Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 43


    "అలాంటి పనులు నావల్లకాదు. చచ్చి మరో జన్మెత్తితే ఏమో చెప్పలేను...." అన్నాడు ఆనందరావు.
    "పోనీ ఆ పనే చేయి...."
    "అంటే ముందు నేను చావాలి......ఒక్క నిముషం......నువ్విక్కడేవుండు..." అని బయటకు వెళ్ళాడు ఆనందరావు.
    శోధన్ చిరాగ్గా అక్కడే కూర్చున్నాడు. ఓ అరగంటలో వచ్చాడానందరావు. లోపలకు వస్తూనే-ఇవి నిద్రమాత్రలు....కొనుక్కుని వచ్చాను..." అన్నాడు.
    "నిజంగా నువ్వు చద్దామనుకుంటున్నావా?" అన్నాడు శోధన్.
    "అవును...."
    "అయితే ఆ మాత్రలన్నీ వేసుకుని చావు.....చచ్చే ముందో చీటీ కూడా రాసిపెట్టు." అని వెళ్ళిపోయాడు శోధన్. అతడక్కన్నించి తిన్నగా ఓ నగర ప్రముఖుడింటికి వెళ్ళి మొత్తం జరిగినదంతా చెప్పాడు.
    నగర ప్రముఖుడుత్సాహంగా-"వెరీగుడ్! ఈ దెబ్బతో శ్రీహరి ఫినిష్!" అన్నాడు.
    "అదెలా?"
    "ఆనందరావు చస్తాడు. పేరున్న డాక్టరుచేత పరీక్ష చేయించు. ఆయన చచ్చినట్లు సర్టిఫికెట్టిస్తాడు. ఆ తర్వాత మన డాక్టరు రంగంలోకి దిగుతాడు...."
    "మన డాక్టరంటే?"
    "డాక్టర్ రంగారావు. ఆయనో గొప్ప ఇంజక్షన్ కనిపెట్టాడు. మనిషి చచ్చేక కూడా ఒకటి రెండు గంటలు తిరిగి బ్రతికించగలదది. ఆ సమయంలో ఆ హతుడు తానే మైనా పూర్తి చేయాలనుకున్న పనులు చేసుకోగలడు. తనకున్న జీవితకాలం పరిమితమని అతడికి తెలుస్తుంది అందువల్ల పుట్టిన తెగింపుతో అతడి కసాధ్యమైన దేమీ వుండదు. ఆనందరావుకు శ్రీహరిమీద ద్వేషమూ, దీప్తిపై కసీ ఏర్పడి ఉంటాయి. అన్న ఎదుట చెల్లెలికి మానభంగం, అదే శ్రీహరిని సగానికి సగం చంపేస్తుంది. ఆ మిగతా సగం కూడా ఆనందరావే చూసుకుంటాడు...." అన్నాడు నగర ప్రముఖుడు.
    "మనిషి చచ్చి బ్రతకడమా?" అన్నాడు శోధన్ ఆశ్చర్యంగా.    
    "ఇందులో ఆశ్చర్యమేమీలేదు. విదేశాల్లో మరణవాంగ్మూలమివ్వకుండా పోయిన వాళ్ళనూ, విల్లు వ్రాయని వాళ్ళనూ ఈ విధంగా బ్రతికించడానికి కొన్ని ప్రయత్నాలు జయప్రదంగా జరిగాయి. మన డాక్టరు వాళ్ళకంటే ఓ మెట్టు పైకి వెళ్ళాడు. అక్కడ మనిషికి మాట్లాడగలగడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనిషి నార్మల్ గా లేచి తిరుగుతాడు. ఎటొచ్చీ రెండు గంటలకు మించి బ్రతకడు. కనీసం గంటైనా బ్రతికి తీరుతాడు...." అన్నాడు నగర ప్రముఖుడు.

                                      5

    "నువ్వు చచ్చి బ్రతికావు.." అన్నాడు శోధన్ ఆనందరావులో తిరిగి చలనం రావడమూ, అతడు కళ్ళు తెరవడమూ శోధన్ కాశ్చర్యంగా వుంది. ఎందుకంటే సరిగ్గా అరగంటకు ముందు-నగర ప్రముఖుడు పంపిన ఓ గొప్ప డాక్టరు అతడు మరణించినట్లు ధృవపరిచి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పి వెళ్ళాడు. ఆ విధంగా ఆయన కాగితం రాసిచ్చాడు కూడా.
    డాక్టరు రంగారావు ఇంజక్షన్ చేసి-"సరిగ్గా అరగంటలో ఇతడి శరీరంలో చలనం పుడుతుంది-" అనేసి వెళ్ళిపోయాడు.
    సరిగ్గా అలాగే జరిగింది.
    జరిగినదంతా విని ఆనందరావు కూడా ఆశ్చర్యపడ్డాడు.
    "చూడు-నీ కిప్పుడు ఎదురులేదు. ప్రపంచమంటే భయంలేదు. అవునా?" అన్నాడు శోభన్.
    "అవును...." అన్నాడు ఆనందరావు ఉత్సాహంగా.
    "ఈపిస్టల్ దగ్గరుంచుకో శ్రీహరి, దీప్తి-వాళ్ళిద్దర్నీ నువ్వేం చేయాలనుకుంటే అది చేయి నీ జీవిత లక్ష్యం నెరవేర్చుకో ఆ తృప్తితో హాయిగా కళ్ళు మూస్తావు. అది నీ అదృష్టం....."
    "నాకేమిటోలా వుంది. చాలా ఉత్సాహంగావుంది. కొత్త జీవితం నాలో సంతోషాన్ని నింపుతోంది శోభన్....నీకు చాలా చాలా థాంక్స్!" అన్నాడు ఆనందరావు.
    "అవన్నీ తర్వాత....ఇప్పుడు ప్రతిక్షణమూ నీ కెంతో విలువైనది. ఈ విలువైన క్షణాలను థాంక్స్ చెప్పడానికీ, కులాసా కబుర్లకూ వృధాచేయకు వెళ్ళు నీ జీవిత లక్ష్యం నెరవేర్చుకో...." అన్నాడు శోధన్.
    "అవును నా ముందున్నవి విలువైన క్షణాలు. ఒక్కటి కూడా వృధా చేసుకోకూడదు...." అన్నాడు ఆనందరావు. అతడి కనులలో దృఢనిశ్చయం కనబడుతోంది.
    ఆనందరావు బయల్దేరగానే శోధన్ పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు. ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న విషయమతడు పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయవలసివుంది.

                                         6

    దీప్తి నెమ్మదిగా-"అతడు మళ్ళీ మనింటికిరాడు...." అంది.
    "అలాగని నే ననుకోను. మనుషుల్లో మంచితనముండి తీరాలన్నది నా నమ్మకం. ఆనందరావు స్వతహాగా దుర్మార్గుడు కాదు ఇతరుల ప్రభావం, తన దురాశా-అతడినీ విధంగా మార్చాయి. ఏదో ఒక రోజున అతడు పశ్చాత్తాపపడతాడు. అప్పుడు మనవద్దకు వస్తాదు...." అన్నాడు శ్రీహరి.
    అతడింకా ఏదో అనాల్సిందే.....ఈలోగా ఎవరో తలుపు తట్టారు.
    దీప్తి వెళ్ళి తలుపుతీసి-"మీరా?" అంది.
    ఆనందరావు జేబులోంచి పిస్టల్ తీసి-"నీకు తెలిసిన ఆనందరావు చచ్చిపోయాడు. నువ్వు చూస్తున్నవాడు కొత్త ఆనందరావు, లోపలికినడు..." అన్నాడు.
    అతడు తలుపులు మూసేసరికి శ్రీహరి అక్కడకు వచ్చాడు. ఆనందరావు చేతిలోని పిస్టల్ చూసి-"ఏమిటి దంతా" అన్నాడు.
    ఆనందరావు క్లుప్తంగా తనెలా చనిపోయాడో, ఎలా బ్రతికాడో చెప్పి-"నే నిప్పుడెవరికీ భయపడను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏం కావాలంటే అది సాధించగలను. అయితే నాకున్న సమయం బహుకొద్ది. ఇప్పుడు నాకు మిగిలిన ప్రతిక్షణమూ విలువైనది అవి ఉపయోగించుకోవాలని వచ్చాను...." అన్నాడు.
    "దీప్తికి మానభంగం నీకు ప్రాణభంగం-ఇందుకే నేను బ్రతికింది...." మళ్ళీ అన్నా డానందరావదోలా నవ్వుతూ.
    ఆ అన్నా చెల్లెళ్ళిద్దరికీ నోటమాట రాలేదు. వాళ్ళిద్దరూ అతడినీ అతడి చేతిలోని పిస్టల్ నూ భయం భయంగా చూడసాగారు. అతడి మాటలు నిజమని వారు నమ్మలేదు.
    "ప్లీజ్ అలా చూడవద్దు...." అన్నాడు ఆనందరావు-"దీప్తి చేతిలోని పరాభవం నాలో పరివర్తన తీసుకొచ్చింది. మీ అన్నా చెల్లెల్లిద్దరూ భగవత్స్వరూపులు. మీ ముందు భగవంతుడికి కూడా ఓటమి తప్పదు నే నోడిపోయానంటే ఆశ్చర్యంలేదు. కానీ మీ యిద్దరికాళ్ళమీదా పడి క్షమార్పణ వేడుకోవాలన్న కోరిక నాలో మిగిలిపోయింది. అయితే మిమ్మల్ని కలుసుకునే ధైర్యం చేయలేకపోయాను. బ్రతికుండగా నా కోరిక తీరదనుకున్నాను. కానీ నా కోరిక తీరడం కోసమే మళ్ళీ బ్రతికినట్లున్నాను. నన్ను తప్పు దారిన నడిపించిన శో'ధన్ ని అంతంచేయాలన్న ఆవేశం కూడా నాకు తిరిగి బ్రతగ్గానే కలిగింది. కానీ నాకు మిగిలిన విలువైన క్షణాలు కొత్తనేరం చేయడానికికాక-పాత నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందుకుపయోగించాలనుకుని మీ దగ్గరకు వచ్చాను...."
    ఆనందరావు పిస్టల్ విసిరేసి శ్రీహరి కాళ్ళమీదపడ్డాడు. అతడు మ్రాన్పడి చూస్తూండగా లేచి తిరిగి దీప్తి కాళ్ళమీద పడ్డాడు.    
    ఆ తర్వాత అతడు మరి లేవలేదు.
    ఆనందరావు చనిపోయాడని అర్ధం కావడానికి వారిద్దరికీ ఎంతోసేపు పట్టలేదు. ఇద్దరికిద్దరూ ఉన్నపళంగా పోలీస్ స్టేషన్ కు పరుగెత్తారు.....
    జరిగిన విశేషం వార్తాపత్రికల్లో మొదటి పేజీలకెక్కింది. ఆ సంచలనవార్త గురించి మనకనవసరం. ఈ సంఘటన గురించి శ్రీహరి చెల్లెలితో-"జీవితంలో ప్ర్తతి క్షణం విలువైనది. తెలియనివాడవి వృధా చేసుకుంటాడు. ఆనందరావు జీవితంలోనూ అంతే జరిగింది. జీవితంలో అతడు-చచ్చి బ్రతికిన ఆ కాసిని క్షణాలను మాత్రమే సక్రమంగా ఉపయోగించుకో గలిగాడు. ఎవరికే క్షణంలో చావు రాసిపెట్టి ఉందో తెలియదు. అందుకని ఆనందరావు కథను మనం హెచ్చరికగా తీసుకుని-ప్రతిక్షణాన్నీ అపురూపంగా చూసుకుంటూ సక్రమంగా ఉపయోగించుకోవాలి." అని చెప్పిన విశేషాన్ని మాత్రం-మన మందరం హెచ్చరికాగా తీసుకోవలసి ఉంటుంది.


                                 -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS