60
జయమ్మగారు పద్మావతిని బెజవాడలో మూర్తితో దిగనివ్వడం 'త్యాగ'మనే అనుకుంది. అది ఆమె 'బలవంతాన చేసిం'ది-చేసేముందు రైలు ఎక్కే ముందు "రాజు" పేరా గుంటూరు రమ్మని ఉత్తరం రాసింది కూడా. మూర్తి ఆవేశం స్నేహితుడి మీది మమకారం రెండూ సంస్కారంవల్లా, వయస్సువల్లా వచ్చినవి. పద్మావతి తెగువకి తన బలహీనతే కారణం. కని, ముగ్గురూ ఒకే రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైలు పరుగెడుతూ ఉంటే అది ఆ ముగ్గురి గుండెలమీదా పరిగెడుతున్నట్లుంది.
జానికమ్మగారు పద్మావతిని పరాభవం చేయదని ఎవరు హామీ యిస్తారు? - చేస్తే ఏం చెయ్యాలి? అన్న ప్రశ్నలు ముగ్గురి గుండెలూ దొలుచుతున్నాయి.
"కృష్ణలో దూకాలి" అదీ పద్మావతి సమాధానం.
"లెంపలు వేసుకుని జాగర్తగా పద్మావతిని చావకుండా వాళ్ళ తల్లికి గుంటూరులో అప్పగించాలి"- అదీ మూర్తి జవాబు.
"రాజు తెచ్చిన సమ్మంధం చేసి దీనిని భాస్కరం అనే వ్యక్తికి దూరంగా నాగపూర్ పంపించాలి." అదీ జయమ్మగారి ఆందోళన- ఆశ- కాని, పరాభావం చేస్తుందేమో అనుకుంటున్న జానికమ్మగా రెక్క.......డ? ఎక్కడ?.....
* * *
గుంటూరు రైలు ఎక్కుతున్న జయమ్మ గారు కూతుర్ని రెక్క పట్టుకు తనకూడా లాక్కుపోదామనుకుంది గాని......పద్మావతి....... "తప్పక వస్తానమ్మా!" అంటూనే దూరంగా నిలబడి పోయింది,
"నీ చెల్లెలైతే ఏం చేస్తావో అదే చెయ్యిబాబూ! దిక్కు మొక్కూ లేని నీ పినతల్లి నిన్ను అడుగుతోందని భావించు" మంటోంది జయమ్మ గారు రైలు కదుల్తూ ఉంటే నిస్సహాయంగా, దీనంగా ...........
మూర్తి గుండెల్లో ఆ రైలు కొంచెం కొంచెం దొల్చుకు డూరుతున్నట్లుగా ఉంది, ఆ మాటలు వింటూంటే,
పద్మావతికి భయంగా తెగువగా సాహసంగా భయంగా ఆశగా దుఃఖంగా బాధగా తేలికగా బరువుగా బెంగగా, రకరకాలుగా ఉంది.
"సుబ్బరావుగారు లాయర్ అవడంవల్ల ఆ యింటిముందు అటువంటి సందడి ఉండటానికి వీలులేదు. అని దూరంనించే గ్రహించాడు మూర్తి. గుండె ఝల్లుమంది కాళ్ళు వణికాయి.
రకరకాల బంధువులు ...... సానుభూతిపరులు......యినవాళ్లు, కానివాళ్ళు......ఎవరికీ యిక 'కాని' ఒక ప్రాణి 'గతా'న్ని పురస్కరించుకుని అక్కడ వాలుతున్నారు ఒక్కరొక్కరే!
వరండాలో చాపమీద సుబ్బారావుగారు కుప్పలా కూలబడి ఉన్నాడు.
మూర్తినిగని ప్రక్కనే ఉన్న పడుచునుగాని గమనించలే దాయన.
ఎవరూ చెప్పకుండానే కళావిహీనమైన అక్కడి ప్రత్యణువూ "సంగతి"ని విడమర్చి చెబుతూ వున్నాయి. మూర్తి కాళ్ళు బరువెక్కిపోయాయి. పద్మావతికి కళ్ళు తిరిగాయి.
"నేను ...... నేను..... మేము..... భాస్కరం స్నేహితులం?"
తల ఎత్తాడాయన. అదీ శూన్యంలోకి చూస్తున్నట్లున్నా డాయన.
"భాస్కరమా? ఇంకా ఎక్కడి భాస్కరం?" చెయ్యి తిప్పాడాయన.
మూర్తి చెప్పులు విడిచి ఆయన ప్రక్కనే కూచున్నాడు. "మీరు పెద్దలు ....." అన్నాడు. లోపలి చీకటి తారట్లాడుతున్న గదుల్లోకి ఇంకా ఆశగా చూస్తూ. సుబ్బారావు పసిపిల్ల వాడిలా వెక్కుళ్ళు ఆపుకుంటున్నాడు. మాటలు రావడంలేదు. దుఃఖమే వస్తోంది.
పద్మావతికి భాస్కరాన్ని వెంటనే చూడాలని పించింది. ఎవరో బంధువులు అక్కడా అక్కడా పడిఉన్నారు. బహుశా అలిసిపోయి ఉంటారు.
మూర్తి పద్మావతిని "లోపలికి వెళ్ళమ్మా" అన్నాడు అతి కష్టంమీద.
సుబ్బారావుగారు నిగ్రహించుకుని-లోనికి వెళ్ళమని మూర్తికి కూడా సైగ చేశారు.
మూర్తీ, పద్మావతినీ యిద్దర్నీ ఒక ఏభై ఏళ్ల విధవావిడ ముందుకువచ్చి పలకరించింది.
"సవత్తల్లి మీద ఇంత మమకారం నేను చూడలేదు......అదో ఆ నట్టింట అ ప్రాణం పోయిన దగ్గిరే ఉన్నాడా అబ్బాయి! ...... ఏం చేస్తామమ్మా. మతి పోగొట్టుకుంటే మాత్రం ఆ సర్వాంతర్యామిలో కలిసిన జీవుడు తిరిగి వస్తాడా? మన పిచ్చి గాని" అంటోందామె.
నట్టింట దీపమై వెలిగిన జానకమ్మగారు లేరు. ఆమె 'ఉనికి' చెరిగిపోయిన చోట దీప శిఖవెలుగుతున్నది .......
భాస్కరం మోకాళ్ళమీద తల ఆన్చుకుని శూన్యంలోకి చూస్తున్నట్లు ఆ దీపాన్నే చూస్తున్నాడు.
ప్రమిదలో దీపం నిశ్చలంగా వెలుగుతోంది! నిశ్శబ్ధంగా, నిర్జీవంగా కూచున్నాడు భాస్కరం.
మూర్తి కొయ్యబారిపోయాడు భాస్కరాన్ని చూస్తూ-పద్మావతిని వెళ్ళమన్నట్లు నట్టింట గుమ్మంలోనే నిలబడిపోయాడు తాను.
పద్మావతికి తన ఆత్మబంధువు ఎవరో తనకు దూరమై పోయినట్లు తోచింది. ఆమె జానికమ్మ గారిని చూడలేదు కాని ఇప్పుడా ప్రమిదలోని దీపాన్ని చూడగానే .... ఎదను వెలితి నిండిపోయింది ఆమెలో ......
ఒక్కొక్క అడుగే వేస్తూ భారంగా, భయంగా వెళ్ళింది పద్మావతి.
మెల్లిగా భాస్కరం భుజం మీద చెయ్యి వేసింది.
చల్లగా తఃగిలిందది. ఉలిక్కిపడ్డాడు. వెంటనే "పిన్నీ!" అన్నాడు భాస్కరం.
"నేను ...... నే......ను....." గాద్గదికంగా అంటున్నది పద్మావతి.
భాస్కరం ఇటు తిరిగాడు కాని అతని కళ్ళు ఆమెను చూడటంలేదు. ఎటో చూస్తున్నాయి. "పొండి. మీరంతా పొండి!!..... పిన్ని నిద్ర పోతోంది......ఇష్షు! ఆమెకు నిద్రాభంగం కాకూడదు...... ఊఁ ....." అంటున్నాడు. భాస్కరం కళ్ళు వాచిపోయాయి. నిద్రాహారాలు లేవా దేహానికి. శాంతిలేదా మనస్సుకి!
మూర్తి వచ్చాడు....... "భాస్కరా! చూడు భాస్కరా! నువ్వు......"
ఎవడు భాస్కరం, ఎవడు నువ్వు? ఏమీలేదు. ఎవరూ లేరు-
"పిన్నీ! పిన్నీ" అంటున్న దతనిలో జీవశక్తి అంతా కలిపి-
"పిన్నీ! పిన్నీ! వీళ్ళు నిన్ను చంపేశారు పిన్నీ! కాని, నాకు తెల్సు పిన్నీ నువ్వు నాకోసం వస్తావమ్మా!" భాస్కరం వాళ్ళను విదిలించుకుని దీపం కేసే చూస్తూ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.
"మమ్మల్ని అన్యాయం చెయ్యకు. భాస్కరం మాకోసం........ మా కోసం"
"ఎవరు మీరు? ...... భాస్కరం ఎవడు వాళ్ళ పిన్ని వాడితో చెప్పకుండా ...... చెప్పకుండా ....." వెక్కివెక్కి ఏడుస్తున్న భాస్కరాన్ని ఓదార్చడం రాక పద్మావతి ఏడుస్తున్నది.
ప్రక్కగదిలో పడున్న ముగ్గురు పిల్లల్లోనుంచి వసంత నిగ్రహించుకుని వాచిన కళ్ళతో వచ్చింది. ముకుందరావు కూడా వచ్చాడు. మూర్తి నిస్సహాయంగా లేచాడు......
వసంత "అన్నయ్యా!" అని భాస్కరం ఒళ్ళో పడిపోయింది.
"పిన్ని వస్తుంది వసూ! వస్తుందిరా ....... తల్లీ! నాకు తెల్సురా ........ నేనేరా చచ్చిపోయిందీ ..... అమ్మ కాదూ ...." భాస్కరం తనే జానికమ్మ గారై పోతున్నాడు...... వసంతను ఓదారుస్తున్నాడు. తాను ఏడుస్తున్నాడు.
పద్మావతి అలాగే స్థాణువులా ఉండిపోయింది. భాస్కరం జానికమ్మగారి ఉనికి చెరిగిపోయిన జాగాలోని 'జ్యోతి' లోని ఏదో శక్తి తనను లాగుతున్నట్లు అటే చూస్తున్నాడు.
* * *
అవతల మూర్తి సుబ్బారావుగారి దగ్గిర కెళ్ళాడు. సరళా రామం ఏడ్చి ఏడ్చి యివతలికి వచ్చి తండ్రిని పెనవేసుకున్నారు.
"చూడు బాబూ! ఈ పిల్లల్ని నాకు ఒప్పగించి వెళ్ళిపోయింది. నన్న్జు కూడా తాను ఒక పసిపిల్లాడిలా సాకింది కదా ? నేను వీళ్ళకు ఎలా ? ఎలా? ...." ఆయన దుఃఖించుతూ "జానకి గొప్ప అన్యాయం చేసింది బాబూ!" అన్నాడు.
"ఛా! మీరే అలా యిధైతే భాస్కరం ఎలా చెప్పండి! ఈ పిల్ల లెలా యిదౌతారు. ?......నేను ..... నేను..... యిలా అవుతుందని.......అవుతుందని ...." మూర్తి మాటలకు సుబ్బారావు గారు కళ్ళు ఒత్తుకుని పిల్లల్ని కౌగలించుకున్నారు.
"భాస్కరాన్ని మనిషి చేస్తుందనుకున్నాను.......కాని, వాణ్ణి వాణ్ణి చాలా అన్యాయం చేసింది జానకి..... కన్నతల్లి భూమ్మీద పడేసింది. తప్పుకుంది ..... ఈ పెంచిన తల్లి వాణ్ణి మనిషిని పూర్తిగా చేసి ..... వాణ్ణి నాకు గాకుండా తానే ఎత్తుకుపోయింది. నన్ను ఒక జీవచ్చవంగా ....."
"పిల్లలున్నారు.....మీరు నిగ్రహించాలి" మూర్తి మాటలకు ఆయన తేరుకుని "ఆ అమ్మాయి ఎవరో ...... కాస్త వరసమ్మా! వీళ్ళకి ....." అంటూ గృహస్థధర్మాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అక్కడున్న ఒక చుట్టాన్ని కేకలేస్తో ......
"ఆమె పద్మావతి అనీ భాస్కరం క్లాసుమేటు" మూర్తి అన్నాడు. అంతలో .....
పద్మావతి వచ్చింది మెల్లిగా అక్కడికి. సుబ్బారావుగారికి మూర్తి పరిచయంచేస్తుండగా ఆమె పాదాలకు ఒంగి నమస్కారం చేసింది. ఆపిల్ల యీ ప్రవర్తనకు ఆయన విస్తుబోయాడు.
"వద్దమ్మా! పాపాత్మున్ని........నాకు వద్దూ.....జానకిలాంటిదేవతను తినేశానమ్మా" అన్నాడు ఆయన.
"నేను మీరు ..... నేను ..... మీరు ...... మీరు ఏమీ అనకపోతే ఇక్కడే ఉండిపోతాను ...." అని తల దించుకునే ఏదో అభూతశక్తి పలికిస్తున్నట్లు అంటోంది పద్మావతి.
సుబ్బారావుగారు చాలాసేపు గంభీరంగా ఉండిపోయారు.
"ఎందుకు తల్లీ! భాస్కరానికి వల్ల పిన్ని కావాలి ..... అది రాదు.... ఈ పిల్లలికి తల్లి కావాలమ్మా! ఇంకెవరు వచ్చినా ఆవిడ రాదు కదమ్మా? ఎందుకు కష్టాలు కోరి తెచ్చుకుంటావు?" అన్నారాయన.
'నేను! ....... నన్ను క్షమించండి ! నేను వెళ్ళలేను ...... వెళ్ళలేను ...." పద్మావతి కన్నీటిబొట్లు రెండు అయన పాదాలమీదవెచ్చగా పడ్డాయి.
"నన్ను పొమ్మనకండి!"
"నాతో సహా నలుగురు పిల్లల్ని దిక్కులేని వాళ్ళను చేసిందా దేవత! పైగా ఈ ఇంటి యజమానురాలైన తాను మాకు పసితనం తప్ప ఏమీ మిగల్చలేదమ్మా! ..... అన్ని హక్కులూ ఆమె ఎవరికీ ఇవ్వకుండా తానే తీసుకుపోయింది. నేనూ భాస్కరం అంతా ఒకటే, తల్లీ ..... ఉండమనీ, వెళ్ళమనీ అనగల 'జానకి' లేదు ...... ఇప్పుడింక ఈ కెందుకీ కష్టాలు .....? మామీద సానుభూతా తల్లీ?" ఆయన బరువుగా లేచి పిల్లల్నిద్ధర్నీ ఎత్తుకుని అక్కణ్ణించి కదిలాడు.
బేలగా, దీనంగా చూసిన పద్మావతిని మూర్తి "ఉహు...." అని తల తిప్పి వారించి ధైర్యం పలికి ...... "చెల్లీ? నువ్వొక్కతెవే నమ్మా! అదృష్టవంతురాలివి...... వాళ్ళ "పిన్ని" గారిని నువు చూడలేదు.......అందుకనే నువ్వే భరించాలి ఇదంతా. నీకు యీ శిక్ష తప్పదు ...... వీళ్ళ నందర్నీ ఆ 'దేవత' ప్రభావం నుంచి ఇవతలికి తేవాలీ, మన ప్రపంచం లోకి "తేవాలీ" అంటే అది నీ ప్రేమని కాదు, నీ సహనాన్ని, త్యాగాన్నీ ...." అంటున్నాడు మూర్తి.
"నాకు తెల్సు ..... నాకు తెల్సు ...." గొణుక్కుంది నిశ్చింతగా, నమ్మకంగా పద్మావతి.
"ఆలోచించుకో......బెంగపడకు." మని మూర్తి నిట్టూర్చాడు. అంతలోనే పద్మావతి "భాస్కరం గారు నన్ను ..... నన్ను ...... పోల్చనేనా లేదు" అంటూ నిరాశపడి ఏడిచింది.
మూర్తి నిగ్రహించుకుని,
"ఛా! ఏమిటదీ? నువ్వూ ఆపనే చేస్తే ఇక ఈ ఇంటికి వెల్తు రెక్కడ ?....." అన్నాడు.
రెండు క్షణాల్లో పద్మావతి కళ్ళు తుడుచుకుని లేచింది - నిశ్చయంగా నిలబడి "ఔను! పిల్లలిద్దర్నీ ఎత్తుకువెళ్ళారు.....ఆయన ఏం చూసుకుంటారు?" అంటూ పద్మావతి లేచి వెళ్ళింది సుబ్బారావుగారు వెళ్ళిన గదివేపు. వసంత, ముకుంద రావూ నిశ్శబ్దంగా ఎదురువచ్చా రామెకు.
పద్మావతి వసంతను కౌగలించుకుంది.
"ఏడవకూడదమ్మా!" అన్నది ధైర్యంగా.
"అన్నయ్య ఆ గదిలోనే అలాగే ...." వసంత పద్మావతి గుండెల్లో తల దూర్చుకుని ఏడుస్తోంది.
ముకుందరావు ఈ కొత్త స్త్రీ ఎవరో తెలియక కాస్త తికమక పడుతూనే పొడిగా అన్నాడు.
"భాస్కరం బావ గురించే మా కందరికీ యిప్పుడు బెంగ"
"ఆయనకు తెలుసు. మీరు బెంగపడకండి ఈ ముగ్గురు పిల్లల బాధ్యతా వారిమీద ఉంది! రెండు రోజులలో సర్దుకుంటారు." అన్న పద్మావతి మాటలకు ముకుందరావు తనకు తెలియకుండానే ఆశపడ్డాడు. అంతలోనే భాస్కరం గురించి ఇంత తెలిసినట్లు చెపుతున్న ఈ కొత్త స్త్రీమూర్తిని - ఆమె ఒడిలో విశ్వాసంగా తలదూర్చి దుఃఖ మాపుకున్న తన భార్యను చూస్తూ రెండు క్షణాలు విస్తుపోయాడు కూడా.
"కాని..... ఈ ఇంటికి ఆడదిక్కు ఎవరూ లేరు" ...... వీళ్ళా పిల్లలు ....... బావ మతిపోయి......"
"ఇష్షు!....... మీకు దండం పెడతాను.....ఆమాట అనకండి ..... ఈ ఇంటికి ఆడదిక్కూ ఉంది ...... వారికి ...... వారికి ..... మతీపోలేదూ" పద్మావతి ఆవేశంలో ఇంకేమీ అనలేదు. అన్నా వినడానికి ముకుందరావు అక్కడ లేదు. ఆశ్చర్యంగా బరువుగా అడుగులేస్తో అవతలికి వెళ్ళిపోయాడు.
"మీరు చాలా ఆలస్యంగా వచ్చారు......తరువాతిమాట లను అస్పష్టంగా మింగేసింది ఏడుస్తూన్న వసంత.
"ఔను ....... ఔను..... పాపిష్టిదాన్ని తల్లీ! నేనూ ...... కాని, ఇక ఈ దేహం ఇక్కన్నుంచి ప్రాణాలతో వెళ్ళదమ్మా! మీరు వద్దంటే నేను ఆవిడ దగ్గరికే వెళ్తాను తప్ప; ఇక మీ అన్నయ్యని మిమ్మల్నీ వదిలి వెళ్ళవమ్మా ......" గట్టిగా కౌగిలించుకుంది వసంతని పద్మావతి.
సుబ్బారావుగారు వసంత వెక్కిళ్ళు విని వచ్చాడక్కడికి కాని, గట్టిగా కౌగలించుకుని వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ ఆడపిల్లల్ని వోదార్చగల ఓపిక లేక అలానే చూస్తూ ఊరుకున్నాడు.
---సమాప్తం---
