Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 43


    ఖబుర్ల ధోరణి లో వున్న వల్లీ గానీ, తల వంచుకుని కూర్చున్న కళ్యాణి కాని మురళీ రాకని గమనించలేదు-- అతను పూర్తిగా లోపలికి వచ్చి కుర్చీ ముందుకి లాక్కుని కూర్చో బోతుంటే ఇద్దరూ త్రుళ్ళి పడి నట్లు తలలు తిప్పి చూశారు.
`    "ఈవిడ పేరు జానకి-- చిక్కడపల్లి లో వుంటారు. వోసారి కూరల బజారు లో పరిచయం అయింది-- ఈ వెనక వీధిలో వాళ్ళ వాళ్ళెవరో ఉన్నారుట-- సరే నన్ను కూడా చూసి పోదామని ఇలా వచ్చారు --' గబగబా ఎవరో తరుముకు వస్తున్నట్లు చెప్పేసింది కళ్యాణి-- అక్కడ కుర్చీలో కూర్చోవాలను కున్నవాడే మళ్లీ మానేసి 'అలాగా' అన్నాడు మురళీ లోపలి గది లోకి వెళ్ళిపోయాడు.
    అప్పటిదాకా రెప్ప వాల్చకుండా అతని వంకే చూస్తూ కూర్చున్న వల్లీ,
    'సినీమా హిరోలని తలదన్నే లా వున్నాడే మీ అయన.' అంది పెదవి విరిచి చిన్నగా నవ్వుతూ.
    కళ్యాణి మనస్సు వులిక్కి పడింది-- చూపులు ఏవగింపు ని దాచుకోలేక పోయాయి.
    'సరే -- నే వెళ్తాను.' అంటూ లేచింది వల్లీ అదేమీ గమనించని దానిలా.
    ఆ మాటకోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణి 'సరే' అంది తనూ లేచి నిలబడుతూ.
    పాప రెండు బుగ్గలూ ముద్దు పెట్టుకుని, కళ్యాణి కళ్ళల్లోకి దేనికోసమో వెతుక్కుంటున్న దానిలా వోసారి చూసి గుమ్మం దాటింది వల్లీ.
    'మళ్లీ ఎప్పుడయినా వస్తాను' అని చెప్పాలనుకున్న వల్లీ
    'ఇంకెప్పుడు మా యింటికి రాకు' అని చెప్పాలనుకున్న కళ్యాణి ఇద్దరూ కూడా ఆ మాటలు నోటిలోనే మింగేశారు--
    భర్తతో అలా అబద్దం చెప్పినందుకు ఎలాగో అనిపించినా, నిజం చెప్పి మళ్లీ ఏవో గొడవలు సృష్టించి మనసు నలగ గోట్టుకోటం కన్నా ఇదే నయం అనుకుంటూ లోపలికి వెళ్లి
    'టిఫిన్ తీసుకుందాం రండి' అంటూ టేబిలు మీద అన్నీ సర్దిపెట్టి పిలిచింది కళ్యాణి.
    మురళీ మాట్లాడకుండా గదిలోంచి ఇవతలకి వచ్చాడు.
    కళ్యాణికి ఏమిటో భయంగా వుంది. అతని ముభావం, గాంభీర్యం చూస్తుంటే అతన్ని పలకరించి ఖబుర్లు చెప్పే సాహసం, బొత్తిగా లేకుండా పోయింది.
    'ఆవిడ మీ అక్క కదూ-- ' ఉన్నట్లుండి మురళీ నోటి లోంచి ఊడి పడ్డ మాటతో కళ్యాణి వులిక్కి పడి 'ఔను' అన్నట్లు తల ఆడించింది.
    'మరి-- ఎక్కడో చిక్కడి పల్లిలో కలిసిందనీ, ఇదనీ అదనీ అన్ని అబద్దాలు ఎందుకు చెప్పావ్' నిలదీస్తున్నట్లే అడిగాడు.
    కళ్యాణి కి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు.
    'ఎన్నాళ్ళ నుంచి ఆవిడ మనింటికి రాకపోకలు సాగిస్తోంది.
    'ఇవాళే-- మొదటిసారిగా -- ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది.'
    'నేను నమ్మను....పోనీ నీమాటే నిజం అనుకుందాం-- అయినా ఆవిడెవరో స్పష్టంగా చెప్పేస్తే తీరిపోయేదిగా -- ఆవిడ మాటలు కొన్ని నా చెవిని పడటం వల్లా, మీ ఇద్దరిలో స్పష్టంగా కనిపిస్తున్న పోలికల వల్లా నేను గ్రహించ గలిగాను-- అయినా అబద్దం చెప్పి నన్ను మభ్య పెట్టటం లో నీ వుద్దేశ్యం ఏమిటి?' నిలదీసి అడుగుతున్నట్లే వుంది అతని గొంతు.
    'తనెవరో తెలిస్తే మీరు అసహ్యించు కుంటారని అగ్రహ పడతారని....'అపరాధిలా తలవంచుకుని బల్ల మీద చేత్తో నిమురుతూ చెప్పింది కళ్యాణి.
    'నా ఆగ్రహమూ అసహ్యమూ సరే-- నీకెలాంటి అభిప్రాయం వుంది ఆవిడ మీద....అయినా అది నీ నోటితో ఎలా చెప్తావులే -- ఎంతయినా అక్క కదూ ఆ మాత్రం అభిమానం వుండక పోతుందా.' మురళీ గొంతులో వెటకారం ధ్వనించింది.
    'నా అభిప్రాయాన్ని నా మనస్సుని మీరు అర్ధం చేసుకుంటారను కుంటాను.'
    'ఆ ధైర్యం తోటే కదూ నోటికి వచ్చినట్ల ల్లా అబద్దాలు కల్పించి చెప్పావు. నేను నువ్వు చెప్పినదల్లా వెర్రి వెధవలా నమ్మేస్తానని , మీ అక్క అడే నాటకాలు నేను గ్రహించ లేననీ, ఆవిడ రహస్యం ఎప్పటికీ దాగే వుంటుందనీ ....'
    'నన్ను కొంచెం చెప్పనివ్వండి.' మనస్సూ, శరీరమూ కూడ బాధతో లుంగలు చుట్టుకు పోతున్నట్లుగా వుంది కళ్యాణి గొంతు.
    'అక్కర్లేదు ' మురళీ కోపంగా టిఫిన్ ప్లేటు ముందుకి తోసేసి లేచి వెళ్ళిపోయాడు.
    మ్రాన్పడి పోయింది కళ్యాణి కొంచెం సేపూ . ఆ తరువాత 'మామూలు రోజులలోనే క్షణాని కొరకంగా మారుతుండే భర్త మనస్సుని ప్రవర్తననీ గుర్తు తెచ్చుకుంటూ "ఇవాళ ఇలా జరగటం లో వింత ఏమీ లేదు.' అనుకుని ఓ నిట్టుర్పు విడిచింది-- కాని ఎంత మరిచి పోదామన్నా అతను అన్న చివరి మాటలు వుండి వుండి గుర్తు వచ్చి ఏదో పదునయిన ఆయుధంతో గుండెలని చీల్చేస్తున్నంత బాధ కలిగేది.
    'తను అన్న మాటల వల్ల ఎదుటి మనిషి మనసు గాయపడుతుంది అన్న ఆలోచన ఈయనకి రాదా' అని ఎంతసేపో బాధపడి చివరికి 'నేనలా అబద్దం చెప్పటం పొరపాటే అయిందేమో' అనుకుంది.

                             *    *    *    *
    మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది-- కేంటీను  లో టిఫినూ కాఫీ సేవించి, తాపీగా ఖబుర్లూ చెప్పుకుంటూ సిగరెట్లు కాల్చుకుంటూ , మెల్లిగా నడుస్తూ ఒక్కొక్కరే ఆఫీసుకి తిరిగి వస్తున్నారు.
    ఆఫీసు వరండా మీద నిలబడి సిగరెట్టు ఆఖరి దమ్ము పీల్చి అది అవతల పారేసి లోపలికి వచ్చిన రమణమూర్తి,
    'మరో కప్పు కాఫీ అయినా వచ్చేదిగా -- ఆ పావలా కాసు ఆ ముష్టి దాని చేతిలో పడేశావెందుకు ?' అన్నాడు అవధానితో.
    'పోనిద్దూ-- తెల్లారి లేచిం దగ్గర నుంచి అలాంటి కాఫీలు బోలెడు తాగుతుంటాం . దాని వల్ల ఒక గంట సేపు కూడ త్రాణ వుండదు-- పాపం ఆ బొచ్చగత్తే ఆ డబ్బుతో ఏ రొట్టె నొ కొనుక్కుంటే ఒక పూట కడుపు నిండుతుంది-- అలాగని ముష్టి వాళ్ళందరికీ అన్ని పూటలూ మనం పెట్ట లేమనుకో-- పసిగుడ్డు ని చేతులలో పెట్టుకుని అలా ఎండలో నిలబడి అడుక్కుంటున్న ఆ మనిషి ని చూస్తె ఏమిటో జాలేసింది.'
    ఏం జరిగిందసలు?' అన్నాడు కామేశ్వర్రావు కుతూహలంగా ముందుకు వంగి -- ఇవాళ ఇంట్లో అర్జంటు పనేదో వుండటం వల్ల మేనేజరు మధ్యాహ్నమే పనంతా పూర్తీ చేసుకుని యింటికి వెళ్ళిపోయాడు. --ఇంక మిగిలిన స్టాఫ్ పేరుకి నాలుగు గంటల దాకా ఆఫీసులో కూర్చున్నా జరిగే ఆఫీసు పని ఏమీ వుండదు సరదాగా ఖబుర్లు చెప్పుకొటం తప్ప--
    'ఆ -- ఏం లేదు -- ఇందాకా కేంటీన్ నుంచి వస్తుంటే , ఎవరో ముష్టిది పసిబిద్దని ఎత్తుకుని అడుక్కుటుంది-- జేబులోంచి ఓ పావలా కాసు తీసి ఇచ్చాను.
    'అబ్బే-- మరీ అంత జాలి పనికి రాదండీ -- నన్నడిగితే అసలు ఈ ముష్టి వాళ్ళకి ముష్టి వేసి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యకూడదు...అబ్బబ్బ -- వీళ్ళు ఎంత న్యూసెన్స్ అనుకుంటున్నారు...ప్రభుత్వం ఈ ముష్టి అడుక్కోవటాన్ని బెన్ చేసెయ్యాలి. అందాకా వీళ్ళ పీడ మనకి వదలదు.' అన్నాడు జనార్ధనం.
    'బాగుంది మీరు చెప్పింది -- అమ్మ పెట్టా పెట్టదు అన్నట్లు చెప్తున్నారు --ఇవాళ నుంచి ముష్టి వాళ్ళెవరూ కంట పడకూడదు అని వో 'లా' పాస్ చేసి వాళ్ళకి ఆ అవకాశం కూడ లేకుండా చేస్తే వాళ్ళు బ్రతికే దేలా? వాళ్ళ కేదో బ్రతుకు తెరువు చూపించి ఆ తరువాత ఏం చేసినా ఫరవాలేదనుకోండి-- మరి, మనదేశంలో విద్యాధికులే నిరుద్యోగ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ వున్నారు కదా అలాంటప్పుడు దేశంలో వున్న ముష్టి వాళ్ళు కూడా చూపించటానికి ఉద్యోగాలే మున్నాయి ?' అంది కమల.
    'చాలా అన్యాయం, చదువు కున్న వాళ్ళకీ, ముష్టి వాళ్ళకీ సాపత్యం ఏమిటి, ఒకరి వుద్యోగాలకి ఒకరు పోటీకి ఎలా వస్తారు?' అన్నాడు రమణమూర్తి మొహం ఎర్రగా చేసుకుని.
    'ఆవిడ వుద్దేశ్యం అది కాదు లేవయ్యా -- దేశంలో వున్న వుద్యోగపు అవకాశాలని గురించి జనరల్ గ చెప్పారంతే .' అన్నాడు జగనన్నాధం రమణ మూర్తిని శాంతపరుస్తూ.
    'అది సరికాని, వీళ్ళందరి కీ ఉపాధులు కల్పించాలి అని కమల గారు అన్నారు దానికి నా జవాబు వినండి....వీళ్ళకి ఈ అడుక్కోవటం అనేది బాగా అలవాటయి పోయింది-- అడుక్కొటానికి వీళ్ళే మీ కష్ట పడక్కర్లేదు-- రోడ్డుకి వో వారగా కూర్చుని ఆ దారిన నడిచే వాళ్ళందర్నీ అమ్మా బాబూ అని బ్రతిమాలాడు కుంటే పదిమంది లో ఒక్కడైనా వో పైసా విడల్చక పోడు -- లేకపోతె పదిళ్ళు తిరిగి బిచ్చం అడుక్కుంటే వో యింటిలో నయినా బిచ్చం దొరక్కపోదు....ఆ పద్దతిలోనే కడుపు నింపుకోటం వాళ్ళకి సుఖంగా వుంటుందే మో , మరి లేకపోతె ప్రభుత్వమూ ఎన్నో సేవా సంస్థలు బెగ్గర్ హోమ్సు పెట్టి ఈ బిచ్చగాళ్ళ ని అందులో జేర్చి వాళ్ళు చెయ్యటానికి పని కల్పించి మీరు పని చెయ్యండి మీకు కడుపు నిండా తిండి పెడతాము అని అన్ని విధాల చెప్పినా వీళ్లు అక్కడ ఒక్క రోజు కూడా వుండకుండా ఎందుకని పారిపోయి వచ్చేస్తున్నారంటారు. కష్టపడి పని చెయ్యటానికి ఒళ్లు వంగకనే ,' అన్నాడు వీర్రాజు.
    'మీరు చెప్పేది నిజమా? వీళ్ళకి వో వృత్తి వో బ్రతుకు తెరువు చూపించినా పని చెయ్య రంటారా?' నమ్మలేక పోతున్నట్లే అడిగాడు అవధాని.
    'ఈ బెగ్గర్ హోమ్సు గురించి , ముష్టి వాళ్ళు అక్కడ వుండకుండా పారిపోవటం గురించి మనం ఎన్నోసార్లు పేపర్ల లో చదువుతూ వుంటాం. అంత ఎందుకు? నా అనుభవం ఒకటి చెప్తాను.' అన్నాడు వీర్రాజు. 'ఏమిటది?' అన్నట్లు అంతా కుతూహలంగా చూశారు.
    'రెండు నెల లయిందనుకుంటా -- వో ఉదయం మా యింటి ముందు వో బిచ్చగత్తె కేక వినిపించింది -- గదిలో పేపరు చదువు కుంటున్న నాకు అది అలా అరుస్తోంటే చిరాకేసి 'దాన్ని పొమ్మని చెప్పు' అన్నాను మా ఆవిడతో -- తను వీధి వరండా లోకి వెళ్లి అక్కడ ఒక్క క్షణం అయినా నిలబడ లేనిదానిలా ఒక్క అంగలో వెనక్కి తిరిగి వచ్చి దండెం మీద క్రితం రోజు తడిపి ఆరవేసిన చీర తీసుకు వెళ్లి దానికిచ్చి వచ్చింది.
    'అదేమిటి? ముష్టి దానికి అంతగట్టి చీర ఇస్తావా?' అన్నాను నేను నీకేం మతి పోలేదు కదా అన్నట్లు చూస్తూ.
    'పోనీ లెద్దురూ , మహా అయితే మరో అయిదారు నెలలు ఆ చీర కట్టుకునే దాన్నేమో-- ఇంతకన్న పాత చీర వుందో లేదో కూడా నాకు గుర్తు లేదు. అయినా పెట్టి తీసి అవన్నీ వెదుకుతూ కూర్చోవాలనిపించలేదు. ఆ మనిషిని చూస్తె-- కడుపు తోటి వున్న మనిషి లా వుంది. ఒక్క అరా గజం బట్ట పీలిక ఒంటికి చుట్ట బెట్టుకుని గేటు ముందు నిలబడి వుంది-- దాని పరిస్థితి చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయను కొండి -- ఒక ఆడదాన్ని బ్రతుకు నడి రోడ్డు మీద నవ్వుల పాలు కాకుండా నాకు చేతనయినా సహాయం చేయ గలిగాను అనే తృప్తి కన్న ఆ చీర మరికొన్నాళ్ళు వాడుకో కుండా ఇచ్చేశాను అన్న బాధ నాకు ఎక్కువదెం కాదు-- ఆ ముష్టిది కొండంత సంబర పడిపోతూ నోటి నిండా లక్షసార్లు దీవిస్తూ అక్కడి కక్కడే ఆ చీర కట్టు కుంటుంటే నా కళ్ళు మనస్సు ఎంత తృప్తి తో నిండి పోయిందో మీకు చెప్పలేను' అంది మా ఆవిడ.
    'సరేలే' అనేశాను నేను.
    తరువాత పది పదిహేను రోజులు గడిచాయి. ఉదయం బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న నాకు మా ఆవిడ ఎవరి మీదో పెద్దగా వేస్తున్న కేకలు వినిపించి "ఏమిటది?' అన్నాను అక్కడ్నించే ఆత్రం ఆపుకోలేక'' -- మొన్నటి ముష్టిదే. మొన్నటి లాగే చిన్న పీలిక చుట్టబెట్టుకు వచ్చింది' అంది...వీర్రాజు మాట పూర్తీ కాకుండానే 'నిజం!' అన్నాయి ఆఫీసులో అయిదారు కంఠాలు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS