Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 44

 

    "మనలో ఒకరు స్త్రీగా మారాలి ..." అన్నాడు రాజా.
    "అంటే నేనే మారాలి ! అన్నాడు విక్టర్"
    ఇద్దరిలోకి విక్టర్ కాస్త పొట్టి. బయట ఒక అదా మగా నడుస్తున్నప్పుడిద్దరిలో పురుషుడు పొట్టిగానూ, స్త్రీ పొడుగ్గానూ వుంటే చూపరులనా జంట ఆకర్షిస్తుంది. అది తమ కంత మంచిది కాదు.
    విక్టర్ చీర కట్టుకున్నాడు. అందు కనుగుణంగా తన రూపు రేఖలు దిద్దుకున్నాడు.
    'ఆడపిల్ల కంటే బాగున్నావు....' అన్నాడు రాజా.
    రాజా పుల్ సూటు వేసుకున్నాడు. ఇప్పుడీద్దరూ చక్కని జంట లాగున్నారు. నిలువుటద్దం ముందు పక్కపక్కన నిలబడి చూసుకుని ఆశ్చర్య పోయారు.
    "ఈ వేషాల్లో మననింకేవ్వరూ గుర్తుపట్టలేరు. నువ్వేమో పెద్ద అయ్యే యస్సాఫీసర్లాగున్నావు. నేను నీ జంటకు తగ్గట్లే వున్నాను...." అన్నాడు విక్టర్.
    "సహజంగా అందమైన వాళ్ళం గదా -- " అని -- "నువు ఎత్తుమడమల జోళ్ళు వేసుకో -- మోడ్రన్ గా వుంటుంది ." అన్నాడు రాజా.
    విక్టర్ పాదాల సైజు పెద్దది. అక్కడి అతడికి సూటయ్యే ఎత్తు మడమల జోడు లేదు.
    "మనం జోళ్ళు మార్చాక తప్పదు. వెంకన్న అసాధ్యుడు. కాలిజోళ్ళను చూసైనా మనని గుర్తించగలడు...." అన్నాడు రాజా మళ్ళీ.
    ఇద్దరూ కాసేపు కష్టపడ్డారు. రాజా వచ్చేటప్పుడు నల్లబూట్లు వేసుకున్నాడు. అతడు వాటికీ బదులిక్కడ బ్రౌన్ కలర్ బూట్లు వేసుకొన్నాడు. విక్టర్ తన ఆకూ చెప్పులకు పైన కొంత రంగు పులిమాడు. అందువల్ల కొంతపని జరిగింది.
    "నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా వుంటే చెప్పుల్ని చీర మాటున దాచుకోవచ్చు. వాటి గురించి కంగారు పడకు-" అన్నాడు రాజా.
    ఆ తర్వాత ఇద్దరూ అక్కడ కాసేపు కలిసి నటన ప్రాక్టీసు చేశారు. అచ్చం భార్యాభర్త ల్లా ప్రవర్తించగలగడానికి వారికీ కాసేప్పట్టింది. అప్పుడిద్దరూ హోటల్లోంచి బయటకు వచ్చారు. ఎప్పుడూ వారిని ప్రత్యేకంగా చూడలేదు. రిసెప్షనిస్టు మాత్రం "జంట చాలా బాగుంది --" అనుకుంది.
    రాజా అయిదడుగుల ఎడంగుళాలుంటాడు. విక్టర్ అయిదూ అరుంటాడు. నిజానికి వారు చక్కని జంట లాగే వున్నారు.
    రోడ్డు మీదకు వచ్చేక ఏ టాక్సీని పిలవకుండా పుట్ పాత్ మీద నడవసాగారు.
    "నడవడం నాకు కష్ట మనిపిస్తోంది. దరిదాపుల్లో వెంకన్న వున్నాడంటే అనుమానించవచ్చు. టాక్సీ పిలుద్దాం -" అన్నాడు విక్టర్. అలవాటు లేని వాళ్ళకు చీరతో నడవడం కష్టమైనపనే!
    "టాక్సీలో ఎక్కడికి వెడదాం ?" అన్నాడు రాజా.
    "స్టేషను కు పోదాం. ఈ వూరు వదిలిపెట్టేద్దాం --"
    సరేనని రాజా రోడ్డు కేసి తిరిగాడు. సరిగ్గా అప్పుడే ఓ టాక్సీ వచ్చి వారి పక్కన ఆగింది.
    ఇద్దరూ టాక్సీ ఎక్కి కూర్చున్నారు.
    "రైల్వే స్టేషన్ !" అన్నాడు రాజా.
    "మిమ్మల్నప్పుడే ఎలా పారి పోనిస్తాను మిస్టర్ రాజా! మీ పద్దతి మార్చుకుంటానని నాకింకా మాతివ్వలేదు కదా!" అన్నాడు డ్రైవర్.
    రాజా, విక్టర్ ఉలిక్కి పడ్డాడు. ఆ డ్రైవర్ డిటెక్టివ్ వెంకన్న ని వారికి అర్ధమైపోయింది.
    "మీ వేషాలు చాలా బాగున్నాయి. ఏ లోపమూ లేదని నేనే ఒప్పుకుంటాను. కానీ ఈ వెంకన్న కళ్ళు కప్పడం మీ వల్ల కాదని ఈపాటికి అర్ధమై వుండాలి మీకు. మర్యాదగా మీ అశక్తత ఒప్పేసుకోండి -- " అన్నాడు వెంకన్న.
    "మామ్మల్నేలా గుర్తుపట్టావు ?" అన్నాడు విక్టర్ ఆశ్చర్యంగా.
    "చాలా సింపుల్ ! మిమ్మల్ననుసరించి మీతో ఈ హోటలు కొచ్చాను. ఆ తర్వాత ఇక్కడే మాటు వేశాను. మీరు బయటకు రాగానే గుర్తు పట్టాను...." అన్నాడు వెంకన్న తమాషాగా నవ్వుతూ.
    "ఎలా."
    "మీరు నాకు లొంగి పాతానని మాటివ్వండి. నేను మిమ్మల్నేలాగు గుర్తు పట్టానో ఇప్పుడే చెప్పేస్తాను--" అన్నాడు వెంకన్న.
    "నువ్వు మాకు రేపటిదాకా గడువిచ్చాను. ఆ తర్వాతే మేము నీకు లొంగేది ...." అన్నాడు రాజా.
    "అయితే ఇంకా మీలో ఆశ చావలేదన్న మాట. అంతా మీ భ్రమ . సరే మిమ్మల్ని పెద్ద బజార్లో దిగబెడతాను. మీ ప్రయత్నం మీరు చేయండి....." అన్నాడు వెంకన్న.

                                      3
    పెద్ద జజార్లో వెంకన్న టాక్సీ లోంచి దిగేక రాజా. విక్టర్ -- యిద్దరూ కూడా తిన్నగా ఖాన్ టైలరింగ్ దుకాణానికి వెళ్ళారు. ఆ వూళ్ళోకే చెప్పుకోదగ్గ పెద్ద దుకాణమది. అందులోనే పురుషులకీ స్త్రీలకి వేర్వేరు విభాగాలున్నాయి. ట్రయిల్ గదులే డజను దాకా వున్నాయి. ఆ షాపెప్పుడు కోలాహలంగానూ, సందడి గానూ వుంటుంది.
    రాజా ఖాన్ తో ఏదో మాట్లాడాడు. ఖాన్ వెంటనే అతణ్ణి ఓ ట్రయిల్ గదిలోకి తీసుకు వెళ్లి -- "ఏమిటి సంగతి?" అనడిగాడు.
    విక్టర్ బయటనే వుండిపోయాడు.
    "మమ్మల్నో డిటెక్టివ్ వెంటాడుతున్నాడు. అతడు దుకాణం బయటే మాటు వేశాడు. మేము వేషాలు మార్చుకుని తప్పించుకు పోవాలి --" అన్నాడు రాజా.
    ఖాన్ ముస్తాసరిగా --"నేనేం చేయాలో చెప్పు !" అన్నాడు.
    రాజా వివరించాడు.
    వెంకన్న చాలా తెలివైనవాడు. త్రిభువన్ హోటలు కు వెళ్ళిన వారందర్నీ గమనించి బయటకు వచ్చే వాళ్ళలో కొత్తగా కనపడ్డ తమ జంట ననుమానించి వుంటాడు. ఇప్పుడతడిని తప్పు దారి పట్టించాలంటే మంచి మార్గముంది.
    ముందుగా ఇద్దరు సర్దార్జీలను షాపులోకి రప్పించాలి. వాళ్ళను తమ వేషాలతో బయటకు పంపించాలి. ఆ తర్వాత తామిద్దరూ సర్దార్జీ వేషాల్లో బయటకు పోతారు.
    'అయితే మనవాళ్ళకు ఫోన్ చేయనా?" అన్నాడు ఖాన్.
    "ఊ...త్వరగా ...." అన్నాడు రాజా.
    తర్వాత ఖాన్ ట్రయిల్ గదిలోంచి బయటకు వచ్చి గెస్ట్ రూమ్ లోకి విక్టర్ నీ, రాజాను పంపాడు. అక్కడ వాళ్ళిద్దరూ తమ పాత వేషాలు మార్చేసుకుని శుభ్రంగా ముఖాలు కడిగేసుకున్నారు.
    సరిగ్గా పావుగంటలో ఆ గదిలోకి సర్దార్జీ లిద్దరూ వచ్చారు. విక్టర్ నీ రాజానూ చూస్తూనే సంతోషంగా పలకరించి తమ పెట్టుడు గడ్డాలూ, మీసాలూ తీసేశారు. క్షణాల మీద వాళ్ళలో ఒకడు రాజా కులా తయారయ్యాడు. రెండో వాడు స్త్రీ వేషం వేశాడు. కాసేపు రూపు రేఖలు తీర్చిదిద్దే సరికి వాళ్ళు అచ్చం ఇందాకా రాజా, విక్టర్ లున్నట్టే ఉన్నారు.
    రాజా, విక్టర్ -- ఇద్దరూ వాళ్ళను అభినందించారు. అప్పుడా జంట బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో రాజా, విక్టర్ ఇద్దరూ సర్దార్జీ వేషాల్లో బయటకు వచ్చారు.
    "ఇంక బ్రహ్మ దేవుడు గూడా మనని పట్టలేదు"- అన్నాడు విక్టర్.
    "వెంకన్న ఆ జంట ననుసరించి పోయుంటాడు "-- అన్నాడు రాజా.
    'అది సరేలే -- మనమిప్పుడు సర్దార్జీలం గదా -- ఏ హోటలకో పోయి కాస్త చాయ్ తాగుదాం -" అన్నాడు విక్టర్.
    దగ్గర్లో నే ఓ చిన్న టీ దుకాణం ఉంది. ఇద్దరూ ఆ దుకాణం లో దూరి ఓ టేబిల్ దగ్గర కూర్చున్నారు.
    సర్వరు వచ్చి - "ఏం కావాలి సార్?" అన్నాడు.
    "చాయ్ - దో ...."
    సర్వరు లోపలికి వెళ్ళాడు. అతడు టీ తేవడానికి ఆలస్యమైంది.
    "టీ తేడానికింత అలస్యమా?" అన్నాడు రాజా కోపంగా.
    'ఆలస్యం టీ గురించి కాదు సాబ్!" అన్నాడు సర్వరు.
    "మరీ?" అన్నాడు విక్టర్.
    "మీరార్దరు చెప్పిన సర్వరు లోపలకు వచ్చేక నేనతడి వేషం మార్చుకుందు కింతసేపు పట్టింది" అన్నాడు సర్వరు.
    "వేషం మార్చడమెందుకూ ?" అని గతుక్కుమన్నాడు.
    విక్టర్. అంటే ఈ సర్వర్ కొంపతీసి వెంకన్న కాదు గదా! కాదు గదా ఏమిటి....అతడు వెంకన్నే!
    "మీరు వేషాలు మార్చారు గదా -- అందుకని నాకూ సరదా పుట్టింది. నా వేషం బాగుందా?" అన్నాడు వెంకన్న.
    "మమ్మల్నేలా గుర్తుపట్టావ్?" అన్నాడు రాజా ఆశ్చర్యంగా.
    "అది ట్రేస్ సీక్రెట్. లొంగి పోతానంటే చెబుతాను."
    "ఇంకా ఇరవై నాలుగ్గంటలు టైముంది మాకు ...."అన్నాడు విక్టర్.
    "సుఖాన వున్న ప్రాణాల్ని దుఃఖ పెట్టుకోవడమంటే ఇదే ననుకుంటాను. పూర్ ఫెలోస్. నాకు మిమ్మల్ని చూస్తె జాలేస్తుంది. అసాధ్యమని తెలిసీ అనవసరంగా శ్రమ పడుతున్నారు...." అన్నాడు వెంకన్న.
    "ఇట్సా ల్రైట్ -- మా ప్రయత్నం మేం చేస్తాం ?" అన్నాడు రాజా.
    
                                  4
    రాజా, విక్టర్ ఇద్దరూ కూడా అక్కణ్ణించి తిన్నగా ధియేటర్ కుసుమకు వెళ్ళారు. ముందు టికెట్స్ కొనుక్కుని హల్లోపలికి వెళ్ళారు. తర్వాత మేనేజర్ని కలుసుకుని తామెవరో చెప్పుకున్నారు.
    "మీకేం సాయం కావాలో చెప్పండి -- " అన్నాడు మేనేజర్.
    "సినిమా హల్లో మొత్తం అయిదు జంటలుండాలి. భర్తది ముస్లిం వేషం. భార్యకు బురఖా వుంటుంది. మనుషులందరూ మాకు లాగే భారీగా వుండాలి. సినిమా అయిపోయాక అన్ని జంటలూ తలోవైపు వెళ్ళి పోవాలి..." అన్నాడు రాజా.    
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS