Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 43


    ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రేమలోనూ వుంటాయి.
    చిన్నప్పట్నించీ సతీష్ కు తాతయ్య దగ్గర బాగా చేరిక. ఇంట్లోని అందరికీ ఆయనే తనకు ఆత్మీయుడన్న భావం అతడిలో యెప్పుడూ ఉండేది. బామ్మపోయాక అతడికీ తాతయ్యే ప్రాణమయ్యాడు.
    బియ్యే ప్యాసై రెండుసార్లుద్యోగం వదులుకున్నాక తల్లి అతణ్ణి సాధించడం మొదలుపెట్టింది. నారాయణ రావామెను మందలిస్తూండేవాడు.
    "మీరూ అలాగంటే ఎలా? ఇంట్లోవున్నట్లే ఆఫీసులో మసిలితే కుదరదని మీరేవాడికి చెప్పాల్సిందిపోయి......నన్ను మందలిస్తారేమిటి మామయ్యా!" అని మాలతి యెదురుతిరిగింది.
    "నా మనుమడు-ఒకరి మోచేతి నీళ్ళు తాగేవాడు కాదు...." అని-"ఏరా -డబ్బిస్తాను......ఫ్యాన్సీ దుకాణం పెట్టుకుంటావా?" అన్నాడు నారాయణరావు.
    సతీష్ అంగీకరించాడు.
    పదివేలు పెట్టుబడికి పాతికవేలు బ్యాంకులోన్ తోడుకాగా ఫ్యాన్సీ దుకాణం వెలిసింది. అయితే సతీష్ కి అదీ సరిపడలేదు. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు, సేల్సుటాక్సు వాళ్ళు ఇన్ కంటాక్సువాళ్ళు .....అతడివెంటబడ్డారు. అందరితోను అతడు గొడవపెట్టుకున్నాడు. షాపు మూసేయాల్సిన అగత్యం పట్టింది.
    "నువ్వింక బాగుపడవు...." అంది మాలతి.
    "ఈ దేశంలో స్వతంత్రంగా బ్రతకాలనుకుంటే దారిలేదు...." అన్నాడు సతీష్ నిర్లక్ష్యంగా.
    నారాయణరావు మనుమడినేమీ అనలేదు. ఆయన నమ్మకస్తుడైన బంధువుల కుర్రాడికి ఫ్యాన్సీషాపు అప్పగించాడు.
    ప్రస్తుతానికి షాపుమీద కొంత ఆదాయం అందుతోంది. షాపు నిలబడింది. కానీ సతీష్ సమస్య అలాగే వుండిపోయింది.
    బంధువుల కుర్రాడి పేరు నరసింహమూర్తి. నారాయణరావతన్ని మూర్తీ-అని పిలుస్తాడు.
    మూర్తి తెలివైనవాడు. నారాయణరావుగారినింప్రెస్ చేయాలని అతడు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నాడు. మూర్తి యేదో ఒకరోజున ఆ ఫ్యాన్సీషాపును స్వంతం చేసుకోగలడని నారాయణరావు అనుమానం.
    ఈలోగా సతీష్ ఓ వ్యాపారస్తుడి కూతుర్ని ప్రేమించాడు. ఇద్దరూ జల్సాగా తిరిగేవారు. వ్యాపారస్తుడికిది తెలిసి స్వయంగా ఇంటికి వచ్చి నారాయణరావుతో నిష్టూరంగా మాట్లాడాడు.
    నారాయణరావుక్కోపంవచ్చి-"మీ అమ్మాయిని మీరదుపులో పెట్టుకోక మా వాడిని తప్పుపడతారేం?" అన్నాడు.
    "మీ అబ్బాయిని మీ రదుపులో పెట్టుకోగలరా?" అన్నాడాయన.
    "నాకా అవసరంలేదు-...." అన్నాడు నారాయణరావు.
    "నాకూ ఆ అవసరంలేదు-" అన్నాడావ్యాపారస్తుడు.
    "అయితే నా దగ్గరకెందుకు వచ్చారు?"
    వ్యాపారస్థుడు నవ్వి-"మీరంటే నాకు గౌరవముంది. అందుకే వచ్చాను-" అన్నాడు.
    "మీ మాటలు నాకర్ధంకావడంలేదు-...."
    "మీవాడిని మీరే అదుపులో పెట్టుకొనడం మంచిది. అది మీకు చేతకాకపోతే నేనే మీ వాణ్ణి అదుపులో పెట్టాల్సుంటుంది. అది మీవాడికి క్షేమం కాదు...."
    "అంటే?"
    "ఇది హెచ్చరిక...." అని వెళ్ళిపోయాడాయన.
    ఆ రాత్రి నారాయణరావు మనుమడిని కూర్చోపెట్టి హితబోధ చేశాడు.
    "దీప నన్ను ప్రేమిస్తోంది తాతయ్యా...." అన్నాడు సతీష్.
    "కానీ-నేనీ పెళ్ళికి ఒప్పుకోను....."
    "ఈ పెళ్ళి జరక్కపోతే నేనింట్లోంచి వెళ్ళిపోతాను" అన్నాడు సతీష్.
    "నన్ను విడిచి వుండగలవురా?" అన్నాడు నారాయణరావు.
    "ఉండలేను......ఇంట్లోంచి వెళ్ళిపోవడమంటే నన్ను నేను శిక్షించుకోవడమే....."
    "అదేం కాదు....ఆ దీపకోసం-నన్నుకూడా కాదంటున్నావు...."
    "నువ్వు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు తాతయ్యా!" అన్నాడు సతీష్-"దీపతో నా పెళ్ళికి అంగీకరించక పోతే-నేనింట్లోంచి వెళ్ళిపోతాను. అయితే దీపనూ కలుసుకోను. నువ్వొప్పుకుంటే నే మా పెళ్ళి జరుగుతుంది. నువ్వొప్పుకునే దాకా నేను దీపనూ కలుసుకోను, నిన్నూ చూడను....."
    నారాయణరావు మనసు ఆర్ద్రమైంది.
    "ఒకసారా అమ్మాయిని పిల్చుకునిరా. నేను మాట్లాడతాను...."
    "థాంక్స్ తాతయ్యా!" అన్నాడు సతీష్.
    ఆ తర్వాత వారంరోజులపాటు-ఈరోజు, రేపు అంటూ గడిపాడతడు. నారాయణరావు దీప నిజంగానే తనింటికి వస్తుందనుకున్నాడు కానీ అలా జరుగలేదు.
    సరిగ్గా వారంరోజుల తర్వాత సతీష్ చావు దెబ్బలు తిని రోడ్డుమీద పడుంటే-ఎవరో తీసుకువెళ్ళి హాస్పిటల్లో జేర్పించారు. మాలతి లబోదిబోమంటూ హాస్పిటల్ కు వెళ్ళింది. నారాయణరావుకూడా హాస్పిటల్లో మనుమడిని చూసుకున్నాడు.
    "ఏమిట్రా యిది!" అన్నాడు నారాయణరావు.
    "ప్రేమ" అన్నాడు సతీష్.
    నారాయణరావు భారంగా నిట్టూర్చాడు.
    సతీష్ హాస్పిటల్లో పదిరోజులున్నాడు. హాస్పిటల్లోంచి బయటపడేసరికి-దీపకు పెళ్ళి జరిగి హనీమూన్ కు కాశ్మీర్ వెళ్ళింది.
    నెలరోజుల తర్వాత ఆమె తిరిగి వచ్చింది.
    సతీష్ వీలుచూసి ఆమెను కలుసుకున్నాడు. ఆమె అతడి నెరుగను పొమ్మంది.
    రెండ్రోజులపాటు సతీష్ పిచ్చివాడిలా తిరిగాడు.
    "ఏమిట్రా యిది!" అన్నాడు నారాయణరావు.
    "మోసం!" అన్నాడు సతీష్.
    "మోసగాళ్ళను ప్రేమించకు. ఇలాగే భంగపడతావు...."
    సతీష్ విషాదంగా నవ్వాడు. మానసికంగా అతడు దెబ్బతిన్నాడని గ్రహించి - నారాయణరావతన్ని ఓదార్చాడు. సతీష్ కాయన దగ్గర చేరిక ఎక్కువయింది.
    కానీ అప్పట్నించీ సతీష్ లో కొత్త మార్పువచ్చింది. అతడు రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. ఉదయం ఓ పట్టాన నిద్ర లేవడంలేదు.
    నారాయణరావు మనుమడి భవిష్యత్తు గురించి బెంగపెట్టుకున్నాడు. రోజూ విధిగా దైవప్రార్ధన చేస్తున్నాడు.

                                    3

    "సతీష్.....సతీష్...."
    "ఎవరో తలుపు తడుతున్నారు.
    జగన్నాధం వెళ్ళి తలుపుతీశాడు. ఎదురుగా కనబడిన యువకుణ్ణి చూసి-"నువ్వు.....విశ్వం కదూ!" అన్నాడు.
    "అవును డీ-సతీష్ యింట్లో వున్నాడా?" అన్నాడు విశ్వం.
    "స్నానం చేస్తున్నాడు....." అన్నాడు జగన్నాధం.
    విశ్వం అసహనంగా-"ఓసారి అర్జంటుగా రమ్మని పిలుస్తారా?" అన్నాడు.
    జగన్నాధం అదోలా అతడివంక చూసి-"కూర్చో!" అన్నాడు.
    విశ్వంగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. జగన్నాధం లోపలకు వెళ్ళాడు.
    విశ్వం ఆయన వెళ్ళగానే మళ్ళీ లేచినిలబడ్డాడు. జేబుల్లో చేతులు పెట్టుకుని అటూ ఇటూ తిరిగాడు. క్షణమొక యుగంలా వుందతడికి.
    కాసేపటిలో సతీష్ అక్కడికి వచ్చాడు.
    విశ్వం సతీష్ ని చూస్తూనే-బయటకు వస్తావా?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS