పద్మావతి చకితయైంది.
శైలజే చెప్పింది,
"భాస్కరంగారి వాళ్ళ పిన్నమ్మకి సీరియస్ గా ఉందట. "-వైర్ వస్తే ఆయన వెళ్ళారు .....ఇక్కడ మూర్తిగారికి లెటర్ రాయలేదని ఆందోళన పడుతున్నారు" అని మళ్ళీ పద్మావతి ఏమీ అనకపోగా తానే,
"మీరు అక్కడికి వెళ్తే ? ......" నని ప్రశ్న వేసింది.
"ఉహూఁ ...... ఏ అనుబంధాలు పురస్కరించుకుని వెళ్ళాలి నేను ..... అదీగాక ఆమె ఎవరో తనకు నేను తగనని తీర్మానించుకున్నది గదా? ఇప్పుడు వెళ్ళడం మా అమ్మ గుండెలు తియ్యడమే అవుతుంది శైలజా!"
"అనుబంధానికి అర్ధం భాస్కరంగారు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనడమా?" నిలదీసింది శైలజ.
పద్మావతికి శైలజ యిలా వేధిస్తున్నందుకు చాలా కోపం వచ్చింది.
"రోడ్డుమీద గనక సరిపోయింది. లేకపోతే దవడ వాయగొడుదు" ననుకుంది.
"మూర్తిగారు మీతో కొన్ని సంగతులు చెప్పాలి రమ్మన్నారు." శైలజ మెల్లిగా అన్నది. "స్నేహ" మనే అనుబంధం ఒకటి మీకూ, భాస్కరానికీ, తనకీ మధ్య బంధమై ఉందనీ, అభ్యంతరం లేక పోతే తన సలహా వినమని అన్నారు" అని చెప్పింది.
"నువ్వు చాలా లక్కీ గర్ ల్ ని శైలజా! మూర్తిగారు చాలా మంచివాడు కాని ఇప్పుడు నా జీవితంలో లేనిపోని ఆశలు చిగురించనివ్వకండి ...... వసంత మనుకుని నేను ఎదురుచూస్తున్న కల లన్నీ శిశిరమై నిలిచిపోయాయి!" పద్మావతి నిట్టూర్చింది.
మూర్తి వీళ్ళను అంతలోనే ఎదుర్కొని "నమస్కారం పద్మావతిగారూ!" అన్నాడు.
"నమస్కారం" పద్మావతి పొడిగా నవ్వింది.
"భాస్కరం వైరు వస్తే బెజవాడ వెళ్ళి మూడు రోజులైంది, నాకు లెటర్ కూడా రాలేదు,"
పద్మావతి మాట్లాడలేదు. కాని ఆమె గుండెల్లో 'పోటు'గా ఉన్నట్లు ఏదో తెలియని బాధ కలిగింది. భాస్కరానికి వాళ్ళ పిన్నమ్మ ఎంత ప్రియమో తనకు నాలుగు సంవత్సరలుగా తెలుసు. "భాస్కరంగారు ఎంత ఇదవుతున్నారో" నన్న బాధ కలిగింది ఆమెకు.
"నేను వాడికి "రిప్ లై పైడు వైరు" ఇచ్చాను పద్మావతిగారూ!" మూర్తి గొంతు గాద్గదికమై పోయింది. "కాని...... ప్చ్......" నిట్టూర్చాడు.
శైలజా, పద్మావతి ఇద్దరూ విస్తుబోయారు. తేరుకుని ఆందోళనగా "అంత అవసరమా? మీరు కంగారవుతున్నారేమో" అన్నది శైలజ.
"నో ....... నో ...... రండి! బహుశా నడిరోడ్డు మీద యిలాంటి విషయాలు ....." అంటూ గంభీరంగా అడుగులు వేస్తూ దీనవదనంతో దారితీసిన మూర్తిని అనుసరించారు ఆ ఇద్దరాడపిల్లలూ......"భాస్కరం ఏదీ అనుకోనిది జరగకపోతే నాకు ఉత్తరం రాయకుండా ఉండడు" అంటూ మూర్తి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు........
తర్వాత చెప్పాడు.
"పద్మావతిగారూ! మీరు ఏమీ అనుకోకపోతే ఒక్కమాట.....బెజవాడ వెళ్ళండి .... మావాడు మావాడు....."
పద్మావతి గుండె లాగిపోయి తీవ్రంగా కొట్టుకోసాగాయి.
"ప్లీజ్! చెప్పండి..... చెప్పండి ఆయనకు ...."
"ఏమో నాకు తెలియదు.....నా తంతికి తిరిగి సమాధానం రాలేదు..... నాకు బెంగగా ఉంది" మూర్తి నీరసంగా అన్నాడు. "వాళ్ళ పిన్నిగా రంటే వాడి దేవుడనుకోండి."
"నేను, నేను దురదృష్టవంతురాలిని శైలజా! అమ్మకి అంతా తెలిసిపోయింది. తను ఇప్పుడు నన్ను బెజవాడ వెళ్ళనివ్వదు" పద్మావతి శైలజకు దుఃఖపడుతూ చెప్పింది!
"కాని, నాకు మనసులో ఆందోళనగా ఉంది. మీఉర్ వెళ్ళి వాళ్ళ పిన్నిగారు మిమ్మల్ని చూస్తే ..... ఆవిడకు మంచాన ఉన్న ఈ దశలో సేవ చేస్తే."
మూర్తి రెండు క్షణాలు ఊరుకుని, అంతలో ఆవేశంగా "ఒక్కటి నిజం పద్మావతిగారూ! మై ఫ్రెండ్ కాన్ ట్ లివ్ వితౌట్ యూ! మావాడు మీరులేందే బ్రతకలేడండీ!" అన్నాడు.
పద్మావతి పరాయి మగవాడు ఉన్నాడు. అది బహిరంగ స్థలమూ అనే ఆలోచన కూడా లేకుండా కంట తడి బెట్టుకుని అంతలో దుఃఖ మాపుకోలేక శైలజ భుజంమీద తల ఆన్చి ఏడ్చింది. కొన్ని క్షణాలు ముగ్గురూ నిశ్శబ్దంగా ఉన్నారు.
"ఈ చెల్లెల్ని క్షమించండి!" అన్నది పద్మావతి కనులు తుడుచుకుని కురులు సర్దుకుని ..... ఎట్టకేలకు.
"మీరు మీ అమ్మగారికి చెప్పండి!" అన్నాడు మూర్తి.
"తాను వినదు.... తాను వినదు" గొణుక్కుంది పద్మావతి.
శైలజ అడిగింది "ఒకవేళ పద్మావతి గారికి అక్కడ పరాభవం జరిగితే...."
"పరాభవాలు. అహంకారాలు యివన్నీ స్నేహం తొలి దశలో పట్టించుకుంటారండీ! ఇప్పుడు, మనుషుల హృదయాలు పెనవేసుకుపోయాకా, కాదూ" అని మూర్తి అన్నమాటలే పదే పదే నచ్చాయి పద్మావతికి....... కొన్ని క్షణాల దారుణ నిశ్శబ్దం తరువాత "నేను వెళ్తాను" అని దిగ్గున లేచిందామె.
* * *
కాని, జయమ్మగారి గతి ఏమవుతుంది?
ఎలా వెళ్ళాలి తను? ఏమని చెప్పాలి జయమ్మ గారికి?
"అయితే భాస్కరం ఇంటి ఇల్లాలి నౌతాను, లేదా కృష్ణా నదికి అంకితమేనా ఔతాన"నుకుంది పద్మావతి. "ఇప్పుడిక ఒకసారి భాస్కరంగారిని చూడందే చావలేను" అనుకుంది. కాని, జయమ్మ గారీ ప్రతిపాదనను ఒప్పుకోదు అని ఆమెకు బాగా తెల్సు.
ఆమెకు కూడా "ఒకే ఒక్క తిరుగులేని ఆయుధం" ఉన్నది. అదే "చావు". అదే అస్త్రం! అదే ఆత్మహత్య!!-అదే బెదిరింపు.
మూర్తిగారి వేపు ఆశగా చూసింది నడుస్తూనే పద్మావతి.
"ఐయామ్ లైక్ యువర్ బ్రదర్ ! చెప్పండి!" అన్నాడు మూర్తి.
"మా అమ్మ దగ్గరికి మీరు వస్తారా?" బేలగా అడిగింది పద్మావతి.
శైలజకు మూర్తీ తనూ "ఇద్దరం" ఒక అక్కర్లేని 'బాదరబందీ' లో పడుతున్నామనిపించినా పద్మావతిని కాదనలేక పోయింది!
"పదండి వస్తాం!" అన్నది.
* * *
మూర్తిని జయమ్మగారు సాదరంగా పలకరించలేదు. అభిమానంగా చూడనూ లేదు. కాని మూర్తి చివరికి బోధపరచి-అంతా చెప్పాడు.
"మేమంతా స్నేహితులం పిన్నిగారూ! మా భాస్కరం మా కందరికీ 'మమత' అనే దాన్ని దానివిలువను అర్ధంచేశాడు. వాడికి పెంపుడుతల్లి ఐన జానికమ్మగారు మీరు అనుకున్నంత చెడ్డది కాదు. ఆమె పద్మావతిని పరాభావం చెయ్యదు. అదీగాక స్నేహధర్మంగా మేం వాణ్ణి యిప్పుడాదుకోవాలి. ......నేను వెళ్తాను.....పద్మావతిని నాతో పంపండి...... మీ అమ్మాయిని నేను అన్నదమ్ముడి బాధ్యతతో తీసుకువెళ్తాను .... ఒక్కసారి వాణ్ణి చూస్తుంది. అంతే."-
"కాని .....ఆడపిల్ల స్నేహానికి అవధులున్నాయి బాబూ! ఆమెకు స్నేహం, ప్రేమ అన్నీ ఒక్క వ్యక్తిమీదనే ఉండాలి." జయమ్మగారు వారించింది.
"అవధులు? అవన్నీ మీ కల్పితాలు. నిజంగా ఆ అవధులే ఉంటే అవి ఆడదానికి రక్తనాళాల్లో ప్రవహించేటంత సహజమైన వే అయితే - పద్మావతిగారు భాస్కరాన్ని అతని స్నేహాన్నీ పెంపొందించుకుంటుందా?" మూర్తి ఉక్రోష పడ్డాడు. అరిచాడు ఇంచుమించు. "ఆడదాని పవిత్రతకు ఆడవాళ్ళే పెద్ద పెద్ద అనర్ధాలు, అవధులు కడుతున్నారు."-
"ఔను - మీరు అన్నది నిజమే! ఎందుకంటే మీరు ఆడపిల్లకు రాగల అప్రదిష్ట చూడటం లేదు. ఏ తల్లి యినా ఇలాగే చేస్తుంది. నేను దిక్కుమాలినదాన్ని గనుక నాకు యివన్నీ కష్టాలు!అందరి సలహాలు వచ్చాయి." జయమ్మగారు నొచ్చుకుంది.
"అమ్మా! ఒక్కసారి చూసిరానీ - నన్ను వాళ్ళ పిన్నిగారికి తలనొప్పి అని తెలిసినా భాస్కరంగారు విలవిల లాడిపోయేవాడు. అలాంటిది ....." పద్మావతి నేదో సాహసప్రవృత్తి ఆవహించి అడుగుతోంది.
"వాళ్ళ సంప్రదాయం మన సంప్రదాయం ...." జయమ్మగా రంటున్నది.
"అన్ని స్వకపోల కల్పితాలు ...... కృత్రిమాలు, కుతంత్రాలు ..... కేవలం సంస్కారం పిన్నిగారూ ..... అదీ కావాలి .... మీ అమ్మాయి భాస్కరాన్ని ప్రేమించింది. అది మానసికమైన అపవిత్రత కాదా? దాన్ని రూపుమాపగలరా? మీరు?"
మూర్తి మాటలకు జయమ్మగారు ఉద్రేకపడి "పద్మావతీ! నీ యిష్టం వచినట్లు తగలడు ..... నాకు నీకూ అనుబంధం తెగిపోయింది ...... వెళ్ళు..... వెళ్ళు. నీ జీవితం నీది ...." అని కేకలేసింది. కూలబడ్డది.
ఆమెను ఆ ముగ్గురూ ఓదార్చి ఓదార్చి అలిసిపోయారు ......
జయమ్మగారు నిస్సహాయంగా "సరే! గుంటూరుకు పోతాను నేను..... నా పిల్లను నాకు నువ్వు తిరిగి అప్పగించు ..... నేను దానికి వేరే సమ్మంధం చూసుకున్నాను" అన్నది ఎట్టకేలకామె.
మూర్తి, శైలజా, పద్మావతి కూడా అలసిపోయి 'ఔన'నీ 'కాద'నీ కూడా జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు.
