"అహఁహఁ! ఏం లేదు ...... కాస్త కాఫీ ఉంటే యిస్తానేమోనని వచ్చాను" అంటూ సుబ్బారావు గారు మాట తప్పించి అవతలికి వెళ్ళాడు.
వసంత భుజంమీద చెయ్యివేసి "మరేంలేదు! సాయంత్రం డాక్టరును పిలుస్తాను. నువ్వు అమ్మ దగ్గరే ఉండు." అన్నాడాయన.
"ఏం! నాన్నగారూ! అమ్మకీ ......"
"నీరసమమ్మా ...... అంతే అన్నయ్యకి రేపు రాద్ధువుగానిలే! ....... సురేఖ అవనీ, శూర్పణక అవనీ .... మరీ అంత బెంగ కూడదు ...... వాడూ అంతే, అదీ అంతే ...... ఇద్దరూ చెరో వేపు ఆలోచిస్తారూ ...... మనం నలిగిపోతాం మధ్య" ఆయన నిట్టూర్చాడు.
నిజానికి జానికమ్మగారికి ఆయనకూ గల బాంధవ్యంయొక్క వయస్సు భాస్కరానికీ, జానికమ్మ గారికీ మధ్య గల అనుబంధంయొక్క వయస్సు ఒకటేఅయినా, జానికమ్మగారు వాడి గురించి తీసుకున్నంత శ్రద్ధ తన విషయంలో ఏనాడూ తీసుకోలేదు. అది ఆయన నమ్మకం. సుబ్బారావు గారికి ఒక్కోసారి అందుకుగాను గర్వమూ, ఒక్కోసారి ఉడుకుబోతుతనమూ కూడా వచ్చేవి యిదివరకు-
ఇప్పుడు కూడా ఆయన భాస్కరం సాయం కోరడంకన్నా మరేం చేయలే ననుకున్నారు. 'వాడికి రాస్తాను." అని గొణుక్కున్నారు. కాని ఆయన భాస్కరానికి టెలిగ్రాం యిచ్చి డాక్టర్ ఇంటికేసి బయలుదేరాడు.
* * *
జానికమ్మగారు భర్త స్వయంగా కాఫీకి వచ్చి అడిగేదాకా తాను కలిపి యివ్వలేకపోయానే అన్న బాధతో కాబోలు గబగబా కాఫీ కలిపి కప్పులో పోసింది గాని ఆమెకు లేచి కప్పు తీసుకుని వెళ్ళగల వోపిక లేకపోయింది. నరాల్లో మెలికలు తిరిగినట్లయింది. కళ్ళు భారంగా మూతలు పడుతున్నాయి.
"వసంతా!" నీర్సంగా ఉన్నదా పిలుపు.
"ఏమ్మా!"
"కాఫీ 'నాన్నగారి' కియ్యి.." అంటూనే ఆమె అక్కడే చెయ్యి తలక్రింద ఆన్చుకుని నట్టింట పడుకుందామె.
వసంత దగ్గరిసా కూచుని "ఏమ్మా" అంది బేలగా.
ఆవిడ బరువుగా కనులు మూసుకుంటూ"నిద్దరొస్తోంది..... మీ అన్నయ్య వస్తే లేపు......వాడు వస్తూనే ఉంటా డీపాటికి...." అన్నది. గుండెలమీద రెండో అరచేత నొక్కుకుంది.
వసంతకు భయం వేసింది. చెమటలు పోశాయి. గబగబా అవతలి గదిలోకి వెళ్ళి దిండు తెచ్చింది. తల్లి తలక్రింద పెట్టింది.
బయటకు వెళ్ళి చూసింది. సుబ్బారావుగారు ఆఫీసు గదిలో లేరు. పిల్లలిద్దరూ కూడాలేరు- ఎదురింటి ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గారింట్లో ఫోన్ ఉంది. పరిగెత్తింది డాక్టరుకోసం "ఫోన్ చెయ్యాలి" అని కాని, మళ్ళీ వాళ్ళ యింటి గుమ్మం మెట్లు ఎక్కుతూనే "అమ్మ ఒకతే ఉందని" వెనక్కి పరిగెత్తింది.
వరండా దాటి అడుగుపెడుతూండగానే రామం సరళా యిద్దరూ "అక్కా! అమ్మ లేవడం లేదే" అంటూ భయాందోళనలతో ఎదురు వచ్చారు.
"అమ్మా! అమ్మా!" వసంత కూడా పిలుస్తూనే తల్లి దగ్గరికి వచ్చ్జింది. జానికమ్మగారు పలకలేదు. వసంత తల్లి వంటిమీద చెయ్యి వేసింది. "అమ్మా! అమ్మా! ..... అన్నయ్యొచ్చాడమ్మా!"
జానికమ్మగారు మరి లేనని నిద్రపోయింది!
"అమ్మా! అమ్మా! ..... అ..... అమ్మా ....." అన్న పిల్లల ఏడుపుకి దేవుడి బొట్టుమీది విగ్రహాలు అదిరిపడ్డాయి తప్ప జానికమ్మగారు మరి పలకలేదు.
భాస్కరానికి టెలిగ్రాం యిచ్చి డాక్టర్ ని తీసుకుని వస్తూన్న సుబ్బారావుగారు కాళ్ళు నరికేసినట్లు గుమ్మం దగ్గిరే కుప్పలా కూలబడిపోయారు.
అతని వెనకనే ఉన్న డాక్టర్ పిల్లలిని తప్పించుకుని పరీక్షకని ముందుకి వంగి- వెంటనే లేచి పోయాడు-అతను చెయ్యగలదేమీ లేదు- (ప్రాణం పోవడానికి ఒక కారణం వెతకడం తప్ప.)
"సుబ్బారావుగారు! పిల్లలున్నారు చూడండీ! పెద్దలు మీరే అలా అయితే ఇక వాళ్ళకు దిక్కెవ్వరు ...... ఊఁ ఊఁ ..... దేవుడు చేశాడు ..... మనం ఏం చేస్తాం ....." అంటూ ఓదార్చాడు. సుబ్బారావుగారిని.
సుబ్బారావుగారూ జానికమ్మగారి దగ్గర పిల్లల్ని ముగ్గుర్ని పెనవేసుకు కూలబడి వెక్కివెక్కి ఏడిచాడు.
"ఇది ద్రోహం జానకీ! ఇది ఘోరం జానకీ! ఇంత శిక్ష వేస్తావా?" అంటూ నిలువునా దుఃఖమై పోయాడాయన.
* * *
భాస్కరానికి రైల్లో ఉన్న వాళ్ళందర్నీ చూస్తూన్నా ..... అన్ని శబ్దాలు వింటూ ఉన్నా పీడ కలలు కంటూ ఉన్నట్లే ఉంది-గుండెల్లో నెత్తురు తోడుతున్నట్లుగా ఉంది. రైలు ఆగకుండానే గెంతేసి ఇంటికేసి పరిగెత్తాడు.
రిక్షాని "త్వరగా పోనీయ్ పోనీయ్" మంటూ పరిగెత్తి వచ్చిన భాస్కరానికి యింటి గుమ్మంలోనే తాను పూర్తిగా శాశ్వతంగా ఆలస్యంగా వచ్చానని తెలిసిపోయింది!
బంధువులంతా "ఇక ఉంచకూడదు ఎత్తేయాలి" అంటున్నారు. కొందరు వోదారుస్తున్నారు కొందరు విస్తుపోతున్నారు. కొందరు 'ఉత్తమా యిల్లాలు పసుపు కుంకుమతో కూతురుపెళ్ళి చేసిమరీ కన్ను మూసింది" అంటున్నారు.

భాస్కరం గుమ్మంలోనే ఆ దృశ్యం చూస్తూనే వెర్రివాడిలా ఐపోయాడు. ఎవరో చెయ్యి పెట్టి గుండెకాయ "ఠ"క్కున లాక్కున్నట్లు "గొల్లు" మన్నాడు.
సుబ్బారావుగారు మొదలు నరికిన చెట్టులా పడిఉన్నవాడు "భా ....... సా ...." అన్నాడు. దుఃఖం పొర్లుకు వచ్చింది.
ఇంకా ఎక్కడి భాస్కరం?
జానికమ్మగారిదీ భాస్కరానిధీ ఇరవైఏళ్ల ఆత్మీయత, ఆ స్నేహానికి కాలం నిలిచిపోయింది. ఆ అనుబంధానికి అర్ధం ఆగిపోయింది. భాస్కరానికి ప్రాణం ఉంది. చైతన్యం చెరిగిపోయింది!
"చెప్పండి! నా పిన్ని నేం చేశారు మీరు? ఎక్కడ? ,...... చంపేస్తాను...... ఊఁ యియ్యండి .... నా పిన్ని నా క్కావాలి...." భాస్కరం తండ్రిని పట్టుకున్నాడు. నిలదీశాడు-కుదిపేశాడు.
పిల్లలు ముగ్గురు భయంతో "అన్నయ్యా!" అంటూ భాస్కారాన్ని అడ్డుకుని అతనికి పెనవేసుకున్నారు. సుబ్బారవుగారు హతాశుడై "నీ పిన్నిని నేనే చంపేను బాబూ! నన్నూ చంపు" అంటున్నాడు.
నలుగురూ ఆపారు......భాస్కరం పరిగెత్తి వెళ్ళి ప్రాణంలేని పసుపు రాసిన పచ్చని పాదాలు-నిన్నటి వరకూ ఆ యింట దేవతలా- దీపం వెల్తుర్లా -తిరుగుతూ ఉన్న పాదాలను పట్టుకున్నాడు. ఆ పాదాల ఉనికి అతని వ్యక్తిత్వానికి బలం. కాని ఇక ఆ పాదాలు కదలవు! పాదాల్లో తలదూర్చి ఏడిచాడు భాస్కరం.
"వీల్లేదు పిన్నీ! నువ్వు అబద్దాలాడావు పిన్నీ.......అబద్దాలాడుతున్నావు పిన్నీ. నాతో చెప్పకుండా చావనూ అన్నావుగా! లే మరీ!! లే పిన్నీ...." తల బాదుకుంటున్నాడు.
నలుగురూ ఆపారు....."ఛీ! చాదస్తంటయ్యా! ఈడొచ్చినవాడివి ..... నువ్వే ఇలా అయితే ఎలా?" అని వారించారు.
భాస్కరానికి అంతా అబద్దంగా ఉంది. అబద్దమై తీరాలనే ఉంది. కూలబడ్డాడు.
పిల్లల్ని కౌగిలించుకున్నాడు.
"మనం కూడా పోదామర్రా ..... చచ్చిపోదామర్రా...." అంటున్నాడు.
జానికమ్మగారు మరి లేదు. ఇక రాదు. ఆమె 'మరణం' అనే 'అనంత సత్యం' లో కలిసి పోయింది. భాస్కరం అక్కడకీ వెళ్ళలేడు.
58
శైలజకు సురేఖ ఉత్తరం చదవగానే "జీవిత మంటే" నే ఒక భయంలాంటిది మిగిలింది. పద్మావతి ఆత్మహత్య చేసుకుంటుందేమో నన్న అనుమానం-అది మరి కాస్సేపట్లో నమ్మకంగా కూడా అయింది. 'నా కెందుకు అక్కర్లేని బాధ' అనుకుంటూనే యాంత్రికంగా లేచి బయలు దేరింది.
"మూర్తిగారి"ని వెతుక్కుంది. మూర్తినేరుగా వస్తూనే "మావాడు వాళ్ళ పిన్నిగారికి సీరియస్ గా ఉందని వెళ్ళాడట" అన్నాడు ఆందోళనతో రొప్పుతూ "నేను కూడా ఆమెను ఒకసారి చూశాను ..... ఐ ఫీల్ డిప్రెస్ డ్" అన్నాడు మళ్ళీ.
"పద్మావతినిగా రెలా ఉంది?" అని అడిగింది, అదే ఆలోచిస్తున్న శైలజ.
"ఎవడికి తెలుసు? ఎవడిక్కావాలి? నేను భాస్కరం గురించి ఆలోచిస్తున్నాను."-
"ఒకవేళ ........."
"ఊఁ ...... ఒకవేళ?" మూర్తి రెట్టించాడు.
"ఆవిడ అతహ్మహత్యలాంటి పిచ్చిపని చేయదు కదా?"
తెలియకుండానే నుదుట చిరుచెమటలు క్రమ్మాయి.
"హారి బాబోయ్! శైలూ! నువ్వు-నువ్వు..." మూర్తి అటూ యిటూ పరిగెట్టాలీ అన్నట్లుగా గాభరాపడ్డాడు.
"ఎందుకు నీకీ ఊహ కలగాలీ?" అన్నాడు కోపంగా మళ్ళీ.
"పద్మావతికీ నేను నాతో మీ రన్నదంతా చెప్పేశాను......."
"ఊఁ ........ ఊఁ ..... ఏమంది?"
"టూ లేట్! అంతా అయిపోయింది ......ఇప్పుడు లాభంలేదు. నాకు గత్యంతరం లేదు" అంటూ వెళ్ళిపోయింది-
మూర్తి అస్తవ్యస్తమై పోయాడు. "పైగా సురేఖగారు మరి రానంది" శైలజకు అది చాలా బాధగా తోచింది. గనుక సీరియస్ గా చెప్పింది.
"చూశావా! ప్రేమకు పగ్గాలు అగుపించకుండా ఎలా ఉన్నాయో?" మూర్తి ఏమనాలో, ఏం చెయ్యాలో తోచక అన్నమాట లివి:
"సురేఖగారు పగ్గాలు తానే వేసుకుంది." నవ్వుతూనే అన్నది శైలజ.
"అబ్బ! మనమంతా సెంటిమెంటల్ ఫూల్స్ మీ శైలూ! మన దేశం మన్ తత్వాలు, హే భగవాన్.....మారాలి. మారాలి......"
"అంటే?"
"అంటే ....... ఉహూఁ ...... నౌ టూ ఎట్ ఆనక చెప్తా ..... పద! పద్మావతిగారిని భాస్కరం గారి దగ్గరికి పొమ్మని చెప్దాం. కనీసం ఓ మంచి పని చేశాం అనుకుందాం ..... చదువుమాట ఎలా ఉన్నా!" మూర్తి శైలజ చెయ్యి పట్ట్టుకున్నాడు.
"ఇష్షు! మనం ఇద్దరం యిలా ఎలా వెళ్తాం. పైగా చెయ్యి వదలండి....." శైలజ సంభ్రమంగా సిగ్గుగా చెయ్యి వెనక్కి లాక్కుంది.
"ప్రేమకు పగ్గాలు మనక్కూడా వస్తున్నాయ్! శైలజా! బివేర్!" మూర్తి నవ్వుతూనే ఎడంగా జరిగి "కుమారి శైలజగారూ! నడవండి మీ పెద్దల కడకు మా పెద్దలనువాళ్ళంటూ ఉంటే పంపుదనుక ఈ ధీరోదాత్త నాయకుడు నిన్ను కలనైన తాకడు. సారీ? మిమ్ముస్వప్నము నందైనన్ గాంచడు ....." అన్నాడు దారి చేత్తో చూపిస్తూ అభినయంపట్టి. కాని ఆ యిద్దరికి లోపల లోపల బెరుకుగానే ఉంది.
* * *
పద్మావతికి జయమ్మగారి 'శంక' కొంతలో కొంత ఆమె మాటల్ల్లో గ్రహింపుకు రాగానే "ఛీ! ఇంత నీచంగా నీ కూతుర్ని ఆలోచిస్తా వనుకో లేదమ్మా!" అన్నది - కాని జయమ్మగారు ఉన్న వాస్తవాన్ని విడమరిచి చెప్పింది.
"లేదు తల్లీ ! నన్ను తిట్టకు ! పవిత్ర మనుకుని, ప్రేమ అనుకుని ప్రేమిస్తాం మనం కాని తప్పుదారి త్రొక్కుతాం అక్కడే.......తర్వాత అది కడుపున బడితే పాపమైపోతుందమ్మా!"
పద్మావతి విస్తుబోయింది.
"నేను అలా అనుకోలేదు. నీవు నీ యిష్టం వచ్చినవాడికి కన్నె ధారపొయ్యి" అని కన్నీళ్ళింకి పోయి కరడు బారిపోయిన మొహం అటు తిప్పుకుంది.
"సరే! దేవుడు మంచివాడై చల్లని చూపు చూశాడు - నాగపూరు సమ్మంధం స్థిరపరుచుకుందాము" జయమ్మగారు నిర్ణయించుకుంది.
* * *
పద్మావతికి రెండు ఆలోచనలు వచ్చాయి. ఒకటీ తల్లికి "భాస్కరంతో లేచిపోయాన"ని ఉత్తరం రాసిపెట్టి తెల్లారకుండా పారిపోడం, చచ్చిపోడం-రెండు అది జరగకపోతే తల్లి చెప్పిన విధంగా పెళ్ళికి ఒప్పుకుని పెళ్ళయిన తర్వాత ఆత్మహత్య చేసుకోడం .... ఎంత కాదన్నా అవే ఆలోచనలు వస్తున్నాయి చీకట్లు ముసురుతున్నట్లు.
శైలజ వస్తూనే "ఏమిటాలోచిస్తున్నారు?" అన్నది పద్మావతిని.
ఉలిక్కిపడి "చావు గురించి" అని అంతలో శైలజను చూసి "అరె! నువ్వెలా వచ్చావ్?" అంది-
"ఇలాగే మీరు తలుపు గడియ వేయలేదు." అంది శైలజ నవ్వుతూ.
"కూచో" నిర్లిప్తంగా అంది మళ్ళీ పద్మావతి.
"కాదు మీకు అర్జంటుగా ఒక మాట చెప్పాలి" రహస్యంగా అంది శైలజ.
పద్మావతికి ఆశ పోలేదు.
"మీ వార్డెన్ గారి పుస్తకమేగా. ఆవిడ కోప్పడుతోంది కదూ! ఇచ్చేస్తా పద!" అంటూ. లేచింది.
శైలజకు గొంతుల్లో వెలక్కాయ పడ్డది. పాలక మారింది.
"బాప్ రే! ఏ వార్డెన్ ?! ఏ పుస్తకమూ, ఏమాకథా?!" అందామనుకుంది.
కాని, పద్మావతే మళ్ళీ గట్టిగా జయమ్మ గారితో "అమ్మా! వీళ్ళ హాస్టలు వార్డె నమ్మగారిది ఒక పుస్తకం తెచ్చి మరిచిపోయా. ఆమె కదియిచ్చి క్షమాపణ చెప్పుకోవాలి" అంటూ ఎదురుగా ఉన్న ఒక పెద్ద బౌండు పుస్తకం తీసుకుని లేచి బయలుదేరింది. అప్పటికి శైలజకి కూడా పరిస్థితులు అర్ధమైపోయాయి.
జయమ్మగారు శైలజ ఎదుట పడలేకపోయింది. "సరే! పోయిరా" అన్నది నీర్సంగా.
59
శైలజ అడిగింది "సురేఖ గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?"
"అదా నీవు అత్యవసరంగా అడిగే ప్రశ్న?"
"చిన్నదాన్ని గదా? చెప్పండి."
"అదృష్టవంతురాలు ....... ధనవంతురాలు"
"కాదు ...... కాదు ...... నన్నడిగితే మీరే అదృష్టవంతురాలు ........ సురేఖగారు నన్నడిగితే చాలా దుర దృష్టవంతులు!"
పద్మావతి నొచ్చుకుంది-ఏమీ అనలేక "నన్నేం చెయ్యమంటావ్?" అన్నది.
"మీరు ఏం చేద్దామనుకుంటున్నారు?"
"సముద్రంలో దూకుదా మనుకుంటున్నాను" విసుగ్గా, అక్కసుగా అన్నది పద్మావతి.
"అదే వద్దని సురేఖగారు రాశారు......"
"మీ యిద్దరికీ థాంక్స్ ...... కాని అదే చేస్తే మీ సొమ్మేం పోదుగా ....."
"పోనీలెండి! ఇక మూర్తిగారు మీతో ఏదో మాట్లాడాలి అన్నారు" శైలజ దురుసుగా అన్నది.
