"ఎందుకు?"
"అర్జంటు పనుంది...."
"ఏమిటి?"
"బయటకు వచ్చేక చెబుతాను....."
"చెప్పందే రాను....."
"సుధాకర్ బామ్మ చచ్చిపోయింది...."
సతీష్ చిరాగ్గా-"సుధాకర్ ఎవరు?" అన్నాడు.
"సుధాకర్ తెలియదూ? అరుణా హోటల్ ప్రొప్రయిటర్ కొడుకు...."
"అతడా!" అని-"అతడి బామ్మపోతే నా కెందుకు?" అన్నాడు సతీష్.
"అతడి బామ్మది మామూలు చావు కాదు. ఎవరో హత్య చేశారు...."
సతీష్ ఉలిక్కిపడి-"అయితే?" అన్నాడు.
"నీతో చాలా మాట్లాడాలి. కానీ యిక్కడకాదు."
సతీష్ మళ్ళీ-"నేను రాను...." అన్నాడు.
"అయితే ఇక్కడే నీకింకా వివరాలు చెప్పాలి...."
"చెప్పు...." అన్నాడు సతీష్ నిర్లక్ష్యంగా.
"సతీష్! సుధాకర్ బామ్మను చాకుతో పొడిచాడు హంతకుడు. హత్యాయుధాన్నామె శరీరంలోనే వదిలాడు. ఆ చాకు స్టెయిన్ లెస్ స్టీలుంది. దానిమీద గులాబి పూవు బొమ్మవుంది. ఎస్ అన్న ఇంగ్లీషు పొడి అక్షరం వుంది..."
సతీష్ కంగారుగా-"పాంటు మార్చుకుని వస్తాను-పద!" అన్నాడు.
"ఇంకా నీతో చాలా మాట్లాడాలి. చాలా అర్జంటుగా మాట్లాడాలి. త్వరగా రావాలి మరి!" అన్నాడు విశ్వం.
"ఇక్కడున్నట్లు వచ్చేస్తాను...." అంటూ లోపలకు వెళ్ళాడు సతీష్. లోపల సతీష్ కి తన పాంటు జేబులు తడుముతున్న తండ్రి కనిపించాడు.
"ఏం చేస్తున్నావు నాన్నా?" అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా.
"ఇది నీ పాంటా? నాదనుకున్నాను...." అంటూ లోపలకు వెళ్ళాడు జగన్నాధం. తండ్రిని గురించి అట్టేపట్టించుకోకుండా బట్టలు మార్చుకున్నాడు సతీష్.
4
"నాన్నా!" అన్నాడు జగన్నాధం.
"ఏరా?" అన్నాడు నారాయణరావు.
"మన సతీష్ గురించి బెంగగా వుంది-" అన్నాడు జగన్నాధం.
"ఎందుకని?"
"పెన్సిలు చెక్కుకుందుకని నువ్వు సతీష్ కి చాకు కొనిపెట్టావు గుర్తుందా?" అన్నాడు జగన్నాధం.
"ఊఁ!"
"దానిమీద గులాబీపువ్వు బొమ్మ వుంటుంది. ఎస్ అన్న పొడి అక్షరం కూడా వుంటుంది...."
"అవును..." అని-"సతీష్ కదంటే యెంతో యిష్టం. ఎవరికీ అదివ్వడు. అల్లం తరుగుతానంటే మీఆవిడకు కూడా యివ్వడు...." అన్నాడు నారాయణ రావు.
"ఆ చాకిప్పుడింట్లో లేదు....."
"దాని సంగతి మన కెందుకు? వాడెక్కడో దాచుకుని వుంటాడు...." అన్నాడు నారాయణరావు.
"వాడి బీరువాలో ఎక్కడా లేదు...."
"జేబులో పెట్టుకున్నాడేమో!"
"వాడి పాంటు జేబులు చూశాను. కనపడలేదు......"
నారాయణరావు ఆశ్చర్యంగా-"నీ కా చాకు కావాలంటే వాడినడిగి తీసుకోవచ్చును కదా-చాటుగా వెతకడ మెందుకూ?" అన్నాడు.
"ఎందుకంటే ఆ చాకిప్పుడో హత్యాయుధం...." అన్నాడు జగన్నాధం.
"ఏమిటీ?"
జగన్నాధ వెంటనే "ఇప్పుడే విశ్వమని ఓ కుర్రాడు వచ్చి మన సతీష్ ని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ సంభాషణ నేను విన్నాను...." అంటూ తను విన్న విశేషం చెప్పాడు.
నారాయణరావు తెల్లబోయి-"అయితే యేం జరిగిందంటావ్?" అన్నాడు.
"ఏమో-నాకూ తెలియడంలేదు...." అన్నాడు జగన్నాధం.
కాసేపు తండ్రీ కొడుకుల మధ్య మౌనం రాజ్యమేలింది.
"మన సతీష్ హత్య చేయడు...." అన్నాడు జగన్నాధం.
"అసలు హత్య చేయాల్సిన అవసరమేముంది వాడికి?"
"అందులోనూ-ఎవడో సుధాకర్ బామ్మని...."
మళ్ళీ తండ్రి కొడుకుల మధ్య మౌనం రాజ్యమేలింది.
"అసలిదంతా నా కెందుకు చెప్పావు?" అన్నాడు నారాయణరావు.
"విశ్వం మాట్లాడిన తీరునుబట్టి-అతడు సతీష్ ని అనుమానిస్తున్నట్లనిపించింది. అతడు మనవాడి నెందుకనుమానించాలి?" అన్నాడు జగన్నాధం.
"అది నీ అనుమానం అతడు మనవాడి నెందు కనుమానిస్తాడు?"
"హత్యాయుధం మనవాడి చాకే ఎందుక్కావాలి? అతడు వివరాలు చెప్పగానే-ఒక్కమాట కూడా అనకుండా విశ్వాన్ననుసరించి యెందుకు వెళ్ళాడు?"
"విశ్వం శవం దగ్గర మనవాడి చాకును చూసి వుంటాడు. వెంటనే ఆ విషయం చెప్పడానికిక్కడికి వచ్చివుంటాడు...." అన్నాడు నారాయణరావు.
"కానీ యిదంతా యెందుకు జరిగింది? యెలా జరిగింది?...."
"ముందా సుధాకర్ బామ్మ హత్య గురించి వివరాలు తెలుసుకోవాలి...." అన్నాడు నారాయణరావు సాలోచనగా.
"అనవసరంగా ఇలాంటి వ్యవహారంలో తలదూర్చడం నాకిష్టం లేదు. ఎందుకంటే-అది లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది....."
"నిజమే.....కానీ మనవాడిప్పుడక్కడికే వెళ్ళాడేమో!"
"వెళ్ళి ఆ చాకు నాదే అన్నాడంటే పోలీసులు వాణ్ణి అరెస్టు చేస్తారు....."
"అలా జరగడానికి వీల్లేదు......" అన్నాడు నారాయణరావు వెంటనే.
"అలాగే జరుగుతుందని నాకు భయంగా వుంది. ఏం చేయాలో పాలుపోవడంలేదు. లోపాయికారీగా కూడా అటువైపు వెళ్ళడం నా కిష్టం లేదు-" అన్నాడు జగన్నాధం.
"సరేలే-నేను బయటకు వెళ్ళి విషయం వాకబు చేస్తాను. నువ్వేమీ కంగారుపడకు-" అన్నాడు నారాయణరావు.
జగన్నాధం తేలికగా నిట్టూర్చి-"నువ్వు వేలుపెడితే యేపనైనా సానుకూలమవుతుంది నాన్నా!"
5
ఆమె పేరు పార్వతమ్మ. వయసు అరవైయేళ్ళు. మనిషి దృఢంగా వుంటుంది. ఆమెకు నాగేశ్వరరావు నటించిన సినిమాలంటే ప్రాణం. వీలుచూసుకుని, వీలుచేసుకుని తరచుగా సినిమాలు చూస్తూంటుంది. సాధారణంగా మ్యేట్నీకో, మొదటి ఆటకో వెడుతూంటుంది. అప్పుడప్పుడు రెండో ఆటకూ వెడుతూంటుంది.
ఆ ఊరామెకు కొట్టినపిండి. ఆ ఊళ్ళో దొంగతనాలు, దోపిడీలు అరుదు. అందుకని ఆమె ఒంటరిగానే సినిమాలు చూస్తుంది. ఏ షోకు వెళ్ళినా ఆమె గురించి ఎవ్వరూ బెంగపెట్టుకోరు.
ఆ రోజు రాత్రి ఆమె పాత సినిమా "పెళ్ళి కానుక"కు రెండవ ఆటకు వెళ్ళి తిరిగిరాలేదు.
తెల్లవారుఝామున మూడు గంటలకు పార్వతమ్మ కోడలు భార్గవికి మెలకువ వచ్చి టైము చూసుకుని అత్తఃగారింకారాలేదని గుర్తించి కంగారుగా భర్తను లేపింది. భార్గవి భర్త ప్రసాద్-కొడుకు సుధాకర్ ని లేపాడు. తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి వెతకడం ప్రారంభించారు.
