Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 46


    రైలు కదిలేముందు ఓ అడుగు ముందుకు వేసేడు. సుబ్బులు తెల్లటిచెయ్యి గాలిలో వూగడం మాత్రం చూసేడు. వేగంగా రెండడుగులు వేశాడు. సుబ్బారావుని సుబ్బులు చూసింది. గాలిలో హేళనగా నవ్వినట్టు ఓ చిన్న చిర్నవ్వు విసిరింది. అది తిన్నగా గుండెల్లో దూసుకుపోయినట్లయింది సుబ్బారావుకి.
    అతను నీరసంగా ఇంటివేపు నడిచాడు. అక్కడ ఫ్లాట్ ఫారం మీద నించుని చేతులూపుకుంటూ మాటాడిన పెద్ద మనుషులు ఆఫ్ ది సిటీ కారుల్లో శరీరాలు పారేసుకుని దూసుకుపోయేరు.
    సుబ్బారావు తన దుర్విధిని తిట్టేసుకున్నాడు.
    ఇంటికొచ్చేసరికి చంద్ర డ్రెస్సు రెడీగా వుంది నైట్ డ్యూటీకి వెళ్ళేందుకు. ఆమె నాదుస్తుల్లో చూచిం తర్వాత సుబ్బారావు మనస్సు చివుక్కుమంది. రోగులకు సేవచేసే నిమిత్తం వెళ్ళబోతున్న చంద్ర తన మనసులోని రోగాన్ని అనుక్షణం పెద్దదిగా చేస్తోంది. సుబ్బారావు తలొంచుకు ఇంట్లో అడుగుపెట్టాడు.
    ఇంట్లోకి వెడుతున్న సుబ్బారావుని చూచి చంద్ర అన్నది.
    "బుజ్జి జాగ్రత్త, మీరు త్వరగా నిద్రపొండి. ఫ్లాస్కులో పాలు కాచి పోశాను."
    "వెళ్ళిరా చంద్రా! నా పనులు నేను చూచుకుంటాను. ఇంకా నాకు మతుంది. పోలేదు. నువ్వెళ్ళిరా, బుజ్జీ, నువ్వేడమాకొరేయ్? మీ అమ్మ ఉద్యోగానికెళ్ళొస్తుంది. నా ప్రాణం తీయకు నాన్నా!"
    "భగవంతుడా!" అన్నది చంద్ర.
    "నేనేం మాటాడను చంద్రా, ఏం మాటాడను. నోరు మూసుక్కూర్చుంటాను వెళ్ళిరా."
    చంద్ర వెళ్ళిపోయింది.
    
                                       *    *    *
    
    బాగా రాత్రివేళ బుజ్జిగాడు నిద్రలో కదలడం గమనించి బుర్రలోని ఆలోచనలని తాత్కాలికంగా తోలేశాడు సుబ్బారావు. గోడ గడియారం తాలూకు క్లిక్ క్లిక్ శబ్దం సుతిమెత్తగా వినిపిస్తూన్న వేళ బుజ్జిగాడు కదిలి తన ఏకాగ్రతని ఆలోచననీ ఖూనీ చేసేశాడు. నిద్రలో బుజ్జిగాడు అందంగా వున్నాడు. అలనాడు మండిపోతున్న నొసటిమీద చల్లటి చేతినుంచి "మీకేం పర్లేదు. మీరు బాగుపడతారు, నిజం. మీరు ఆరోగ్యంగా వుంటారు. దేముడు మీయందుంటాడు" అన్నప్పటి చంద్ర నిశ్చలమైన చూపూ నిర్మలమైన మొహాన్ని పుణికి పుచ్చుకున్నాడు బుజ్జి.
    "బుజ్జీ! నీకు సుఖం లేదురా తండ్రీ!" అనుకున్నాడు సుబ్బారావు.
    వెంటనే అతని మనసు హాస్పిటల్లో ఓ వార్డుపైన లగ్నమైంది. ఎవరో రోగి బాధలో మూలిగేడు, చంద్రావతి అటువేపు వెళ్ళిపోయింది. అతని మంచం పక్కన నించుని మెత్తగా నవ్వింది.
    "మీరు బాగా నవ్వగలరు. అలాగే నవ్వండి. మీరు నవ్వకపోతే నాకేం తోచదసలు. నవ్వండి ప్లీజ్" రోగి పిచ్చిగా అనేస్తున్నట్లున్నాడు.
    చంద్రావతి నవ్వుతున్నట్టే వుంది. రోగి ఆవేశంతో మాటాడేస్తున్నట్టే వున్నాడు. ఆనాడు అలాగే మాటాడి చంద్రావతి హృదయంలో స్థానం సంపాయించుకున్నాడు సుబ్బారావు. ఈనాడు నాలుగు రోజుల్లోనే కన్నుమూసే ఆ ఫలానాగాడు ఆశగా, వెర్రిగా మాట్లాడేస్తున్నాడు. చంద్రావతిని మరో మగాడి మత్తులో తోసేయకు భగవంతుడా! చంద్రావతి నా భార్య. ఒక నిరుద్యోగికి భార్య. ఈ మొగుడ్తో విసిగిపోయిన ఇల్లాలు. ఈ సమయాన ఆమె మనసు మరో మనిషిని, మరో రోగినీ కోరుకోవచ్చు. అలా చేయకు. నన్నన్యాయం చేయకు.
    ఎవరో కుర్రడాక్టరు కళ్ళల్లో కోరిక నింపుకుని చంద్రావతివేపు విసురుగా వొస్తున్నట్టూ, చంద్రావతి రోగి మంచం వొదిలి ఆ కుర్ర డాక్టరువేపు మెల్లిగా హంసలా నడిచినట్టూ మరోకొత్త 'ఊహాగానం'చేసి గుండెల్లో పోటు తెచ్చేసుకున్నాడు సుబ్బారావు. అలాగే ఆయాసంతో కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు.
    ఆ ఉదయం చంద్రావతి పెందరాళే వొచ్చేసింది ఆమె మొహంలో ఆర్నెల్ల నుంచి లేని తృప్తీ వెల్తురూ నిండుకున్నాయి. సుబ్బారావుకి ఆమె మొహం చూడగానే దడ కలిగింది.
    "మంచి వార్త చెప్పేదా?"
    "చెప్పు చంద్రా! నీకైనా "మంచి" జరగనివ్వు."
    "ఇది నా గురించి కాదు."
    "మరి!"
    "మీ గురించి"
    "చంద్రా! ఉదయమే వేళాకోళం చెయ్యకు నువ్వు. చచ్చి బతుకుతూన్న మనిషిన్నేను. నాకింకా మంచేమిటి వల్లకాడు"
    "మీకు డాక్టర్ సుదర్శనరావు బాగా తెలుసుగా." సుబ్బారావుకి డాక్టర్ సుదర్శనరావు బాగా తెలుసు. తెల్లవారుతుండగా చంద్రావతి నైతిక పరిధుల్ని కించపరిచే నిమిత్తం చేసిన ఊహాగానంలోని కుర్ర డాక్టరతనే! అంచేత తెలుసునన్నట్టు సిగ్గుగా, బెదురుగా తలూపేడు.
    'ఆయన్తో మాటాడేను."
    మాటలే ఆడిందో లేక అతని మనసుతోనే ఆడిందో! "చంద్రా ఇక చెప్పకు" అందామనుకుని నోరు తడిచేసుకు వూరుకున్నాడు.
    "కాకినాడలో మీకుద్యోగం వేస్యితానన్నారాయన" అన్నది చంద్ర ఉత్సాహంగా.
    సుబ్బారావు నెత్తిన పిడుగుపడ్డట్టయింది.
    "వొద్దు చంద్రా! నన్నింకా చేతగానివాడిగా తయారుచేయకు. నీ ప్రయోజకత్వంతో నన్నుద్దరించకు. ఆ డాక్టరుకీ నీకూ వెయ్యి నమస్కారాలు. నన్నిలా బతకనివ్వు. మరో మాట. నన్నుగురించీ, నా చేతకానితనం గురించీ నువ్వెవ్వరికీ చెప్పక్కరలేదు. నీకా అధికారవూఁ లేదు. తెలిసిందా? అయినా చంద్రా! నువ్వు కరుణించి నాకు వేయించబోయే ఉద్యోగం నేనెలా చేస్తాననుకున్నావసలు, నీకు తెలీదేమో. నువ్వంటే నాకు భయంగా వుందిప్పుడు. దైవసాక్షిగా నువ్వు నన్ను భయపెట్టేస్తున్నావ్....." చివర్ని మాటాడబోయేది ఆపి కళ్ళు తుడుచుకున్నాడు పిరికి వి.సుబ్బారావు.
    "భగవంతుడా!" మళ్ళా భగవంతుడ్ని తలిచింది చంద్రావతి.
    
                                        *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS