Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 44


                                           సుఖం లేని మనిషి
    

    జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ అని చెప్పి ఓ పెద్ద బట్టల దుకాణం పెద్ద బజార్ రోడ్డుమీద ఆర్నెల్ల క్రితం వరకూ వెలిగిపోతూ వుండేది. ఈ కథ జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ వారి బట్టల దుకాణం గురించి మాత్రం కానే కాదు.
    ఆ బట్టల దుకాణం కొన్ని లక్షల వ్యాపారం చేసిందని వినికిడి. జె.వెంకటేశ్వర్లు వూళ్ళో నాలుగు మేడలు కట్టించడం గూడా ఆ వ్యాపారం యొక్క ప్రయోజకత్వమేనని వదంతి.
    ఆ దుకాణం అస్తమానం రద్దీగా ఉండేది. డాక్టర్లూ, ప్లీడర్లూ, కాలేజీ కుర్రాళ్ళూ, ఆఫీసర్లూ, పొద్దుపోని ఆస్థిపరులూ మొదలైన పచ్చటి మనుషులు చాలామంది అక్కడ ఖాతాదారులు. జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లో కొన్న గుడ్డ చాలా ఖరీదైనదీ, మంచి శ్రేష్టమైనదీ అని పెద్ద నమ్మకం జనాభాకి! ఆ కొట్టు యింద్రభవనంలా వుండేది. ఆ కొట్లో మనుషులూ బాగుండేవారు.
    మరీ బాగుండేది మిస్ సుబ్బులు! ఆ అమ్మాయి ఆ కొట్లో సేల్స్ గర్ల్ ఆ కొట్టుకొచ్చే సగానికి సగం మంది కేవలం సుబ్బుల్తో కాస్త కాలక్షేపం కోసవఁని చెప్పేస్తే అతిశయోక్తి కాదు.
    జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ కి వాస్తవమైన యజమాని జె.వెంకటేశ్వర్లు మాత్రమే! ఆ ఆసామికి గుండెనొప్పి, ఆయాసం, దడ, అనే మామూలు వ్యాధి ఒక అలంకారం. అంచేత యజమాని పదవి ఒక నమ్మిన మనిషి చేతిలో పెట్టేడు. ఆ మనిషి పేరు సుబ్బారావు వి. సుబ్బారావు.
    చాలామంది ఆశ్చర్యపోయేవారు. జె. వెంకటేశ్వర్లుకున్న ముగ్గురు కొడుకులూ ఉత్త చవటలని జనం ఉద్దేశం కాదు గానీ వాళ్ళెవరికీ దక్కని స్థానం ఎవడో పరాయివాడు వి.సుబ్బారావు కెలా దక్కిందని ముక్కులమీద వేళ్ళేసుకునేవారు. డిగ్రీలు పుచ్చుకున్న నిరుద్యోగులకీ, పేదరికంలోంచి బైట పడిపోవాలనుకునే సామాన్యమైన మనుషులకీ వి. సుబ్బారావున్జూస్తే వొళ్ళు మండుకొచ్చేది. అతని అదృష్టానికి అసూయా కలిగేది. ఆ కొట్టుకొచ్చే ఖరీదైన ఖాతాదార్లు వి. సుబ్బారావుని మర్యాదగా పలకరించడం చూసిన మూడో మనిషి (వి. సుబ్బారావు కి ఆత్మీయుడైన పక్షంలో) చచ్చేంత సిగ్గుపడిపోయేవాడు.
    అంతలా వెలిగిపోయేడు వి.సుబ్బారావు.
    కానీ - ఆర్నెల్ల క్రితం జె. వెంకటేశ్వర్లుకి గుండె కొట్టుకోవడం మరి ఆగిపోయింది. జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లోని పెద్దమనిషి, యోగ్యుడు, దూరదృష్టి కల వాడూ, అదృష్టవంతుడూ, మహానుభావుడూ కన్నుమూసేడని స్థానిక పత్రికలు ఉద్ఘాటించేయి. సభల్లో తీర్మానాలూ చోటు చేసుకున్నాయి. వారం రోజులపాటు మూసినా జె.వెంకటేశ్వర్లు అండ్ సన్స్ దుకాణం మరింక తెరవనే లేదు. దానికి జనం ఆశ్చర్యపోనూ లేదు. ఏమంటే వాళ్ళందరికీ అండ్ సన్స్ గాళ్ళ చాకులాంటి తెలివితేటలు ఎప్పట్నుంచో తెలుసు.
    ఈ మహత్తర భాగ్యం కోసం అండ్ సన్స్ ఎంతకాలం నుంచో యెదురుచూస్తున్న వైనమూ తెలుసు. అండ్ సన్స్ బట్టల వ్యాపారం మానుకుని మిస్ సుబ్బుల్తో సహా మదరాసు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళందరూ కలిసి తెలుగు సినిమా తీసే యేర్పాటులో తలనిండా మునిగిపోయేరు. ప్రస్తుతం జె.వెంకటేశ్వర్లు అండ్ సన్స్ స్థానంలో రెండు డ్రింక్ షాపులూ, ఒక "మందు" దుకాణమూ వెలిశాయి.
    ఈ విపత్కర సంఘటనకి గొప్ప బాధపడ్డది కేవలం వి.సుబ్బారావొక్కడే. ఎంచేతంటే దేవుడులాటి యజమానీ, ఇంద్రపదవిలాటి ఉద్యోగవూఁ దూరమయ్యాయి కదా!
    కాబట్టి ఇది వి.సుబ్బారావు కథ మాత్రమే!
    
                                       *    *    *
    
    ఉద్యోగం వూడిపోయిన లగాయితూ - అతను ఒక్కోసారి జీవితాన్ని గురించీ, ఒక్కోసారి ప్రేమగురించీ, ఎక్కువసార్లు జీవితం ప్రేమ రెండిటినీ గురించీ ఆలోచించటం నేర్చుకున్నాడు. జీవితం గురించి ఆలోచించిన క్షణం జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ గుర్తుకొచ్చి ఆశ్చర్యపోతాడు. ప్రేమ గురించి ఆలోచించిన క్షణం చంద్రావతి జ్ఞాపకమొచ్చి బాధ పడిపోతాడు. టూకీగా అతని వ్యాపకం యిది :
    చంద్రావతి యోగ్యురాలని తెలుసు. కాదేమోనన్న అనుమానం జె. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ లో పనిచేస్తున్నప్పుడు కలిగింది కాదు. ఆ రోజుల్లో పరాయి విషయాలు ఆలోచించేందుకు టైముండేది కాదసలు. కానీ ఇప్పుడీప్పుడు చంద్రావతిని తలుచుకుంటూంటే భయం వేస్తోంది.
    చంద్రావతి నర్సు ఉద్యోగం చేస్తున్న ఇల్లాలు. రెండేళ్ళ క్రితం కాబోలు చంద్రావతికి సుబ్బారావుకి పెళ్ళయింది. ఆ పెళ్ళి చాలా సందడిగానూ, ఆనందంగానూ, కాంతివంతంగానూ కాలేదు. అభిమానాలూ, పట్టుదలలూ, పంతాల మధ్య నలుగురైదుగురు ముఖ్యమైన స్నేహితుల సమక్షాన నిరాడంబరంగా జరిగిపోయింది. వాళ్ళిద్దరి పెళ్ళి అంత నీరసంగా, బద్దకంగా జరగడంలో కథా వుంది.
    ఆ మధ్యెప్పుడో సుబ్బారావుకి జబ్బేదో చేయడం మూలంగా హాస్పిటల్లో నడుం వాల్చవలసి వచ్చింది. అతనికి హాస్పిటలంటే మహా అసహ్యం. అయినా తప్పింది కాదు. లేకపోతే జబ్బు ముదిరి భూమ్మీద నూకలక్కూడా నోచుకోలేవని బెదరగొట్టారు. భయం భయంగానే హాస్పిటల్ మంచం మీద చేరేడు.    
    రెండు రోజుల వరకూ మంచం దగ్గరకొచ్చే మనషుల మీద అతని కాట్టే ఆసక్తి వున్నది కాదు. తన జబ్బు గురించి దిగులుగానూ కొంచెం యేడుపుగానూ వుండేది.
    ఆ స్థితిలో చంద్రావతి కలిసింది. పున్నమిలాటి చందమామకీ, చంద్రావతికీ పోలికజేసి చెప్పడం అలంకార రీత్యా దోషమేమీ కాదు. అంత చల్లగానూ, అంత వెల్తురుగానూ అంత అందంగానూ వుంటుంది చంద్రావతి.
    మందుపోసేది. మాడిపోతూన్న నొసటిమీది చల్లటి చేతి స్పర్శతో అమృతం కురిపించేది. అప్పుడనుకునే వాడతను - "చంద్రా! నువ్వు దూరం కావద్దు. అస్తమానం నువ్వు నా దగ్గరే వుండిపో నన్ను విడిచి వెళ్ళిపోతే నేను బతకలేను. నీలో యేదో వింత ఆకర్షణ వుంది. నన్ను అలరిస్తోంది. చంద్రా -నువ్వు దూరంకాకు. నన్ను విడిచి పెట్టొద్దు."
    ఓనాటి రాత్రి అతనికి టెంపరేచర్ ఎక్కువయ్యింది. అప్పుడతను నిజంగా పలవరించేడు. ఆ పలవరింతలు విన్న చంద్రావతి మొదట్లో ఖంగారు పడ్డది. ఆనక సర్దుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS