సుబ్బారావు నిర్ణయం విన్న తల్లీ, తండ్రీ, అన్నదమ్ములూ, వెరశి ఆత్మబంధువులంతా నోరూ నెత్తీ మొత్తుకున్నారు, "నీకెవడ్రా ప్రేమ గురించి చెప్పాడు! పోనీ ప్రేమించేవాడివి... హవ్వ... సుబ్బారావొరేయ్! నువ్వు నీ జన్మలో బాగుపడవు. తెలిసిందా, నువ్వు నీ యిష్టం మీద పెళ్ళి చేసుకుంటే నా యిష్టంమ్మీద నువ్వు బతకడం లేదన్న మాటే గదా! వెళ్ళిపోరేయ్! ఈ యింట్లోంచి వెళ్ళిపో, మళ్ళీ నీ దరిద్రగొట్టు మొహం నాకు చూపించకు" అన్నాడు తండ్రి తతిమ్మా వాళ్ళందరి కన్నీళ్ళు గమనిస్తూ గూడా.
వి.సుబ్బారావు కివన్నీ బాగా గుర్తుండిపోయేయి గుర్తుండకూడదను కున్నవన్నీ మరిచిపోయే అవకాశాన్ని అండ్ సన్స్ తినేశారు.
చంద్రావతి యింకా నర్సుద్యోగం చేస్తోనే వుంది. చంద్రావతి పతివ్రతా శిరోమణి అని నాగరిక సుబ్బారావు సర్టిఫికెటిచ్చాడు. చంద్రావతిని చూచి భయపడుతున్నది ఆ నాగరిక సుబ్బారావు తాలూకు అనవసరమైన ఆలోచనలు. అందుచేతనే అతను కోలుకోలేక పోతున్నాడు.
ఈ రోజున వి.సుబ్బారావు వాళ్ళబ్బాయి తొమ్మిది నెలల వాణ్ణి యెత్తుకుని అడిస్తున్నాడు యింట్లో. ఆ కుర్రాడి బోసినవ్వు ముద్దొచ్చే చిన్ని చిన్ని మాటలూ, అప్పుడప్పుడూ వాడి తాలూకు మెత్తని తాపులూ అనుభవించడం లేదతను. అతని మనసు మదరాసు మెయిల్మీద, అందులో ఖరీదైన కంపార్టుమెంటులో, అతి విలువైన సీట్లో ముద్దబంతి పూవులా కూర్చునుండగల సుబ్బుల్ని పలవరిస్తోంది. సుబ్బులుకి సొంతమైన రంగుల జీవితాన్ని ఊహిస్తోంది.
సుబ్బులూ పైకొచ్చేశావ్ ఫో! నీ దరిద్రాన్ని అండ్ సన్స్ తీర్చిపారేశారు. నువ్వైనా సుఖపడు సుబ్బులూ! నీకు గతం వెధవది. నిజం సుబ్బులూ! కానీ నాగతం బంగారంతో సమానం. నేనిప్పుడేమో వెధవని. ఏం చేతగాని వెధవని. నీకూ నాకూ చాలా భేదం ఉందోయ్ సుబ్బులూ! పూర్వం నీకు డ్రింకు తాగడం చాతనొచ్చేది గాదు, యెలా తాగాలో నన్నడిగేదానివి. ఇప్పుడేం తాగుతున్నావో మరి! పోన్లే సుబ్బులూ! అభిమానముంది ఇంత వుత్తరమైనా రాశావ్. తప్పకుండా వొస్తాను. వొచ్చి ఖరీదు పెరిగిన నీతో నలుగు నిముషాలు పాటు నా చేదు జీవితాన్ని మనవి చేస్తాను. సుబ్బులూ, సుబ్బులూ నువ్వు పెళ్ళి చేసుకుంటావా? ఎవర్ని చేసుకుంటావ్? ఇంకా ఆ రెండు జెడలే వేస్తూన్నావా? నా మాటడుగుతే అవే నీకు నప్పుతుంది. తారామణీ! అఖిలాంద్ర ప్రజలకి పరిచయం కాబోతూన్న ఒకప్పటి పేదరాలా! నీకు నా ఆశీస్సులు."
సుబ్బారావు కనుకొలకులలో నీళ్ళు నిలిచేయి! ఎంచేతంటే జెలసీ, అందానికీ మధ్యవున్న భావమేదో అతన్ని పూర్తిగా నింపేసింది. ఏమైతేనేం సుబ్బుల్ని తలుచుకుని ఏడ్చేసేడు సుబ్బారావు వి. సుబ్బారావు.
అతనీ అవస్థలో ఉన్నప్పుడు చంద్రావతి పిలిచింది. మూడోసారిగాబోలు ఉలిక్కిపడి, తెప్పరిల్లి వూఁకొట్టేడు సుబ్బారావు.
"అన్నం వొడ్డించేను."
"అక్కర్లేదు, చంద్రా! ఆకలనడం లేదసలు: నువ్వు తినేయ్."
"ఇప్పుడు నా సంగతేగావల్సొంది. లేవండి చల్లారి పోతుంది."
బుజ్జిగాడ్ని భుజాన వేసుకుని సుబ్బారావు వంటగదిలోకి వెళ్ళేడు. వంటగదిలో రెండు కంచాల్లోనూ వొడ్డించింది చంద్రావతి. బుజ్జిని నేలమీదికి దించి, చొక్కా దులుపుకుని కసిగా అనేశాడు సుబ్బారావు.
"చంద్రానువ్వు నన్ను పూర్తిగా అవమానించేస్తున్నావ్. నీకు తెలుసా నువ్వు నన్ను తినేస్తున్నావు. మనిషిని వున్న పళంగా చంపేస్తున్నావ్ నువ్వు."
సుబ్బారావు కెక్కిన పిచ్చిసంగతి చంద్రావతికి పూర్తిగా తెలుసు. అందుకే తలొంచుకు కూర వొడ్డిస్తోంది. సుబ్బారావు గది గుమ్మానికి ఆనుకుని రెండు చేతుల్తోనూ తల సవరించుకుంటూ అన్నాడు!
"చంద్రా! పోనీ ఓపని చేయలేవూ?"
చంద్రావతి తలెత్తి చూసింది.
"మరేం లేదు. నువ్వు ఖంగారు పడొద్దు. నేను నిజమే చెప్తున్నాను. నే చెప్పింది పూర్తిగా విని ఆనక ఆలోచన చేసి చెప్పు. ఫర్లేదు కాస్తాలస్యమైనా నీ నిర్ణయం చెప్పేయ్."
"చెప్పండి. నన్నేం చేయమంటారు?"
సుబ్బారావు చంద్రావతి వేపు నిశితంగా చూసేడు. చెప్దామనుకున్న మాటకాస్తా గుండెల్లోనే పేలిపోయింది. గిర్రున వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చేడు. పడక కుర్చీలో కూర్చుని యింత టాపు వేపు చూస్తూ గొణుక్కున్నాడు.
"నాకుద్యోగం లేదు. నువ్వు నన్ను పోషించేస్తున్నావు చంద్రా! నా బాధ గూడా అదే. నువ్వు నా కోసం ఉద్యోగం మానేయ్. పైగా నువ్వు నర్సుని. ఒఅక్నాడు నన్నలరించిన.. వొద్దు చంద్రా! నువ్వు మంచి దానివి పైగా దేవతవి. నేనేం నీకు చెప్పలేను. శాసించే అధికారం నీ మంచితనం తినేసింది."
బుజ్జిగాడి యేడుపు విని మళ్ళా లేచి నించున్నాడు సుబ్బారావు. గబగబా వాడి దగ్గరికెళ్ళాడు. రెండు చేతుల్తో వాడి నెత్తుకుని గుండెలకు హత్తుకుని అన్నాడు.
"నువ్వొక్కడివి బుజ్జీ! అమ్మప్రాణం తినేస్తున్నావ్ వెధవ! చంద్రా నన్ను క్షమించు. మరేం లేదు. నేను నీకేం చెప్పలేను. అన్నం వడ్డించావు కదూ, తినేస్తాను చంద్రా. చాలా ఆకలిగావుంది. వెధవది, నాకుద్యోగం లేదు గదూ అంచేత నోటికొచ్చినట్లు వాగేస్తున్నాను."
అతను కంచం ముందు కూర్చున్నాడు, చంద్రావతి లోలోపల ఏడ్చేసింది. సుబ్బారావు అన్నం తినడం పూర్తి చేసేడు.
ఆ సాయంత్రం అతను స్నానం చేసేడు. చక్కగా తలదువ్వుకున్నాడు. చంద్రావతి ముందొచ్చి నించున్నాడు.
"వొస్తా చంద్రా! మళ్ళా యిప్పుడే వొస్తాను. స్టేషన్ వరకూ వెళ్ళొస్తాను. వొస్తారా బుజ్జీ! వొస్తా!"
ఇల్లొదిలి స్టేషను రోడ్డువైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళేడు. స్టేషను చేరేసరికి మదరాసు మెయిలొచ్చి అయిదు నిమిషాలయిందని ఎవరో చెప్పేరు. వేగంగా ఫ్లాటుఫారం మీదికి గెంతేడు. సుబ్బుల్ని స్పష్టంగా చూళ్ళేదుగాని సుబ్బులు చుట్టూతా మూగిన జనాన్ని చూసేడు. వాళ్ళ ఖరీదైన వేషాల్ని చూసేడు. మతిపోయినట్లయింది. ఓ గోడకి చేరగిలబడిపోయేడు.
సుబ్బులు కంపార్టుమెంటు దగ్గిర జనం నుంచి మందహాసాలూ, అట్టహాసాలూ వివిధ రకాలుగా వినిపిస్తున్నాయి. తలుపుదగ్గిర నుంచున్న సుబ్బులు "సగం" కనిపించింది. పూర్వపు బంగారు బొమ్మకి యీ మధ్య నగిషీతనం ఎక్కువైనట్టు పసిగట్టేయగలిగాడు. జనంతో చెప్పేయాలి.
ఏమండోయ్! జెంటిల్మెన్ ఆఫ్ ది సిటీ. పుర ప్రముఖుల్లారా! పెద్దలారా! ఆవిడెవరనుకున్నారు? మా సుబ్బులు ఆఫ్టరాల్ జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లో సేల్స్ గర్ల్. అమ్మకం చేసే ఆడకూతురు. ఆవిడ్నెందుకు ఆకాశానికెత్తేస్తారు. ఇక్కడ నేనున్నాను. పైచెప్పబడిన సంస్థలో యజమానిగా చెలామణి అయిన శ్రీశ్రీ వి.సుబ్బారావుగార్ని మీరంతా నా దగ్గరకు రండి. వేగంగా వొచ్చేయండి! నేనా పిల్లతో ఏకాంతంగా మాటాడేందుకు అవకాశమివ్వండి. మీ దొంగచూపులూ, నక్కవినయాలూ, కారాకిళ్ళీ పళ్ళూ, వాసనగొట్టే నోళ్ళు; జడ్జివొళ్ళూ, సుబ్బులుకి దూరం చేయండి తప్పుకోండి ముందు సుబ్బులూ నేనొచ్చేశాను. సుబ్బులూ, నామీద జాలి చూపించు. "ఏమండీ! నా యజమానిగారూ! బాధపడుతున్నారా?" అని సముదాయింపు సుబ్బులూ.
