ఆమె పెళ్ళికానుక సినిమాకు వెళ్ళినట్లు యింట్లో తెలుసు అందుకని సరాసరి తండ్రీ కొడుకులా థియేటర్ కు బయల్దేరారు.
దారిలో వారికి పార్వతమ్మ శవం కనబడింది.
పార్వతమ్మ చనిపోయిందని ప్రసాద్ అనుకోలేదు. ఆయన పరీక్షించి చూసి-"ఎవరో కత్తితో పొడిచారు-" అన్నాడు.
"కత్తికాదు. చాకు-" అంటూ పక్కనే ఉన్న చాకును తీయబోయాడు సుధాకర్.
"అది నువ్వు ముట్టుకోకు-అమ్మను నేను లేవదీస్తాను-" అన్నాడు ప్రసాద్. ఆయన తల్లిని ముట్టుకునేసరికి వళ్ళు చల్లగా వుంది. అప్పుడు పరీక్షించగా శ్వాసలేదు. గుండె చప్పుడు లేదు.
"నీ బామ్మ చచ్చిపోయిందిరా-"అన్నాడు ప్రసాద్ చటుక్కున.
"అంటే....హత్య!....." అన్నాడు సుధాకర్ నిశ్చేష్టుడై.
అరవైయేళ్ళ తన బామ్మ ఆ విధంగా హత్య గావించబడుతుందని సుధాకర్ అనుకోలేదు.
ఒకరు శవం దగ్గరే వుండిపోగా-ఇంకొకరు పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు. శవాన్ని హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో తేలిన ప్రకారం పార్వతమ్మ మెడలో ఒక గొలుసు, రెండు చేతులకూ నాలుగు గాజులు పోయాయి. దగ్గర కొంత డబ్బు కూడా వుండాలి. ఎంతో తెలియదు.
"మా బామ్మ నా పెళ్ళి చూడాలని తహతహ లాడింది. తను పోయేలోగా నన్ను పెళ్ళి చేసుకోమని బ్రతిమలాడింది. నేను వినలేదు. తమ నూరేళ్ళూ బ్రతుకుతుందని నమ్మాను. దుర్మార్గుడు-నా బామ్మ ప్రాణం తీశాడు...." అంటూ యేడ్చాడు సుధాకర్.
ఆ దుర్మార్గుడెవరో అతడికి తెలియదు. కానీ ఆ చాకెవరిదో అతడికి తెలుసు. అయితే తన అనుమానాన్నతడు పోలీసుల ముందు బయటపెట్టలేదు. ముందుగా విశ్వానికి చెప్పాడు.
విశ్వం సతీష్ కి చెప్పాడు.
నారాయణరావు కొంత కథను పత్రికావిలేఖరి ద్వారా తెలుసుకున్నాడు చివరి భాగం మాత్రం ఆయన ఊహించాడు.
విశ్వం, సుధాకర్, సతీష్-ఈ ముగ్గురూ స్నేహితులు సతీష్ ద్వారా ఈ పేర్లాయన తరచు వింటూంటాడు.
"ఆమె ముసలిది. ఆ సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నట్లుంది. లేకుంటే అన్ని గంటలసేపు శవమక్కడ పడివుండదు. నేరస్థుడామె నగలు కాజేయాలంటే ఆమెను చంపాల్సిన అవసరముండదు. వాడెవరో చాలా క్రూరాత్ముడై వుండాలి-" అన్నాడు పత్రికా విలేఖరి.
ఈ విషయం కూడా కొడుక్కు చెప్పాడు నారాయణరావు.
జగన్నాధం అప్పుడు ఆఫీసులో వున్నాడు-"నా కేమిటో చాలా భయంగా వుంది నాన్నా!....." అన్నాడు.
"కానీ నా మనసిప్పుడు తేలికపడింది. ఆ హత్య సతీష్ చేయలేదని ధృవపడింది-" అన్నాడు నారాయణరావు.
"ఎలా?"
"నిజానికది దొంగతనం. అందుకు హత్య అవసరం లేదు. హంతకుడి క్రూరత్వమే హత్యకు పురికొల్పింది. మన సతీష్ అంత క్రూరంగా ప్రవర్తించలేడు-" అన్నాడు నారాయణరావు.
"దొంగతనం మాత్రం మనవాడికి అవసరమా?"
"లేదు కనీ అనుమానించాల్సిన ఆగత్యం యేర్పడింది కదా!"
జగన్నాధం నిట్టూర్చి-"చాకు గురించి సుధాకర్ రిపోర్టిస్తాడేమో!" అన్నాడు.
"నువ్వు భయపడకు. శవం దగ్గరున్న చాకు మనసతీష్ ది కాదు. వేరెవ్వరిదో-" అన్నాడు నారాయణ రావు.
"నీ కెలా తెలుసు?"
"సతీష్ చాకు-ఇంట్లోనే వుంది!"
"ఎక్కడ?"
"నా దగ్గర..."
"మరి ఉదయం నాతో చెప్పలేదేం?"
"సతీష్ ఎందుకు భయపడ్డాడో తెలుసుకోవాలనిపించింది నాకు. ఆ విశ్వం వచ్చి హత్యాస్థలంలో ఫలానా చాకుందనగానే వాడెందుకు కంగారుగా వెంటబడి పోయాడూ-అని నా కనుమానం కలిగింది. అందుక్కారణం తెలుసుకోవాలని యింట్లోంచి బయల్దేరాను...-"
జగన్నాధం ముఖంలో తృప్తి కనబడింది-"నాన్నా! నా మనసిప్పుడు తేలిక పడింది....-" అన్నాడు.
ఎందుకో నారాయణరావు మాత్రం భారంగా నిట్టూర్చాడు.
6
ఉదయం వెళ్ళినవాడు మధ్యాహ్నం రెండింటి కింటికి తిరిగొచ్చాడు సతీష్. అతడు దిగులుగా వుండడం కనిపెట్టిన మాలతి-"ఏమయిందిరా?" అంది.
"ఏమీకాలేదులే-"అన్నాడు సతీష్ చిరాగ్గా.
మాలతి అతణ్ణింక పలకరించడం మంచిది కాదని-భోజనానికి రమ్మంది.
"నేను భోంచేసే వచ్చాను-...." అన్నాడు సతీష్.
"ఎక్కడ?"
"ఓ స్నేహితుడింట్లో-...."
అతడి సమాధానం మాలతికి తృప్తి కలిగించలేదు. ఆమె మరి మాట్లాడకుండా మామగారి గదికి వెళ్ళింది.
నారాయణ మంచి నిద్రలో వున్నాడు. ఆయన్ను లేపింది.
"ఏమిటమ్మా?" అన్నాడు నారాయణరావు.
"సతీష్ వచ్చాడు. చిరాగ్గా వున్నాడు. భోంచేయమంటే యెక్కడో చేసే వచ్చానంటున్నాడు....-"అంది మాలతి.
ఆమె కళ్ళలోని దిగులు, హృదయవేదన వెంటనే నారాయణరావు కర్ధమయ్యాయి-"నేను రమ్మన్నానని వాడి నొక్కసారిలా పంపించు-" అన్నాడాయన.
మాలతి వెళ్ళిపోయింది. కాసేపట్లోనే సతీష్ అక్కడకు వచ్చి-"తాతయ్యా! అమ్మ నిన్ను రికమెండ్ చేయమందా?" అన్నాడు.
"దేనికి?"
"భోంచెయ్యమని నాకు చెప్పడానికి......"
"నువ్వు భోంచేయకపోతే మీ అమ్మకేం నష్టం?" అన్నాడు నారాయణరావు.
"నష్టం కాకపోతే నీ కెందుకు చెప్పింది?" అన్నాడు సతీష్.
"చెబితే మాత్రం నిన్ను పిలవాల్సిన అవసరం నాకేముంది?"
"మరైతే నువ్వెందుకు పిలిచావు?"
"ఆలోచించి చూడు..."
"నా భోజనం గురించి అమ్మకూ నీకూ ఇంత పట్టింపెందుకో-ఎంత ఆలోచించినా నా కర్ధం కావడంలేదు-...." అన్నాడు సతీష్.
"అభిమానం విలువ పోగొట్టుకున్నప్పుడు కానీ తెలియదులే...."
సతీష్ తడబడి-"అభిమానం నే నెప్పుడూ పోగొట్టుకోను...." అన్నాడు.
"ఇప్పటికే నా అభిమానం పోగొట్టుకున్నావు-" అన్నాడు నారాయణరావు.
"అలాగనకు తాతయ్యా!" అన్నాడు సతీష్.
"అనొద్దంటే అభిమానం ఆగదు. మీ అమ్మొచ్చి భోంచెయ్యనంటున్నావని చెప్పింది. ఆ వెంటనే నిన్ను పిలిచాను. కానీ భోంచేయమని చెప్పడానికి కాదు....."
సతీష్ పాంటు జేబులోకి చేతులు పోనిచ్చి అటూ యిటూ నడుస్తూ-"మరెందుకు పిలిపించావు?" అన్నాడు.
