రెండు ఉచ్చ్వాసాల దిగంత స్వప్నం .....కొండమావి గుబురుల కింద.
అడవి మల్లెల దండల పరిమళాలు........గుప్పెడు ఆకాశంలో తేలిపోవడం..........
నేలకు దిగుతున్న మబ్బుల్ని రెండు చేతుల్తో అక్కున చేర్చుకుని ముద్దు పెట్టుకోవడం ....అలసట లేని పరుగు........ఆయాసం లేని మహోద్రేకం......గుండెల్లో రక్తచలనం.....కనురెప్పల నీడల్లో ఉత్సాహం పరుగులు........నిజానికి, భయానికి, నిట్టుర్పుకి, తెగింపుకి, నిలువెత్తు యౌవనానికి పయనిచ్చే నీరాజనం ప్రేమ......
నాలుగు మెత్తని చేతుల మొట్టమొదటి స్పర్శానుభవం ........గాడమైన చుంభన తర్వాత కలిగే మొహపరవశం.....దహిస్తున్న దావానలపు కోరిక ----
సముద్రం ముందు పొడి ఇసక మీద ఒక్కసారి దుమికి వచ్చే అల నెమ్మది నెమ్మదిగా ఇంకిపోతున్న నిశ్శబ్దపు చప్పుడు .....
అలలు ఇంకిపోయాయి.
కలలు కరిగిపోతాయి కలవరాన్ని మిగుల్చుతాయి.
నిండు వెన్నెల చందమామ మీద,
ప్రేయసి నిండు నీలాల కురుల ముసుగులో
లోకమంతా చీకటిగా కన్పిస్తుంది.
లోకమంతా స్వర్గంలా, తెల్లవారుజామున స్వప్నంలా కన్పిస్తుంది.
వాల్ పోస్టరులో కన్పిస్తున్న కృష్ణ నందన చిత్రం వేపు చూస్తున్నాడు విమల్.
ఆకుపచ్చటి యవ్వన వృక్షానికి, పసుపుపచ్చ లాంటి మెరుపుల వయసు.
కృష్ణ నందన .
అయిదేళ్ళ క్రితం-
వెన్నెల రాత్రి, అరుకు ఘాట్ రోడ్ పక్కన, ఏకాంతపు మర్రి చెట్టు కింద ఇద్దరే.
నిశ్శబ్దపు ఒడిలో కూర్చున్న సమయం చటుక్కున గుర్తుకొచ్చింది విమల్ కి.
దూరంగా బుర్రగుహలకు వెళ్ళేదారి , వెన్నెల్లో మల్లెపూల వాగులా కన్పిస్తోంది.
"ఇక్కడ ఈ పల్లెటూల్లో , ఈ చెట్టు కింద గుడిసెలో ఉండిపొతే ఎలా వుంటుందో కదా......?"
తెల్లటి చీర, తెల్లటి జాకెట్టులో వెన్నెల బొమ్మలా వుంది కృష్ణ నందన.
మర్రి చెట్టు ఆకుల సందులోంచి వెన్నెల కిరణాలు సూటిగా ఆమె గుండెల మీద పడుతున్నాయి.
వాటివేపే చూస్తున్నాడు విమల్.
గుండెకత్తుకొని, కనురెప్పల మీద, నును మెత్తటి ఎదమీద ముద్దు పెట్టుకున్నాడు విమల్.
అంతవరకూ కొండ గుహల్లో దాగున్న చలిగాలి వంటికి రివ్వున తగిలినట్లయింది కృష్ణనందనకు.
దూరంగా, గిరిజనుల పల్లెలోంచి జానపద గీతం అస్పష్టంగా విన్పిస్తోంది.
"నేనంటే నీ కిష్టమేనా నందనా........" మెరుస్తున్న ముక్కుపుడక మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు విమల్.
నవ్వింది కృష్ణ నందన. ఆ నవ్వు ఓ గిరిజన జానపద గీతంలా వుంది.
"నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేదో తెలీదు కానీ.......నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా------"
"ఎంతగా ప్రేమిస్తున్నారు-------"
"చెప్పనా--------"
"ఇంతగా------" ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
"దీన్ని ప్రేమంటారా ------ముద్దంటారా------"
"ముద్దుగా దీన్నీ ప్రేమనే అంటారు......"
మళ్ళీ నవ్వింది కృష్ణ నందన.
"ప్రేమలో ముద్దే కాదు....ద్వేషం కూడా వుంటుంది.........అవునా ...' అప్పుడే కృష్ణ నందన చూపు, వెన్నెల్లో మెరుస్తూ వాళ్ళిద్దరి వేపే చూస్తున్న ఓ జంతువు మీద పడింది.
చటుక్కున అటుపక్క చూసిన విమల్ ఆ జంతువుని చూసి , భయపడ్డాడు.
"నందనా ....పాము ......శబ్దం చెయ్యకుండా లెగు......దూరంగా వెళ్ళిపోదాం......"నవ్వింది కృష్ణ నందన.
"దాన్ని మనం డిస్ట్రబ్ చెయ్యకుండా వుంటే, కాసేపు వెన్నెల్లో సేదదీరి , అదే వెళ్లిపోతుంది.....' ధీమాగా అంది.
మరో అయిదు నిమిషాల తర్వాత ఆ పాము కింద కెళ్ళిపోయింది.
"భలే చెప్పావ్......పాముల మెంటాలిటీ బాగా స్టడీ చేసినట్లున్నావ్"
"లేదు......పాముల మెంటాలిటీయే కాదు......ప్రతి ప్రాణి మెంటాలిటీ కూడా అదే......ప్రేమిస్తే , ప్రేమను, ద్వేషిస్తే ద్వేషాన్ని స్తాయ్....." నెమ్మదిగా అంది నందన.
"ప్రేమలోంచే ద్వేషం పుడుతుందా?"
"ఎక్కడో చదివాను.......
KISS ME.....
KILL ME.....
LOVE ME.....
LEAVE ME......
DAMN ME.......
DARLING,
BUT DONT DECEIVE ME
"ప్రేమ పేరుతొ మోసం జరిగిందనుకో .......అడై నా, మగైనా రియాక్షన్ ఒక్కటే......అది నిజమైన ప్రేమ విషయంలో.......' చెప్పడం ఆపింది కృష్ణ నందన.
