననుకోకు."
తను అనవసరంగా తొందర పడిందేమోనని బాధ పడింది సునీత. అక తర్వాత ఆమె అతను చెప్పిన విధంగానే చేసింది.
