'మళ్లీ ఇంకో చీర ఇచ్చేరా?' అంది తార.
'ఆ ముష్టి వాళ్ళ గుంపు లోకి ఒకత్తి మంచి చీర కట్టుకుని వెడితే మిగిలిన వాళ్ళు చూస్తూ వూరు కుంటారా. అంతా దాన్ని లాక్కుని చివరికి ముక్కలు చేసి తలోటి తీసుకుని వుంటారు.' అన్నాడు అవధాని.
'ఆ-- అది అసలు వాళ్ళ గూడెం దాకా వెళ్లి వుంటుందా దారి లోనే ఎవరికో రూపాయి కో అర్ధ కో అమ్మేసి వుంటుంది.' అన్నాడు కామేశ్వరర్రావు.
'అదేమీ కాదు-- కోయ్యలాంటి పువ్వుల చీరలో ముస్తాబయి అడుక్కోటాని కి వస్తే ఎవ్వరూ ఏమీ ఇవ్వరని అదే ఆ చీర దాచేసుకుని మళ్లీ అలా తయారయి వుంటుంది.' అన్నాడు రమణమూర్తి.
'అలా అది ఎందుకు చేసిందో కారణం ఏమై వుంటుందో ఎవరైనా మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పగలడేమో' అన్నాడు జనార్దనం.
'ఏమో మరి-- నాకు తోచింది ఒక్కటే. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. కాని నేననుకుంటున్నది ఏమిటంటే, ఈ ముష్టి అడుక్కోటం అనేది డానికి చిన్నప్పటి నుంచీ అలవాటయి పోయింది. దాని తండ్రి ముష్టి వాడు తల్లి ముష్టి ది , దాని రక్తంలో ఈ అడుక్కు తినే గుణం జీర్ణించుకు పోయింది. ఇవాళ దానికి అవసరానికి మించి ఇచ్చినా అడుక్కోటం అది మానలేదు. ఆ నీచపు బుద్ది వాళ్ళల్లో నశించి పోదు.' చీదరించు కుంతున్నట్లుగా అన్నాడు వీర్రాజు, ' పైగా అందరికీ జాలి పుట్టి ఇంతో అంతో పదేసేలా చేయాలని, దాని కోసం వీళ్ళు ఎంతకయినా తెగిస్తారు.'
'అంతేనంటారా ?' అన్నాడు జగన్నాధం.
'మరి కాకపొతే ఏమిటి? కనకపు సింహాసనమున శునకము ను గూర్చుండ బెట్టి అన్న పద్యము వినలే....' అన్నాడు కామేశ్వర్రావు.
'అంతే మరి- మనవాళ్ళు హీరిడిటీ, రక్త సంబంధం అంటూ ఎందుకన్నారు? పోలికలూ బుద్దులూ అన్నీ వంశ పారం పర్యంగానే వస్తాయి....' అన్నాడు వీర్రాజు అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది.
కాని మురళీ బుర్ర మాత్రం దాన్ని గురించే ఆలోచిస్తూ ఆ సంభాషణ లోని ప్రతి అక్షరం మననం చేసుకోటానికి ప్రయత్నిస్తోంది. అందులోనూ 'దాని రక్తంలో ఈ అడుక్కు తినే గుణం జీర్ణించుకు పోయింది. ఇవాళ డానికి అవసరానికి మించి ఇచ్చినా ఆ అడుక్కోవటం పోదు.' అన్న మాటలు మరీ మరీ గింగురు మంటున్నాయి అతని చెవిలో.
వీర్రాజు ఆ మాటలని ఏ వుద్దేశం తోనూ అనలేడు. వాటిలో వ్యంగ్యం కాని ఎత్తి పొడుపు కాని లేదు-- మిగిలిన వాళ్ళెవరూ కూడా వాటికి మరే అర్దాలూ వెతకలేదు....కాని మురళీ కి మాత్రం అదొక విసురులా వచ్చి సూటిగా గుండెలకి తగిలింది.
మనిషిలో ఒక లోపం వుంది -- తను ఎందు లోనయినా తక్కువగా వున్నానని కాని, లేకపోతె ఎవరైనా వేలెత్తి చూపించగలిగే అంశం ఏదైనా తనలొ వుందని గాని అనుకున్నప్పుడు ఏ ప్రక్క నుంచయినా ఎలాంటి విమర్శలయినా విసుర్లయినా వినిపిస్తాయేమో అన్నట్లు అలా చెవులు రిక్కించుకుని కూర్చుంటాడు.
అవతలి వాళ్ళు ఆ వుద్దేశ్యంతో అన్నీ అనకపోయినా ప్రతి విషయాన్ని తన పరిస్తితికే అన్వయించు కుంటూ బాధపడతాడు-- ఆ బలహీనతని జయించగలిగే వాళ్ళు అక్కడా అక్కడా వుంటారు కాని మురళీ కి అది చేత కాలేదు-- ఇంకా చెప్పాలంటే సరిగ్గా అలాంటి ప్రశ్నే కొన్నాళ్ళుగా అతన్ని వేధిస్తోంది.
ఉదాహరణతో సహా విన్న ఆ సంభాషణ అతని మనస్సులో ఏదో అశాంతి ని రేపింది. -- తరువాత కొద్ది రోజులు గడిచినా అతను ఏదో విధమైన అస్థిమితం తో చిరాకు తో సతమత మావుతూనే వున్నాడు. సరిగ్గా అలాంటి రోజులలోనే వో సంఘటన జరిగింది.
* * * *
ఆ ఉదయం నిద్ర లేచేసరికి మురళీ కి తల నొప్పిగా వున్నట్ల నిపించింది. సరే, అదే పోతుందిలే అనుకుని లేచి స్నానం అదీ చేసి భోజనం చేసి ఆఫీసు కి వెళ్ళిపోయాడు.
క్రమంగా సర్దుకుంటుంది అనుకున్న ఆ తలనొప్పి తగ్గలేదు సరి కదా ఇంకా ఎక్కువ కావటం ప్రారంభించింది. మేనేజరు తో అవసరమైన విషయాలని గురించి మాట్లాడటం టైపిస్టు కి వుత్తరాలు డిక్టేటు చెయ్యటం అన్నీ అయేసరికి మరీ విపరీతంగా నొప్పి ఎక్కువయి ఆఫీసులో కూర్చోటమే సాధ్యం కాదని పించి అది-- అయినా కాస్త అర్జెంటు పని వుండి పోవటంతో ఫ్యూన్ చేత ఓ తల నొప్పి మాత్రా వో కప్పు కాఫీ తెప్పించుకుని మాత్ర వేసుకుని కాఫీ తాగాడు. దాంతో కాస్త నొప్పి తగ్గినా అక్కడ కూర్చోవాలని పించక ఆ అర్జెంటు పనేదో చూసేసి మేనేజరు కి చెప్పేసి వచ్చేశాడు.
అతను రిక్షా దిగి గేటు తెరుచుకుని లోపలికి వస్తూ, తను ఇంటి గడపలో నిలువునా నిలబడి వున్న మనిషిని చూసి తెల్లబోయాడు.
'ఎవరితను ? మా దగ్గర వాళ్ళలో కాని దూరపు బంధువులలో కాని ఇలాంటి వ్యక్తీ ఎవ్వరూ లేరు-- స్నేహం లేదు సరి కదా కనీసం ముఖ పరిచయం అయినా వున్న గుర్తు రావటం లేదు-- మరి మా ఇంటికి వచ్చిన ఇతను ఎవరై వుంటారు?' అని అనుకుంటూనే అడుగులు ముందుకి వేశాడు.
విలాసంగా సిగరెట్టు కాలుస్తూ, ఆ పొగ రింగుల లోకి అరమోడ్పు కన్నులతో చూస్తూ వోలాంటి తన్మయత్వంతో వున్న ఆ వ్యక్తీ తన దగ్గరగా ఎవరో వచ్చినట్లు అనిపించి చటుక్కున తల తిప్పి చూశాడు. ఒక్క క్షణం ఒకరి కళ్ళలోకి ఒకరు సూటిగా పరీక్షగా చూసుకున్నారు.
'ఎవరు నువ్వు?' అన్నట్లు వోసారి ఎగాదిగా మురళీ వంక చూసి అంతలోనే పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చుకుంటూ 'రండి' అంటూ లోపలికి నడిచాడు ఆ వ్యక్తీ.
'నా యింట్లో కి నేను రావటానికి వీడు అనుజ్ఞ ఇవ్వాలా అసలు వీడెవడు?' అని లోలోపలే విసుక్కుంటూ 'మీరు?' అంటూ అర్దోక్తి లోనే ఆగిపోయాడు మురళీ -- తను వూహించినది సరి అవునో కాదో ఇప్పటికిప్పుడే తేలిపోతుంది అనిపించింది.
'కళ్యాణి మా మేనగోడలే లెండి-- నా పేరు రాఘవరావు' నవ్వుతూ చెప్పాడతను.
ఆ ఇకిలిపు చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది మురళీ కి. ఈడ్చి పెట్టి ఒక్క లెంపకాయ కొడదామా అనిపించింది-- అతను మొహంలో చిట్లింపు ని కళ్ళలో విసుగుని గ్రహించి అదేం లెక్క చెయ్యనట్లు రాఘవులే మళ్లీ అన్నాడు.
'మీరెవరో, అడగక్కర్లెకుండానే నాకు తెలిసిపోయింది లెండి-- రాగానే కళ్యాణి మీ పెళ్లి ఫోటోలు అవీ చూపించింది.' అంటూ మరోసారి ఇకిలించి 'కళ్యాణి అల్లుడు గారు వచ్చారమ్మా' అంటూ వో కేక పెట్టాడు.
వంటగదిలో నవ్వుకుంటూ ఖబుర్లు చెప్పుకుంటూ కాఫీ కలుపుతున్న వల్లీ కి కళ్యాణి కి మురళీ రావటం వాళ్ళు మాట్లాడుకోటం తెలియలేదు కాని ఇప్పుడు రాఘవులు గట్టిగా వేసిన కేకతో ఇద్దరూ త్రుళ్ళి పడ్డారు-- కప్పులలోకి కాఫీ ఒంచు తున్న కళ్యాణి చెయ్యి వణికి గిన్నెలో కాఫీ కొంత ఆమె చీర మీద కొంత నెల మీదా పడిపోయింది. ఆ వున్నది రెండు కప్పులలో నే పోసి 'ఇది మీరు తీసుకోండి. మాకు మళ్లీ చేస్తాను' అంటూ రెండు కప్పులూ సాసర్లూ వో ట్రేలో పెట్టి అక్కగారి చేతికి ఇచ్చింది కళ్యాణి. ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా ఆమె చేతులు వణికి పోవటం గమనించిన వల్లి 'ఏమిటే ఇది. మీ అయన పేరు చెప్పేసరికి అంత భయపడి పోతున్నావు.' అంది వేళాకోళం గానూ వెక్కిరింత గాను కూడ.
'నయమే-- భయం ఏమిటి ఏం లేదు-- ఈ మధ్య వంట్లో నీరసంగా వుంటోంది. దాంతో కాళ్ళూ చేతులూ ఇరవై నాలుగు గంటలూ వనుకుతున్నట్లే వుంటున్నాయి.' ఏదో చెప్పేసి ప్రక్కకి తిరిగి కొంగుతో మొహం మీద చెమట తుడుచుకుని 'పద' అంది కళ్యాణి.
కాఫీ ట్రేతో ముందు వల్లీ అ వెనక కళ్యాణి వీధి గదిలోకి వచ్చారు. అక్కడ కుర్చీలో రాఘవులు ఒక్కడే కూర్చుని వున్నారు.
'మరిది గారేరీ?' అంది వల్లీ వో కప్పు అతనికిచ్చి మరో కప్పు తను తీసుకుంటూ.
'అలా లోపలికే వచ్చారు. గదిలో వున్నారేమో' తెల్లటి గుడ్డ పీలికలా పాలిపోయి వున్న కళ్యాణి మొహంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు.
కళ్యాణి ఏమీ మాట్లాడలేదు. అసలు మాట్లాడాని కంటూ ఏదైనా వుందని కూడ తనకి అనిపించలేదు --
కాఫీ తాగి వాళ్ళు వెళ్ళిపోయాక వీధి తలుపు గడియ పెట్టి , గుండెలను పిడికిటి లో పట్టుకుని గబగబ లోపలికి వచ్చిన కళ్యాణి గుమ్మం నుంచే పడక గది లోకి చూసింది-- ప్యాంటు జేబుల్లో రెండు చేతులూ పెట్టుకుని కిటికీ దగ్గర నిలబడి వున్నాడు మురళీ. అతను అటు తిరిగి వుండటం వల్ల కళ్యాణి ని గమనించ లేదు. ఆ స్థితిలో వున్న అతన్ని అప్పుడు పలకరించటానికి సాహసం లేక మెల్లిగా వంట గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి.
మళ్లీ నీళ్ళు కాచి డికాక్షన్ వేసి కాఫీ కలిపెసరికి ఆలశ్యం అవుతుందని గబగబా నెస్ కేఫ్ కాఫీ రెండు కప్పులలోకి కలిపి గదిలోకి తీసుకు వెళ్ళింది.
'ఇప్పటికి తెమిలిందన్న మాట' కిటికీ దగ్గర నుంచి కదిలి రాకుండానే అన్నాడు.
ఏదో మాట్లాడబోయి చేతకాక ఆ మాటలతో పాటు వో గుటక ని కూడా మింగి కాప్పు అందించ బోయింది కళ్యాణి.
'ఇప్పుడెం అక్కర్లేదు. అక్కడ పెట్టు.' కళ్యాణి మారు మాట ఆడకుండా అతను చెప్పినట్లు చేసింది.
'ఎంత సేపయింది వీళ్ళోచ్చి?' ముడుచుకున్న కనుబొమలు తీక్షణంగా వున్న చూపులు దూకుడు గావస్తున్న మాటలు, అతని ధోరణి వో ప్రక్క నుంచి ఖంగారు పెట్టేస్తున్నా ఎలాగో అంది కళ్యాణి.
'ఇప్పుడే.....వో అరగంట యిందేమో .'
'ఉహూ..ఇవాళ ఒంట్లో బాగుండక నేను త్వరగా ఇంటికి వచ్చాను కాబట్టి తెలిసింది...నేను ఇంట్లో లేని సమయంలో వీళ్ళు ఇలాగే వస్తూ పోతూ ఉన్నారన్న మాట.....'
'ఆహా లేదు....మామయ్య ఇవాళే మొదటిసారి వచ్చాడు. నన్నూ పాపనీ ఒక్కసారయినా చూడాలని ఎంతో ఇదవుతుంటే అక్కయ్య తీసుకొచ్చింది.....'
కళ్యాణి మాటలు ఇంకా పూర్తీ కానేలేదు. చివ్వున ఇటు తిరిగి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అన్నాడు మురళీ, 'మామయ్యట, మామయ్య-- ఆ వెధవ-- వాడు. వాడు....ఆ మాట నానోట వుచ్చరించా లంటేనే నా కసహ్యం. అలాంటి వాడు నన్ను అల్లుడు గారూ అంటూ నిన్ను అమ్మాయీ అంటూ మన యింట్లో తిరగటం నేను సహించను -- ఇలాంటివి నా కిష్టం వుండవు. ఇది మొదటి సారయినా ఎన్నో సారయినా అయిందేదో అయి పోయింది. ఇంక నుంచి నువ్వు వాళ్ళని లోపలికి రానివ్వద్దు-- వాళ్లతో నవ్వుతూ ఖబుర్లు చెప్పుకొటం నీకు సరదాగానే వుండొచ్చు...'
'నాకు సరదాగా వుందా -- వాళ్లు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండీ నా గుండెలు పగిలి ముక్కలయి పోతాయేమో నన్నంతగా ఎలా దడదడ లాడిపోయాయో రక్తనాళాలు చిట్లి పోతాయేమో నన్నంత వేగంగా నా శరీరంలో ప్రతి రక్త బిందువూ ఎలా వురకలూ పరుగులూ పెట్టేసిందో మీకు చెప్పటం నాకు చేతకాదు.........'
'అది నాకు చెప్పలేక పోయినా ఫరవాలేదు....నాకు కావలసిందోకటే , ఇక నుంచి నీ వాళ్ళెవరూ నీతో ఎలాంటి సంబంధమూ పెట్టుకోటానికి వీలులేదు. వాళ్ళ రాక పోకలన్నీ బంద్ అయిపోవలసిందే -- ఆ మాట నువ్వు వాళ్ళకి స్పష్టంగా చెప్పలేకపోతే నే చెప్తాను అంతేకాని........'
'మీకలాంటి అవసరం రాదు.....ఇంక వాళ్ళు మన ఇంటికి రారు-- వాళ్ళని పంపించే ముందు నేనే చెప్పేశాను. అలా చెప్పాలని వాళ్ళు రాగానే అనుకున్నాను కూడ ....కానీ కనీసం ఈ ఒక్క రోజైనా వాళ్ళు ఉన్నంత సేపూ వాళ్లతో సరదాగానే మాట్లాడాలనీ నాలోని భయాన్ని అలజడి ని వాళ్ళు గుర్తించ కుండా నవ్వుతూ మాట్లాడాలనీ అనిపించింది.......'
ఆర్ద్రత నింపుకున్న గొంతుతో కళ్యాణి చెప్తుంటే వెటకారంగా కనుబొమలు ముడిచి, 'ఇదంతా నేను విన్న దానికీ అన్నదానికీ సంజాయిషీ ఏమీ ఇవ్వక్కర్లేదు' అన్నాడు.
'సంజాయిషీ ఇవ్వటం కాదు నా అంతట నేను చెప్తున్నాను....ఆ కాస్సేపు అలా వుండటానికి నేను ఎంతగా శక్తిని కూడ దీసుకోవలసి వచ్చిందో , అంతర్యంలో అంతటి అగ్ని ని పెట్టుకుని పైకి చిరునవ్వు నటించటం అనేది....ఇస్ అబ్బా.... ఆ పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో మీకు అర్ధం అయేలా చెప్పటం నాకు చేతకాదు' హటాత్తుగా టేబిలు మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది కళ్యాణి.
'ఇవాళ తలనొప్పి తో అసలే నా తల పగిలి పోతోంది. నీ గొడవతో ఇంకా నాకు వేర్రేత్తించకు. నన్ను కాస్సేపు కళ్ళు మూసుకు పడుకోనీ.' అంటూ అలాగే వెళ్లి మంచం మీద వాలిపోయాడు.
కాస్సేపు అలా ఏడ్చి, ఏడ్చి, గుండెలలో భారం కొంచెం తేలిక చేసుకుని ఆ తరువాత కళ్ళు తుడుచుకుని ఆ గది లోంచి ఇవతలకి వచ్చి వీధి గదిలొ పాపని ఆడిస్తూ కూర్చుంది కళ్యాణి.
