Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 47


                                                       కలెక్టరూ క్షమించు

    "నమస్కారం గురూగారూ! బాగా చదువుతున్నారా? మీకేం లెండి. నిక్షేపంలాంటి వాళ్ళు. చదివి బాగుపడవలసిన వాళ్ళు. ఐ.ఎ.ఎస్.కి వెళ్ళవలసిన వాళ్ళూను. గుడ్ లక్. వొస్తాను" ఎక్కడ్నుంచి ఒచ్చాడో ఒచ్చీ రావడంతోటే బడాబడా నాలుగూ అనేసి మళ్ళా తనకేమీ పట్టనట్టు యీల పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు గుర్నాధం.
    ప్రసాదం మనసు చివుక్కుమన్నది. మళ్లీ పుస్తకంలో చూపు నిలిపేడు.
    కాలేజీలో చేరిన మొదటిరోజుల్లో ఈ కోరిక పుట్టింది. రాను రానూ అంతరాంతరాల్లో పురుగులా తిరగడం మూలంగా చివరికి తప్పదన్నట్టూ యీ ఆఖరి సంవత్సరంలో పదిమంది ఎదుటా చెప్పాడు. మరోప్పుడైతే అదీ చెప్పక పోను.
    'హాస్టల్ డే'_
    వెయ్యిదీపాలు వెలుగుతున్నాయి. దీపాల కాంతిలో ఆవరణంతా కన్నులపండువుగా వుంది. వేదికమీద కాలేజీ ప్రిన్సిపాల్, వారి కుడిపక్క హాస్టలు వార్డెన్, ఎడం ప్రక్క ఆ వూరి చైర్మన్. 'భవిష్యత్తులో నేను' అనే విషయం మీద హాస్టలు కుర్రాళ్ళు ఒకరి తర్వాత మరొకరు మాటాడేస్తున్నారు. కార్యక్రమం పూర్తవుతుందనగా, హాస్టల్ సెక్రటరీ రామిరెడ్డి ప్రసాదం పేరు ఎనౌన్సు చేసాడు.
    చిరుచెమటలు పోశాయి. కాళ్ళు ఒణికాయి. తడబడుతూ వేదికమీదకు వెళ్ళాడు. మైకు ముందు నించున్న తర్వాత కలిగిన ఉత్సాహం అతన్నింత అభాసు చేయిస్తోంది.
    "ప్రసాదంగారు కలక్టర్రోయ్!"
    పుస్తకాలపురుగు, బుద్ధావతారం, చంటిబాబు - ఈ మొదలైన ముద్దుపేర్లు చాలవన్నట్టు. ఆనాటినుంచీ ఈ పిలుపుతో అలంకరిస్తున్నారు వీళ్ళందరూ.    
    నిజానికి దీన్లో తప్పేముందసలు? చదువుకుని, చేసిన కృషితో బాగుపడి కలక్టరవడం తప్పా? ఈ ఉద్దేశాన్ని గుండెల్లో దాచుకోవడం నేరమా? సమయం వచ్చింది గనక. నేను ఫలానా, నా జాతకం ఫలానా అని జోస్యం చెప్పడం అభాసా?
    కాదని చాలా తడవలనుకున్నాడు ప్రసాదం. కానీ, వీళ్ళనోళ్లు మంచివికావు. ఒక మనిషి అభిప్రాయానికి విలువనిచ్చే సివిలిజేషను వీళ్ళకి చాలా దూరం. అందుచేత రోజుకో మాటైనా పలకరిస్తోన్న తన కల_పరాయివాళ్ళ దృష్టిలో ఒకానొక హాస్యగాడి వింతకోరికలా నిలిచిపోయిందేవిటానే బాధ. అప్పుడు మనస్సంతా సిగ్గుతో నిండుకుపోతుంది. ఇదో రకమైన శిక్ష.
    ప్రసాదానికి వాళ్ళ డాడీ గుర్తుకొచ్చేరు. వారి హోదాలాటి నల్లటి ఫియట్ కారు గుర్తుకొచ్చింది. వారి పరువు మర్యాదల్లాంటి అందమైన 'కాంతిభవనం' గుర్తుకొచ్చింది. వారి మంచి మనసులాంటి ఏభయి ఎకరాల మాగాణి గుర్తుకొచ్చింది. వారి పూర్వజన్మ సుకృతానికి సాక్ష్యాలైన డాక్టరూ, లాయరన్నయ్యలు గుర్తుకొచ్చేరు.
    ఆ కుటుంబంలోని సభ్యుడు తను. తనకి కలక్టరవ్వాలనే ఆశ ఉండటంలో అతిశయోక్తి లేదు. అనుకోకూడదు గానీ - తనని యాగీచేస్తోన్న వాళ్ళల్లో యే కొందర్నైనా జీవిత పర్యంతం తనకి బానిసలుగా యేర్పాటు చేసుకోగల తాహతు తనది. తన అంతస్తేమిటో తెలీని ఫూల్స్.
    మనసారా నమ్ముకుంటున్న లక్ష్యం ఐ.ఏ.ఎస్. ఊహా ప్రపంచంలో, ఉద్దేశాల లిస్టులో చెరగని ముద్ర కలక్టరు గిరి. ఇది తననుంచి దూరం కావడం కల్ల. తన ప్రయోజకత్త్వమేమిటో తెలిసినవాడు ఈ గుర్నాధమే తన దగ్గర దిక్కుమాలిన గుమాస్తా ఉద్యోగం చేయాలి.
    అందర్తో తన అంతస్థు గురించి చెప్పేయాలన్నంత ఉద్రేకం కలుగుతోంది. కానీ, అర్థం చేసుకోలేని అనాగరికుల ముందు, తన మూలంగా - ఉచ్చమైన తన కుటుంబం గూడా చిన్నచూపు రుద్దుకోవడం యిష్టం లేదు. అందుచేతనే కోపాన్ని దిగమింగుకుని, కాసిని కప్పి పెట్టుకుని బతుకు తున్నాడు.
    పుస్తకం మూసేడు. గదివేపు వెళ్ళబోయేడు. రామిరెడ్డి పిలుపుతో ఆగి నుంచుని పలకరింపుగా అలవోకగా నవ్వేడు. రామిరెడ్డి గబగబా ప్రసాదం దగ్గరికొచ్చి అతని చేతిని లాక్కుంటూ.
    "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు.
    "ఎందుకనిట?"
    "కొట్టేవ్. ఎస్సే కాంపిటేషనల్లో ఫస్టొచ్చేవ్."
    "థాంక్స్"
    "పద. కేంటీన్ లో కాఫీ పోయించు. జీవుడు అల్లాడిపోతున్నా నీకోసం వెతకడం మానలేదు."
    "వొద్దు. ఇవాళ నా మనసు బాగోలేదు."
    "వెధవ మనసు. తీసిపారేయ్. శుభవార్త తెచ్చిన దూతకి ఆకలెక్కువ. సంప్రదాయాన్ని మర్డర్ చేయకు. ముందునడు."
    "నేను రాలేనులే రెడ్డీ నువ్వెళ్ళు."
    "అందుచేతనే నిన్నందరూ అంటున్నారు - సంఘజీవివికావూ అవటాని. నా చేత గూడా ఆ మాటనిపించకు ప్రసాదం!"
    రామిరెడ్డితో పాటు కేంటీన్ ల్లోకి అడుగుపెట్టేడు ప్రసాదం. నాలుగైదు తలలు అటూ యిటూ వెతికి వేలాడి మరో రెండు మూడు తలల్ని పలుకరించి కలిసికట్టుగా మొత్తం కిసుక్కున నవ్వేశాయి. ప్రసాదం ఈ రకమైన వాతావరణానికి అలవాటు పడుతున్నవాడు గనుక అంతగా పట్టించుకోలేదు. వాళ్ళందరికీ దూరంగా ఓ మూల కూర్చున్నాడు. రామిరెడ్డి మరో యిద్దర్ని వెంటబెట్టుకొచ్చి ప్రసాదం దగ్గిర కూర్చున్నాడు.
    నలుగురికీ స్వీట్సు ఆర్డరిచ్చాడు రామిరెడ్డి. పుస్తకంలో తలదూర్చేడు ప్రసాదం.
    "ఏం రెడ్డీ! శకుంతలమ్మ రాత్రి సినిమా కొచ్చిందట. నిజమా?" కొత్తగా వచ్చిన యిద్దర్లో కేషియస్ అడిగాడు.
    "ఎవరు చెప్పింది? వేణూనా?"
    "మాకు తెలుసులే గురూ!" ఆడపిల్ల గొంతు మగపిల్లాడు కులుకుతూ అన్నాడు.
    "నాన్సెన్స్! మీకెలా తెలుస్తుందోయ్?" రామిరెడ్డి విసుక్కున్నాడు.
    "తెలుసంతే?" కేషియన్ స్వీటు నోట్లో పెట్టుకుని ముద్దగా చెప్పేడు.
    "నౌ! సినిమాకే కాదు. వెన్నెల్లో నాతోపాటు తిరుగుతుంది. సముద్రంలో నా సరసన నించుని స్నానం చేస్తుంది. శకుంతల కళ్ళంటే నాకెంతో యిష్టం ఇలా అన్నానని వేణూతో చెప్పు. చెప్పి, వాడూ, నువ్వూ యిద్దరూ బడుద్దాయిలని ఒప్పుకోండి. ఒప్పుకుని జాయింటుగా ఉరేసుకు చావండి తెలిసిందా? నెక్ట్స్... మీరిద్దరూ తింటున్న స్వీట్సుగాని, తాగబోయే కాఫీగ్గాని బిల్లు ప్రసాదం ఇవ్వడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS