Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 44


                                 తప్పు చేయను!

    అసలు తప్పులో ఒక పెద్ద ఆకర్షణ ఉన్నదేమో అనుకుంటూంటాను నేను.
    డబ్బుపెట్టి పేకాడడం తప్పని చాలామంది అభిప్రాయం-అయితే ఒకసారి అలా ఆడి మనిన వాడెవడూ తప్పని పైకి ఒప్పుకున్నా-మళ్ళీ ఆడకుండా ఉండలేడని- స్వానుభవంమీద నా కేర్పడిన అభిప్రాయం.
    అలాగే ఆకర్షించే తప్పులు చాలా ఉన్నాయి-దొంగతనం, మద్యపానం, వ్యభిచారం......మొదలైనవి.
    ఎవరూ చూడకుండా ఉంటే దొంగతనం చేయాలనే అనిపిస్తుంది నాకు.
    దొంగతనం చేయడంలో ఒక విధమైన థ్రిల్ ఉంది. ఎవరైనా వస్తున్నారేమో నన్న భయం ఓమూల పీడిస్తూంటే- చేతులు తనకు కావలాసిన వస్తువువైపు పోతూంటే-అప్పుడు కలిగే శారీరక, మానసిక సంచలనాలు అపూర్వం-వీటన్నిటి అనంతరం మనం పట్టుబడ్డ కుండా బయట పడ్డామంటే కలిగే ఆనందం చెప్పనలవి కాదు. ఒక చిత్రకారుడు గంటలకొద్దీ ఏకాగ్రతతో గీసిన చిత్రం చక్కగా వచ్చినపుడు కలిగే ఆనందానికి ఈ ఆనందం ఏమీ తీసిపోదు.
    అంతేకాదు చిత్రం పాడయిపోతే-మళ్ళీ చిత్రాన్ని గీయడంలో విజయం సాధించేవరకూ చిత్రకారుడికి మనస్సు స్థిమితం ఎలా ఉండదో- దొంగకూ అంతే-అందుకే కాబోలు-మన పూర్వీకులు దొంగతనం ఒక కళ అన్నారు.
    అసలు నేను తప్పులు చేయడం దొంగతనంతో ఆరంభమయింది. నా కప్పుడు పధ్నాలుగేళ్ళనుకుంటాను. ఫోర్తుఫారం చదువుతున్నాను. మా క్లాసులోనే చదువుతున్న గోపీ అనే అబ్బాయి క్లాసుకి మంచి రంగుల పుస్తకం తీసుకొచ్చాడు. అది వాళ్ళ బాబాయి అమెరికా నుంచి తీసుకొచ్చాడుట. ఆ బొమ్మలు చూస్తూంటే నాకూ అలాంటి ఓ పుస్తకం ఉంటే ఎంత బాగుండును అనిపించింది. కానీ దొంగతనం చేయాలనే అభిప్రాయం మాత్రం కలగలేదు.
    మెల్లగా గోపీ దగ్గరకెళ్ళి "మీ బాబాయి నీకింకా ఇలాంటి పుస్తకాలేమైనా తెచ్చిపెడితే నాక్కూడా ఒకటిస్తావా?" అనడిగాను.
    "అమ్మయ్యో! ఈ పుస్తకమే ఇవ్వడం-బాబాయింకా రెండు పుస్తకాలు తెచ్చాడు గానీ నేనివ్వను బాబూ! అన్నాడు గోపీ. నిరుత్సాహపడి ఊరుకున్నాను.
    అయితే మధ్యాహ్నం ఇంటర్వల్ లో గోపీ పుస్తకం మాయమైపోయింది. ఎవరో ఆ పుస్తకాన్ని దొంగిలించారు. అందరినీ సోదాచేశాడు గోపీ-ఎవరి దగ్గరాలేదు. నాకేసి వాడు రెండు మూడుసార్లు అనుమానంగా చూశాడు గానీ ఏమీ అనలేకపోయాడు.
    గోపీ హెడ్ మాష్టరికి రిపోర్టిచ్చి-ఏడుస్తూ మధ్యాహ్నం బడిమానేసి యింటి కెళ్ళిపోయాడు.
    గోపీ అంతగా ఏడుస్తూంటే నాకెంతో బాధ కలిగింది. ఆ పుస్తకం కాజేసినవాడి నెలాగైనా పట్టుకుని-అతని పుస్తకం అతని కిప్పించాలనిపించింది. అయితే రెండు మూడు రోజులు గడచిపోయినా ఆ పుస్తకం దొరకలేదు. కానీ గోపీ మాత్రం మళ్ళీ మామూలుగానే తిరుగుతున్నాడు.
    అప్పుడే నాలో చిన్న భావం లేచింది. ఆ పుస్తకం గోపీ నా కెలాగూ ఇవ్వలేదు. అలా అని అది అతనికీ దక్కలేదు. ఎవడో ధైర్యవంతుడు అది చేజిక్కించుకున్నాడు. ఆ ధైర్యం నేనే చేసివుంటే ఆ పుస్తకం నాకే దక్కివుండేది-
    దొంగతనం జరిగినంత మాత్రాన-వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి దాని గురించి కలకాలం విచారిస్తూ కూర్చోడు. ఆ విచారం తొందరలోనే మరచిపోతాడు. ప్రస్తుతం గోపీ ఎక్కువగా బాధపడడమూ లేద-ఆ కుర్రాడెవడో పుస్తకాన్నీ చేజిక్కించుకున్నాడు.
    అంతేకాదు-మంచిగా అడిగిన నాకు పుస్తకాన్ని ఇవ్వలేని గోపీ-పుస్తకంపోతే నోరుమూసుకుని ఊరుకున్నాడు. మనకేదైనా కోరిక ఉన్నప్పుడు బలవంతంగా తీర్చుకోవాలి తప్ప. సౌమ్యంగా ఉండి లాభంలేదు. ఈ ఆలోచనే నన్ను దొంగతనంపట్ల ఆకర్షితుణ్ణి చేసింది.
    ఒక వ్యక్తి దొంగగా మారడానికి ఈమాత్రం సంఘటన చాలునని నేను చెప్పబోవడంలేదు. కానీ-నా విషయంలో మాత్రం ఈ సంఘటన సరిపోయిందని మాత్రమే చెబుతున్నాను.
    దేనికైనా ఇంటగెలిచి రచ్చగెలవమన్నారు. అందుకే నేను దొంగతనాలు ఇంట్లో మొదలుపెట్టాను. పావలా, అర్ధరూపాయలతో మొదలైన దొంగతనాలు-అయిదు రూపాయలవరకూ పెరిగేసరికి నేను స్కూల్ ఫైనల్ పరీక్షలు వ్రాసేశాను.
    అయితే నా విషయంలో పెద్దవాళ్ళకి అనుమానం రాకపోలేదు. పావలా, అర్ధా పోతూంటే మా అమ్మకు తెలిసేది కాదు. దేనికో ఖర్చు పెట్టేశాను కాబోలనుకునేది అలాగే నాన్నగారు కూడా ఒకటీ, రెండూ పోతూంటే గుర్తించేవారుకారు. ఆయన అంతగా డబ్బు లెక్క వేసుకునే మనిషికారు. మాకు పుష్కలంగా డబ్బుంది. లక్షాధికారులం కాకపోయినా ఉన్నవాళ్ళమనే చెప్పుకోవాలి.
    కానీ అప్పుడప్పుడు నాన్నగారికీ, అమ్మకీ కూడా అనుమానం వస్తూండేది. అయితే అనుమానం ఎప్పుడు దాసీ వాళ్ళమీదకే పోయేది. నేను చేసిన నేరానికి నా ఎదురుగా మరొకరు చివాట్లు తింటూంటే నాకు అదొకలా, సరదాగా ఉండేది.
    నేను దొంగతనం చేసేవాడినే కానీ-ఆ డబ్బు ఖర్చు పెట్టడ మెలాగో నాకు తెలిసేది కాదు. అప్పుడు నాకు ఏవిధమైన అవసరాలూ ఉండేవికాదు. అవసరమే-దొంగతనానికి మూలకారణమని కొంతమంది అనేది ఎంతవరకూ నిజమో-నేను చెప్పలేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS