Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 44


                                వెన్నెల విలువ

    వాసుదేవరావు కుటుంబమంతా సినిమాకు వెళ్ళారు. వంట మనిషి రమణమ్మ ఒక్కర్తీ యింట్లో వుంది. ఆమెకు నవలల పిచ్చి. ఓ చేతిలో నవల పట్టుకుని రెండోచేత్తో పులుసు కలుపుతూండగా ఎవరో వీధి తలుపు తట్టారు.
    రమణమ్మ వెళ్ళి తలుపు తీసింది.
    సుమారు ముఫ్ఫై అయిదేళ్ళ వ్యక్తి లోపల అడుగు పెట్టాడు. రమణమ్మ అతణ్ణి చూసి "నువ్వా?" అంది.
    "అవును నేనే!" అన్నాడతడు. అతడి ముఖం కరుకుగా వుంది. మాట కరుకుగా వుందీ.
    "ఎందుకొచ్చావ్?" అంది రమణమ్మ.
    "నీ కోసమే వచ్చాను...." అన్నాడతడు.
    "నా కోసమా?"
    "అవును నిజంగా నీకోసమే!"
    "నా దగ్గరేముంది?"
    అతడు నవ్వి "వెన్నెల విలువ చంద్రుడేం చెప్పగలడు?" అన్నాడు.
    "కవిత్వం నేర్చుకున్నావే!" అందామె.
    "కవిత్వం కూడు పెట్టదు. కూడు పెట్టేవి కూడా చాలా నేర్చుకున్నాను" అన్నాడతడు.
    "ఇంతకీ ఇప్పుడిక్కడి కెందుకొచ్చావో చెప్పు...."
    చెప్పానుగా నీ కోసమని...."
    రమణమ్మ యిబ్బందిగా నవ్వి "థాంక్స్!" అంది.
    "కాసేప్పోయాక నేనే నీకు థాంక్స్ చెబుతాను...." అన్నాడతడు.
    "ఎందుకని?"
    "నేనీ యిల్లు దోచుకోవాలనుకుంటున్నాను. అందుకు నీ సాయం కావాలి" అన్నాడతను తాపీగా.    
    రమణమ్మ భయం భయంగా అతడివంక చూసి "ఏదో మామూలుగా రోజులు గడిచిపోతున్నాయి నాకు. ననిబ్బందుల్లో యిరికించకు" అంది.
    "నీ మీద అనుమానమేదీ వుండదు. నీకు ప్రమాదమూ వుండదు. నువ్వు నాకు సాయం చేసినట్లు యెవ్వరికీ తెలియదు" అన్నాడతను.
    "వద్దు...." అంది రమణమ్మ.
    "నా దోపిడీవల్ల నీకూ ప్రయోజనముంటుంది. ఇక్కడ సంపాదించిన డబ్బుతో నీ కూతుర్ని నా కూతురిలా పెంచుతాను" అన్నాడతడు.
    రమణమ్మకో కూతురుంది. ఆమెకు పదహారో యేట అక్రమ సంతానంగా పుట్టిందా పిల్ల. ఆ పిల్లకిప్పుడు పధ్నాలుగేళ్ళు ఆ పిల్లకు ఆర్నెల్లప్పుడు రమణమ్మ ఎరిగున్న వాళ్ళకు అప్పజెప్పింది. తనకు పెళ్ళయిందనీ భర్త పోయాడనీ అందరికీ చెప్పుకుంది. అయినవాళ్ళెవరూ లేక ఆ తర్వాత ఆమెకు పెళ్ళి కావడమూ కష్టమయింది.
    ఆ తర్వాత నుంచి రమణమ్మ ఆ యింటా ఈ ఇంటా పనులు చేస్తూ గడపసాగింది. అప్పుడప్పుడు కూతురి గురించి విచారిస్తుండేది. ఎరిగున్నవాళ్ళకు చాలా కాలం పిల్లలు లేరు మూడేళ్లొచ్చేదాకా రమణమ్మ కూతుర్ని వాళ్ళు బాగానే పెంచారు. ఆ తర్వాత వాళ్ళకిద్దరు పిల్లలు కలిగారు. అప్పట్నించీ వాళ్ళకు రమణమ్మ కూతురిపై ఆసక్తి తగ్గిపోయింది. ఆ పిల్ల వాళ్ళింట్లో పనిపిల్లలా బ్రతుకుతోంది.
    రమణమ్మ ప్రస్తుతం తను బాలవితంతువని చెప్పుకుంటోంది. ఆ విధంగా ఎప్పటికైనా ఎవరైనా తన్ను పెళ్ళి చేసుకొనవచ్చునని ఆమె ఆశ తనకొక బిడ్డ వున్న విషయాన్నామె రహస్యంగా కాపాడుకుంటోంది.
    అనుకోకుండా రమణమ్మకు సత్యం పరిచయమయ్యాడు.
    సత్యం వాసుదేవరావింట్లో వంటవాడు. ఆ యింట్లోనే పై పనులకు కుదిరింది రమణమ్మ. ఇద్దరికీ ఒకరంటే ఒకరి కిష్టమైంది. రమణమ్మ సత్యాన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. సత్యం ఆమెకు తన యిబ్బంది చెప్పుకున్నాడు.
    పద్దెనిమిదేళ్ళప్పుడు ఎవడో డాక్టరు ప్రోత్సహిస్తే అతడు వేసక్టమీ ఆపరేషను చేయించుకుని ఓ ట్రాన్సిస్టరు సంపాదించుకున్నాడు. తనేం పోగొట్టుకున్నాడో అతడి కప్పుడు తెలియదు.
    "మనకు పిల్లలు పుట్టరు. పెళ్ళి చేసుకుని ఏం లాభం?" అన్నాడు సత్యం?
    రమణమ్మ ముందు తటపటాయించినా తర్వాత తన గురించిన నిజం చెప్పేసింది. సత్యం ఎంతో సంతోషించి "నీ కూతురే మన కూతురు" అన్నాడు.
    పెళ్ళయ్యేదాకా తమ ప్రేమ వ్యవహారాన్నెంతో రహస్యంగా వుంచాలను'కున్నారు వాళ్ళు కానీ ఈ లోగా వాసుదేవరావింట్లో దొంగతనం జరిగింది. అయిదువేల రూపాయలు విలువచేసే వెండి కంచాలు పోయాయి. అనుమానం సత్యం మీదకు వెళ్ళింది. అతణ్ణి పోలీసుల కప్పగించారు. అక్కడ నాకేం తెలియదు మొర్రో అంటున్నా నాలుగుతన్ని అతడిచేత నేరాన్నొప్పించారు పోలీసులు.
    సత్యానికి రెండేళ్ళ జైలుశిక్ష పడింది.
    ఇది జరిగి ఏడాది దాటింది.
    ఈలోగా రమణమ్మ ఆ యింట్లో వంటమనిషిగా కుదిరింది సత్యానికీ ఆమెకూ సంబంధించిన కథ రహస్యంగా వుండిపోయింది.
    "అప్పుడే ఎలా వచ్చేశావ్ సత్యం?" అంది రమణమ్మ.
    "జైల్లోంచి పారిపోయావా?" భయంగా అంది రమణమ్మ "అంటే నువ్వు నిజంగా ఆరితేరిన దొంగవన్న మాట!"
    సత్యం విషాదంగా నవ్వాడు-"చెయ్యని నేరానికి నన్ను దొంగను చేశారు పోలీసులు. కానీ తెలిసి కూడా ఎందరో నేరస్థుల్ని వాళ్ళు పట్టుకోవడంలేదు. వాళ్ళలో కొందరు మనమధ్య పెద్దమనుషులుగా కూడా చెలామణీ అవుతున్నారు. అలాంటి పెద్ద మనిషి ఒకాయనకు నా సాయం కావాల్సొచ్చింది...."
    రమణమ్మ ఆశ్చర్యంగా వింటున్నదల్లా "అరే-పులుసు మరిగిపోతోంది...." అంటూ వంటింట్లోకి పరుగెత్తింది. సత్యం తనూ ఆమె ననుసరించి-"ఏదీ నీ వంట రుచిచూస్తాను..." అంటూ గరిటితో కాస్త పులుసు తీసి ఊది అరచేతిలో పోసుకుని రుచిచూసి "అబ్బే ఇదేం పులుసు?" అన్నాడు.
    "నీకులా నాకు వంట రాదు" అంది రమణమ్మ.
    "ఎందుకు రాదూ?" అంటూ అప్పటికప్పుడు పులుసుకు రుచి రావాలంటే ఏం చేయాలో రమణమ్మకు చెప్పాడు. పులుసు తయారవుతూండగా సత్యం ఆమెకు తన కథ చెప్పాడు.
    సమాజంలో పెద్దమనిషిగా చలామణీ అవుతున్న ఒకాయన తన అవసరాలకు నేరస్థుల్ని ఉపయోగించుకుంటూంటాడు. ఆయన కన్ను సత్యం మీద పడింది. ఫలితమగా ఆయన మనిషొకడు జైల్లో ప్రవేశించి సత్యాన్ని కలుసుకున్నాడు. ఆ పెద్దమనిషి చెప్పినట్లు చేస్తానంటే జైలునించి తప్పించగలనన్నాడు. సత్యం ఒప్పుకున్నాడు. పోలీసులు చూసీచూడనట్లూరుకున్నారు. సత్యం జైల్నించి తప్పించుకున్నాడు.
    సత్యం అన్నప్రకారం ఆ పెద్దమనిషిని కలుసుకున్నాడు. ఆయన చెప్పిన పని సామాన్యమైనది కాదు. అదో పెదబ్యాంకు దోపిడీ. అందుకు మొత్తం అయిదుగురు మనుషులు కావాలి. వాళ్ళలో సత్యం ఒకడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS