మూడు రాత్రులు!
వసుంధర
విసుక్కుంటూ తలుపు తీసి ఎదురుగా కనబడ్డ వ్యక్తిని చూసి చిరాగ్గా -- "ఎవర్నువ్వు?' అన్నాడతను.
"నా పేరు జోగినాధం . నీతో చిన్న పనుండి వచ్చాను. అన్నదవతల వ్యక్తీ.
జోగినాధం తన పేరుగా చెప్పుకుంటున్న వ్యక్తీ బట్టలు మాసి ఉన్నాయనడం కంటే కుళ్ళీ ఉన్నాయనడం సమంజసంగా ఉంటుంది. చూడ్డానికి పిచ్చివాడిలా , బికారి వాదిలాగున్నా డతను. ఇటువంటి వ్యక్తీ తనను నువ్వనడం ఆ ఇంట్లో అతనికి కోపం తెప్పించింది --" నువ్వు నన్ను పిల్చినట్లుగానేనేను నిన్ను పిలిచాను."
"నీకూ నాకూ పోలికేమిటి?"
"ఆ అనుమానం నాకూ ఉంది. ఆ విషయం ఇప్పుడు తెల్చేసుకోవచ్చు. మీ ఇంట్లో షవర్ ఉందా?" అడిగాడు జోగినాధం.
"ఉంది -- ఏం ?"
"నాకు షవర్ బాత్ చేయాలనుంది."
"నీ బ్రతుక్కదొక్కటే తక్కువయింది." అంటూ ఆ వ్యక్తీ అదే పనిగా నవ్వసాగాడు. జోగినాధం పిచ్చి వాడ యుంటాడని అతనిలో నమ్మకం పెరగసాగింది.
"నిజమే నువ్వు చెప్పింది. తలంతా చిరాగ్గా ఉంది. మీ ఇంట్లో షవర్ బాత్ చేయ్యనిస్తావా?" అన్నాడు జోగినాధం.
"చెయ్యనివ్వను -- " అన్నాడతడు.
"ఓరి నీ -- ఓ పావుగంట నేను షవర్ బాత్ చేస్తే నీ సొమ్మేం పోయింది? ఈ మాత్రం వితరణ లేదా నీకు?" అన్నాడు జోగినాధం.
"వితరణకు పాత్రత పాటించల్సుంటుంది గదా -"
"పాత్రతకు కొలబద్ద ఏమిటి? వేషమా? నువ్వు మీ ఇంట్లో షవర్ బాత్ చేయ్యనిచ్చి , ఓ జత బట్టలిచ్చా వంటే నిన్ను మించి పోతాను. అప్పుడు నీకే అనిపిస్తుంది. జోగినాధం అంత గొప్పవాడికి ఆతిధ్యమిచ్చే అర్హత నీకున్నడా అని?"
"నా దానంతో గొప్పవాడివి అయ్యే వాడివి నన్నెలా మించగలవు?"
"నీ చేతి కింత మట్టి ఓ మామిడి టెంకా ఇస్తే నీకై నువ్వు మామిడాకులూ, మామిడి పళ్ళూ చేయగలవా? లేవు. కానీ ఆ టెంకను మట్టిలో పాతిపెడితే అది మహా వృక్షమై నువ్వు చేయలేని పనులు చేయగలుగుతుంది."
అతను చిరాగ్గా -- "నీతో మాట్లాడుతూ కూర్చునే వ్యవధి లేదు నాకు.ఇంకో యింట్లో ప్రయత్నించు.." అన్నాడు.
"నువ్వు కూర్చోలేదులే -- నిలబడే ఉన్నావు. అది సరే కానీ నేను కారణ జన్ముడిని. నే నేవరింట్లో నైనా స్నానం చేస్తానంటే అది వారిని అనుగ్రహించడ మన్న మాట! నా అనుగ్రహం పొందే అదృష్టం చాలా కొద్ది మందికి వస్తుంది. ఆ కొద్ది మంది జాబితాలో చేరే అవకాశం ఈ జన్మకు నీకు వస్తుందో లేదో ." అంటూ జోగినాధం అక్కణ్ణించి కదల బోయాడు.
అతని ముఖం ఎర్రగా అయింది. వెళ్ళిపోతున్న జోగినాధాన్ని వెనక్కు పిలిచాడు. లోపలకు రమ్మన్నాడు. "ఫరవాలేదు. అదృష్ట వంతుడివే నువ్వు." అంటూ జోగినాధం ఆ ఇంట్లో ప్రవేశించాడు.
అతను తలుపులు తీసి -- "ఒక్క నిముషం అక్కడ నిలబడు - " అంటూ లోపలకు వెళ్ళాడు. తిరిగి వచ్చిన అతని చేతిలో బెల్టు ఉంది. ఊహించని వేగంతో అతను జోగినాధాన్ని బెల్టుతో కొట్టాడు. జోగినాధం క్రింద పడిపోయాడు. అతను లేవబోతుంటే మళ్ళీ రెండు బెల్టు దెబ్బలు తగిలాయి. అతనికి లేవడానికి ప్రయత్నించలేదు.
"ఎవరితో మాట్లాడుతున్నావో తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేను సాధారణంగా ఎవరినైనా చేత్తోనే అనుగ్రహిస్తాను. కానీ నీ వళ్ళంతా మురికి, నీ దగ్గర వాసన. నిన్ను తాకకుండా వీలైనంత దూరం నుంచి అనుగ్రహించాలని బెల్టు వాడాను. ఇంకెప్పుడూ ఎవరింటికీ షవర్ బాత్ కు వెళ్ళకు. వెళ్ళినా తల తిక్కగా మాట్లాడకు-" అని జోగినాధం లేస్తుండడం గమనించి మరో రెండు బెల్టు దెబ్బలు వేశాడు.
జోగినాధం అతను విసిరిన బెల్టును ఒడుపుగా తన వైపులాగాడు. అతనిది ఊహించక పోవడం మూలాన చేతిలో పట్టులేదు. బెల్టు జోగినాధం చేతిలోకి వచ్చింది. అతని కళ్ళలో భయం కనపడింది.
"భయపడకు. నేను కారణ జన్ముడిని. అందుకే షవర్ బాత్ కు నీ ఇంటికి రావాలని బుద్ది పుట్టింది. నీలో క్రూరత్వం వెర్రి తలలు వేస్తోంది. నీ కధ తెలుసుకుని నీ అంతు తెల్చేదాకా స్నానం చేసే అదృష్టం నాకెలాగూ ఉండదు. ఈ బెల్టు నీ దగ్గరే వదిలేస్తాను. దీన్ని నామీద ఉపయోగించినందుకు నువ్వు అదే పనిగా దుఃఖించే రోజు రాకపోదు--" అని తలుపు తీసుకుని బెల్టు అక్కడ పారేవేసి, విసురుగా వెళ్ళిపోయాడు జోగినాధం.
2
"పాలవాడొచ్చినట్లున్నాడండీ - లేస్తాను -"అంది సునీత.
"వీల్లేదు . అలాగే కదలకుండా పడుకో -- నేను పాలు పోయించుకు వస్తాను-" అంటూ గోవిందరావు లేచి వెళ్ళి పాలు పోయించుకుని పక్కలోకి వచ్చాడు. ఇది యించుమించు ప్రతి రోజూ జరిగేదే!
ఉదయం మెలకువ వచ్చేక బలమైన కౌగిట్లో ఓ అర్ధగంటైన సునీతను బంధించి ఉంచితే కానీ గోవిందరావు కు తృప్తిగా ఉండదు. వారికి మెలకువ వచ్చే సమయమూ పాలవాడోచ్చే సమయమూ ఒకటే కావడంతో రోజూ అతనికి ఇబ్బందిగా ఉంటోంది.
పాలు పోయించడానికి తను లేచి వెడతానని సునీత అంటుంది. ఆమె లేచి వెళ్ళాలంటే బట్టలు సవరించుకుని వెళ్ళాలి. అందుకు అయిదు నిముషాలైనా పడుతుంది. కానీ అదంత ముఖ్య సమస్య కాదు. ఒక పర్యాయం లేచి బట్టలు సవరించుకున్నాక సునీత మరి పక్కలోకి రాదు. అందుకే గోవిందరావు ఆ బాధ్యత స్వీకరించాడు.
ఈ దంపతులది ప్రేమ వివాహం. ప్రేమ దాకా బాగానే గడిచినా వివాహం అంత సాఫీగా జరుగలేదు. అందంలోనూ, చదువులోనూ , సంపద లోనూ గోవిందరావు కు అన్ని విధాల దీటు వచ్చే వ్యక్తీ మరొకడున్నాడు అతని పేరు రామస్వామి. అతను సునీతకు బావ.
సునీత పుట్టినప్పుడే రామస్వామి కి భార్య పుట్టిందని అంతా అనుకున్నారు. పుట్టినపట్నించి కూడా సునీత అంటే రామస్వామి కి ప్రాణంగా ఉండేది. భార్య అనేపదానికి అర్ధం తెలియని వయసులో కూడా ఆమె తనకు భార్య అని అంతా అంటూంటే అతనా నందించేవాడు. ఆ పదానికి అర్ధం తెలిశాక అతనామెను ప్రేమించడం మొదలు పెట్టాడు.
రామస్వామి తండ్రి ఇల్లరికపు టల్లుడు కాకపోయినా మామగారుండే ఊళ్ళో నే అతని ఉద్యోగ ముండడమూ , అతనికి స్వంత ఇల్లు లేకపోవడమూ, అతని మామగారికి స్వంతిల్లు ఉండడమూ కారణంగా పెళ్ళయినప్పట్నించీ అతని మాకాం మామగారింట్లోనే! అయితే ఆ యింట్లో అతను వేరే వాటాలో ఉంటున్నాడు. ఈ వేరు వాటాలు రామస్వామి తండ్రికే కానీ రామస్వామి కి లేవు. ఈ కారణంగా అతనూ, సునీతా చిన్నప్పట్నించీ కలిసే పెరుగారు.
సునీతకు వయసు పెరిగిన కొద్ది అందాలు సంతరించుకుంది. పదహారేళ్ళ వచ్చేసరికి ఆమె బంగారు బొమ్మలా ఉండేది. ఆమె అందాన్నే తన అదృష్టంగా గుర్తించి సంబర పడుతుండేవాడు రామస్వామి.
అయితే రామస్వామి గురించి సునీత ఆలోచన లింకో విధంగా ఉండేవి. తన ఎదురుగా ఉంటూ, తనతో పాటే కలిసి పెరుగుతూ , తనకు తెలిసిన వ్యక్తీ కాక మరే అందాల రాజకుమారుడో తనకు భర్త కావాలని ఆమె కోరుకుంటుండేది. కానీ తన మనసులోని ఈ రకమైన ఆలోచనలను అందరితో నూ చెప్పడాని కామె భయపడింది.
గోవిందరావు తో సునీత పరిచయం రామస్వామి వల్లనే జరిగింది. గోవిందరావు రామస్వామి క్లాసుమేటు , అన్నింట్లో నూ అతను ఫస్టుగా వస్తుంటాడని రామస్వామి మరదలికి తరచుగా చెబుతుండేవాడు. రామస్వామికి గోవిందరావంటే చాలా ఇష్టం. తరచుగా కంబైన్డ్ స్టడీ స్ కి అతను గోవిందరావు ఇంటికైనా వేడుతుండేవాడు. లేదా గోవిందరావు ని తనింటి కైనా రప్పించు కుంటుండే వాడు.
రామస్వామి గోవిందరావు గురించి చెప్పిన విశేషాలు సునీత మదిలో చెరగని ముద్ర లయ్యాయి. అతని పట్ల ఆమెలో ఆరాధానా భావం కలిగి పెరగసాగింది. దానికి తోడు గోవిందరావు చాలా అందంగా ఉంటాడు. చదివే నవలలు, చూసే సినిమాలు ఆమెకు అతని పై ప్రేమను పుట్టించ సాగాయి. ఆ ప్రేమ, ఆరాధన ఆమె కళ్ళలో ప్రతిఫలించగా- తెలివైన గోవిందరావు త్వరలోనే అర్ధం చేసుకోగలిగాడు. అతనికీ అందాల సునీతపై మోజు మళ్ళింది. తన ప్రయత్నాలు వీలున్నప్పుడల్లా చేసి చూశాడు. ఫలితంగా ఇద్దరూ పరస్పరం ప్రేమించుకోసాగారు.
ఈ సంగతి రామస్వామి ఊహించనైనా ఊహించలేదు. సునీత ఎప్పటికీ తనదే అని అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. తన మిత్రుడి పైన అతడికి ఏపాటి అపనమ్మకం కూడా లేదు. అయితే ఒక రోజున అతను ఇద్దర్నీ సినిమా హల్లో చూసి ఆశ్చర్య పోయాడు. తన్ను తానూ నిగ్రహించుకుని గోవిందరావుతో ఏకాంతంగా మాట్లాడాడు -- తర్వాత!
అప్పుడు గోవిందరావు ఎమ్మెస్సీ ఫైనలియర్ చదువు తున్నాడు. సునీత బీయస్సీ మొదటి సంవత్సరం చదువు తోంది.
"ఒరేయ్ నువ్విలా ప్రవర్తిస్తానని నేననుకోలేదు..." అన్నాడు రామస్వామి.
"తప్పు చేసే స్వభావం కాదు నాది -- " అన్నాడు గోవిందరావు.
"నా మరదల్ని తీసుకుని సినిమాకు వెడతావా?" అది తప్పు కాదంటావా?"
"అందులో తప్పేముంది? ఆమెను నేను ప్రేమించాను..."
రామస్వామి తడబడి -- "సునీత నాకు కాబోయే భార్య. తెలుసునా?" అన్నాడు.
"ఆ విషయం సునీత నడిగేనా?" అన్నాడు గోవిందరావు.
రామస్వామి స్నేహితుడి తో అంతకు మించి మాట్లాడ లేదు. తర్వాత అతను సునీత ను కలుసుకున్నాడు--
'ఈ విషయం ఇంట్లో చెప్పకు బావా!" అంది సునీత.
"ఎందుకని ?"
"అయన ఉద్యోగం వచ్చేదాకా పెళ్ళి మాటలు కుదరవు గదా -- పెళ్ళి సంగతి మాట్లాడ గలిగేవరకూ మా ప్రేమ సంగతి ఇంట్లో తెలియడం ఇష్టం లేదు---" అంది సునీత.
