Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 45


                                   18

    మూడు నాలుగు వారాలు గడిచి పోయాయి.....
    'లింగమూర్తి గారి అబ్బాయి పెళ్లి.' శుభలేఖ కళ్యాణి చేతిలో పెడుతూ అన్నాడు మురళీ.
    'ఎప్పుడు?' కవరు లోంచి కార్డు పైకి తీస్తూనే అడిగింది కళ్యాణి.
    'ఈ నెల పదిహేనో తారీఖుని -- కర్నూలు లో'-- దగ్గరగా వచ్చి చేతులు అందించిన పాపని ఎత్తుకుని లోపలికి వెళ్తూ అన్నాడు మురళీ.
    'ఆహా-- ఇరవయ్యో తారీఖున -- ఈ వూళ్ళో రిసెప్షన్ ఎరేంజ్ చేశారా- పబ్లిక్ గార్డెన్ లో సరూ బాగ్ లో ఎక్కడా అని ఆలోచిస్తున్నట్లు మురళీ వంక చూసింది.
    'వల్లబ్ భాయి పటేల్ స్టాట్యూ కెదురుగా వున్న గేటులోంచి కాకుండా మరో గేటులోంచి లోపలికి వెళ్తే ఎడం వేపు వుంది చూడు.....'
    'ఆ, ఆ, దానికిది వరకు మరో పేరేదో వుండేదను కుంటాను....'    
    'ఔను.' అన్నాడు మురళీ -- కార్డు మరోసారి చదివి కవరులో పెట్టి టేబిలు మీద పెట్టేసింది కళ్యాణి.
    రిసెప్షన్ రోజు వచ్చింది--
    సాయంకాలం అయిదు గంటలకే పాపకి స్నానం చేయించి, మంచి బట్టలు వేసి తల దువ్వి పౌడరు అద్ది ముస్తాబు చేసింది కళ్యాణి. తనూ స్నానం చేసి తయారయే సరికి మురళీ కూడా తయారయాడు.
    అద్దం ఎదురుగా నిలబడి చీర కుచ్చేళ్ళు సరి జేసుకుంటూ, ధర్మవరం సిల్కు చీర జరీ అంచు ముడతలు పడకుండా సర్దుకుంటున్న కళ్యాణి, 'ప్చ్. ఇవాళ పువ్వులే అమ్మ రాలేదు వీధిలోకి .' అనుకుంది కాస్త పైకే- ఆ ప్రక్కనే నిలబడి టై కట్టుకుంటున్న మురళీ --
    'అసలు మల్లె మొగ్గలింకా ముమ్మరంగా రావటం లేదుగా-- అందులోనూ పెళ్ళిళ్ళ సీజను-- పువ్వులన్నీ బజార్లోనే అమ్ముడయి పోతాయి. ఇంక వీధి వీధి తిరిగి అమ్మటాని కేం మిగులుతాయి....బజార్లో దండ లేమైనా దొరుకుతాయేమో, వెళ్ళే టప్పుడు తీసుకుందాం లే.' అన్నాడు.
    'మన పెరట్లో వేసిన చెట్టు ఇంకా మొగ్గే తొడగలేదు.
    'ఎంత సంరక్షణ చేసినా కొన్ని చెట్లు అంతే ....అయినా ఇదేం మన స్వంత ఇల్లా ఏమైనానా-- అద్దె యింటి కోసం ఇంత అవస్థ పడుతున్నావు.'
    'బాగుందండీ -- అద్దె ఇల్లయితే మాత్రం, మనం వున్నన్నాళ్ళు పరిసరాలు అందంగా ఆహ్లాదకరంగా వుండేలా చూసుకోవద్దా--' అంది కళ్యాణి.
    ఆరు గంటలు దాటుతుంటే ఇంటికి తాళం పెట్టి పాపని తీసుకుని ఇద్దరూ బయలుదేరారు.
    దారిలో బజార్లో రిక్షా ఆపి పూజ దండలు తీసుకుంటుంటే --
    'నాకూ?' అన్నట్లు జుట్టు మీద చెయ్యి పెట్టుకుని చూపించింది పాప.
    'అరె-- ఇది ఇలా పేచీ పెడుతుందని తెలిస్తే , రిబ్బనయినా తెచ్చేదాన్ని' అంటూ హెయిర్ పిన్ తో వో దండ ఎలాగో దాని తలలో ముడిచి తనూ పెట్టుకుంది కళ్యాణి.
    పబ్లిక్ గార్డెన్స్ గేటు ముందు రిక్షా దిగి లోపలికి వెళ్తుంటే ఆ బాటకి రెండు వైపులా లెక్కలేనన్ని కారులు రకరకాల వి రంగు రంగులవి పార్కు చేసి వున్నాయి.
    'అబ్బ ఎన్ని కార్లో?' అంది కళ్యాణి.
    'అవును. అయన చాల రోజుల నించి యిక్కడ వుంటున్నారు. కాకపోయినా మా కంపెనీ బ్రాంచి మేనేజరంటే మరి చాలా మంది పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం వుంటుంది.' అన్నాడు మురళీ.
    ఆ బాటకి ఎడం వైపుగా, బాట కంటే కాస్త పల్లంగా వున్న విశాలమైన జాగా అంతా ఒత్తుగా పరచిన పచ్చికతో , అక్కడక్కడా ఒక పద్దతిలో నాటిన పూల మొక్కలతో , ఇలాంటి పార్టీలు అవి ఇవ్వటానికి అనువుగా వుంటుంది. క్రిందికి దిగి అక్కడికి వెళ్ళటానికి మెట్లున్నాయి వో దగ్గర --
    ఇవాళ ఆ మెట్లకి రెండు వేపులా, ఇంకా క్రింద పూల చెట్లకి బల్బులు పెట్టారు. అప్పుడే వెలిగిన ఆ రంగు రంగుల దీపాలతో సరూబాగ్ మెరిసి పోతుంది. రంగు రంగుల పట్టు చీరలతో, రకరకాల ఫ్యాషన్ల లో విలువైన ఆభరణాలతో ...ఠీవిగా  సూట్లతో వచ్చిన ఆడా మగా ఇంకా దర్జాగా మెరిసి పోతున్నారు ఆ వెలుగులో.....మురళీ కళ్యాణి పాపా మెట్లు దిగి క్రిందికి వచ్చారు.
    అక్కడే ఆ దగ్గరగా నిలబడిన మూర్తి గారూ, భార్యా వచ్చిన వాళ్ళందర్నీ పలకరించి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకి కాస్త ప్రక్కగా వున్న టేబిలు మీద పుష్ప గుచ్చాలున్నాయి. మూర్తి గారి కూతురు పదిహేనేళ్ళ అమ్మాయి అయన ఆఖరి  కొడుకు పన్నెండేళ్ళ అబ్బాయీ అక్కడ నిలబడి తెచ్చిన వాళ్ళకి తలోటి ఇస్తున్నారు. ఆ దగ్గరలోనే వో సోఫాలో పెళ్లి కొడుకూ పెళ్లి కూతురు మెడల నిండా పూల దండలతో కూర్చున్నారు.
    వచ్చిన వాళ్ళందర్నీ అంటే దగ్గరి బంధువులు, అది వరకే ఆ అబ్బాయికి పరిచయం వున్న స్నేహితులు తప్ప మిగిలిన వాళ్ళందర్నీ మూర్తిగారు స్వయంగా వెంట బెట్టుకుని వెళ్లి కొడుకునీ కోడలినీ పరిచయం చేస్తున్నారు--

                                    
    అలా పరిచయాలు అయిపోయాక వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి తను తెచ్చినా ప్రెజెంటేషన్ పేకెట్ ఆ ప్రక్క నున్న టేబిలు మీద పెట్టి మూర్తి గారు చూపించిన ఇంకెవరి వేంటో ముందుకి సాగారు మురళీ వాళ్ళు.
    అప్పటికే చాలా టేబిల్స్ నిండిపోయాయి. ఖాళీగా వున్న టేబిలు దగ్గరికి వీళ్ళని తీసుకు వెళ్లి కూర్చో పెట్టి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి.
    హోటల్ రాజకమల్ కి  కేటరింగు ఇచ్చారు-- వో టేబిలు చుట్టూ నాలుగు కుర్చీలు వేసి నలుగురికి సరిపడే ప్లేట్లూ స్పూన్లూ టిఫినూ అన్నీ అమర్చి పెట్టి వున్నాయి.
    పాపని ఒడిలో కూర్చో బెట్టుకుని కూర్చున్న కళ్యాణి ఎదురుగా వున్న వాటి సంగతి వదిలేసి, ఆ పెళ్లి కొడుకు వేసుకున్న బుష్ కలర్ సూటు లో మురళీ ఎలా వుంటాడో ఊహించుకుంటూ  'ఈసారి అలాంటి సూటు కుట్టించు కోమని చెప్పాలి ఈయనకి....' అనుకుంటోంది.
    'పెళ్లి కూతురు కట్టుకున్న మబ్బు రంగు బెనారస్ సిల్కు చీర చాలా బాగుంది . కళ్యాణి కలాంటిది కొని ఇవ్వాలి.' అనుకుంటున్న మురళీ, 'ఏమిటా లోచిస్తున్నావు' అన్నాడు కళ్యాణి తో. 'మీరూ ఏదో ఆలోచిస్తున్నారు చెప్పండి.' అంది కళ్యాణి.
    ఇద్దరూ ఒకరి ఆలోచన ఒకరు చెప్పుకుని నవ్వుకున్నారు.
    'ఊ, కానీ-- మనం ఇలా ఊహలలో విహరిస్తుంటే , పార్టీ ముగిసి అంతా వెళ్ళిపోతారు.' అన్నాడు మురళీ -- పాపని ఖాళీగా వున్న పక్క కుర్చీలో కూర్చో పెట్టింది కళ్యాణి.
    ప్లేటు లోంచి వో బిస్కెట్ సర్వు చేసుకో బోతున్న మురళీ కళ్యాణి 'హలో' అన్న పలకరింపు విని అదీ ఎవరో ఎవరినో అన్నట్లు కుతూహలంగా తలలు తిప్పి చూశాడు-- ఆ పలకరించింది తమనే. ఆ వస్తున్న వాళ్ళు రమణ మూర్తి, కామేశ్వర్రావు , అవధాని, జగన్నాధం.
    'మీరు ఇప్పుడే వస్తున్నారా? మేమే ఆలశ్యం అయాం అనుకున్నాం' అన్నాడు మురళీ ఏదో మాట్లాడక పోతే బాగుండదని
    'కళ్యాణి గారూ బాగున్నారా?' అంటూ కల్యాణి ని పలకరించి 'మీ పాప బాగా పెద్దయి పోయినట్లుందే-- ఏడాది దాటిందా' అని అడుగుతూ పాప బుగ్గలు రెండు ఎర్రగా కంది పోయేలా నిమిరి తన ముద్దు ఒలకబోశాడు కామేశ్వర్రావు.
    'ఏం ముద్దు బాబూ, పిల్లలు బాధతో విలవిల్లాడి పోయేలా చేస్తే కాని, వీళ్ల సరదా తీరదు కాబోలు' అని లోలోపలే విసుక్కుంది కళ్యాణి పైకి ఏమీ అనలేక.
    'ఇంకా సంవత్సరం నిండలేదు-- ఇంకో నెల పైన వుంది పుట్టిన రోజు' అన్నాడు మురళీ కామేశ్వర్రావు అడిగిన దానికి సమాధానంగా.
    'వో అయితే బర్త్ డే పార్టీ ఇవ్వాల్సిందే' లేకపోతె వూరుకోము -- మీ పెళ్లి భోజనం తరువాత మళ్లీ ఇంతవరకూ మానోళ్ళు తియ్య బరచనే లేదు.' అన్నాడు రమణ మూర్తి.
    మురళీ నవ్వి వూరుకున్నాడు.
    అలా ఆ ఖబురూ ఈ ఖబురూ మాట్లాడుతూ ఖాళీగా వున్న ఆ ప్రక్క టేబులు చుట్టూ సర్దుకున్నారు ఆ నలుగురూ.
    స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పలేదు అన్నట్లు ఇక్కడ కూడా వీళ్ళు మా దగ్గరే తయారయారు.' అనుకున్నాడు మురళీ.
    కళ్యాణి కూడా వాళ్ళని చూసిన దగ్గర నుంచీ ఉత్సాహం చచ్చిపోయిన దానిలా ముభావంగా వుండి పోయింది.
    ఏవో పొడిపొడిగా మాట్లాడుకుంటూ మెల్లిగా ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు ప్రక్క టేబిలు దగ్గర నుంచి రమణ మూర్తీ, వాళ్ళ మాటలు కూడా వినిపిస్తున్నాయి.
    అలా వాళ్ళ ధోరణి లో వాళ్ళు వుండి పోయినా వాళ్ళంతా ఒక్క విషయం మాత్రం గమనించారు.
    వాళ్ళ టేబిలు ప్రక్క నుంచి అటూ ఇటూ వెళ్తున్న వారిలో చాలామంది ఆడా మగా కూడా కళ్యాణి మీద నుంచి దృష్టి మరల్చుకోలేనట్లూ మళ్లీ సభ్యతకి లోటు రాకుండా నూ ఒక్క క్షణం అలా రెప్ప వాల్చకుండా కళ్యాణి వంక చూసి మరీ కదిలి పోతున్నారు.
    మురళీ జాలీ మూడ్ లో వుండగా అలాంటిది జరిగితే, 'అందమయిన వస్తువుని చూస్తె అందరికీ అరాధించ బుద్ది వేస్తుందేమో.' అన్నట్లు చిలిపిగా కళ్యాణి వంక చూసి నవ్వేవాడు.
    కాని, ఇప్పుడు ఇద్దరు కూడా చూసీ చూడనట్లు వుండి పోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS